Pages

Sunday, 8 June 2014

అమ్మవై..మన్నించు








   అమ్మవై..మన్నించు 

    కణాల కౌగిలినుండి  విడివడిన,
    పిండం నువ్వు,

    జీవనాళాలను  మేళవించుకొని, 

    ఊపిరికై  తపించావు. 

    మగత  కమ్మిన   మీఅమ్మ  కళ్ళకు,

    దూరమైన  దీపం   నీవు. 

    తను  చేజార్చుకున్న  కాలం  కౌగిట్లో,

    అదృశ్యమైన  ఆనందం  నీవు. 

    అంతరించిన సంతోషపు చాయల్లో,

    బుడి,బుడి,అడుగుల  ఆత్మీయ తడి నీవు. 

    కసాయిలకు  బయపడి  వారికి  నీ కుత్తుకనిచ్చి,

    మూడునెలలకే  సాగనంపిన పిరికి పంద  మీ అమ్మ. 

    కన్నీరింకిన  ఎద ఎడారిలో ,

    నిన్ను సైకతచిత్రం గా  చిత్రించాలని  చూస్తుంది. 

    హఠాత్తుగా నిన్ను సాగనంపి,అన్నివేళలా శిశిరమై,  

    నీకై రక్తాశ్రువులు  రాలుస్తుంది. 

    అంతర్వేదనలో  ఆవిష్కరించిన నిజాలను,

    నీ  న్యాయస్థానమందు  ఉంచి, 
    వద్యశిలపై... తలనుంచి  శిక్షకై  ఎదురుచూస్తుంది. 

    అమ్మా.. అనేపిలుపును కోల్పోయినా...,

    కనుల వాకిళ్ళు  నీకై తెరచి  
    నీ నవ్వుల పువ్వులు రాలుతాయనీ...,

    ఏ ఇంటనైనా ఊపిరి పోసుకొని,

    కాంతి  పుంజమై.... కనిపిస్తావనీ.... ,
    ఎదురుచూసే  నీ తల్లిని  మన్నించు.   


   

8 comments:

  1. మేడం,
    ఈ కవిత చదువుతుంటే,
    ఎందరో నిస్సహాయ తల్లుల రోదన కలిపి అక్షరం గా మార్చినట్లుది,
    అభినందనలు మీ సాహితీ స్రవంతి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..ప్రభు

    ReplyDelete
    Replies
    1. ప్రభు గారూ,
      మీరు కవితను అర్దం చేసుకొనే తీరు బాగుంటుంది,
      ధన్యవాదాలు .

      Delete
  2. అమ్మ మనసు వెన్నపూస, మన్నించడం ఏంటి కరిగిపోతుంది కదండి.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ మన్నించాల్సింది అమ్మనే..., అందుకే అమ్మ్మ లాంటి మనస్సు అవసరమైంది,
      పద్మా ధన్యవాదాలు మీకు.

      Delete
  3. ఫాతిమా గారూ !
    ఎంతో మనోవేదన దాగివుంది మీ కవి హృదయంలో.
    కవితలో వాడిన మీ పదజాలం సామాన్యుడికి అర్ధమయేదే అయినా ..
    ఆలోచించి చూస్తే అవ్యక్తమైన అణురాగ నిధి భండారాలే కదా .

    " తను చేజార్చుకున్న కాలం కౌగిట్లో,
    అదృశ్యమైన ఆనందం నీవు. "

    కన్నీటి ధారల మధ్య ఓ కన్న తల్లి రోదనను మా గుండె నిండా
    నింపుతూనే జగతిలోని అమ్మలందరికీ ఆశను గుండెల్లో పొదిగారు.


    " అమ్మా.. అనేపిలుపును కోల్పోయినా...,
    కనుల వాకిళ్ళు నీకై తెరచి
    నీ నవ్వుల పువ్వులు రాలుతాయనీ..., "

    ఈ చివరి వాక్యాలు మీ కవితకు ఓ నిండు రూపాన్ని ఆపాదించాయి.

    'యూ ఆర్ గ్రేట్ ' ఫాతిమా జీ !
    అందుకోండి నా అభినందనలు.

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఈ అమ్మ మనస్సును ఆవిషరించానో లేదో, అమ్మవంటి మీ ప్రశంసను అందుకున్నాను.
      నా ప్ర్తతి అక్షరానా పలికిన భావాన్ని అభిమానించే మిత్రులు దొరికినందుకు సంతోషం.
      ధన్యవాదాలు సర్.

      Delete

  4. జీవనాళాలను మేళవించుకొని, ఊపిరికై తపించిన పిండం, కన్నతల్లి చూపుకు, దూరమైన దీపం, కాలం కౌగిట్లో, అదృశ్యమైన ఆనందం, బుడి, బుడి, అడుగుల ఆత్మీయ తడి .... అతను.
    కసాయిలకు భయపడి, పొత్తిళ్ళలోనే అతన్ని కాదనుకున్న కుంతి .... ఆమె
    ఇప్పుడు, కన్నీరింకిన ఎద ఎడారిలో, సైకతచిత్రం గా చిత్రించాలని చూస్తూ, ,అన్నివేళలా శిశిరంలా, అతనికై రక్తాశ్రువులు రాలుస్తూ,
    అంతర్వేదనలో ఆవిష్కరించిన నిజాల న్యాయస్థానం ముందు తలొంచుకుని,
    అమ్మా.. అనే పిలుపు కు బదులు ఆత్మీయ నవ్వుల పువ్వులు రాలేనని..., ఒక, కాంతి పుంజమై.... కనిపిస్తాడేమో అని.... , వేయి కళ్ళతో ఎదురుచూసే ఆ అమ్మని, అమ్మవై .... మన్నించు.

    ఎంత చక్కని కథనం ఎంత చక్కని భావం
    భావనల నిధి నిక్షేపాలు వెదుక్కునే భావుకులకు పండుగ మీ కవితావిష్కరణ
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. మీ వాఖ్యలో.... నా కవిత కనిపిస్తుంది,
      భావుకత్వానికి వస్తే మీ కంటే ఎవరున్నారు, మీ ప్రశంస గొప్ప సంతోషాన్నిస్తుంది.
      ధన్యవాదాలు సర్.

      Delete