" నీవు నా ప్రాణమే "
బలాత్కరించబడ్డ క్షణాలన్నీ....
బంధీలైన గడియలన్నీ....,
నిఘా వెనుక భయాలన్నీ...,
జీవితం పై దాడి చేసే వేళ ...
అగాథాల అంబుధిలో ..,
విఘాతాల వనాలలో ....
వసంతం పారిపోతుంటే ,
శిశిరం వచ్చి చేరుతున్న వేళ ,
నా కళ్ల మీదుగా ప్రవహించే
నెత్తుటి నదులను తొలగించి ,
నిశి రాతిరిని పండువెన్నెలగా మార్చిన ,
శరత్ చంద్రునివి నీవు .
గుండెలకు తుపాకులు పెట్టినా ..,
చెదరని విప్లవ పక్షులు,
నా మనో గాయాలు ,
ఓ సందిగ్ద సాయంకాల వేళ ,
చిక్కుపడిన నా ఆలోచనా వల,
చలించిన నా మనో కల ....,
ఉట్టికాళ్లతో మండుటెండలో నడిచే
పసిపాప పాదాల వేధన నాది ,
కాలిన పాదాలకు నవనీతం అద్ది,
అక్కున చేర్చుకున్న అయ్యతనం నీది,
ఎలా సాద్యమైంది , నీకిదంతా ...?
ఎలా దూరమైంది ,నా వెతంతా...?
శరీరమంతా రెండు చేతులుగా చేసుకొని,
కృతజ్ఞతతో నీకు నమస్కరిస్తున్నాను