Pages

Monday, 7 January 2013

అమ్మ




అమ్మ 

నక్కిన నరాలను రిక్కించి వింటుంది,
నీ మాటల్లో అమ్మ అనే పదం కోసం..

నవరంద్రాలను శ్రవణాలుగా చేసుకొని వింటుంది,
నీవు  పిలిచే  అమ్మా అనే పిలుపు కోసం.

మసకబారిన   చూపులను  సారిస్తుంది,
ఎదురుగా  రావటానికి కూడా ఇష్టపడని నీ కోసం.

శుష్కించిన  దేహం తో  ఎదురుచూస్తుంది.
పట్టెడన్నం   పెడతావని  నీ కోసం.

సమాదుల  పక్కనే  చతికిల బడి ఉంది
సాగనంపటానికి కష్టం  లేకుండా నీ కోసం.

రక్త సంబంధాలు రంగు మార్చుకుంటున్నాయి.
జోల పాటలు  జాలిపాటలుగా  మారుతున్నాయి.

నెత్తుటి   సాక్ష్యాలు   కుత్తుకని   కోస్తున్నాయి.
పండుటాకులను  ఎండుటాకులుగా  చేస్తున్నాయి.

కళ్ళు తెరిచి చూడు  నువ్వు  ఎక్కికూర్చున్న  నెత్తే,
కళ్ళ ముందు  నువ్వు పెట్టె కొరివి  కోసం చూస్తుంది.

కళ్ళు తెరిచి చూడు  ఆ జుట్టు
నీవు ఆడుతూ  లాగినదే.

కళ్ళు తెరిచి చూడు ఆ గుండె,
నీవు ఆకలితో  పారాడినదే.

కళ్ళు తెరిచి చూడు ఆ చీరకుచ్చిళ్ళు ,
బూచిని  చూసి  దడుచుకొని  నువ్వు  దాగినవే.

వెతుకు,వెతుకు, నీ దేహమంతా  వెతుకు
ప్రతి కణమూ, ప్రతినరమూ నీ  తల్లి పెట్టిన బిక్షే.

అమ్మని తలిస్తే వ్యర్దమనుకొనే  క్షణకాలాన్ని 
నీకే  బిక్ష వేసి వెళ్ళింది, బ్రతుకు,నీ  ఆకరి బ్రతుకు,

మళ్ళీ పుట్టుక లేకుండా బ్రతుకు.
అమ్మ అవసరం లేని, జన్మ ఉందేమో..చూసి  మరీ బ్రతుకు.












8 comments:

  1. రక్త సంబంధాలు రంగు మార్చుకుంటున్నాయి.
    జోల పాటలు జాలిపాటలుగా మారుతున్నాయి.

    నిజమేనండీ..:(

    ReplyDelete
  2. వెతుకు,వెతుకు, నీ దేహమంతా వెతుకు
    ప్రతి కణమూ, ప్రతినరమూ నీ తల్లి పెట్టిన బిక్షే...

    ఎంతో హృద్యంగా చెప్పారు.

    ReplyDelete
  3. ఈ దేహం, ఈ జీవం, ఈ ఙానం, ఈ జీవితం అంతా అమ్మ పెట్టిన భిక్షే కదా. అమ్మే కదా మనలని సృష్టించిన బ్రహ్మ.
    (from my old post)

    ReplyDelete