Pages

Saturday, 11 February 2012

నువ్వే నేను

నా     అధరాలపై దరహసానివీ
నా     ఎదపై వెన్నెల సంతకానివీ
నా     గమనానికి గతివీ 
నా     గానానికి శ్రుతివీ 
నా     భవితకి బాటవీ
నా     కవితకి భావానివీ
నా     ఆశల సౌధానివీ
నా     ఆశయాల సారదివీ 
నా     మాటలలో మధుర్యానివీ 
నా     ఆటలో సారధ్యానివీ 
నా     పాటలో పల్లవివీ
నా     తోటలో మల్లెలవీ 
నా     శ్వాశలో స్వచ్చానివీ
నా     ధ్యాసలో నిత్యానివీ
నా     నా ఆలోచనలలో పూలజల్లువీ 
నా      ఆస్వాదనలో జాబిల్లివీ 
నా      నా వయస్సుకి సరిజోదివీ 
నా     ఊహలకి ఊపిరివీ 
నా     ఊసులకి సరిగామవీ 
నువ్వే ఈ కోకిల కోరిన ఆమనివి 
నువ్వే ఈ కోవెలలో కొలువైన దైవానివి.

(ఆంద్ర భూమి వారపత్రిక 02 June 2011)  

Friday, 10 February 2012

మౌన రణం


మౌన రణం

ఇద్దరి మధ్యా నిశబ్దం రాజ్యం ఏలుతుంది,   
మాటల సౌధానికి మౌనపు వెల్ల వేసినట్లుంది. 

ఒకరి ఆలోచనలు ఒకరు పసిగట్టినట్లు ఉలికిపాటు, 
ఒకరి మాటలు ఇంకొకరు పలికినట్లు ఏమరుపాటు. 

ఏమైనా జరిగితే బావుండు,  ఎవరైనా వస్తే బావుండు,
ఎంతపోసినా పొంత నిండని పోగవంటి ఆలోచనలు.

వెలుగో వెడిమో తెలియని స్తబ్దత, 
ఆకలో అలకో తెలియని నైరాస్యత,

ఉండి   ఉండి చెళ్ళుమనిపించే    గత స్మృతులు. 
                            ***
చేయి చేయి పట్టుకొని భావి కలలకు రెక్కలు కడుతున్నప్పుడు,
హెచ్చవేతలేకాని  తీసివేతలు ఉండవని  లెక్కలు కట్టినపుడు. 

ఒకరి శిల్పాన్ని ఒకరు ఇష్టంగా చేక్కుకున్నప్పుడు,
అనుభందపు ఆకుపై అనుమానపు ముల్లు పడుతుందనీ.

అంతరాలను అసహనాల సెగలు అంటుకుoటాయనీ,   
మాటల తూటాలు  మనసు మర నుండి బయటకొస్తాయనీ,
తెలియని అవివేకం . . . . . . .  మాయమైన వివేకం. 
                             ***
ఏకాంతం కోసం అందరికీ దూరం అయ్యాం,       
రాజీ కుదర్చమని  ఎవరిని దేవురించలెం.    

కదిలే శవాల్లా . . . .  . . కాలాన్ని దోర్లిస్తున్నాం, 
పడిన ముడిని విప్పుకోవాలని చూస్తున్నాం, 

ఇద్దరిలో ఎవరో ఒకరు దూరాన్ని చెరిపేస్తే . . . . . రాబోయే ఆ చిన్ని ఆకారం సాకారమైతే . . . . .
రగులుతున్న మౌనరణం ముచ్చటైన పలుకుగా మారదా.

