Pages

Saturday, 25 April 2026

నా కవిత్వం.. వనజ తాతినేని విశ్లేషణ

 గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే .. చదివిన వారికి ఎవరి తాహతుని బట్టి వారికి ఎంతోకొంత అనుభూతిని అందించగల్గడం. ఆ లక్షణం మెరాజ్ ఫాతిమా కవిత్వానికి పూర్తిగా వుంది. ఆమె కవిత్వం అర్థం కాకపోవడం ఏమీ వుండదు. తేటతెల్లంగా వుంటుంది.

వి చెప్పేది నీకు పూర్తి అనుభవం లో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం.

కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా! నీకు తోచనిది కనబడనిదీ కవి చెప్పిన నీ అనుభవంలోకి ఎంతోకొంత వచ్చేది అదీ నీకు సరిపడే కవిత్వం అన్నారు చలం.

మనకు ఎంతో కొంత అనుభవం లోకి వచ్చే కవిత్వం గురించి..ఇక్కడ పరిచయం చేసుకుందాం.

ఈ పరిచయం సారంగ చానల్ లో కూడా చూడండి!

కవిత్వమే మెరాజ్ సహచరి

**************

రే, ఇక్కడో పారిజాతం ఉండాలి

రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవి

గొప్ప తోడుని అడిగిన ఆ మొక్కులేవి?

 

గుడ్డ బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసిన

చిన్నారి ముత్తయిదువ ఆ చిన్నమ్మ ఏదీ?

ఆమె నడిచిన చిట్టి పాదముద్రలేవీ?

అని అడుగుతున్న ఈ స్త్రీ సౌకుమార్య భావనలు ఎక్కడివి!?

 

“కాలమంతా రంగుల రాట్నమై

గిర గిరా తిరిగే చలన చక్రమై స్ఖలన దుఃఖమై యుగాల నాటి ప్రశ్నా పత్రమై..

బాల్యాన్ని పాతి పెట్టిన శిథిల సౌధమై..”

అంటూ..  పసి తనపు తలపుని గుర్తు చేసుకుంటూన్న  ఈ అక్షర విన్యాసం ఎవరిదీ!?

“మెరాజ్ ఫాతిమా” అనే కవి కవిత్వం ఇది..

మూడు దశాబ్దాలుగా కవిత్వం ఆమెకు సహచరిగా వుంది. తన ముందు తరం వెనుక తరం మధ్య వారధిగా నిలబడి శతాబ్దాల మూగ వేదన ను కవన రూపం లో విప్పి చూపించారు. మొదట ఆమె “కవితా సమాహారం” అనే బ్లాగ్ ద్వారా పరిచయం.అక్కడ ఆమె కవిత్వం పరివ్యాప్తం అయ్యాయి. తర్వాత రెండు మూడేళ్ళకు ఫేస్ బుక్ లో మంచి కవిత్వం వ్రాసే వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాహానికి పూర్వం ఆమె కడప ఆకాశవాణి యువవాణి కార్యక్రమం ద్వారా  వాసంతి గా పరిచయం. సాహితీ ప్రపంచం ఆమెకు కొత్తేమి కాదు.వస్తువు ఏదైనా ఆమె హృదయంలో లలితమై చలనమై ఆలోచనలో జ్వలనమై జాగృతమై ఆమెకంటూ ఒక ప్రత్యేక  ముద్రగా అలరిస్తుంది.

మగవాళ్ళ అమానుష కృత్యాల వల్ల స్త్రీల జీవితాలు అంధకారంలో మునిగి పోయినప్పుడు వారికి కాస్త వెంటిలేటర్ అవసరం అని తన కవిత్వం లో పదే పదే చాటి చెబుతారు. స్త్రీలకు  కాస్త చదివిడి జ్ఞానం వుండటం మూలంగా వారికి తమ జీవితం మీద శరీరం మీద అధికారం కావాలనే ఆలోచన ఆకాంక్ష కల్గడం మొదలవుతుందని తద్వారా  స్త్రీ  బలపడటానికి  కూడా పుస్తకాలే దారి చూపుతాయని ఆమె  అంటారు.

పురుషులకు ప్రేమ ఆట వస్తువేమో కానీ స్త్రీకి ప్రేమే జీవితం. ప్రేమించిన పాపానికి.. మనస్పూర్తిగా నమ్మి అతని చేయి పట్టుకుని ముందుకు నడిచిన పాపానికి.. ఎన్నో కష్టాలను అనుభవించి అధిగమించి.. తమ జీవిత లక్ష్యం చేరుకోగల్గిన స్త్రీలను తన కవిత్వంలో చూపించారు. పురుషుల్లో చదువుతోపాటు సంస్కారం ఏ మాత్రం పెరగలేదనే చురకలు అంటిస్తారు.

పురుషుడికి సహచరి అంటే ఏమిటి అన్నదానికి ఈ  కవయిత్రి చెప్పిన ఈ భావం చూడండి.. ఎంత హిమోన్నత శిఖరమో!

‘’నీకు తెలుసా! స్పృహనై  స్పూర్తినై  స్పర్దనై స్పర్శనై సాహసినై

సహవాసినై  సంతసం తో సదా నీకై  అద్దరిన వేచి ఉండే హిమాని నేను

జీవితానికీ  జీవించటానికీ భాష్యం చెప్పే నీ సహచరినే నేను”

మెరాజ్ కవిత్వంలో ఏముంది? నిత్యం ప్రవహిస్తున్న లావా లాంటి కవిత్వం వుంది..

కవితా నిర్మాణం శైలి విభిన్నంగా వుంటుంది..అని పూర్వ కవులు వ్యాఖ్యానించారు.

