Pages

Friday, 28 February 2014

చందురూడా... ,







      చందురూడా... ,

      బహురూపుల చందమామవు,
      మదిలో దాగి  కలలకు, 
      మోహపు సంకెళ్ళు వేస్తావు. 

      చెంత  చేరని శశి మామావు,
      నిడురలేని కనులకు  వెన్నెల,
      లేపనాలు రాస్తావు. 
      మేఘాల మాటున నక్కిన జాబిలి మామవు,
      ఎదురుచూసే  వారిని  ఏడిపించి,
      కొంటెగా వెక్కిరిస్తావు. 

      తొలిజామునే వీడ్కోలు పలికి,
      మలి పక్షానికై వేచి ఉండమని,
      చల్లగా జారుకొనే రేరాజువు. 

      చల్లని నీ వెన్నెలతో,
      చక్కని నీ స్నేహంతో,
      శాంతిని పంచే చందమామవు,

      సౌమ్యుడవూ....,సోముడవూ...,సఖుడవూ...,
      అమ్మ తమ్ముడవూ..,అయినవాడవూ..,అందరివాడవూ.., 
      అందనివాడవూ...,













Monday, 24 February 2014

మ(తె)గువ

    




    మ(తె)గువ

    వెచ్చటి  కన్నీళ్ళనూ,కాలిపోయిన కలలనూ,
    వారసత్వపు  ఆస్తిగా అనుకుంటాం,
    ఎందుకంటే  మేం నిర్భాగ్య అబలలం.

    కడుపు కోతలనూ,గర్భ స్రావాలనూ,
    అలవాటుగా  అనుభవిస్తాం,
    ఎందుకంటే మేం  అమాయక అతివలం.

    మగతనం పెత్తనాలనూ,మదపు ఎత్తుగడలనూ,
    శిరస్సు వంచి  బరిస్తాం,
    ఎందుకంటే  మేం  మర్మమెరుగని మహిళలం.

    ఆరాచకాలనూ,అన్యాయాలనూ,
    అప్పుడే  మరచిపోతుంటాం,
    ఎందుకంటే మేం అసహాయ ఆడవాళ్ళం.

    కలల పూలతలల్ని తుంచిన  కర్కశ జంతువుతో,
    కలసి మెలసి  కమ్మగా కాపురం చేస్తుంటాం,
    ఎందుకంటే  మేం  పెదవివిప్పని పడతులం.

    మనసారా  స్నేహించేది  హంసయినా  దరిచేరనీయక,
    అపరసాద్విలా  అవతారమెత్తి  కాకితోనే కలకాలముంటాం,
    ఎందుకంటే  మేం  తప్పు తెలియని తలోదరులం.

    ఇంకోచోట,

    లాలించి,కవ్వించి  మరపించలేకున్నా ,
    శ్రమించి చెంతనుండే  సహచారునితో,
    రవ్వంతైనా  సహనంతో  ఉండలేం ,
    ఎందుకంటే  మేం  ఆదునిక అతివలం.

    మదిలో  స్థానాన్నిచ్చి రక్త సంబంధీకుల కంటే,
    ఉన్నతంగా ఉంచినా,
    తనని దేహం నుండి తెగిన అంగాన్ని చేస్తాం,
    ఎందుకంటే  మేం  విద్యా వనితలం.

    పందిరి తానైతే,పచ్చగా అల్లుకోవాల్సిన  సమయాన,
    ఎండినపుల్లై  విరిగి పడి విరుచుక పాడుతాం,
    ఎందుకంటే  మేం  స్వాతంత్ర్య ఉవిదలం.

    పుట్టింటి వాళ్ళతో కుమ్ముక్కై  హక్కులకై,
    అర్రులు చాచి  అత్తింటి ఆడవాళ్ళనే బజారుకీడుస్తాం.
    ఎందుకంటే  మేం  నాగరిక నారులం.

    (అగ్గయి  బగ్గున మండుతూ అన్యాయం జరిగిందని  విలపిస్తూ
    అనాలోచితంగా బుగ్గయ్యే  దుస్థితి  తెచ్చుకోకూడదని
    ఎందరో  సోదరీమణులకు  ఓ హెచ్చరిక మాత్రమే.. మెరాజ్.)






Friday, 21 February 2014

అక్షర (ధార) దారి

     

    అక్షర (ధార) దారి 

     కవిత్వమంటే  మత్తుగా కలల్లో 
     తేలిపొవటం అనుకొనేదాన్ని,

     మది లోతుల్లో ఊరిన  మదురభావాల  
     అమృతపు ఊట అనుకొనేదాన్ని,

     కానీ,

     భావోద్వేగాల  బాకుల దాటికి,
     ఊపిరాడక  తెగిన శ్వాస  అనుకోలేదు,

     ఇక్కడ ఎవరి పంథా  వారిదే,
     అందరు   సలిపేదీ  అక్షర పొరే. 

