Pages

Wednesday, 29 January 2014

ఆశల భవిత.

    


    ఆశల  భవిత. 

     ఆమె గుండె మండుతుంది,గొంతు తడి ఆరుతుంది,
     బుగ్గలపై జారుతున్న కన్నీళ్లు ఎండిపోతున్నాయి. 

     గట్టిగా అరవాలనుంది, వీధిలోకి పరుగెట్టాలనుంది,
     నిద్రిస్తున్న నాగరీకులనందరినీ  నిలదీయాలనుంది. 

     చదువులమ్మ బడిలో అన్నీనీతిసూత్రాలే, సుమతివాక్కులె,
     సాయంత్రమైతే   కన్నతండ్రి  నోటినుండి అన్నీ బూతులే,

     చదువుల తల్లి  చేతిలో శభాష్ అనిపించుకున్న మార్కులచిట్టీ,
     తూలుతూ  వచ్చిన తండ్రి   చేతి వేలుముద్రకై పట్టిన కుస్తీ,

     చిరాకుపడ్డ  సగటు మనిషి  చిట్టీని   చింపి పారేశాడు,
     అడ్డమొచ్చిన  ఆలిని గొడ్డుని బాదినట్లు బాదేశాడు. 

     ఎగిరేపిట్టకి  ఉండేలు దెబ్బ తగిలినట్లూ...  ,
     వేల కీటకాలు  శరీరాన్ని  తొలుస్తున్నట్లూ..,

     నేలరాలిన ప్రతి కాగితపు ముక్కా వెక్కిరిస్తున్నట్లూ.... ,
     దిక్కులన్నీ ఏకమై  తనని  బురదలో ముంచేస్తున్నట్లూ..,  

     తన్నులు  తిన్న తల్లి  కన్నీటితో కలిసిన, 
     మెతుకులు తినిపిస్తుంటే,కుక్కి మంచంలో కునుకు తీసింది. 

     అవును  ఆమె చదువుల తల్లి, 
     రేపటి ఆడపిల్లలకి కల్పవల్లి, ఆశల దీపావళి.. 

     (మరో కొత్త ఉదయం ఆమెను నిద్ర లేపుతుంది,
     ఆశా భవిత  బడివైపు  అడుగులేయిస్తుంది )




  

Monday, 27 January 2014

రేపటి పౌరులు






    రేపటి  పౌరులు



గణతంత్ర దినాన్ని పునస్కరించుకొని మా పిల్లల కోరిక మేర నగరం లో జండా వందన అనంతరం ఓ పార్క కి విద్యార్ధులను తీసుకొని వెళ్ళాము.

పిల్లలు పార్కంతా కలయ దిరిగారు, ప్రతి పువ్వునూ పలకరించారు,తెల్లని యూనిఫాంలో పావురాళ్ళలా ఉన్నారు మేము టీచర్స్ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా పిల్లలని ఓ కంట కనిపెట్టే ఉన్నాము .
ఆడుతున్న్నమా పిల్లలు ఉన్నట్లుండి ఓ చోట గుమిగూడారు, ఏమయి ఉంటుందో అని మేము పరుగున వెళ్ళాము
వారి మద్య ఓ ఆరేళ్ళ పిల్ల చింపిరి జుట్టూ,చిరిగిన బట్టల్లో భుజానికి ఓ గుడ్డ సంచీ,చేతికి వెదురుబుట్ట తగిలించుకొని వేపిన పల్లీలు(వేరుశనగ పప్పులు)అమ్ముతుంది.చిన్ని చిన్ని పేపరు ముక్కల్లో వాటిని అందంగా పేర్చి పొట్లం కట్టి ఇస్తుంది.మేము ఆ దృశ్యం చూస్తూనే పిల్లల్ని గట్టిగా కేకలేశాము, ఇదేనా మీకు స్కూల్లో నేర్పింది ఇలా బైటి చిరుతిండ్లు తినకూడదని చెప్పలేదా అని కేకలేశాం. పిల్లలు వెంటనే ఆ పొట్లాలు ఆ పిల్ల బుట్టలో పడేసి మా వెనక్కి వచ్చి నిల్చున్నారు, ఆ పాప వాళ్ళకు పైసలు తిరిగి ఇస్తూ.. అవి శుబ్రంగానే ఉన్నాయండీ అన్నది భయంగా, మా పావురాళ్ళు మాతో కదిలాయి, ఆ పాప కొంచం సేపు అక్కడే తచ్చాడి ఇక లాబం లేదని ఎటో వెళ్ళింది.

మద్యాహ్నానికి పిల్లలు ఆడి ,ఆడి అలసిపోయి మేము అరేంజ్ చేసిన ఫుడ్ తిని, ఓ చోట గుండంగా కూర్చుని ఇండోర్ గేమ్‌ ఆడుకుంటున్నారు.

