కంటి (ఇంటి) దీపం
మునిమాపువేళ బారులు తీరిన కొంగల
రెక్కల చప్పుళ్ళ రొదలో ,
నా ఆలోచనలను చెదరగొడుతూ
ఎవరెవరివో బాదాతప్త హృదయరోదనలో
పేగు బంధాల మూగ వేదనలో
గిర్రున తిరుగుతున్న నా తలలో
ఎన్ని ఆలోచనలో.. ఉప్పగా జారేకన్నీరు
నాపెదవులను తడుపుతూ....కన్నీటి తలపువై
నన్ను నా నుండి దూరం చేసి,
అదృశ్యమైన నీవు అనివార్యమరణమై,
అర్ధంలేని వార్తవై ,అంతు దొరకని పరిశోదనవై,
అంతర్దానమై,అపఖ్యాతివై,అఘోచరమై,...
నా గుండెపై నిత్యం రగిలే ప్రేమజ్వాలవై...,
నా అసమర్ధతకు బలైన నిస్సహాయవై ...,
నా గుండెను నిత్యమూ సలిపే జ్ఞాపకానివై..,
నా చుట్టూ శిరశ్చేదిత చలన దేహాలే..,
చిక్కు ముడి విప్పలేక
బేతాళ శవాన్ని మోసే విక్రమార్కులే..,
పక్కన పిడుగు పడ్డా వినిపించని బదిరులే..,
అర్దంలేని ఊసుపోని వ్యర్ద ప్రేలాపాలే...
నా వేదనకు అంతం లేని వృదా ప్రయత్నాలే,
నువ్వు మాయమైంది జనారణ్యములో,
జంతు అరణ్యానైతే కేవలం ప్రాణమే పోయేది.
నీ కన్నీళ్ళ నిస్సహాయ రోదన
ఆ కామాందులను కరిగించగలిగితే,
నీవెప్పుడో మానవీయ వంతెనపై నడిచి,
మరో మంచు ముత్యానివై మమ్ము చేరవా..,
ఈ గాంధారీ సుతుల వస్త్రాపహరణానికి తెరపడి,
కలియుగ కురుక్షేత్రం జరిగేదెప్పుడు
ఒంటరి సీతమ్మలనెత్తుకెళ్ళిన రావణాసురులకు
వాయుపుత్రుని వాసన తగిలేదెప్పుడు...?????