     వెన్నెల దారాలతో భావాలను కూర్చి,
     ప్రణయ  ఊయల లూపేదొకరైతే...,

     విప్లవ దారులలో భాషను నడిపి,
     ఆకలిని ఆర్పాలని  చూసేదొకరు. 

     మానసిక  మైదానపు  సైకత ముత్యాలను,
     మాటల ముత్యాలను చేసేదొకరైతే..,

     ఉక్కు  పాదాల కిందున్న అణగారిన  జాతికి ,
     మాటల నినాదాల తూటాలను ఇచ్చేదొకరూ. 

     ప్రేమించే హృదయాలను స్వాంతన  పరచి,
     నీ తోడుగా నేనున్ననని నిండుగా పలికే  భావం ఒకరిది.

     శ్రమైక జీవికి  చైతన్యం నేర్పి చెమట  ఖరీదుకై,
     ఆయుధం పడితేనే న్యాయం  అనే అభయం మరొకరిది. 

     ఒకరు సిరాలో మమతని నింపి మదిని  మరపిస్తారు,
     మరొకరు  సిరాలో చైతన్యాన్ని నింపి సమాజాన్ని శాసిస్తారు. 

     ఒకరి  ప్రయత్నం  ఆనందాన్ని  తేవాలనీ... 
     మరొకరి  ప్రయత్నం   ఆకలిని  తరమాలనీ.. 









Monday, 10 February 2014

అంకు(శ )ర స్పర్శ.

     




     

    అంకు(శ )ర  స్పర్శ. 

     కాయాన్ని కారుణ్యం  చేసి, మాటని మధురం చేసి,
     ఒడినే  లాలిత్యపు  పానుపు చేసాను.  

     స్పర్శ  కుండే  ఒక మహత్తర  శక్తి గూర్చిచెప్పేందుకే,

     నిన్ను గుండెకు హత్తుకున్నాను. 

     ఆకలి  గొన్న  నీ చిన్ని  బొజ్జను  అమృత బిందువులతో,

     నింపి  అమ్మ  స్థానమేమిటో  అర్ధమయ్యేలా  చేసాను. 

     బుడి,బుడి, అడుగుల పరిదిని దాటిన నీవు,
     వడి,వడిగా జంతు సమూహంలోకి ఎప్పుడెళ్ళావో...,

     
     రోజంతా అదృశ్యమైనా... అర్దరాత్రి ఇల్లు  చేరినా.., 
     అక్కున చేర్చుకొని  అన్నంపెట్టిన  అమ్మను కదా...,

     బూచీ... అంటూ రాత్రిని చూసి నా చీరకుచ్చెళ్ళలో దాగే నీవు

     రాత్రే  నిన్ను చూసి దడుసుకొనేలా బూచిలా మారావు. 

     పట్టుకొన్న నా వేలును కోసి  తీసుకెళ్ళి జనసమ్మర్దానికి,

     దాన్ని చూపుడు వేలుగా  బహుకరించావు. 

     నా అమలిన అంతరంగ ప్రపంచం మీద మాలిన్య పాదాలతో నడచి, 

     మరక అడుగుల ముద్రలను  మిగులుస్తావనుకోలేదు. 

     అమ్మతనపు  అమృతాన్నే  కదా  తాగించాను,

     మరి  విషాన్ని ఉమ్మే ఉన్మాదివయ్యావని  ఎలా అనుకోను? 

     నా ఎదురుగా నన్నే నిలబెట్టి  ఆత్మ విమర్శా అద్దాన్నిచ్చి,

     నీ  నిజాన్ని చూడమంటే  ఎలా  చూడగలనూ..?

     (అనకొండలో ,ఆక్టోపస్ లో   ఒంటిని చుట్టుకున్నా  పర్వాలేదు,

     అపనిందలూ,అనర్దాలూ ,పెంపకం చేతకాదనే  పెడర్దాలూ... 
     తల్లి మనస్సులో  గుచ్చుకొనే  బలురక్కసి ముళ్ళు ) 









Friday, 7 February 2014

కలం సంకెళ్ళను సడలిస్తూ.....

     




   కలం  సంకెళ్ళను  సడలిస్తూ.....,

    విశ్లేషించే  కళ్ళతో ..,
    మూగబోయిన హృదయాలను  గమనిస్తే...,
    పాత్రలేవొ,పాత్రదారులెవ్వరొ, తెలిసిపొతుంది.  

    పరామర్శించాల్సిన  కళ్ళతో...,
    మదనపడే  మనస్సులను  పలకరిస్తే..,
    వెతలేమిటొ,వేదనేమిటో  తెలిసిపొతుంది. 