ఇంతలో ఓ కుర్రాడు కొన్ని బెలూన్లు తీసుకొని అక్కడికి వచ్చాడు, వాడు ఎండలో తిరిగి చెమటలు కక్కుతున్నాడు, మేము మా పిల్లలకు అవి కొనొద్దని కళ్ళతోనే వారించాము.అశుబ్రమైన వారి దగ్గరికి వెళ్ళరాదని మేము చెప్పిన పాఠం వారు మరచిపోలేదు.

మరి కాసేపటికి ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడు, ఓ చిన్ని ప్లాస్టిక్ సీసాలో సబ్బు నీళ్ళు నింపుకొని, చిన్ని స్ట్రా తో ఆ నీరు నోటిలోకి తీసుకొని బుడగల్లా ఊదుతున్నాడు . అది చూసి మా పిల్లలు సంబరపడ్డారు, వెంటనే ఓ టీచర్ ఆ నీళ్ళు నోటిలోకి వెల్తే  ప్రమాదమని హెచ్చరించింది. వాడిని అక్కడినుండి వెళ్ళమని అదిలించింది.ఇంతలో ఓ మూడేళ్ళ చిన్ని కుర్రాడు రంగురంగుల కాగితపు పూలు కొనమని ఇంచుమించు కాళ్ళు పట్టుకున్నట్లు అడిగాడు, ఆ పూలకి వేసే రంగులు ప్రమాదకరమని మా డ్రాయింగ్ టీచర్ వద్దన్నారు. మొత్తం మీద ఆ పిల్లల్ని అక్కడి నుండి తరిమేసి, మా పావురాళ్ళని  రక్షించుకున్నాం.
                                                                    ***


సాయంత్రమైంది ఇంటికి బయలుదేరాము  పిల్లల్ని బస్ లో ఎక్కించి మేము గేట్ వరకూ మెల్లగా నడుస్తున్నాం, ఇందాకటి ఆ పిల్లలు పార్కులో ఓ మూల చేరి ,మా విద్యార్ధులు తిని పారేసిన ఎంగిలి ప్లేట్స్ లో మిగిలిన పదార్దాలు తింటూ కనిపించారు.

అంతలోనే  ఓ ఆడ మనిషి, చేతిలో ఓ బెత్తం (మా బాషలో)తో వారిని  కొట్టేందుకు  ఎగబడింది.
"దొంగ నా.. ఇక్కడ మెక్కుతున్నారా? ఒసే .. పల్లీలు అమ్మకుంటా ఎంగిలి నాకుతున్నావా కుక్కా.." అంటూ ఆ పిల్లని  జుట్టు పట్టుకుంది.

నేను అడ్డుకోబోయాను మా టీచర్స్ వద్దన్నారు, (నిజమే మా లాంటి నాగరికులు కలగజేసుకోకూడదు కదా..)
"అయ్యో వాళ్ళు వద్దన్నారక్కా.. అవి తినకూడదట", ఆ పిల్ల వణుకుతూ చెప్పింది,

"నీకేమైందిరా బద్మాష్.." సబ్బునీళ్ళ బుడ్డోడిని జుట్టు పట్టుకుందావిడ.

"ఆ నీళ్ళు నోట్లోకి పోగూడదంట." మొండిగా అన్నడు వాడు.

"నువ్వురా చెత్త నా.. "కాగితపు పూల బుడ్డోడిని నేల మీదేసి ఈడ్చింది.

ఆ ఇస్కూల్ పిల్లల్ని మాటల్లో పెట్టి కొనిపించలేకపొయ్యారు, మీకు కడుపు మాడిస్తే తిక్క కుదురుతుంది కేకలేస్తుందామె.

వాళ్ళు ఎదో మాట్లాడతున్నారక్కా. మాకు అర్దం కాలా ... చదూకున్నోళ్ళు కదా మా దగ్గరగా రాకూడదని దూరంగా వెళ్ళారు. ఏడుస్తూ ఏక కంఠం తో చెప్తున్నారు ఆ పిల్లలు , ఇక చూడలేక నేను బస్స్సెక్కాను ,



గేటు దాటుతున్న మా బస్సుకు టాటా, చెప్తూ  ఊపుతున్న ఆ పసి చేయి  నా నీళ్ళు నిండిన కళ్ళకు మసగ్గా  కనిపించింది.  బాల్యం కూడా ఎన్ని రంగుల్లో ఉందో... (నేనింకా మూడురంగుల్లోనే వెతుకుతున్నాను.)





















Saturday, 25 January 2014

నిరుక్త

    




   నిరుక్త

    కలలకి ఆకారమయిన చిరు మొలకవి.