మాతృత్వం  స్త్రీకి ప్రపంచమైంది. కుటుంబం కూడా చారిత్రాత్మక అవసరం చేసింది. ఆమెను నాలుగు గోడలకు పరిమితం చేసింది. సామాజిక జీవితాన్ని దూరం చేసింది. ఉత్పత్తిలో భాగం కాకుండా చేసింది.అందువల్లనే స్త్రీ భర్తపై ఆధారపడాల్సి వచ్చింది. పెదవి విప్పితే పాశవిక హింసను చవిచూసింది. కన్న బిడ్డైనా సరే.. స్త్రీ ని నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తాడు. ఆ విషయాన్నే వేదనతో  కవిత్వీకరించారు.

“తల్లులు విశ్రమించ కూడదు,

లోకం నుండి నిష్క్రమించనూ కూడదు,

 

అలా ఒళ్ళు మరిసి

ఉండకూడదు,

చురుగ్గా ,చాలాగ్గా ఉండాలి

పరాగ్గా ఉండకూడదు,

 

తన కాండక్ట్ సరిఫికెట్ నిరూపణ కై

మొగుడి ముందే కాదు ప్రతి మొగోడి ముందూ పరోక్షంగా మోకరిల్లాలి,

 

కన్న పేగైనా సరే

ఉన్నపళంగా వదిలేస్తే

కిక్కురు మనకుండా

త్యాగానికి తల ఇవ్వాలి.

 

అవును….

అమ్మంటే త్యాగానికి

బలవ్వాలి.”

******

మెరాజ్ కవిత్వంలో  సామాజిక స్పృహ మెండుగా వుంది. ఆమె నిత్యం ఫేస్ బుక్ లో పంచుకునే కవితల్లో మనుషులు మనిషి తనాన్ని కోల్పోవడం పట్ల వేదన వుంది. పరిసరాలు పరిశుభ్రంగా పచ్చగా వుండాలన్న ఆకాంక్ష వుంది.

స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులందరూ అనుభవిస్తున్న వివక్షలు గురించి వుంటుంది.

అన్నింటికీ మించి కుటుంబ వ్యవస్థ మోపుతున్న భారం పట్ల ఆక్రోశం వ్యక్తం అవుతుంది. మెరాజ్ కవిత్వం జీవితాలను చిత్రించింది. స్త్రీ మనస్సు ను ప్రతిబింబించే కవిత్వం చాలానే రాసారు. స్త్రీ వాదం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలు పురుషునిలో దేహగతమైన సాన్నిహిత్యం కన్నా కూడ మానసికమైన తోడు వుండాలని బలంగా కోరుకుంటారు.

మర్రిచెట్టు నీడలో ఎదగని మొక్కలా వ్యక్తిత్వాలు కుంచించుకుపోయి బతకడం అంటే రోసి పోయిన .. స్త్రీ ల వేదనలు ఆవేదనలు కొత్తవేం కావు. కానీ నాగరిక సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాల నేపథ్యంలో స్త్రీల పై జరిగే హింస కూడా కొత్తగా వుంటుంది. దాన్ని కూడా కవిత్వీకరణ చేయడం తప్పనిసరి అంటారు.

స్త్రీలు బాలికలు పై జురుగుతున్న లైగింక వేధింపులు అత్యాచారాలు పట్ల ఆగ్రహం వుంది. మదాంధుల  దాడిలో  మరణించిన కన్నెపిల్లల  కలల కాగితాలపై అంతులేని  విశ్వాసముతో  స్వజాతిగా సమిష్టి సంతకాలు పెడదాం, పరువు కోసం ప్రాకులాట  మానేద్దాం తిరుగుబాటు   చేద్దాం అని నినదించారు క్రింది కవితలో..

“ఆడవాళ్ళూ! మీకు జోహార్లు”

చాలు  చాలిక

ఒకరినొకరు  నిందించుకొనే   ఆత్మ  ద్రోహాల

మహత్తర  నాటకాల మహోన్నత  సంభాషణలూ

 

ఆత్మ స్తుతితో  అందలమెక్కిన

అప్రకటితపు  అనూహ్య   వైనాలం

 

శిరస్సులపై  పరువుల  బరువును

అనామకులమై   మోస్తున్న

నిజాలం,

 

జన్మనిచ్చిన  సంతతికి  మాతృస్వామ్య

హక్కుదారీ సంతకానికి  నోచుకోని నిశానులం,

 

ఉరి తాటికి వేలాడే మెడలేని పడతులం

ఉచ్చ గుడ్డలుతికే   ఉత్తమ  ఇల్లాళ్ళం

గోనె  సంచుల్లో

కుక్కబడ్ద  అనాథ  శవాలం

 

ముక్కలైన   మూగ  శకలాలం

ముప్పెనకు  గురైన  నత్తగుల్లలం,

 

పెదవులపై   ఫెమినిజాన్ని   కాదు

చెదలు  పట్టిన  చరిత్రని   తిరగతోడుదాం

విచ్చుకత్తులు గుచ్చుకున్న  గొంతులో నిత్య శబ్దమై   పల్లవిద్దాం

 

తగలబడుతున్న  పూలవనాలపై

కఫన్  కప్పిన  మన కలలపై,  నివురు  కప్పిన

తప్పుడు  సాక్ష్యాలను   తగలబెడదాం

అని.

గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే .. చదివిన వారికి ఎవరి తాహతుని బట్టి వారికి ఎంతోకొంత అనుభూతిని అందించగల్గడం. ఆ లక్షణం మెరాజ్ ఫాతిమా కవిత్వానికి పూర్తిగా వుంది. ఆమె కవిత్వం అర్థం కాకపోవడం ఏమీ వుండదు. తేటతెల్లంగా వుంటుంది. చదివిన వారి గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆలోచనలను కుట్టి కుదుపుతుంది. ఇది కదా సత్యం, ఇది కదా నా అనుభవం కూడా అని పాఠకుడు అంగీకరిస్తాడు . తను రాయలేని తన వైయక్తిక అనుభవాన్ని ఆ కవితలో దర్శిస్తాడు. కవిత్వంలో సెల్ఫ్ ఐడెంటిటీ వెతుక్కుంటారు.

భర్త మాత్రమే కాదు కుటుంబంలోని ఇతర స్త్రీలు కూడా స్త్రీకి శత్రువులే అని సవివరంగా చూపిస్తారు.

ఇటీవలే రాసిన ఈ కవిత్వం చూడండి. మనిషికి కరుణ రసం ఎంత అవసరమో  తెలియజేసిన కవిత ఇది. మనిషి దుఃఖ సముద్రాన్ని లోలోపల దాచుకున్నాడు. అది కరిగి కన్నీరై ప్రవహించి కలంలో సిరా గా మారితే నైనా ఎన్నాళ్లుగా రాయాలనుకున్నవి రాయగలను. గడ్డకట్టుకు పోయిన హృదయాన్ని కరిగించేది కూడా దుఃఖమే!   రాతలో తనను తాను బహిర్గతం చేసుకోవాలనుకున్నా కావల్సినది కూడా దుఃఖమే. కానీ ఆ దుఃఖం రాక లోపలే పేరుకుపోయి వణికిస్తుంది అంటారు.

” ఒలకని సిరా ”

 

ఎప్పుడో రాయాలి అనుకున్నదీ…

ఇప్పటికీ రాయలేకపోతున్నదీ…,

 

అదే…

 

గొంతులోంచి  బైటకి రానిదీ,

కళ్ళలోనుంచి కలంలోకి ఇంకనిదీ …

 

ఇంకేదీ కాదది

ఇప్పటికీ కంటినుండి తొణకనీదీ

ఒంటరిని చేసి ఒణికించెదీ

దుమ్ములా కమ్ముకున్న

దుఃఖమది,

కడ వరకూ అలలా ఎగిసిపడే

కడలంత  కష్టమది.

ఒలకని సిరా.. అంటే ఎప్పటి నుండో రాయాలనుకుని రాయలేనిది.

పోనీ అది గొంతులో నుండి వస్తుందా అదీ రాదు. కళ్ళల్లోంచి దుఃఖం సిరా అయి కలంలో ఇంకనూ లేదు. దుఃఖం మనిషిని  దమ్ములా కమ్ముకుని  ఇతరుల్లో కలవనీయకుండా ఒంటరిని చేసి  వణికిస్తుంది. లోలోపల అలల్లా ఎగసి పడుతుంది తప్ప బయటకి రాని దుఃఖం కడలి అంత కష్టమైంది అంటారు.

మెరాజ్ ఫాతిమా “అంతర్వేదన”  అనే కవితా సంపుటి వెలువరించారు. అందులో 65 కవితలు ఉన్నాయి.  పత్రికల్లో అచ్చు అయినవి రాశిలో తక్కువైనా వాసి కల్గినవి. మెరాజ్ కవిత్వంలో భావనమయ ప్రపంచం కన్నా మనుషుల ఇరుకు మనస్తత్వాన్ని వాచ్యంగా బట్టబయలు చేస్తారు.అదీ బాగున్నట్టే వుంటుంది. కవిత్వం అంటే ఇదీ, అది కాదు కవిత్వం అనుకోవడానికి వీల్లేని సోషల్ మీడియా కాలంలో  కవిత్వం కోసం కవిత్వాన్ని నిదానంగా వెతుక్కోవాలి ఓపికగా వెతుక్కోవాలి. .

మెరాజ్ ది   ప్రాపంచిక దృక్పథం.  ఒక్కోసారి క్లుప్తంగా రెండు స్టాంజా ల్లో చెప్ప వలసిన భావాన్ని అనంతమైన అర్థాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చదువరుల మెదడుకి హృదయానికి చేరేలా నేర్పుగా రాయగల్గిన ప్రతిభ ఆమె సొత్తు. ఆమె అభిలషణీయం ఏమిటో చూద్దామా.. ఈ చిన్న కవితలో..

ప్రకృతి ధర్మం అనే కవిత తో .. ఇలా అంటారు.

నేలనుతాకక ముందే వేలసార్లు అనుకుంటా

ఇంకొన్ని క్షణాలుంటే ఇంకొందరికి నీడనిద్దామని,

భూమిని చేరాకా కూడా అనుకొంటా

కొన్ని నగ్న పాదాలకు రక్షణనిద్దామని,

ప్రకృతి ధర్మాన్ని కాదనలేం,

గాలి పొమ్మంటుంటే ధూళి రమ్మంటుంటే

ఏ దరికో  ఏ దిశ కో పయనించాలి,

పరుగులాపి శాశ్వతంగా శయనించాలి.

కవి హృదయం కూడా.. జీవించినంత వరకూ స్పందించే గుణం మిగిలి వుండాలని.. కవిత్వం రాస్తూనే వుండాలని కోరుకుంటారు.

“నూరు పువ్వులు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ” మావో నినాదం..

ఒక్క కవిత ఉద్భవించనీ.. వేయి హృదయాలకు ఉత్తేజం నింపగా  .. అని నేటి కవుల కవితా సేద్యం. పుట్లు పుట్లుగా కవిత్వం పండుతుంది. అవి చచ్చువో పుచ్చువో మేలిమి గలవో అని కనిపెట్టి దగ్గరకు తీసుకోగల్గేది.. పాఠకులే!


