అమ్మవై..మన్నించు
కణాల కౌగిలినుండి విడివడిన,
పిండం నువ్వు,
జీవనాళాలను మేళవించుకొని,
ఊపిరికై తపించావు.
మగత కమ్మిన మీఅమ్మ కళ్ళకు,
దూరమైన దీపం నీవు.
తను చేజార్చుకున్న కాలం కౌగిట్లో,
అదృశ్యమైన ఆనందం నీవు.
అంతరించిన సంతోషపు చాయల్లో,
బుడి,బుడి,అడుగుల ఆత్మీయ తడి నీవు.
కసాయిలకు బయపడి వారికి నీ కుత్తుకనిచ్చి,
మూడునెలలకే సాగనంపిన పిరికి పంద మీ అమ్మ.
కన్నీరింకిన ఎద ఎడారిలో ,
నిన్ను సైకతచిత్రం గా చిత్రించాలని చూస్తుంది.
హఠాత్తుగా నిన్ను సాగనంపి,అన్నివేళలా శిశిరమై,
నీకై రక్తాశ్రువులు రాలుస్తుంది.
అంతర్వేదనలో ఆవిష్కరించిన నిజాలను,
నీ న్యాయస్థానమందు ఉంచి,
వద్యశిలపై... తలనుంచి శిక్షకై ఎదురుచూస్తుంది.
అమ్మా.. అనేపిలుపును కోల్పోయినా...,
కనుల వాకిళ్ళు నీకై తెరచి
నీ నవ్వుల పువ్వులు రాలుతాయనీ...,
ఏ ఇంటనైనా ఊపిరి పోసుకొని,
కాంతి పుంజమై.... కనిపిస్తావనీ.... ,
ఎదురుచూసే నీ తల్లిని మన్నించు.