    మోహానికీ, మోసానికీ మద్య,
    అనిర్వచనీయ  అఘాతాలను గమనిస్తె..,
    నిజాల గొంతు నులిమిన ఇజాలేమిటో తెలిసిపోతుంది.  

    సామాజిక  స్పృహలేని  మురికి పందులు ,
    బ్రతుకు వెలితిని దుర్గందంలో  నింపి,
    ముక్కుల్లో  అత్తరు పోసుకొన్న తీరు తెలుస్తుంది. 

    సుఖాల,సంతోషాల వేటలో..,
    మజిలీలు మార్చే మాయగాళ్ళు..,
    మడుగులో పడిన దుర్యొధనులై...
    నవ్వులను అంతంచేసిన  వైనం తెలుస్తుంది. 

    మనలొనే ... మన మద్యనే  ఉన్న ఎందరో..,
    ముళ్ళై ,మేకులై, పల్లేరులై,గాజుముక్కలై..,
    దారంతా విస్తరిస్తూ,విహరిస్తుంటే...,

    ఎన్నోఅనాథ  శకలాలను వీధులోకి  విసిరేస్తుంటే...,
    పరిష్కారం దొరకని  నా బుర్రవేడెక్కినప్పుడూ..,
    ఆవేశాన్నిపంటి కింద బిగబట్టి,పందిటి గుంజగా ఉండలేక ,
    అప్పుడప్పుడూ  కలం సంకెళ్ళను  సడలిస్తూ ఉంటాను.  







Wednesday, 5 February 2014

ఎలా...?

     


    ఎలా...?

     కళ్ళుమూసుకున్నా..కనిపిస్తున్నాయి. 
     చెవులు మూసుకున్న..  వినిపిస్తున్నాయి. 

     ఊరు వదిలేసినా..  వెంటాడుతున్నాయి. 
     ఊరుకుందామన్నా.. కదిలిస్తున్నాయి. 

     రాత్రంతా  వేటాడిన  పులిపంజాలు  సిరామరకలై, 
     పొద్దున్నే కళ్ళల్లో వార్తలై  గుచ్చుకుంటున్నాయి .

     హెడ్డింగులన్నీ..కదం తొక్కే సివంగుల్లా  ఉన్నాయి.  
     కర్తవ్యాన్ని  గుర్తుచేస్తూ...కవాతు చేస్తున్నాయి,

     పట్టించుకోకుండా  పేపరు గిరాటేద్దామంటే..,
     కర్తవ్యం  గుర్తుచేసే కొలువు  ఒప్పుకోనంది . 

     నా  బడి గుడిలో  కొలువైన  పసి దేవుళ్ళు,
     ఆత్మ స్తైర్యాన్నిచ్చే.. హారతి కోసం ఎదురుచూస్తూ....,

     మనిషిగా బ్రతికే వరాన్నిస్తూ...,
     మానవత్వాన్ని ప్రసాదిస్తూ...,  








Monday, 3 February 2014

ఎటు దారి ?

     





     ఎటు దారి ?

      బూట్లు తొడిగీ, బుగ్గలు నిమిరీ,
      బువ్వతినబెట్టీ.., జుట్టుదువ్వీ,
      భుజానెత్తుకొనీ  బడిలో దింపే అమ్మా,

      ఒడిలో పెట్టుకొని హోంవర్క్  చేయించీ,
      సంకనెత్తుకొని  సరదాగా తిప్పి,
      గోరుముద్దలు  తినిపించి జోలపాడే...అక్కా

      ఎదిగినకూతుర్ని కూలికి పంపి,
      ఎదిగొచ్చే కొడుకు భవిత కొసం,
      చదివించే శక్తి లేకున్నా,
      రెక్కలు ముక్కలు చేసుకొన్న నాన్న.

      పదవ తరగతే పెద్ద చదువనీ,
      ఆ పైన చదివించే శక్తి తమకు లేదనీ,
      చేతులెత్తేసిన ఇంటి సభ్యులు  

      ఇక ఇప్పుడు,

     కాలేజీ చదువూ లేదూ,
     కూలిపని చేసే అలవాటూ లేదూ,
     కూడుపెట్టే కొలువూ రాదు, 

     ముద్దుగ చూసిన ఆ ముగ్గరే,
     సోమరిగాడివని చీదరించుకుంటే,
     ఆవారాగాడివని  అదిలిస్తుంటే,

    కూలీగా మారాలంటే నామోషీ ..,
    ఖాళీ  జేబు చూసుకుంటే  పెరిగే కసీ
    తనపై తనకే పెరిగే సానుబూతీ,

    (క్రమబద్దీకరణ లేని కాలం నిరుద్యోగ రక్తపింజరి ఇంగితాన్ని 
    తాగేస్తుంది ,సామాజిక ముప్పు తెస్తుంది )