Pages

Tuesday, 31 March 2026

నడుస్తున్న కల

 "నడిచే కల"

     ఆమె నడుస్తుంది,

     కలల  అలలతో  కలసి

     అడుగు కలుపుతుంది.

     అడవి మల్లె  అందాన్నీ..

     ఆత్మీయ బంధాన్నీ..,

     తనలో ఇముడ్చుకుంది.


     ఓ సుందర స్వప్నాన్ని

     కలవాలనీ..,

     వశీకరణంతో, 

     ఒడిచేర్చుకోవాలనీ..,

     ఆశతో జీవిస్తుంది. 


    మనస్సంతా  

    ఎదురుతెన్నుల  కన్నులైతే..,

    గుండెనిండా   గాయాల   కవాతులైతే  

    దారంతా...  చూపును   పరిచింది ,


    చిక్కటి చీకటి గదిలో..,

    తుదిలేని  మది  తలపులతో..,

    బ్రతుకంతా  పయనిస్తూ..,

    మినుగురులా    మెరుస్తుంది ,

    తను   వెతికే   తీగను   నేనైతే ,

    పొద్దు  తెలీని  ప్రేమనివ్వాలనుకుంటే్...,

    హద్దులెరుగని   ఈ  గుండెపై , అంక్షల   వలవేసింది 

    

     అందుకే ......

     ప్రతిసారీ    శబ్దమై  నాలో  పాకుతూ.., 

     శ్వాసై  నన్ను  తాకుతుంది...,

Wednesday, 20 July 2022

"ప్రకృతి ధర్మం"

 నేలనుతాకక ముందే 

వేలసార్లు అనుకుంటా

ఇంకొన్ని క్షణాలుంటే 

ఇంకొందరికి 

నీడనిద్దామని,


భూమిని చేరాకా కూడా అనుకొంటా 

కొన్ని నగ్నపాదాలకు రక్షణనిద్దామని,


ప్రకృతి ధర్మాన్ని కాదనలేం,


గాలి పొమ్మంటుంటే,

దూళి రమ్మంటుంటే,

ఏ దరికో, ఏ దిశ కో

పయనించాలి, 

పరుగులాపి

శాశ్వతంగా శయనించాలి.

 మిత్రులందరికీ 

నమస్తే , 

చాలాకాలం తర్వాత బ్లాగ్ లో ఓ కవిత

పెడదాం అనుకుంటున్నా.🙏🏻

Monday, 12 November 2018










బంధీ



వెండిపంజరానికి అందం తెచ్చిన బంధీ నేను ,
పుత్తడి కత్తిపై నెత్తురులా పూసిన అత్తరు నేను ,
ఎన్నో అసాధారణ , నిరాధారణ వాక్యాల మద్య ,
అసంబద్ద కావ్యాన్ని నేను ,
ముంచె
త్తే మానసిక కల్లం లో,
పలుకుల పరిగి ఏరుకునే పసిదాన్నే నేను,
నీకు తెలుసా
జీవితం అంటే ఏమిటో....?
కాలి గోటికి తగిలి ఎగిరపపడే గులకరాయి కాదు,
కొంగుకు కట్టుకున్న చెల్లని రూక కాదు ,
వశీకరణ ఒడిలోకి లాక్కునే చంచల వ్యామోహం కాదు ,
శిశిర వనాల పై వీచే...వడగాలి జీవితమంటే ,
కరకు చెరలను చేదించే కరవాలం జీవితమంటే ,
విషాదాన్ని తుడిచే వెన్నెల తుషారం జీవితమంటే ,
కామాన్నీ,భోగాన్నీ ఉసిగొలిపే వన్నెల విహారం జీవితమంటే ..,
నీకు తెలుసా..?
స్పృహనై ..
స్పూర్తినై ...,
స్పర్దనై... ,
స్పర్శనై.. ,
సాహసినై ..,
సహవాసినై ..,
సంతసం తో...సదా నీకై ...అద్దరిన వేచి ఉండే హిమాని నేను ,
జీవితానికీ..... జీవించటానికీ..,
భాష్యం చెప్పే ...నీ సహచరినే నేను
మెత్తని పూల బాటనై సాగిపోయే కాలాతీతం నేను ,
అచ్చ్హోట నీకై ప్రేమ ఫలాలను పరచిన శబరిని నేను,
అందరికీ అందని అద్దరిన ఉన్న అమృతాన్ని, 

నీకై వేచిన హిమగిరిని నేను...,

Friday, 6 April 2018





     మనం 



     అధికారిక, అహంభావక
    అంక్షలు విధించాలనే ఆకాంక్ష నీది.
    ఇదీ నా వాదన..........
   అత్యంత. సన్నిహితమైన
   అతి విలువైన. అమూల్యతను పదిల పరచుకొనే తత్వం నాది
   ఇది నీ వాదన...........

