Pages

Thursday 31 January 2013

వాక్కు.










వాక్కు.

వేదన నిండిన  గుండెకు  మరపుమందు  నిస్తుంది.
మది వాకిట నేర్పుగా ...ఓర్పు పరదాకడుతుంది ..,
నీ చల్లని వాక్కు.

విచక్షణ లేని క్షణాన  రక్షణలా,
విరిగిన  మానస వీణను   అతికించి  సృతించేలా చేస్తుంది,
నీ  చక్కని వాక్కు.

చీకటి  తరువు  నుండి  వెన్నెల కుసుమాలను   పూయించి,
మది  గాయాలు   మానపటానికి  మాటల   తేనెలతైలం  పూస్తుంది.
నీ  మంచి వాక్కు.

కనుల  నీరు  తుడిచి  కలత పోగొట్టి ,
చెంత  చేర్చుకొని  సేద  తీరుస్తుంది ,
నీ  చెలిమి వాక్కు.

గనీభవించిన  కాలాన్ని ద్రవీబవించి,
అస్తమించే  నా బ్రతుకునకు  సమస్తమై  నిలుస్తుంది,
నీ  స్వాంతన వాక్కు.

Thursday 24 January 2013

మీ మనసు(లు)ల్లో ఎదగాలని.





మీ మనసు(లు)ల్లో  ఎదగాలని.


నన్ను చూసి బొంద కూడా
పక్కున నవ్వింది
అక్కున చేర్చుకొంటూ...

భూమిపై   ఉన్నన్నాళ్ళూ ,
యెంత క్షోబ  పడ్డానో,
పంచేంద్రియాలతో  పరుల మాటలు
వింటూ.

అమ్మ కూడా తమ్ముడి
బట్టలు సరిపోతాయని
సంబర పడిపోతూ,

తోటి  ఆడపిల్లలు ,
పోడుగబ్బాయిలకు ,
నాతోనే లేఖలు పంపితే
కన్నీళ్ళను  ఆపుకుంటూ.

ఆలి వస్తే
అర్డంచేసుకుంటుందనీ ,
సంతానమైతే
సర్డుకుపోతారనీ ఆశపడుతూ...

మంచి పని చేస్తే,
మనిషి  అంటారనీ..
మీ అందరి కోసం మంచినే
ఎన్నుకొంటూ..,

దారివెంట వెళ్తుంటే,
నాకేవరైనా  నమస్కరిస్తే
బాగుండు అనుకుంటూ..

పురుష అహంకారం
అని తిట్టే అతివలు,
పురుష ఆకారాన్నే ,
చూస్తున్నారే  అని బాదపడుతూ...

సంతానానికి
బరువు కాకున్నా,
పరిచయానికి పనికిరానని
తెలుసుకున్నా...

ఏమి చేయను ,
ఎదగని మీ మనసుల్లో ,
ఒదిగిపోయిన
మరగుజ్జునే..


















Monday 21 January 2013

ఛీ..ఛీ.. సిటీ బస్సు.









ఛీ..ఛీ.. సిటీ బస్సు.


ఎక్కకుండానే  కదిలించే  బస్సూ..
యెక్కుతూనే జలదరించే  లుక్సూ..

లోపలి కెళ్ళమనే  కండక్టర్  గద్దింపూ..
లోనికెళ్తూనే  సీటుకోసం  అర్దింపూ..

టిక్కెట్టు డబ్బులు తీయటంలో సర్కస్సూ..
బట్ట తొలిగిన చోట ఎగిరొచ్చి పడే  గ్లాన్సూ..

బస్సంతా  సిగారు  ధూప  సుగంధమూ..,
కూర్చున్న మగవారి బూతుల పంచాంగమూ ..

వికలాంగుల సీటులో  కాలేజీ కుర్రతనమూ..
ఆడంగుల కళ్ళలో కాటేసే  గుర్రుతనమూ..

ముసలి, ముతకా,బిడ్డ తల్లులూ, గర్బిణీలూ..
వాలిపోతూ, తూలిపోతూ, జారిపోవడాలూ..

వారి  పాట్లు, అగచాట్లూ, చేసే ఎక్ష్సర్సైజులూ ..
పోకిరీగాళ్ళకు  దొరికే ఉచిత  చిత్ర ప్రదర్సనలూ..

డబ్బు సంచిలో ముఖం దాచుకున్న కండక్టరూ..
గబ్బు గల్లీలనూ, ఇరుకు సందులనూ..ఈదిస్తున్న  డ్రైవరూ....






