అన్నా, రైతన్నా.
కరువుటెండలో పసిమొలకలు,
నీళ్ళు లేక వసివాడుతున్నాయి.
నేలలో దాగిన విత్తనాలు,
నిస్సత్తువతో నిద్రపోతున్నాయి.
పొలందున్నే వృషభరాజులు గ్రాసం లేక,
గ్రహపాట్లు పడుతున్నాయి.
పచ్చని తోటై పరిమళించాల్సిన పల్లెసీమ,
కుళ్ళిన శవాల కంపు కొడుతుంది.
ఇంటిగుమ్మానికి వేలాడే ఎండిన మావిడాకులు.
తువ్వాయిల ఆకలి తీరుస్తున్నాయి.
రాగిముద్దలో బెల్లం నంచుకుతునే ముసలి చేతులు,
ముక్కిపోయిన రేషన్ బియ్యపు గంజి తాగుతున్నాయి.
అంతకంతకూ పెరిగే అప్పులూ,ఆకలీ కలసి,
రసాయనమందులను విందుగా చేసుకొంటున్నాయి.
మట్టిబిడ్డల మరణ శాసనాలు రాతిగుండె రాజకీయ,
ఎదుగుదలకు సోపానాలవుతున్నాయి.
నక్కజిత్తుల నాటకీయ రాజకీయం కన్ను గీటి,వేశ్యలా,
నంగినవ్వుల రాయితీ ఇస్తుంది.
ఆత్మహత్యలు విడనాడు, ఆత్మస్తైర్యం పెంచుకో,
తినాల్సింది గడ్డికాదనీ, అన్నమనేది ఉందనీ తెలియజెప్పు.
అన్నా..... నేలతల్లిని నమ్ముకో అమ్ముకోకు,
వాడి సమాదిపైనా ఇంత పచ్చటి పంట పండించు.
మట్టిబిడ్డల మరణ శాసనాలు రాతిగుండె రాజకీయ,
ReplyDeleteఎదుగుదలకు సోపానాలవుతున్నాయి.
super గా ఉండండి
హరి గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteఫాతిమా గారు చాలా బక్కచిక్కిన రైతుల దీనగాధను అవిష్కరించారు
ReplyDeleteఅన్నా.....
నేలతల్లిని నమ్ముకో అమ్ముకోకు,
వాడి సమాదిపైనా ఇంత పచ్చటి పంట పండించు......మంచి ముగింపునిచ్చారు
డేవిడ్ గారూ ధన్యవాదాలు.
Deleteకరువుటెండ పసిమొలకలు వసివాడి విత్తులు, నిస్సత్తువతో నిద్రపోతూ .... ముసలి చేతులు, ముక్కిన రేషన్ బియ్యం గంజి తాగుతూ .... పెరిగిపోతున్న అప్పులూ, ఆకలీ కలసి రాతిగుండె రాజకీయ, ఎదుగుదలలకు సోపానాలవుతూ .... నువ్వు ఆ నంగినవ్వుల రాయితీ మాయలో మోసపోకు .... రైతన్నా ..... నమ్మిన నేలతల్లిని అమ్ముకోకు!
ReplyDeleteఏది మంచి ఏది చెడో ఆలోచించేందుకు కావలసిన స్థిమితత్వం రైతుబిడ్డకు చేకూర్చాల్సిన అవసరం ఉంది ఫాతిమా గారు. మీ బాధ లో భూమాత ఔదార్యాన్ని చూసాను. భూమితల్లి పరవశించేది రైతన్న శ్రమ ఫలించడం లోనే .... హృదయ పూర్వక అభినందనలు