Tuesday, 31 March 2026

నడుస్తున్న కల

 "నడిచే కల"

     ఆమె నడుస్తుంది,

     కలల  అలలతో  కలసి

     అడుగు కలుపుతుంది.

     అడవి మల్లె  అందాన్నీ..

     ఆత్మీయ బంధాన్నీ..,

     తనలో ఇముడ్చుకుంది.


     ఓ సుందర స్వప్నాన్ని

     కలవాలనీ..,

     వశీకరణంతో, 

     ఒడిచేర్చుకోవాలనీ..,

     ఆశతో జీవిస్తుంది. 


    మనస్సంతా  

    ఎదురుతెన్నుల  కన్నులైతే..,

    గుండెనిండా   గాయాల   కవాతులైతే  

    దారంతా...  చూపును   పరిచింది ,


    చిక్కటి చీకటి గదిలో..,

    తుదిలేని  మది  తలపులతో..,

    బ్రతుకంతా  పయనిస్తూ..,

    మినుగురులా    మెరుస్తుంది ,

    తను   వెతికే   తీగను   నేనైతే ,

    పొద్దు  తెలీని  ప్రేమనివ్వాలనుకుంటే్...,

    హద్దులెరుగని   ఈ  గుండెపై , అంక్షల   వలవేసింది 

    

     అందుకే ......

     ప్రతిసారీ    శబ్దమై  నాలో  పాకుతూ.., 

     శ్వాసై  నన్ను  తాకుతుంది...,

Wednesday, 20 July 2022

"ప్రకృతి ధర్మం"

 నేలనుతాకక ముందే 

వేలసార్లు అనుకుంటా

ఇంకొన్ని క్షణాలుంటే 

ఇంకొందరికి 

నీడనిద్దామని,


భూమిని చేరాకా కూడా అనుకొంటా 

కొన్ని నగ్నపాదాలకు రక్షణనిద్దామని,


ప్రకృతి ధర్మాన్ని కాదనలేం,


గాలి పొమ్మంటుంటే,

దూళి రమ్మంటుంటే,

ఏ దరికో, ఏ దిశ కో

పయనించాలి, 

పరుగులాపి

శాశ్వతంగా శయనించాలి.

 మిత్రులందరికీ 

నమస్తే , 

చాలాకాలం తర్వాత బ్లాగ్ లో ఓ కవిత

పెడదాం అనుకుంటున్నా.🙏🏻

Monday, 12 November 2018










బంధీ



వెండిపంజరానికి అందం తెచ్చిన బంధీ నేను ,
పుత్తడి కత్తిపై నెత్తురులా పూసిన అత్తరు నేను ,
ఎన్నో అసాధారణ , నిరాధారణ వాక్యాల మద్య ,
అసంబద్ద కావ్యాన్ని నేను ,
ముంచె
త్తే మానసిక కల్లం లో,
పలుకుల పరిగి ఏరుకునే పసిదాన్నే నేను,
నీకు తెలుసా
జీవితం అంటే ఏమిటో....?
కాలి గోటికి తగిలి ఎగిరపపడే గులకరాయి కాదు,
కొంగుకు కట్టుకున్న చెల్లని రూక కాదు ,
వశీకరణ ఒడిలోకి లాక్కునే చంచల వ్యామోహం కాదు ,
శిశిర వనాల పై వీచే...వడగాలి జీవితమంటే ,
కరకు చెరలను చేదించే కరవాలం జీవితమంటే ,
విషాదాన్ని తుడిచే వెన్నెల తుషారం జీవితమంటే ,
కామాన్నీ,భోగాన్నీ ఉసిగొలిపే వన్నెల విహారం జీవితమంటే ..,
నీకు తెలుసా..?
స్పృహనై ..
స్పూర్తినై ...,
స్పర్దనై... ,
స్పర్శనై.. ,
సాహసినై ..,
సహవాసినై ..,
సంతసం తో...సదా నీకై ...అద్దరిన వేచి ఉండే హిమాని నేను ,
జీవితానికీ..... జీవించటానికీ..,
భాష్యం చెప్పే ...నీ సహచరినే నేను
మెత్తని పూల బాటనై సాగిపోయే కాలాతీతం నేను ,
అచ్చ్హోట నీకై ప్రేమ ఫలాలను పరచిన శబరిని నేను,
అందరికీ అందని అద్దరిన ఉన్న అమృతాన్ని, 

నీకై వేచిన హిమగిరిని నేను...,

Friday, 6 April 2018





     మనం 



     అధికారిక, అహంభావక
    అంక్షలు విధించాలనే ఆకాంక్ష నీది.
    ఇదీ నా వాదన..........
   అత్యంత. సన్నిహితమైన
   అతి విలువైన. అమూల్యతను పదిల పరచుకొనే తత్వం నాది
   ఇది నీ వాదన...........