Saturday 19 January 2013








అగ్ని కవాతు.



ఎవరు ఆదుకుంటారు,
దిక్కులేని  పూబాలలను.

అజ్ఞాత హస్తాలు వివస్త్రను చేస్తుంటే..
ఆర్తనాదాలు  చేసినా  ఎవరు వింటారు?

టెలివిజన్  సీరియల్కి  చిక్కుకున్న వాళ్ళా. 
ఇంటర్ నెట్ లో ఇరుక్కున్న వాళ్ళా.?

క్లబ్బుల్లో కబుర్లాడే వాళ్ళా?
పబ్బుల్లో.. తైతక్కలాడీ వాళ్ళా?

దుస్సావాసాల   మధాంధుల మూకను,
ఎవరు అడ్డుకుంటారు?

అడిగినంత  దబ్బిచే వాళ్ళ  అమ్మ,నాన్నలా?
అర్దరాత్రి  వరకూ మందు  పోయించే  బారువాళ్ళా ?
వారికి  పర్మిషనిచ్చిన   సర్కారు వాళ్ళా.?

చెల్లీ.. అయిన వాళ్ళు లేని నిన్ను ఎవరూ  ఆదుకోరు
నీకోసం ఎవరూ  రారు.

విష వైకృత  క్రీడకు.. అంతం పలుకు.
చీకటి  దుప్పటి  చాటున  నక్కిన  
నాగరికులను  నడి  బజారుకు లాగు.

పగటి పూట పరువుకెరిసే పురుషోత్తములనూ..,
రాత్రిపూట  రాసలీలకు  తయ్యారయ్యే  పురుషపుంగవులనూ..

నీ దేహంపై  దాహం తీర్చుకున్న మదాన్దులకూ..
తిరగబడు,తెగాబడు , చండ్రనిప్పులు చేతబట్టి,
అగ్ని కవాతు చెయ్యి, మగాడనే ముద్రని  చిద్రం చెయ్యి.

రోకలి  చిగురించదూ ..,ఎడారి తడినివ్వదూ..
నీ అరచేతులనే చురకత్తులు చేసుకో,

తెగించు, చిరునామా లేని, చిల్లుకానీ లేని ,
నీకు జరిమానా  ఉండదు, ఎందుకంటే,
ఖాకీ పట్టించుకోడు  కనుక  ...పరేషానీ  ఉండదు.

















Wednesday 16 January 2013

చెల్లని ఆశలు





చెల్లని ఆశలు


చెప్పాలనుకున్న పలుకులన్నీ..,
గొంతులోనే  ఆగిపోతుంటే.

రాయాలనుకున్న పదాలన్నీ..,
కాగితాన్నే  వెక్కిరిస్తుంటే.

ఉబుకుతున్న కన్నీళ్ళే..,
కారణం  అడుగుతుంటే.

అణగారిన  కోరికలన్నీ ..,
కలలకే  అంకితమవుతుంటే.

దరి చేరని బంధాలన్నీ..,
దిగంతాలను దాటి వెళ్తుంటే.

హక్కులను సందించే  ఇజాలన్నీ...,
దిక్కులేదన్న  నిజాన్ని నిగ్గదీస్తుంటే .

ఆకశాన  చుక్కలన్నీ..,
చందమామని  పట్టుకోలేకుంటే.

అంతరాన అల్లుకున్న  ఆశలన్నీ..,
తెల్లబోయి గొల్లుమంటుంటే.

చేసుకొన్న బాసలన్నీ..,
సాక్ష్యమెవరని  అడుగుతుంటే.

అగోచరమైన అనురాగానికి..,
అంధ విశ్వాసాన్నే... ఆధారమనుకో...అంతే ..అంతే .









Friday 11 January 2013


నాన్న.


నీ చుట్టూ భ్రమిస్తూ..,
నీకై  తానూ శ్రమిస్తూ.

నీ పట్టుదలని భరిస్తూ..,
తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ,

నీ కాళ్ళమీద నిన్ను  నిలబెడుతూ...,
తన కాలి సత్తువ  అరగదీసుకుంటూ..,

నీ  కోరికల చిట్టా తీరుస్తూ..,
తన కోరికలే మర్చిపోతూ,

నీ సరదాలను  భరిస్తూ..,
తన నిద్ర మరచి జాగరణ చేస్తూ..,

కోడలి  ధూషణని  మౌనంగా బరిస్తూ..,
మనవలకు కళ్ళెం లేని గుర్రంగా మారుతూ..,

కుక్కకీ, తనకీ ఒకే రకమైన ముద్ద పెట్టినా...,
తన ముంత  తలవాకిటనే  పెట్టినా..,

పెదవి  విప్పని  నీ  పితామహుడు ఆశతో ఉండేది ,
అసలుకంటే వడ్డీపై ఉన్న మమకారంతోనే..

