అక్షర (ధార) దారి
కవిత్వమంటే మత్తుగా కలల్లో
తేలిపొవటం అనుకొనేదాన్ని,
మది లోతుల్లో ఊరిన మదురభావాల
అమృతపు ఊట అనుకొనేదాన్ని,
కానీ,
భావోద్వేగాల బాకుల దాటికి,
ఊపిరాడక తెగిన శ్వాస అనుకోలేదు,
ఇక్కడ ఎవరి పంథా వారిదే,
అందరు సలిపేదీ అక్షర పొరే.
వెన్నెల దారాలతో భావాలను కూర్చి,
ప్రణయ ఊయల లూపేదొకరైతే...,
విప్లవ దారులలో భాషను నడిపి,
ఆకలిని ఆర్పాలని చూసేదొకరు.
మానసిక మైదానపు సైకత ముత్యాలను,
మాటల ముత్యాలను చేసేదొకరైతే..,
ఉక్కు పాదాల కిందున్న అణగారిన జాతికి ,
మాటల నినాదాల తూటాలను ఇచ్చేదొకరూ.
ప్రేమించే హృదయాలను స్వాంతన పరచి,
నీ తోడుగా నేనున్ననని నిండుగా పలికే భావం ఒకరిది.
శ్రమైక జీవికి చైతన్యం నేర్పి చెమట ఖరీదుకై,
ఆయుధం పడితేనే న్యాయం అనే అభయం మరొకరిది.
ఒకరు సిరాలో మమతని నింపి మదిని మరపిస్తారు,
మరొకరు సిరాలో చైతన్యాన్ని నింపి సమాజాన్ని శాసిస్తారు.
ఒకరి ప్రయత్నం ఆనందాన్ని తేవాలనీ...
మరొకరి ప్రయత్నం ఆకలిని తరమాలనీ..
ఒక సంపూర్ణమైన వ్యక్తి చెప్పే జీవిత పాఠంలా, ఏక కాలంలో నాణానికి రెండువైపులా చూపించడంలో కృతకృత్యులయ్యారు మీరజ్.
ReplyDeleteమీ ప్రశంసా,స్పందనా రెండూ నన్ను ముందుకు నడిపిస్తాయి దేవీ.
Deleteధన్యవాదాలు.
మది లో మథనం మేధో మథనం జరిగి ప్రభవించేదే కవిత్వం ప్రకృతి ప్రేమ ఆనందం విషాదం ఆశ ఆకాంక్ష అందం అబ్బురం ఆవేశం అన్నీ కవితా వస్తువులే ఎవరి శైలి వారిది ఐనా అందరి లక్ష్యం సమాజ చైతన్యమే అందరిదీ అక్షర సమరమే. మీ అక్షర ధార అందంగా జాలువారింది
ReplyDeleteరమేష్ గారూ, మీ బ్లాగ్ ఓపెన్ కావటం లేదు, ఒసారి బాగ్ అడ్రస్ పెట్టండి.
Deleteనా అక్షర ధారని మెచ్చుకున్న మీకు నా ధన్యవాదాలు.
skvramesh.blogspot.com
Deleteకవిత్వమంటే అమృతపు ఊట మాత్రమే కాదని భావోద్వేగాల బాకుల దాటికి ఊపిరాడక తెగిన శ్వాస కూడా అని - ట్రెమెండస్ లైన్స్!
ReplyDeleteమీ ప్రశంసకు ధన్యవాఅదాలు వర్మాజి.
Deleteఇక్కడ ఎవరి పంథా వారిదే,
ReplyDeleteఅందరు సలిపేదీ అక్షర పొరే.
చూసారా విచిత్రం ! నాకు తెలసిన రచయితలు , రచయిత్రులు ఓ యాబది వరకున్నారు . ఎవరి శైలి వారిదే ... వారి వారి భావనలను ఓ ప్రత్యేక రూపంలో మలుస్తున్నారు . నవరసాలను పండించ గలవారు కొందరైతే , మరి కొందరు వారి వారి ప్రత్యెక దారిలోనే వెళ్లి మనసుకి ఆహ్లాదాన్ని పంచుతున్నారు. మీ ప్రత్యేకత మీ స్వంతం.