   ఇద్దరి మద్యా పారదర్శకత లేదు.
   మనో పరిపక్వత లేదు.
   మనల్ని మనం విభేదించుకుంటే...., విశ్లేషించు కుంటే...,
   విభిన్న దారుల బాటసారులమై పయనిస్తే...,
   మనకందని ఇంకో ప్రపంచం ఉందని తెలుసుకుంటే ..,
   మనం లేని ఇంకో కోణాన్ని దర్శించగలిగితే...,
   అందుకోసం .......,
  అహాన్నీ...
  కొంత ఇహాన్నీ....,
  వదిలేస్తే....,
  కోపాన్నీ...,
  కొంత మోహాన్నీ...,
  సడలిస్తే...,
  నేను
 నాదీ
 నీవూ..,
నీదీ..
అనేదాన్ని....,
దాటేస్తే....,
శోధన ఎరుగని భోదన అలవడుతుంది ....,
వేదన ఎరుగని సాదన అలవడుతుంది ....,

Sunday, 1 April 2018




చెప్పగలవా 

నిర్బంధం లోనూ కొంత ఆనందం ఉంటుంది.
ఒప్పందంలోనే నిర్బంధం దాగి ఉంటుంది.
.
అప్పుడప్పుడు ఆకాశం తప్పిపోతుంది,
వెన్నెల దివిటీని పట్టు కొని వెతకాల్సి వస్తుంది.
.
వికటించే పరిస్థితులలో ఇరుక్కుంటే,
విషాదమే వికసిస్తుంది మరి.
.
రెప్పలు మూయాలంటే భయం,
కత్తుల్ని మింగినట్లు కలలొస్తాయి.
.
గతాన్ని రుతువులు ఎత్తుకెళ్ళాయి.
మదింకా దెన్నో అన్వేషిస్తుంది.
.
తుది,మొదలూ ఎరుగని తలపులు చిక్కుపడీ,
విప్పలేని వేళ్ళని వణికిస్తున్నాయి.
.
ఏదో ఉద్వేగం ,ఇంకేదో విషాదం.
మనసు కారాగారంలో గుండె గంట మోగుతుంది.
.....
....
నీవెందుకు మౌనం వహిస్తావ్ ?
చెప్పు...,
స్వేచ్చంటే విడుదలా...? ఎదుగుదలా..?
.


Friday, 22 September 2017

ఆశల ఉలినై.










ఆశల ఉలినై. 

ఓ చిన్న విరామం,
వేయివేదనలు మోసిన హ్రదయం,
రెండు వెచ్చటి కన్నీటి చుక్కల అనంతరం,
సుద్దీర్ఘ  నిట్టూర్పుతో ...,

ప్రతి క్షణమూ రగిలే పగల  నెగళ్ళూ ..,
ప్రతి కణమూ ఆక్రోశాన్ని దాచుకొన్న వైనాలూ ...,
సుదీర్ఘ  నిరాశతో ..... ,

ముక్కలైన చుక్కలన్నీ..., వెలివేసిన ఆకాశం వాకిట,
మబ్బుల  చాటున తలదాచుకోనిమ్మని ,
సుదీర్ఘ  శోకంతో ..... ,

సువిశాల ప్రపంచాన  మన చూపు మాత్రమే  సోకె  గవాక్షాన్ని,
అమర్చుకొన్న  మానవ నైజాన,

తాత్విక పునాదులవైపు దృష్టి సారిస్తూ... 
మార్మిక కామితాన్ని ఆహ్వానించే  జనసంద్రాన,

ఎంత తొలిచినా, ఒలిచినా ...పెచ్చులూడిపోయే...,
రాతి శిల్పం , ఓటి శిల్పం ...... ఈ  అస్థిర  హ్రదయం. 

Sunday, 11 June 2017

ఎవరైనా చూశారా ?










ఓ అధ్బుత మయూఖ శకలం ,

శూన్యపుదారుల్లో నడిచి వెళ్లింది ..,

సరిగమలు పలికిస్తూ వెళ్ళింది ,

మర్మరహిత మనోఫలకం పై ,

ఆత్మీయ మధుర సంతకమై .

తెగిపోయిన స్వర్గపు దారులను

వెన్నెల దారాలతో కలిపిన అద్వితీయ వారథి ..,

తొలకరి జల్లులో తడిచిన ఆరుద్ర పురుగు

పసితనపు పలవరింతల పచ్చిపాల నురుగు .

వెదురు వేణువు నుండి ...,

అల్లన ,మెల్లన సాగే ...అమర గానం ..

నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలైతే.
వేగు చుక్కయి సందించిన వింటి నారి నుండి .....

మింటి కెగిరిందేమో......మీరెవరైనా ..చూశారా..???


" నీ నేను "











వెండిపంజరానికి అందం తెచ్చిన బంధీ నేను
పుత్తడి కత్తిపై నెత్తురులా పూసిన అత్తరు నేను ,
ఎన్నో అసాధారణ , నిరాధారణ వాక్యాల మద్య
అసంబద్ద కావ్యాన్ని నేను ,
ముంచెత్తే మానసిక కల్లం లో,
పలుకుల పరిగి ఏరుకునే పసిదాన్నే నేను,
నీకు తెలుసా
జీవితం అంటే ఏమిటో....?
కాలి గోటికి తగిలి ఎగిరపపడే గులకరాయి కాదు,

కొంగుకు కట్టుకున్న చెల్లని రూక కాదు ,

వశీకరణ ఒడిలోకి లాక్కునే చంచల వ్యామోహం కాదు ,

శిశిర వనాల పై వీచే...వడగాలి జీవితమంటే ,

కరకు చెరలను చేదించే కరవాలం జీవితమంటే ,

విషాదాన్ని తుడిచే వెన్నెల తుషారం జీవితమంటే ,

కామాన్నీ,భోగాన్నీ ఉసిగొలిపే వన్నెల విహారం జీవితమంటే ..,

నీకు తెలుసా..?

స్పృహనై ..