   ఇద్దరి మద్యా పారదర్శకత లేదు.
   మనో పరిపక్వత లేదు.
   మనల్ని మనం విభేదించుకుంటే...., విశ్లేషించు కుంటే...,
   విభిన్న దారుల బాటసారులమై పయనిస్తే...,
   మనకందని ఇంకో ప్రపంచం ఉందని తెలుసుకుంటే ..,
   మనం లేని ఇంకో కోణాన్ని దర్శించగలిగితే...,
   అందుకోసం .......,
  అహాన్నీ...
  కొంత ఇహాన్నీ....,
  వదిలేస్తే....,
  కోపాన్నీ...,
  కొంత మోహాన్నీ...,
  సడలిస్తే...,
  నేను
 నాదీ
 నీవూ..,
నీదీ..
అనేదాన్ని....,
దాటేస్తే....,
శోధన ఎరుగని భోదన అలవడుతుంది ....,
వేదన ఎరుగని సాదన అలవడుతుంది ....,

Sunday, 1 April 2018




చెప్పగలవా 

నిర్బంధం లోనూ కొంత ఆనందం ఉంటుంది.
ఒప్పందంలోనే నిర్బంధం దాగి ఉంటుంది.
.
అప్పుడప్పుడు ఆకాశం తప్పిపోతుంది,
వెన్నెల దివిటీని పట్టు కొని వెతకాల్సి వస్తుంది.
.
వికటించే పరిస్థితులలో ఇరుక్కుంటే,
విషాదమే వికసిస్తుంది మరి.
.
రెప్పలు మూయాలంటే భయం,
కత్తుల్ని మింగినట్లు కలలొస్తాయి.
.
గతాన్ని రుతువులు ఎత్తుకెళ్ళాయి.
మదింకా దెన్నో అన్వేషిస్తుంది.
.
తుది,మొదలూ ఎరుగని తలపులు చిక్కుపడీ,
విప్పలేని వేళ్ళని వణికిస్తున్నాయి.
.
ఏదో ఉద్వేగం ,ఇంకేదో విషాదం.
మనసు కారాగారంలో గుండె గంట మోగుతుంది.
.....
....
నీవెందుకు మౌనం వహిస్తావ్ ?
చెప్పు...,
స్వేచ్చంటే విడుదలా...? ఎదుగుదలా..?
.


Friday, 22 September 2017

ఆశల ఉలినై.










ఆశల ఉలినై. 

ఓ చిన్న విరామం,
వేయివేదనలు మోసిన హ్రదయం,
రెండు వెచ్చటి కన్నీటి చుక్కల అనంతరం,
సుద్దీర్ఘ  నిట్టూర్పుతో ...,

ప్రతి క్షణమూ రగిలే పగల  నెగళ్ళూ ..,
ప్రతి కణమూ ఆక్రోశాన్ని దాచుకొన్న వైనాలూ ...,
సుదీర్ఘ  నిరాశతో ..... ,

ముక్కలైన చుక్కలన్నీ..., వెలివేసిన ఆకాశం వాకిట,
మబ్బుల  చాటున తలదాచుకోనిమ్మని ,
సుదీర్ఘ  శోకంతో ..... ,

సువిశాల ప్రపంచాన  మన చూపు మాత్రమే  సోకె  గవాక్షాన్ని,
అమర్చుకొన్న  మానవ నైజాన,

తాత్విక పునాదులవైపు దృష్టి సారిస్తూ... 
మార్మిక కామితాన్ని ఆహ్వానించే  జనసంద్రాన,

ఎంత తొలిచినా, ఒలిచినా ...పెచ్చులూడిపోయే...,
రాతి శిల్పం , ఓటి శిల్పం ...... ఈ  అస్థిర  హ్రదయం.