"ఒకరి ప్రయత్నం ఆనందాన్ని తేవాలనీ...
మరొకరి ప్రయత్నం ఆకలిని తరమాలనీ.. "
- జీవితమంతా ఈ రెండు వాఖ్యాల్లోనే తలదాచుకుందనిపిస్తుంది . తీపి - చేదుల భావనలను గుండెకు హత్తుకునేలా మా ముందుంచి "వహ్వా" అనిపించారు . అభినందనలు మీకు ఫాతిమా జీ.
- శ్రీపాద
శ్రీపాద గారూ, ఇంకా ఎన్నో విదాల భావాలను వ్యక్త పరచలేకపోయాను, ప్రకృతినీ, భక్తినీ, విరహాన్నీ,జంతుప్రేమనూ,రక్తసంబంధాన్నీ కవితా వస్తువులుగా తీసుకున్న అద్భుత కావ్యాలెన్నో...,
Deleteమీచే వహ్వా అనిపించుకున్నాను, సంతోషం.
కొందరు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తారు.. రక్తపాతం. మరికొందరు కలం పట్టుకుని కదం తొక్కుదారు.. ఆక్షరపాతం. మనసులు స్వచ్చమైనవైతే రక్తపాతంతో పనిలేదు. ఆ మనసుల్లో స్వచ్ఛత నింపే సాధనం కవిత్వం, లేదా అక్షర ప్రయోగం ఏదైనా. ఇది మీరన్న విప్లవదారి. ఇక మనసులో ఎన్నో భావాలు... ఆ భావాల్లో గులాబీలూ ఉన్నాయి, ఆ గులాబి కింద ముళ్లూ ఉన్నాయి, ఆవేదనలున్నాయి, ఆక్రోశాలూ ఉన్నాయి. కానీ అన్నిటికీ తనలో కలిపేసుకుని.. అక్షరం... ప్రతీ ఒక్కరికి ఒక పేజీనిచ్చింది.
ReplyDeleteమనసుతో కాసేపు మాటాడితే ఎన్నో భావాలు... ఆ భావాలకు ఓ రూపాన్నిస్తున్న ఈ అక్షరం లేకపోతే... అంతరిక్షంలో ఉన్న శూన్యానికి... మనకు పెద్ద తేడా ఉండదేమో. ఇన్ని భావాలు చదివే, ఆకళింపు చేసుకునే సదావకాశం దొరికేది కాదేమో.
మెరాజ్ గారు... మీ పరిశీలన పటిమకు... మీరు రాసిన ఈ పదకవిత నాలో చాలా అక్షరావేశాన్ని తట్టి లేపింది. థాంక్యూ వెరీ మచ్...
మీ వివరణ బాగుంది, నిజమే అక్షరమే లేకుంటే ఈ శూన్యమైన మనస్సులను భావాలతో నింపలేమేమో.
Deleteమీలో అక్షరావేశం ఉంది, తప్పకుండా రాయండి,రాస్తారు.
మీ స్పందనకు ధన్యవాదాలు.
స్పందన కలిగించేదే, ఏ రచనైనా !
ReplyDeleteఅది కవితైనా, వచనమైనా !
రాసే ప్రతి చరణం ,
కావాలి, ఓ అరుణం !
చేయాలి, ప్రవర్తన పై ఓ రణం !
మార్చాలి, మనిషి లో, ప్రతి కణం !
కాకపొతే, ఆచరణం,
వృధా ' ఆ ' చరణం !
అపుడు, రాసింది, అక్షరాల అరణ్యం !
అంతర్జాలం లో, ఓ కీకారణ్యం !
నిజమే ఆ చరణం వృదాయే కాకపోతే ఆచరణం.