గుర్తుచేసుకో...నీఎ చిల్లు జేబు నింపినదీ ఆయనే.
నీ బతుకు బండికి చక్రం బిగించిందీ  ఆయనే.

నీవు తప్పించే పున్నామ  నరకం కోసం..,
ఇప్పుడు ఈ నరకాన్నీ అనుభవిస్తున్నదీ  ఆయన..

ఎవరో కాదు నీ వేలు పట్టుకొని నడిపించిన ,
చలనమున్న శవంలా  కనిపించే ..నిన్ను కన్న  నీ నాన్న.

Monday 7 January 2013

అమ్మ




అమ్మ 

నక్కిన నరాలను రిక్కించి వింటుంది,
నీ మాటల్లో అమ్మ అనే పదం కోసం..

నవరంద్రాలను శ్రవణాలుగా చేసుకొని వింటుంది,
నీవు  పిలిచే  అమ్మా అనే పిలుపు కోసం.

మసకబారిన   చూపులను  సారిస్తుంది,
ఎదురుగా  రావటానికి కూడా ఇష్టపడని నీ కోసం.

శుష్కించిన  దేహం తో  ఎదురుచూస్తుంది.
పట్టెడన్నం   పెడతావని  నీ కోసం.

సమాదుల  పక్కనే  చతికిల బడి ఉంది
సాగనంపటానికి కష్టం  లేకుండా నీ కోసం.

రక్త సంబంధాలు రంగు మార్చుకుంటున్నాయి.
జోల పాటలు  జాలిపాటలుగా  మారుతున్నాయి.

నెత్తుటి   సాక్ష్యాలు   కుత్తుకని   కోస్తున్నాయి.
పండుటాకులను  ఎండుటాకులుగా  చేస్తున్నాయి.

కళ్ళు తెరిచి చూడు  నువ్వు  ఎక్కికూర్చున్న  నెత్తే,
కళ్ళ ముందు  నువ్వు పెట్టె కొరివి  కోసం చూస్తుంది.

కళ్ళు తెరిచి చూడు  ఆ జుట్టు
నీవు ఆడుతూ  లాగినదే.

కళ్ళు తెరిచి చూడు ఆ గుండె,
నీవు ఆకలితో  పారాడినదే.

కళ్ళు తెరిచి చూడు ఆ చీరకుచ్చిళ్ళు ,
బూచిని  చూసి  దడుచుకొని  నువ్వు  దాగినవే.

వెతుకు,వెతుకు, నీ దేహమంతా  వెతుకు
ప్రతి కణమూ, ప్రతినరమూ నీ  తల్లి పెట్టిన బిక్షే.

అమ్మని తలిస్తే వ్యర్దమనుకొనే  క్షణకాలాన్ని 
నీకే  బిక్ష వేసి వెళ్ళింది, బ్రతుకు,నీ  ఆకరి బ్రతుకు,

మళ్ళీ పుట్టుక లేకుండా బ్రతుకు.
అమ్మ అవసరం లేని, జన్మ ఉందేమో..చూసి  మరీ బ్రతుకు.












Friday 4 January 2013

అన్నదాత

అన్నదాత


విత్తు నాటి
కళ్ళలో  ఒత్తులేసుకొని.

చినుకు కోసం ,
ఆకాశం వంక చూపులేట్టుకొని.

పంట కోసం,
తొండలు గుడ్లు పెట్టిన భూమిని నమ్ముకొని.

పరువు కోసం,
కరువునే ఎదిరిద్దామనుకొని.

కొంప కోసం,
మనిషితనాన్నే  నమ్ముకొని.

అప్పు కోసం,
అధికారుల ముందు చేతులు కట్టుకొని.

బువ్వ కోసం,
అహోరాత్రులూ తనను తాను  కష్ట పెట్టుకొని.

గువ్వల కోసం,
పండిన   కంకులనే నట్టింటే వేలాడగట్టుకొని.

అన్నగా పిలవబడి,అమ్మగా  తలవబడే వాడే  రైతంటే.
మట్టికొట్టుకొని  ఉన్నాడని మనం నెట్టివేసే వాడే రైతంటే.

అన్నపూర్ణ  అక్షయపాత్ర  నింపి,మన ఆకలి  తీర్చేవాడే  రైతంటే.