స్పూర్తినై ...,

స్పర్దనై... ,

స్పర్శనై.. ,

సాహసినై ..,

సహవాసినై ..,

సంతసం తో...సదా నీకై ...అద్దరిన వేచి ఉండే హిమాని నేను ,

జీవితానికీ..... జీవించటానికీ..,

భాష్యం చెప్పే ...నీ సహచరినే నేను

మెత్తని పూల బాటనై సాగిపోయే కాలాతీతం నేను ,

అచ్చ్హోట నీకై ప్రేమ ఫలాలను పరచిన శబరిని నేను,

అందరికీ అందని అద్దరిన ఉన్న అమృతాన్ని,

నీకై వేచిన హిమగిరిని నేను...,

Saturday, 23 April 2016












గిజిగాడు

కిటికీ ఊచలకు  తలవాల్చి ,
తలపులు తోడుకుంటున్న  వేళ,
కిటికీ  రెక్కలపై  వాలి  తన రెక్కలు  విదిల్చాడు,
నా  బంగారు  గిజిగాడు.

నిశ్శబ్దం లో  ఒదిగిపోయిన  నాపై,
తడి  రెక్కల  టప ,టపల  విదిలింపు తో,
చిరుతడి చేసి తమాషా  చూస్తాడు,
నా బంగరు  గిజిగాడు.

నా  తపస్సును  బంగం చేస్తూ,
నా సమాధిపై  నాట్యం చేస్తూ,
తమస్సు  నాకే వదలి   వెళ్ళిపోయాడు,
నా బంగారు  గిజిగాడు.


వెతికి,వెతికి అలసిన  నేను ,
ఆకసాన  కనిపిస్తాడనే ఆశతో....,
ఇంటికప్పునే  తీసేశాను.....,


ఓ  శుభోదయాన .......,

పచ్చటి  వేపమానుపై
అందంగా తానల్లుకున్న  గూటిలో,
భార్యా ,పిల్లలతో ఊయలలూగుతూ..,
నన్ను చూసి  గర్వంగా  మీసం  దువ్వి కన్ను గీటాడు,


 నేనూరుకున్నానా ....?
దోరగా నవ్వుతూ ..,
దోసిట  గింజలతో... ,
మరోమారు వాడి ముందు అమ్మలా అవతరించాను ...,

 

  

Monday, 14 December 2015

ఏకాంత శిల




ఏకాంత  శిల 





శబ్దాన్ని   మరచి చలనాన్ని  విడిచిన ,
అనిశ్చత ,అంధకార, నిరాకార ,ఆవాహన ,
ఉద్విగ్న  అక్షర ప్రియం ...,

వేన వేల భావాలకు   బాసటగా నిలిచినా ,
పదాల ,పెదాలపై ..పల్లవించే  తీయని  పరిమళాల,
హృది దోసిలి  నిండా  సజీవ  జ్ఞాపకాలు ...,


పారిజాతాలై  
మది  మందిరాన  రాలుతూ...   ,
మౌనాన్ని  తట్టి లేపి ,మాటను  పట్టి  తెచ్చి ,
మనస్సుకు  లిపి  నేర్పిన  సమయాన ..,

 ఏదో  రూపం ,మరేదో  మోహం...,
జీవన  గతిని  మార్చాలనీ,
అనివార్య ,నిర్వికారత ,విఘాత  తలపుల ,
వికృత  శాపమై ....,

నను  సుషిప్తిలోనికి  జార్చాలని ,
విశ్వ ప్రయత్నం చేసే ....  ఓ .... ఏకాంతమా...,



ఉలిని  చేతబట్టి ..,
శిలను  చెలిగా  మలచిన ..,
మనోహరుని  సాన్నిహిత్యం ...,
నీకు  అల్విదా   పలుకుతుంది .... వినుమా... .,


Wednesday, 25 November 2015

ఓ సారి ఇటు చూడు



ఓ సారి   ఇటు  చూడు 



చందురూడా .... !
నీ సిరివెన్నెల   సిరులోలుకుతూ ..,
చిరుజల్లుల  మరులోలుకుతూ ..,
రేరాణి  మధుపర్కములను  తమీతో   తడుపుతూ ..,


కలువలరాయడా ...!
తారకలన్నీ దివి  తోరణాలై  వెలుగుతూ..,
మబ్బుల   సెజ్జపై  వెలుగులద్డుతూ..,
మింటి  ఇంటికి    ఇంద్రధనువు   గొళ్ళెం పెడుతూ ..,


రేరాజా...!
అనిలుని  కవ్వింతను  అనలముగా   తలంచుతూ..,
ఇనునికి,వారిజమునకూ  ఈర్ష్య  కలిగించుతూ.., 
మనో  మందిరాన  పూలశరాలను  సందించుతూ ...,
కలువభామ  ఆకసానికి  మేఘాల  మెట్లు కడుతున్నది   

Saturday, 22 August 2015

రంగులడబ్బా సరిజేసుకో బిడ్డా ....



     








రంగులడబ్బా  సరిజేసుకో బిడ్డా ..... 





పొద్దుగాల నుండి  గా  రంగుల  డబ్బాలోకెల్లి ,
ఒకటే  ఒర్లుడు , పోరగాల్లు  తినేటివేన్దో   పాడయి  జచ్చినాయంట ,

అస్సలు  గీళ్ళకి  తెల్సా.. ..,
మా ఇంట్ల  పోరగాల్లకి  బువ్వ దొరుకుడే  కష్టం ,

గాయమ్మ   ఎవ్వరో   సిన్మాపోరినట  ఎవ్వనినో  ప్రేమించినదనీ... ,
పెళ్ళిలో  కెల్లి  పారిపోయినాదనీ .... ఒకటే    సూపెట్టుడే ,


కులపోల్ల    అదిలింపుల్లో ... ..పురుగుల మందు దాగి,
ఊరిపొలిమేరల్లో  పోయిన  మన   ఊరి పోరి  కనిపించలేదారా...? 