Deleteకానీ ఆచరణ కొరకే పాటుపడే ఈ రణం కీకారణ్య మద్యనే జరుగుతుంది అనుక్షణం.
ప్రతిసారీ ఇది అవుతుంది అక్షర "వృణం",
అందుకే అప్పుడప్పుడూ మిత్రుల ఈ అంతర్జాల ఒదార్పుయానం.
సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
మీ అక్షరదారి అద్భుతంగా ఉంది. సాహితీ ప్రక్రియల్లో స్థూలంగా కనిపించే ’’భావుకత్వం - అభ్యుదయం’’; ’’కాల్పనికం - వాస్తవికం’’ అనే ద్వంద్వ పథాల్ని మీ కవితా వస్తువుగా భలే ఎన్నుకున్నారు. చూస్తోంటే, మీ కవితలో రెండు మార్గాలకూ సమన్యాయం జరిగేట్టు జాగ్రత్త వహించినట్టున్నారు. ఐతే, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైంది, ఏది మనిషి ఆలోచనను-సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నవి తరచుగా ఎదురై మనసుల్ని తొలిచే భేతాళ ప్రశ్నలు? ఈ విషయానికి సంబంధించి ఓ కామెంటు తరచుగా వినిపిస్తుంటుందిలా... కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అనీ (భావుకత్వం); ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అనీ (అభ్యుదయం).
ReplyDeleteమీ విష్లేషణతో జర్నలిస్ట్ అనిపించుకున్నారు,
Deleteనాగ్ రాజ్ గారూ, మీరన్నట్లు ఏది ఉత్తమ కవిత్వమో చెప్పటం కష్టం. ఏది సమాజాన్ని ముందుకు నడిపిస్తుందో చెప్పలేం,
కానీ సామాజిక స్పహ కలిగి ఉండటం కవియెక్క భాద్యత, నా ఒక్క అక్షరమైనా చిన్ని మార్పును తేగలిగితే నా జన్మ ధన్యమైనట్లే. మీ స్పందనకు నా ధన్యవాదాలు.
కవిత్వమంటే కలల్లో తేలిపొవటం, మదురభావాల అమృతపు ఊట గ్రోలడం అనుకొనేదాన్ని,
ReplyDeleteకానీ,
వెన్నెల దారల భావాల, ఊయల లూపుతూ..., విప్లవ దారులలో శబ్దాయుధం ధరించి...., అణగారిన జాతికి, మాటల నినాదాల పోరాట భావనల్ని పంచుతూ...., స్వాంతన పరచి, తోడుగా ఉన్నానని నిండుగా పలికే భావం తో....., చెమట విలువను తెలియబరుస్తూ శ్రమజీవికి న్యాయాన్ని విడమర్చుతూ....,
కొందరు సిరాలో మమతని నింపి మదిని మరపిస్తే, మరికొందరు సిరాలో చైతన్యాన్ని నింపి సమాజాన్ని శాసిస్తూ..., ఆనందాన్ని తేవాలనీ... ఆకలిని తరమాలనీ....,
అక్షర (ధార) దారి రహదారులు వేస్తూ కవులూ కవయిత్రులు.
అతి విశృతమైన వస్తువును తీసుకుని కూడా న్యాయం చెయ్యగలిగినందుకు .... అభినందనలు మెరాజ్ గారు!
సర్, సమాజాన్ని శాసించటం ఎలా ఉన్నా, మీ వంటి మిత్రుల సలహా మాత్రం ఆశిస్తాను.
Deleteనా రాతలు చేతలు కావాలనే నా ఆకాంక్షను నెరవేర్చుకుంటానో లేదో...,
ఓపిగ్గా చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.
సమస్యల వర్తమానం...
ReplyDeleteశోధనల కొలమానం...
దిన దిన ప్రవర్ధమానం...
మీ అంతర్జాల యానం...
శుభాకాంక్షలు...
ఇలాగే ఉండాలి మీ అభిమానం,
Deleteధన్యవాదాలు సర్.