(సాహితీ ప్రస్తానం మాస పత్రిక May నెల సంచికలో ప్రచురితం)




Sunday, 5 February 2012

సాక్షులు


సముద్రుడు వినలేదా మన సరాగాలు
సైకత కనలేదా మన సరసాలు

మేఘుడు తరించాలేదా మన మధ్య   కురవాలని
పవనుడు తపించలేదా మన మధ్యకు   రావాలని

వసంతుడు విహరించలేదా మన ప్రేమ వనంలో 
వరుణుడు వర్షిన్చాలేదా మన భావ కవనంలో 

గిరి ఎరుగడా మన ఒడుపు  పట్టుని 
తరువు ఎరుగడా మన వలపు జట్టుని

అగ్ని ఎరుగడా మన భగ్న ప్రేమని
ధాత్రి ఎరుగాదా మన జన్మ ఆర్తిని

సోముడు చూడలేదా మన శృంగారాన్ని 
తారక పాడలేదా మన విరహ గీతాన్ని

హంస ఎరుగదా మన అలకని
హరిణి  ఎరుగదా మన అలసటని

మన ప్రేమ హర్షించని ఈ ప్రజకి పంచ భూతాలే సాక్షి పలకవా.


("బెంగుళూరు తెలుగు తేజం" మాసపత్రిక మార్చ్ 2012 లో ప్రచురితం)


   




Thursday, 26 January 2012

ఒక్కసారి

ఒక్కసారి

కురుల చీకటి కమ్ముకున్న నీ జాబిలీ మోమును . . . . . . . . . . .
                                                                                       చూడనీ ఓసారి.

గులాబీ రేకులు విడివడి జంటగా చేరినట్లున్న ఆ ఆధారాలను . . . 
                                                                                    అలరించనీ ఓసారి.

కొలనులో మిలమిలలాడే మీనంలా ఉన్న ఆ నయనాలను 
సిగ్గుతో ఎర్రబడిన ఆ అద్దాల చెక్కిళ్ళను . . . . .  . . . . . . . . . . . . . .
                                                                                           కననీ ఓసారి.

ఫాలభాగంపై పరుచుకున్న ముంగురులనూ 
మదిలోని ప్రేమ వెలిగి కాంతులీను కనులనూ . . . . . . . . . . . . . .
                                                                                         కాంచని ఓసారి.       

సిగ్గుల మొగ్గవై అడుగులు తడబడుతుంటే నర్తిన్చేలా ఉన్న నీ నడకను 
ఎదురుచూపులు దాచుకుంటూ దొరికిపొఇన నీ తడబాటును . . . . .
                                                                                          చూడనీ ఓసారి. 

కోటి వీణలు మీటినట్లున్న నీ పలుకు కనకపు కంఠాన్ని దాటి రావటం . . . . .
                                                                                             విననీ ఓసారి.   

కోమలమైన నీ హృదయం నుండి జారిన ప్రతి అమృతపు చినుకులలో . . . . .
                                                                                        తడవనీ ప్రతిసారి.


(మల్లెపందిరి మాసపత్రిక మే నెల సంచికలో ప్రచురితం)

Sunday, 22 January 2012

ఎలా చెప్పను







   ఎలా చెప్పను?

    అందమైన  భావాలన్నీ మదిని, 
    ఆలింగనం చేసుకున్నాయని, 
    ఎంత  దాచినా వదనం  పై విరులలా, 
    విచ్చుకుంటున్నాయని....ఎలా చెప్పను?

    చిరు కదలికకే కాలిఅందియ  
    నా ఉనికి  తెలియచేస్తుందని 
    వెనుక ఉన్న వాలుజడ  
    వీపుపై  దరువు వేస్తుందని....ఎలా చెప్పను?


    పొగ మంచులో ఎగసిపడే వలపు వేడిమి 
    ఎద లోపల ఘనీభవిస్తుందని 
    మధుర స్వప్నాల మూట విప్పితే 
    నిదుర చెడకొట్టి  ఎగిరిపోతున్నాయని...ఎలా చెప్పను?  


    వెన్నెల వెండి పాత్రలో నీ చెలిమి 
    వెన్నముద్దలా మురిపిస్తుందని 
    పూల రెక్కల స్పర్సలా తేనేచుక్కల రుచిలా 
    నీ ప్రేమ పులకింతలు పెడుతుందని.... ఎలా చెప్పను? 


