Pages

Saturday 25 October 2014

అక్షరాయుధాన్నై ...,







    అక్షరాయుధాన్నై ...,

    చిక్కుముడి   సమాజ  సమస్యలకు ,
    సులువైన  మార్గాన్వేషినై ....,

    పగిలిన అడ్డం ముక్కలను ,
    అతికించే   ఐఖ్యతా  సూత్రాన్నై....,

    కీచులాటల   కీచకులను ఏకం చేసే,
    సామూహిక  సంఘటిత  శక్తినై....,

    జనన,మరణ దృవాల  మద్య ,
    సుఖ,దు:ఖాల  అయస్కాంత  ఆకర్షణనై ....,

    అచ్చిరాని   అనుబంధ అఘాదాల మద్య,
    మానవీయ  వారదినై..., 

    జనం గుండెల్లో జెండాగా ఎగురుతూ ,
    అట్టడుగు వర్గాల  ఆకలి కేకనై...,

    మనుషుల మద్య  విస్తరించే  రాక్షస,
    నిశ్శబ్దాన్ని పారద్రోలే  లిపి ఘోషనై ...,

    సరికొత్త   జీవనపేజీ కై  వెతికే ,
    అనంతాన్వేష  అవిశ్రాంత  అక్షరాన్నై...,

    తప్పుడు   తలకట్టుల   తలలు కొట్టే,
    చప్పుడు చేసే (శబ్ద)  యుద్ద  కవిత్వభేరి  మోగిస్తున్నా......  

   


  

Sunday 19 October 2014

రిక్త హస్తాలు













        రిక్త హస్తాలు

     అయినవారికి  తాంబూలం
     అందించిన ఈ హస్తాలు ,
     నేడు అలసి సొలసిపోయిన తమలపాకులు .

     వారసత్వపు  దానగుణం
     హస్తరేఖల్లో  అమరిన ఈ హస్తాలు,
     ఆశగా చాపిన ప్రతి చేతినే తడిపే  కర్ణుని  కరాలు ,

     అన్నదాతగా  పట్టెడన్నం పెట్టే
     ఆత్మీయ  ఈ హస్తాలు ,
     అన్నార్తుల ఆకలి తీర్చే అక్షయ పాత్రలు .

     చీకటిని పారద్రోలే  చిరు దివ్వెలకు ,
     రక్షణ నిచ్చే ఈ హస్తాలు,
     జగతినే జాగృతి చేసే శుభసూచకాలు,

     సంతానానికి  సంతోషాన్నిచ్చె,
     అమ్మతనపు ఈ హస్తాలు,,
     నిద్రపుచ్చే ఊయలలు ,

     కరవు కాటకాల, ఆర్దిక  ఆటుపోటులకై ,,
     తెగిపడిన ఈ హస్తాలు ,
     నేడు అడుగంటిన అక్షయ పాత్రలు . 




Thursday 16 October 2014

పరాదీనులై ...

         





        పరాదీనులై ...

        అనేక   రూపాల   సమూహం   స్త్రీలు,
        అమ్మతనానికి   ఆనవాళ్ళు  వీళ్ళు.

       పలకరింపుల  తొలకరింపులకే ..,

       పరవశించే  పసి మనస్సులై..,

       మాయల మాటల  తూటాలకే ,

       గాయపడే మానసిక  క్షతగాత్రులై ,

       చీకటి రసాయనాలకు  సమీకరణాలై,

       వెలుగు  తగిలిన   తీసివేతలై...

       వ్యక్తిత్వాన్ని అమ్ముకొనీ,తప్పుడు వ్యక్తిని నమ్ముకొనీ,

       వెలితి గుండెలను  పిచ్చి  బ్రమలతో బర్తీ చేసుకొని

       రంగుల,హంగుల మెచ్చుకోలుకై ,

       మలినమంటిన హృదయ కరచాలనాలకై ,

       భరించలేని  బంధనాలను  వదలి ,

       ఊపిరి  తీసే  ఊహల  పల్లకి నెక్కి,

       పవిత్రమైన స్త్రీ(వ్యక్తి) త్వాన్ని అపాత్ర దానం చేసి ,

       పరహీనులై    చలన   రహితం   కాకండి....,  



  

Monday 6 October 2014

చేజారిన నా కలం




   


    





    చేజారిన   నా   కలం 




    అంతులేని సమస్యల సుడిగుండములో  ..

    పడిపోయిన నా కలం,

    భాద్యతల అక్షరాలను బాదల గాయాలనుండి ,

    పొడిచి,పొడిచి వెలికి తెచ్చేది,

    మనస్సు మర నుండి మాటలను తూటాలుగా చేసి ,

    సూటిగా మీ గుండెలకే సందించేది,
   ఎక్కడికి పోయిందో ........ ,


    చంటోడి ఆకలికై పోరాడుతూ ..,

    అమ్మ గుండెలపై పారాడు తుందా ?


    కుంటోడి అంగవైకల్యానికి ఆసరాగా,

    ఏ చెమట చెట్టున ఇరుక్కుందో..?


    రైతన్న అప్పుల పద్దులు రాస్తూ..,

    మొలకెత్తని పుచ్చువిత్తనమై పెళుసుబారిందా...?


    కరకు పాళీగా నా కుత్తుకపై కూర్చుని ,

    రగిలిపోయే నా దిగులు గుండెకు

    కాసిన్ని అక్షరాలనిచ్చి సేద తీర్చేది........... ఎక్కడికి పోయిందో....!!