    కష్టాలకొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి.


    నిరుపేద ముంగిట వెలసిన చలువ పందిరివి.


    కలల పంటవైన నిను మోసిన అమ్మ,


    కరవు కాటకాలతో వడలిపోయిన కొమ్మ.


    అణువణువూ ఆరిపోతున్నట్లూ, ఆఖరి శ్వాస ఆగిపోతున్నట్లూ..


    నిప్పుల కొలిమి తానై నొప్పులు పడింది,


    కంటి దీపమైన నీవు ఇంట వేలిగే వరకూ 

    పంటి బిగువున బాధనాపుకోగలిగింది.

    తొమ్మిది నెల్లల్లో నీ బతుకు పుస్తకం అచ్చువేసింది.


    తొలి పలుకుల్లో నీ ఆకారానికి ఆకృతిని ఇచ్చింది.


    ఆఖరి పేజీలో తన ఆయువునే అంకితమిచ్చింది.


    తన గర్భం నుండి దించి నిను ధరణి వితర్ది పై నిలబెట్టింది


    "కంగారు తల్లి "లా నిను తోలుసంచిలో మోయలేక పోయింది..


    జోల పాటలతో నిన్ను నిదురపుచ్చలేదు.


    కర్మ సిద్ధాంతాన్ని నీ కాళ్ళకు చుట్టింది.


    ఆకలి గ్రంథాన్ని నీ అరచేతిలో పెట్టింది.నీకు అందనంత దూరం వెళ్ళింది


    చిరుచేపవైన నీవు వెతల వైతరణిని ఎలా ఈదగలవో..


    చిన్న కురంగివి నీవు వేటసివంగులను ఎలా ఎదుర్కొగలవో..


    కాలదోషం పట్టని ఈ బీదతనాన్ని ఎలా పారద్రోలగలవో...


                                          ***

    చిన్ని వామనా భారతమ్మనడుగు అడుగు ఎక్కడ పెట్టాలి అని.

    చిట్టి కుచేలా అన్నపూర్ణమ్మని అడుగు నా అన్నం ఏది అని.


    ధర్మభూమినడుగు ఈ దారిద్యపు ఖర్మ ఏమిటి అని..


    కాళరాత్రి నడుగు కాంతి పుంజం ఎపుడొస్తుందీ అని.


    నీ ప్రతి పనినీ పదును చేసుకో ..నీ బ్రతుకు బాటను చదును చేసుకో.



Thursday, 23 January 2014

అతివ అంతరంగం

అతివ అంతరంగం

నీ  రాకకై  ఎదురు  చూసిన  "ఊర్మిళను"
నీ  తలపుతో  తపించిన  " శకుంతలను"
నీ  ఆనతో  కానలకేగిన  "అయోనిజను" 
నీ  పాద  స్పర్శతో  నాతియైన  "అహల్యను"
నీ  ప్రేమ  నాకే  చెందాలని  సాధించిన  "సత్యను"
నిను  తులసి దళంతో తూకం వేసిన "రుక్మిణిని"
నీ  పదాలనే  పలవరించిన  "మీరాని"
నీ  సత్యపథంలో  నడిచిన  "చంద్రమతిని"
నీకు  పరస్త్రీ  వ్యామోహం  వలదని  పలికిన  "మండోదరిని"
మూర్చిల్లిన  నిను  ముప్పునుండి  తప్పించిన  "నరకాసుర మర్దినిని"
నీ  ప్రేమకై  రేపల్లెను  పొదరిల్లు  చేసిన  "రాధని"
నీవాడిన  జూదంలో  పావునైన  "పాంచాలిని"
యుగాలు  మారినా  నీ "యువతినే", తరాలు మారినా నీ "తలోదరినే"
కలియుగంలోనూ నీ "కలికినే".
ఈ యుగం లో నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలను".
రాక్షసంగా  నీవు మారి నన్ను విగతను చేస్తున్నావు.

Wednesday, 22 January 2014

కాలుతున్న పూలతీగలు

   









    కాలుతున్న పూలతీగలు. 

     పూలతోటలో పరిమళించాల్సిన  కుసుమాలు ,
     దున్నపోతుల  గిట్టలకింద నలుగుతున్నాయి. 

     వెలుగు కిరణాలతో  విరియాల్సిన  గులాబీలు,
     నిశి  రాతిరిలో నుసి రేఖలై  రాలుతున్నాయి. 

     అక్షరాల  ఆలయాలలో కూడా రాక్షస పాదాలు. 
     సంచరిస్తూ  సరదా  తీర్చుకున్తున్నాయి. 

     ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఊరిబైట చేరి ఊరిస్తున్నాయి,
     మిడతల దండును తరిమేందుకు  మిరియపు పొడినిస్తున్నాయి. 