    లోతుకు పాతుకుపోయే నీ చూపులకు 
    హృదయ ఫలకంపై  నీచిత్రమే  ఉందని.
    ను కలిసే ఈ క్షణం కోసం 
    మనసు మయూరమై నర్తిస్తుందని.... ఎలా చెప్పను? 


    గాలివాటుని... తేనే   ఊటని  
    ఆస్వాదించే మిళిందానికి  
    స్నేహ బాటని... వలపు తోటని చేరమని.... ఎలా పిలువను? 

    మదికీ... మస్తిష్కానికీ సామ్యం కుదరక
    వేదనకు... రోదనకు పొంతన లేదని.... నిన్నెలా మరువను?
     
    


మార్పు

ఆకృతి కోల్పోయిన నా మనస్సును కుదించి కుట్టేసుకున్నా
                                              ఎంత కంఫర్ట్ గా  ఉందొ.

అస్తిత్వం కోల్పోఇన  నా తలపులను వేటాడి భంధించాను 
                                                   ఎంత కరెక్టగా ఉందొ.

అలమటించే నా మదిని వేదననుండి వేరుచేసాను.
                                                  ఎంత హాపీ గా ఉందొ. 

అగోచరమైన అభిమానాలను వెతకటం మానేసాను.
                                              ఎంత డైలూట్ గా ఉందొ.   

నన్ను నేను చంపేసుకుని పోస్ట్మార్టం చేసుకున్నా.  
కొన్ని కొత్త కణాలను చేర్చుకుని నేనున్న ఊహల సౌధాన్ని పునాదులతో పీకిపారేస్తున్నా.   
అచ్చోట కొత్త సమాధి కట్టుకుని దానిపై రారాజులా కూర్చున్నా.
కొత్త తలపులతో ద్రోహపు తిమిరాన్ని చీల్చి స్నేహపు సమరాన్ని సాగిస్తున్నా.  
                                              ఎంత డైనమిక్ గా ఉందొ.           


Saturday, 21 January 2012

మరీచిక


మరీచిక

ఎక్కడో చూసిన జ్ఞాపకం
ఎప్పుడో కలసిన వైనం

తలపుల  తలుపు తెరిస్తే  నీవే ప్రత్యక్షం 
గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం

గుండె లోతుల్లో నీ తలపు మధురిమ 
హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ                                                                                    

నా ఊహల్లో విహరిస్తున్తావు
నా ఊపిరిలో సంచరిస్తుంటావు 

తలపుల తలుపు తడతావు
గుండె గుడిగంటలు కోడతావు

చేలికాడనే అంటావు చెంత చేరవు
జతకాడనే అంటావు జాడ చూపవు

మరిచిపోఇనవే  గుర్తు చేస్తావు
మరుగున పడినవి చర్చిస్తావు

విలుకానిలా వేటాడతావు    
చేలికానిలా మాటాడతావు

ఎదలోనే ఉన్నాను వెతుకు అన్నావు 
మదిలోనే ఉన్నాను బ్రతుకు అన్నావు

పగలంతా నా అడుగులకు తడబాటువై
రేయంతా నా పలవరింతల అలవాటువై

దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
వాకిట్లో నీడలా పారిపోతావు

కోకిలా అన్నావా   అనే ఉంటావు
కోవెలలో వున్నావా వుండే ఉంటావు 

వీడని నా పెదవినీ ముడివడిన నా భ్రుకుటినీ 
కరువడిన నా భాషనీ మరుగడిన నా ధ్యాసనీ పరిహసిస్తావు 

జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నై   
కొన్ని కలలా కొన్ని కన్నీళ్ళలా 

ఎద సోదలలో సన్నని మెలిక
మది కధలలో చీకటి కదలిక

తెలిసింది.  
             నీవు గత జన్మ స్మృతివి
             నీవు మరుజన్మకు శ్రుతివి 
             ఈ జన్మకు మదినిండిన "మరీచికవి".
         
(ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక జూలై  2011 )