అరె  బస్టాపలకెల్లి    బద్మ్మాష్ గాళ్ళు ,
ఆడపోరిలను  ఆగమ్జేస్తుండ్రు   గదా...  గది  కన్పడదా.... ?

గాయనెవరో   పైదేశానికెల్లి    పైసలుబోసి  పొట్ట  మెలికలు  దిప్పుచ్చుకున్నాడంట ,
ఇక్కడ   కడుపుతోనున్న  ఆడకూతురు  ఆసుపత్రిబైటనే  పురుడుబోసుకొని  పీనిగయ్యింది,
గది కానొస్తలేదారా  మీకు ,

సూటూ  బూటూ   ఏసుకున్నోల్లనో,
సినిమా  హీరోలనో,
కాలేజీ పోరగాళ్ళనో,
సైబరు కేటుగాళ్లనో ,
షాపింగ్ బేరగాళ్లనో ,
దొంగనోట్ల  దొరగాల్లనో ,
కబ్జాల  గజ్జిగాల్లనో,
దొంగ బాబాగాల్లనో ,
రంగుటుంగరాల్లోల్లనో , కాదురా  మీ  ఇంటర్యూలతో   ఊదరగొట్టుడు....,

ఇల్లులేనోళ్లనీ,  కళ్ళులేనోళ్లనీ, రోగాలు  ముసురుకున్నోల్లనీ, మురికి  కాలువల్లో  కాపురమున్నోల్లనీ, దోమలతో దోస్తీజేసేటోల్లనీ, ముస్టోల్లనీ, కుస్టోల్లనీ,  అనాథలనీ, అన్నార్తులనీ ...ఇంటర్యూ  జేయండి ...., గాళ్ళ  లొల్లి  ఏందో   ఎల్లబెట్టుండ్రి . 

రంగుల డబ్బాకు   హంగులే   కాదు  ఆకలి    జూపించుడు  ఎప్పటికీ  తెల్వదా ??? 

  


  


Friday, 14 August 2015

నువ్వేనా...?











నువ్వేనా...?

సుదీర్గ    నిశ్శబ్దం   ఆవల ,
అనంత  ఒంటరితనం  వెనుక  నక్కిన ,
అలుపెరుగని  నా  మనో కలల
అన్వేషితవు  నీవేనా...?


నా భుజం  పై  నేనే  తలవాల్చుకొని ,
ఒకింత  ఓదార్పుని  ఆశించిన  క్షణాన,
వెన్నంటి   ఉన్న  మనో చాయని ,
ఏమార్చిన   విభావరి   నీవేనా..?


కల్లోలిత    నదీమ  జలాన్ని  ఈదలేని ,
నా  అనాశక్తనో,  రేరాజుకై  తపించే,
నా  అర్ద ఊపిరినీ ...ఆపాలని  చూసిన,
అమావాస్య  నిశాచరి  నీవేనా..?


వేల మొక్కుల  అనంతరం ,
నేలకు  దిగిన  రేరాజు  రేయంచులో,
నను  పలకరించు  వేళ ,
శబ్దించిన  ఆ  అపశృతి   నీవేనా  ......?


ఇంతకీ ...,

నువ్వు   నీడవా... ?  జాడవా ...? మనో  దారివా ...?











Wednesday, 17 June 2015

" సమజవతలేదు "


                   









" సమజవతలేదు "




దిమాక్   కరాబయ్తాంది
గీ ..   బతుకులు    జూస్తుంటే,

ఏటికేడు  కాలమవతాదనుకుంటే,
ఆగమవతానే     ఉండాది.

పోరగాడి సదువు  పూర్తయినాదిలే  అనుకుంటే ,
కొలువు  పతంగై   పైన   కూచున్నాది.

గీ   పల్లెలో   ఏముంది,
నీళ్ళకోసం   మైళ్ళు   నడుసుడయ్యే ,

ఊర్ల నీళ్ళు  దాగితే ,
కాళ్ళు   వంకర్లు   బోవుడే  ఇగ.

 అవ్...  ...ఒక్క మాటడగాల్నే  నిన్ను ,
ఓటు  దీసుకుంటివి  గదా..మా   దూప దీర్చవా?


ఇంగితముంటే ,
జరా  సొంచాయించు,
గాయనెవరో  మూటగట్టుకున్నాడు,
గీయనెవరో  ముల్లె గట్టుకున్నడు ,

గీ   భోగాతమ్ రోజూ   ఉండెడిదే,
మేము  గట్టిన  శిస్తులూ ,మేము  గట్టిన పన్నులూ
మస్తు  అయితాయి  గదా ...,


మరి ,
గాడేమి  పట్టుకెల్లిండో, గీడేమి  పెట్టి ఎల్లిండో,
ఏలి  ముద్రగాళ్ళమ్   మాకేమెరిక?



అయినా నాకు  తెల్వక  అడగతా.... ,
అందరూ  గల్సి ,జాతరలెక్క  జమయ్యి ,
మా   పీనిగిల  మీదకెల్లి ....చిల్లరేరుటేందే ......సమజవతలేదు


Wednesday, 27 May 2015

" నీవు నా ప్రాణమే "








 " నీవు   నా ప్రాణమే "


బలాత్కరించబడ్డ  క్షణాలన్నీ....
బంధీలైన  గడియలన్నీ....,
నిఘా  వెనుక  భయాలన్నీ...,
జీవితం పై  దాడి  చేసే  వేళ ...



