Pages

Tuesday, 27 May 2014

నీవు.

   







   






   

నీవు.


నేను ఆర్తిగా వెతికే తీయని ం
జ్ఞాపకం నీవు.

తరాల నుండీ ఎడతెగని,
అన్వేషణ నీవు.

నిశిరాత్రి నిరీక్షణా వేదనకు,
వెన్నెల లేపనం నీవు .

అల్లరిగా అల్లుకునే కనిపించని,
సమీరం నీవు.

ఆగిపోతున్న గుండెకు ఊపిరిలూదే,
హృదయ స్పందన నీవు.

తలపులో తచ్చాడే అడుగుల,
సవ్వడి నీవు.

పలవరింతలలో పరుగిడే,
కలల రేరాజువు నీవు.

ఎప్పటికీ చేరువ కాని ,
ఊహల సుదూరం నీవు.

ఎదురు చూపులకు చిక్కక,
వెక్కిరించే ఎండమావి నీవు.











Wednesday, 21 May 2014

మాకు ఆకలేస్తుంది

    






    మాకు  ఆకలేస్తుంది.

    అన్నదాతా..... మాకు  ఆకలేస్తుంది,

    కానీ   నీ ఇంట  అన్నంకుండ  ఖాళీగా ఉంది.

    కృషీవలా... మాకు   దాహమేస్తుంది.

    కానీ  నీ ఇంట  కన్నీరే  దొరుకుతుంది.

    మా శిశువులకు  పాలు లేవు,
    కానీ   నీ ఇంట పాడి  పాడేక్కింది.

    రైతన్నా...,


    కాలిపోయిన  కలలు  శాశ్వతం  కాదు,

    రాలిపోయిన కంకులే ఏరుకుందాం. 

    గుప్పెడు గింజల పలహారమే చాలు,

    గుక్కెడు నీటితో గొంతు తడుపుకుందాం. 

    కరవు రక్కసి కాళ్ళు విరిచేసి,

    కలో, గంజో అందరమూ  కలసి తాగుదాం. 

    మట్టిపొరల కింద బంగారముంది,

    తట్టి చూడు చిరుమోలకై  పైకివస్తుంది. 

    గొంతులో  గరళాన్ని పోసుకోకు,

    గుండెలో ఆశల గూటిని  కట్టుకుందాం . 

    ఉరికొయ్యకు   వరి  కంకుల ఉట్టి కట్టు. 

    ఊరపిచ్చుకల  దీవెనలకై  దోసిలి పట్టు. 









Saturday, 10 May 2014

హలం బాటలో కలం.

    




   హలం బాటలో కలం 

    పచ్చిక తివాచీపై  నడిచే పాదాలు, 
    నెర్రెల నేలపై నడిచి, 
    పగుళ్ళుబారుతున్నాయి. 

    గవ్వలూ ,మువ్వలూ మెడలో వేసుకొని, 

    తలలూపే బసవన్నలు, 
    కబేళాలకు తరలి వెళ్తున్నాయి. 

    జన్మనిచ్చిన  ఆవాసాలు  నడ్డివిరిగి, 

    నేలరాలుతున్నాయి. 

    పొట్టకూటికై  ఊరొదిలి  వెళ్ళే  వలసలు

    కాలిబాటలోనే కడతేరుతున్నాయి. 

    దెయ్యాలు హస్తాలు చాచి,  

    ప్రాణాలని లాక్కున్నట్లు,
    ఓట్లు  పట్టుకెళ్ళిన   నాయకులు,

    కుర్చీదక్కగానే సోమ్ముల కుమ్ములాటలో,

    నమ్మకాలను వమ్ముచేస్తున్నారు. 

    అన్నదాత ,రైతన్నా.., అని బాకాలూడిన వైనం 

    గుర్తున్న గాడిదకొడుకులైతే..,
    తిన్నది అన్నమే అయితే..,భవితకు భరోసా ఇవ్వండి. 