     గడప దాటిన తనయ  ఘడియైనా  కాకముందే,
     వార్తల్లో నాని  నాన్నకి  శవమై  అగుపిస్తుంది. 

     ఎన్ని డేగల ముక్కులు పొడిచాయో..,ఎన్ని కుక్కలు ఎంగిలి చేశాయో 
     ఎన్ని ఎలుగులు దాడిచేశాయో,క్షణ,క్షణమూ  వీక్షణం. 

     కన్నవాళ్ళ,తోడబుట్టిన వాళ్ళను  కెలికి,కెలికి,
     నిజాలు తెలుసు కొంటున్న  వైనాలు. 

     దాడిచేసిన  అడవి దున్నలు,జనారణ్యం లో 
     రోమ్మువిరుచుకు  తిరుగుతున్నాయి.

     ఏలికలు  బృహన్నలై  "అభయ" ముద్రలు చూపుతున్నారు,
     న్యాయ స్థానాలు  "నిర్భయ" వాగ్దానాలు చేస్తున్నాయి.  

     ఆడబిడ్డలని  వివస్త్రలను  చేసిన  ఉన్మాదులకు,
     ఇలాంటివి "అనూహ్య " సంఘటనలవుతున్నాయి. 

     ఒక్కసారి,

     మదాన్ధులను  వధించి చూడు, 
     ఉన్మాదులను ఉరేసి చూడు,
     చట్టం దాని పని అది చేసుకొనేలా చూడు,
     తక్కెట్లో  న్యాయాన్ని సరిచేసి చూడు.   




Monday, 20 January 2014

కంటివెలుగువై... మింటిదీపమై






    కంటివెలుగువై... మింటిదీపమై... 


     తొలి కిరణమై,వెలుగు దారమై... 
     నులివచ్చని  స్పర్శవై..,

     ఆత్మీయ బంధానివై, సుమ గంధానివై... 
     కలల కౌముదివై...,

     అనురాగ అతిథివై,రంగుల ఆమనివై..,
     ఎడారిలో నీటి చలమవై..,

     ఒంటరి జీవితానికి  కొండంత ఓదార్పువై..,
     మదుర జ్ఞాపకానివై..,

     ఎద మీటిన  భవిత వీణియవై.., 
     నుదుట రాసిన  వెన్నెల  సంతకమై..,

     అవును 

     చూపులేని  ఆ  కనుపాపలకు,
     వెలుగునిచ్చే మింటిదీపానివై..,

     దృశ్య ప్రవాహమై... తనతో ..,
     ఏడడుగులు  నడిచిన  నీవు 

     మరో మహానీయుడివే....మానవత్వానికి మరో మాటవే.     




Friday, 17 January 2014

మూగబోయిన పల్లె

   






    మూగబోయిన  పల్లె

     నిద్రబోయిన   నా పల్లె
     నిశ్సబ్దంగా ఉంది,

     పక్షులన్నీ  గింజలు లేక,

     చెట్టు కొమ్మకే అంటుకు పొయాయి.

     డొక్కలెండిన కుక్కలు

     మురికి నీళ్ళతో  కడుపు నింపుకున్నాయి.

     దారంతా గోతులు,

     మట్టి ఎగుమతి  అవుతున్న ఆనవాళ్ళూ,

     నరికిన చెట్లూ,

     పూలమ్మిన చోటే కట్టెలమ్మిన దౌర్భాగ్యాలూ,

     బోసిపోయిన వాకిళ్ళూ ,

     గుమ్మం లో ముసలీ,ముతకా కాపలాలూ,

     నులకతాళ్ళు  తింటున్న తువ్వాయిలూ,

     కళ్ళలో ప్రాణాలెట్టుకున్న బసవయ్యలూ, 

     బిలంలోకి   జారిపోయిన పల్లె తాళాలూ,

     వెతికి పట్టుకున్న నగరవాసులు , 

     పల్లెతల్లిని నిద్దురలేపి,
     పాతకబుర్లన్నీ  పలికించుకొనీ,
     అమ్మ కమ్మదనమంతా ఒలికించుకొనీ... ఆడీ,పాడీ,

     హటాత్తుగా అమ్మనలా వదిలేసి ,
     పట్టుకొమ్మని  దిగి,బతుకు బాటన పడతారు,
     మళ్ళా మకర సంక్రాంతికి  పలకరిస్తారు.

     {పల్లెలు దేశానికి  పట్టుకొమ్మలు అన్నారు బాపూజీ... 
     అవినేడు  ఎండుకొమ్మలవుతున్నాయి.
     ఆ కొమ్మలను చిగురించేలా.. రైతుకు  చేయూతనిద్దాం }