అగాథాల  అంబుధిలో ..,
విఘాతాల  వనాలలో ....
వసంతం పారిపోతుంటే ,
శిశిరం   వచ్చి  చేరుతున్న వేళ ,



నా కళ్ల మీదుగా   ప్రవహించే
నెత్తుటి  నదులను  తొలగించి ,
నిశి  రాతిరిని  పండువెన్నెలగా  మార్చిన ,
శరత్ చంద్రునివి   నీవు .




గుండెలకు  తుపాకులు  పెట్టినా ..,
చెదరని  విప్లవ  పక్షులు,
నా  మనో  గాయాలు ,



ఓ  సందిగ్ద  సాయంకాల  వేళ ,
చిక్కుపడిన    నా  ఆలోచనా  వల,
చలించిన  నా  మనో  కల ....,



ఉట్టికాళ్లతో    మండుటెండలో  నడిచే
పసిపాప   పాదాల     వేధన  నాది ,

కాలిన  పాదాలకు  నవనీతం  అద్ది,
అక్కున  చేర్చుకున్న అయ్యతనం  నీది,



ఎలా  సాద్యమైంది ,  నీకిదంతా ...?
ఎలా   దూరమైంది ,నా   వెతంతా...?



శరీరమంతా  రెండు  చేతులుగా  చేసుకొని,
కృతజ్ఞతతో  నీకు    నమస్కరిస్తున్నాను



Thursday, 7 May 2015












మాలిమైన  పావురాళ్ళు , నా అక్షర  స్నేహితురాళ్ళు.

   తిరణాలలో  తప్పిపోయిన
   బీద  పసిపిల్లలు,

   దిక్కుతోచక ..ఆకలితో ఏడిచే
   అనాథ  బాలబాలికలు .

   నా కలం లోని   సిరాచుక్క నుండి ,
   ఎగిసి  పడే  ఎర్రని  రక్తాక్షరాలు

   మరల మద్య  మరల, మరలా తిరిగే
   అలుపెరుగని  కార్మికులు,


   పట్టెడన్నానికై ..ఎండని  సైతం లెక్కచేయని,
   వెట్టికి   అలవాటైన శ్రామికులు
 

 
కష్టాలకూ,నష్టాలకూ తలవంచి ,
అధికదరల  తలారికి  తలనిచ్చే

   అరాచకాలపై సమర భేరి మోగించిన,
   అక్షర శంఖాలు.

   నిదుర కాసి  నేను అల్లుకున్న
   జాబిలి వెలుగులు.

   అలుపే  ఎరుగని  నిరంతర పోరు సలిపే,
   అక్షర  వీరులు.

   ప్రతి సాహితీ ప్రియుని పలకరించే,
   ప్రేమ మాలికలు.

   విద్యావంతులైన  మీ ఆశ్శీస్సులను  నాకందించే,
   శుభాషితాలు

  

Sunday, 12 April 2015

శరత్ కాల చలన క్షణం








శరత్ కాల   చలన క్షణం







పొడి పొడిగా  నేల  రాలే ..
వెన్నెల పలుకులను
ఏరి  కోరి  శీతల  రాత్రుల
శిథిల  జ్ఞాపకాల  సమాదిపై
మధుర   రాసులుగా   పోస్తూ ...,








కనురెప్పల  వెనుక
నిలిచిపోయిన  రూపాన్ని
విఫలమై  విరిగిపడే  కాలనీ,
పోటెత్తే  హృదయ  సంద్రాన ,
మది  అలలపై   మమకారంగా  అద్దుతూ ..,








వెలసిపోయిన  మనో ఫలకంపై
కలసి  వేసుకున్న  రంగుల  చిత్రాన్ని
పెచ్చులూడిపోకుండా  పెదవులద్ది ,
వ్యధిత  హృదయంతో   విలపిస్తూ ...,  








కలత పడకు  కలకాలం తోడుంటానన్న ,
కలువల రేడు  కనుమరుగైతే
ఆకసమంతా ...కలయదిరిగి ,
జాడ  తెలియని    ఆడ  హృదయం
తరతరాలుగా   తలపోస్తూ..  విలపిస్తూనే ఉంది .    








Thursday, 19 March 2015

సంహిత.

    





   సంహిత. 

    నేను  కలలు  కనటం  మానేసినప్పుడల్లా,
    నన్ను వెతుక్కుంటూ వస్తుంది. 

    నాపై రవ్వంత చిరునవ్వునీ,కొండంత కోపాన్నీ,
    కుమ్మరించి హడావిడిగా, 
    వెడలిపోతుంది. 

    నా  ముంజేతి పై ముద్దు పెట్టి,  చెవి మెలిపెట్టి, 
    నెత్తిపై  మొట్టి, తడబడుతుంటే  
    తమాషా చూస్తుంది. 

    అనంత  జనాంబుధిలో  ఉక్కిరిబిక్కిరై ,
    దిక్కుతోచక నేనుంటే, 
    లంగరేసి పక్కకు లాగుతుంది. 

    నన్ను పొద్దు తిరుగుడు పువ్వులా తిప్పి,తిప్పి,
    రాత్రికి తులాభారమేసి, 
    సత్యకు అమ్మేస్తుంది. 

   కునుకుపడేవేళ  కురంగిలా వచ్చి,
   అంతులేని ఈర్ష్యతో,
   సివంగిలా  గర్జిస్తుంది. 

    వెదురు వేణువునై  నేను  వేదన వినిపిస్తే..,
    నన్ను పొత్తిళ్ళలో పాపాయిని చేసి,
    హత్తుకుంటుంది. 

    చిరు గడ్డాన్ని చివుక్కున  కొరికి,
    బిక్కమొఖం వేసిన నన్ను, 
    అక్కున చేర్చుకుంటుంది.