    విభజన మంత్రాన్ని భజనగీతం చేసి, 

    చచ్చిన రాష్ట్రం అని రాసిన  రోతగాళ్ళ నాలుకలు తెగ్గోసి,
    పొలాలలో  పోలి చల్లాలి. 

    మా కాలాలు ఖడ్గాలుగా మారక ముందే,

    అన్నం పెట్టిన చేతులు ఆయుధాలు  పట్టక ముందే,
    దుర్నీతి పాలన విడవండి. 

    తల్లిపేగు తెగ్గోసి, పల్లెకు పాడి కడుతున్నారు,

    దుష్ట పాలనలో దున్నపోతుల్లా,పందుల్లా పొర్లుతున్నారు. 

    మరో ఐదేళ్లకు  మీ పాడె మీరే మోసుకొనే ,

    దుస్థితి   తెచ్చుకోకండి. 

    ఇప్పటికీ  మించిపోలేదు  రైతన్నను ఆదుకొని,

    అన్నం తినండి. 

Wednesday, 7 May 2014

విధి







   విధి

   నా ఏకాంత  గానాన్ని  నీకు  వినిపించాలని,
   నిశిరాత్రి  గొంతు  సవరించుకుంటాను.

   ఎముకలు  కొరికే  చలిలో నీ వెచ్హని స్పర్శ,
   నన్ను అంటుకొనే ఉందని  భావిస్తుంటాను.

   అంతలో కర్తవ్యం గుర్తొచ్హి  శత్రువుకోసం,

    నిశ్శబ్ద   నడిరేయిలో కళ్ళు విప్పార్చి చూస్తుంటాను.

   నా గుండెలపై  ఆనించిన  నీ తల గుర్తొస్తుంది,

   భాతమ్మకు సవాల్ విసిరే  చొరబాటుదారుడు గుర్తొస్తాడు.

   మన ప్రేమ  మొలక చిట్టి తల్లి  ఇప్పుడెలా ఉందో అనుకుంటాను,

   మన దేశ హద్దు దుష్మన్‌  దాటేశారేమో అని కలవర పడతాను.

   నా  చిన్ని ప్రపంచం  నువ్వూ,నా చిట్టి తల్లీ, అనుకుంటాను,

   మరు క్షణం  కాదు, కాదు, విశాల భారతం నా  కుటుంబం   అనుకుంటా..

   నా జీవన  సహచరీ.. మనసంతా నువ్వే అనుకుంటాను,

   నా భారత మాతా, గుండె నిండా నువ్వే, అని ఎప్పటికీ అంటాను.

   ఓ అమ్మకు ముద్దు బిడ్డ నే, ఓ ఇల్లాలికి వీర పతినే,

   కానీ, భారతమ్మ నమ్మిన  సిఫాయిని. 
   విధినిర్వహణలో ఉన్న  వీర జవాన్‌ని. 
   

Monday, 5 May 2014

ఊపిరి విలాపం.

    



   ఊపిరి విలాపం. 

    మోడుని అల్లుకొని  మోదుగలు  పూయిస్తూ..,

    చిరిగిపోయిన  కాగితంపై  చివురు  సంతకం చేస్తూ..,

    గుండె దొన్నెలోకి  కన్నీళ్ళను  ఒంపుకుంటూ..,

    కాలం  వెంబడి  అవిటి   కాళ్లతో నడవాలని చూస్తూ..,

    చెదిరిన గుండెల్లో  చివికిన దృశ్యాలని   చెరిపేస్తూ..,

    వక్రించిన కత్తివేటుకు  ఖండాలుగా తెగిన  గుండె శకలాలను  అతికిస్తూ.., 

    ఈ సైకత బొమ్మని  మనిషిగా  నిలబెట్టాలని  ప్రయత్నిస్తూ.., 

    ఓడిన ప్రతిసారీ....,

    వర్తమానపు  వధ్యశిలపై  తలారివేటుకై   తల పెట్టేస్తూ...,

    మరో జన్మలోనైనా...మనో ఆశ్రమ  ఆవరణలో...,
    మనశ్శాంతిని కోరుకుంటున్నాను.