Pages

Sunday, 7 April 2013






కరుణ మానినారా 

నేను చిన్ని వేళ్ళతో  పట్టుకోబోతే 
అల్లిబిల్లిగా  జారిపోయారు.

నోరారా "ఆ " అనిపిలిస్తే,
వచ్చి నా పలకలో  వాలిపోయావు,

నిన్ను అమ్మతో పోల్చి 
ఆ అంటే  అమ్మ అన్నానో లేదో నాతొ పాటు 
అమ్మ వొడి చేరిపోయావు.

ఈ.. అంటూ చిట్టి పళ్ళు బైట పెట్టి ,
వెక్కిరిస్తే వంకర టింకరగా,
వచ్చి  చిక్కిపోయావు.

ఊ... అంటూ చిన్ని నోరు సున్నాలా చుట్టి,
ఊయలలూగుతూ పిలిస్తే,
వయ్యారంగా వచ్చి పక్కన చేరావు.

మిమ్మలంతా పలక పల్లకీ  ఎక్కించుకొని,
మిమ్ము దిద్దిన గంధం 
నా బుగ్గలకు రాసుకోనేదాన్ని.

ఇన్నాళ్ళుగా నా ప్రతి మాటలో మీరే ,
నా ప్రతి పాటలోనూ మీరే ,
నా నట్టింటా మీరే,నా పుటింటా మీరే .

ఇప్పుడేమయ్యారు 
పలుకుల నుండి పారిపోయారా?
పలకల  నుండి  జారిపోయారా?

మిమ్ము వదిలి మేమంతా 
కొత్త లిపితో  తైతక్క లాడుతుంటే,
మమ్ము వెక్కిరించి వెళ్ళిపోయారా ?

కాగితం పూలకి,
మేము వెంపర్లాడు తుంటే,
కలువ పూలై సర్కారీ కొలనులో కొలువయ్యారా?

ఎక్కడున్నారు  ప్రియతమలారా...
ఏ కవుల హృదయాల్లో ఉన్నారు? 
పద్య రూపాన నర్తించిన  నాట్య మయూరాలు,
కావ్య కడలిలో  దాగిన అక్షర ముత్యాలు.

దేశ  బాషలందు  తెలుగు లెస్స ,
అనిపించి అన్య భాషలందు  నన్ను,
అగ్ర  స్థానాన ఉంచిన మణి మాణిక్యాలె.


కన్నతల్లి నుండి కానుకగా,
తెచ్చుకున్న కంటి పాపలో,
వెలిగే మింటి దీపాలే.

ఏరి ఏమయ్యారు? 
నా అక్షర మాల నుండి రాలిపోయారా?
నన్ను నిరక్ష్య రాసిని చేసి పారిపోయారా?

రారా...ఇకరారా.. కరుణ మానినారా 
ప్రియతమలారా..









7 comments:

  1. బాగుంది మేరాజ్ గారు.
    క్రమంగా తెలుగు భాషను నేర్చుకోవటం తగ్గించేస్తున్న అందరికి తెలుగు అక్షరాల వ్యధని కవితా రూపం లో చక్కగా తెలియపరిచారు..

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గాఅరూ, మీరు విదేశాల్లో ఉండి కూడా తెలుగు మరచిపోలేదు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. ఎంత ఆవేదనతో ఈ అక్షరాల మాలికని అల్లారో ... మనం దిద్దించిన చేతులు మళ్ళీ ఆ అక్షరాలని దిద్దిస్తాయో లేదో అని అనుమానం,భయం కూడా . క్రమేపి దూరం అవుతున్న బాష గురించి చక్కగా వ్రాసి ఆలోచనలు కల్గించారు. చాలా బావుంది మేరాజ్ .

    ReplyDelete
    Replies
    1. వనజా, రాను,రానూ తెలుగు కనుమరుగవుతుంది భయంగా ఉంది.ఆ ఆవేదనే ఈ కవిత . మీ స్పందన చాలు ఇంకా ముందుకెళ్ళటానికి

      Delete
  3. బాగా రాసారు.తెలుగు టీచర్లకి వారంలో ఒక్క క్లాసు కూడా దొరకడం లేదని మా అబ్బాయి చదువుతున్న కార్పొరేటు స్కూల్లో గోల. అన్ని క్లాసులూ ఎం.పి. సి. కే. తెలుగు బాగానే వచ్హినా మా వాడు చాలా చదవకుండా మిస్ అవుతున్నాడని నా బాధ.

    ReplyDelete
  4. నిజమే తెలుగు టీచర్ గా ఆ బాద నేను పడినదే, మీరు బాబుకు తెలుగు నేర్పుతున్నందుకు ధన్యవాదాలు, అను గారూ, నా బ్లాగ్ కి స్వాగతం మీ స్పందనకు మరో మారు నమస్సులు.

    ReplyDelete
  5. బాగుంది. పంతులమ్మ తన పిల్లలకోసం తపించే తపన

    ReplyDelete