Pages

Saturday, 21 June 2014

సరిగా...అడుగేద్దాం


   


    సరిగా...అడుగేద్దాం 


    ప్రతిరాత్రీ  నా నుండి నిద్ర, 
    అలిగి తొలిగి పోతుంది. 

    వేలవేల నూలుపోగులను 
    వస్త్రం గా మలచే  మగ్గం 
    మూలపడిఉంది. 

    నట్టింట  తిష్టవేసి ,
    అమ్మ తాళానికి నాట్యమాడే
    కుట్టు మిషను  
    వయసు పైబడి పాడెక్కింది.

    పొలం గట్లలో  పహారా కాస్తూ.. 
    వీరజవానులా
    ఫోజులిచ్చె నాన్న
    షాపింగ్  మాల్ ముందు 
    సలాములు కొడుతున్నాడు. 

    నాకు ఉద్యోగం కావాలి,
    కాదు,కాదు కొలువు కావాలి,
    అందుకు నేను 
    ఎక్కడ పుట్టానో తేలాల్సి  ఉంది.

    నాచెళ్ళెల్లకు 
    చదువులు కావాలి,వారికి 
    రక్షణ నివ్వలేని  
    నాలుగో  సింహాలు
    నవ్వుల పాలవుతున్నాయి   
      

    దేహరహిత  కీటకాలు 
    నన్ను చుట్టి ముట్టి నట్లుంది.
    మునిగిన చేదలా బావినుండి
    బైటపడాలంటే.... 
    చేయూత కావాలి. 

    ఏమి చేద్దాం,.......భాయ్,


    "ఈజీగోయింగ్" 
    బాటసారులం  మనం,
    పక్కనున్నోళ్ళను 
    పట్టించుకోం. 

    మనకెందుకులే
    మనదాకా రాదులే
    అనుకొని మడుగులో 
    పడే దుర్యోధన  వారసులం . 

    ఇసుక తుఫానులు 
    ఎగరేసుకుపొతుంటే,
    పిచ్చుక గూళ్ళు కట్టుకొనే
    పిరికివాళ్ళం. 

    కడలి కెరటాలు 
    ముంచెత్తుతుంటే
    మునిగి తేలే.. ,
    నత్తగుల్లలం  మనం 

    ఇకపైనా... వద్దు..,

    శ్రమను చరిత్ర చిహ్నం గా,
    ఎగరేసే  శ్రామికులమౌదాం ,
    ఆకలి తీర్చే 
    పాలనా  జండాలవుదాం. 




  

3 comments:

  1. అన్నీ కాదనలేని వాస్తవాలేనండీ..
    అలాగే చక్కని పరిష్కారం కూడా..!

    ReplyDelete
  2. దేహరహిత కీటకాలు నన్ను చుట్టి ముట్టి, మునిగిన చేదలా బావినుండి బైటపడాలని ..... చేయూత కోసం ఎదురుచూస్తూ
    ఒకవైపు
    ఇసుక తుఫానులు ఎగరేసుకుపొతుంటే, పిచ్చుక గూళ్ళు కట్టుకొని అదే జీవితమని సంభరపడి పోతూ .... పిరికివాళ్ళమై
    కడలి కెరటాలు ముంచెత్తుతుంటే మునిగి తేలుతూ మురిసిపోతూ ...., నత్తగుల్లలమై
    ఇంకొకవైపు
    ఎటుచూసినా మనమే
    ఏమి చేద్దాం,.......భాయ్,

    అభినందనలు మెరాజ్ గారు! శుభోదయం!!

    ReplyDelete
  3. ఆశా భావం గల మీ కవిత ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది.

    కాల వైపరిత్యమేమో .....
    పరిస్థితులు మనిషిని ఎంతగా దిగజార్చుతుందో
    అద్దంలా చూపించారు,

    "మనకెందుకులే
    మనదాకా రాదులే
    అనుకొని మడుగులో
    పడే దుర్యోధన వారసులం ."

    అవును.
    మనస్వార్ధం మనదే గాని సాటి మనిషికి చేయిని ఆసరాగా అందించాలని
    ఎంతమందనుకుంటారు ఈ నవసమాజంలో,
    ఎందమావులబోలు వింత ఆలోచనలు తప్ప.

    మనిషిలో మార్పు వచ్చి మానవతాదృక్పదంతో ఆలోచించినపుడు
    మీ భావనలన్నింటికీ పొంతన గలిగే పరిష్కారాలు లభ్యమౌతాయేమో .

    చాలా బాగా రాసారు .
    అభినందనలు ఫాతిమా గారూ
    *శ్రీపాద

    ReplyDelete