Pages

Sunday, 23 December 2012

శ్వేత పత్రం





శ్వేత పత్రం


నా మది ఒక తెల్ల కాగితం.

నీ చేతి రాతతో  చలనం పొందింది.

నీ పదాలకు  పల్లకీ అయింది.

నీ ఊహలకు ఊపిరి పోసింది.

నీ భావాలకు భాండాగారం అయింది.

నీ చిలిపితనానికి  చిరునామా అయింది.

నీ విరహానికి విహంగం అయింది.

నీ సందేశానికి మేఘమైంది.

నీ కమ్మకి  కపోతం అయింది.

నీ ఆర్ద్రతకు  ఆలంబన అయింది.

నీ వేదనకు వేదిక అయింది.

నీ ప్రతి కదలికకు హంస తూలిక అయింది.

నీ ప్రతి స్పందనకూ  ప్రతిబింభమైంది.

నీ ఒంటరితనానికి  ఓదార్పు అయింది. 

నీ తుంటరి తనానికి ఆటవిడుపు అయింది.

నీ సంతకానికి సహవాసి అయింది.

నీ సంతోషానికి సహపంక్తి అయింది.

నీ సరసానికి కొలువుకూటం అయింది.

నీ నిరసనకు నిలువుటద్దం  అయింది.

నీ తలపుల  తడి ఇంకా ఆరకుంది.

నీ వలపు సిరా ఇంకా ఒలికే  ఉంది.
.

12 comments:

  1. వావ్, మీ కలం రెండువైపులా పదునే కాదండోయ్, అన్ని రంగుల తోనూ భావాలను ప్రఫుటంగా చెప్పగలదు కూడా.
    చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ,
      చూసారా, మీ పొగడ్త నన్ను రోజుకు ఒక కవిత రాసేలా చేస్తుంది.
      మీ ప్రశంసకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

      Delete
  2. చివరి వాక్యం చదివాక మాటల్లేవ్...అంతే.

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ,
      మీ స్పందనకు ధన్యవాదాలు.
      నా ప్రతి కవిత చదివి అభిప్రాయం చెప్పిన మీకు సదా రుణపడి ఉంటాను.

      Delete
  3. మేరాజ్ గారూ!...
    శ్వత పత్రం అంటూ మొదలెట్టి
    చక్కటి ప్రేమ పత్రం వ్రాసేసారు...
    నీ తలపుల తడి ఇంకా ఆరకుంది.
    నీ వలపు సిరా ఇంకా ఒలికే ఉంది.
    ఈ వాక్యాలు సూపర్బ్...
    అభినందనలు...మీకు....@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, నా కవితలోని భావాలను నచ్చి, మెచ్చే మీకు నా ధన్యవాదాలు.
      కొంత సమయం దొరకక మీ బ్లాగ్ చూడలేకపోతున్నాను,

      Delete
  4. మీ కలంలో సిరా ఎప్పటికీ నిండి ఉండాలని,

    మీ గుండెలోని ఆర్ద్రత కలకాలం నిలిచి ఉండాలని,

    మీరెప్పటికి ఇలానే మంచి కవితలు రాస్తూ ఉండాలని కోరుకుంటూ....

    ReplyDelete
    Replies
    1. సర్, మీ అభిమానం, ఆశీస్సులే నా కలం లోని సిరా,
      నేను రాసే ప్రతి భావాన్నీ సమర్దించి, మెచ్చి, దిద్దే సహృదయం మీలో ఉంది,
      నా కవిత చదవటం కోసం మీ సమయాన్ని వెచ్చించటం అదృష్టంగా భావిస్తాను నేను.
      మీ స్పందనకు మరో మారు కృతఙ్ఞతలు.

      Delete
  5. "నా మది ఒక తెల్ల కాగితం.
    నీ చేతి రాతతో చలనం పొందింది."

    శ్వేతపత్రాన్ని వలపు సిరాతో చాలా అందంగా తీర్చిదిద్దారండీ చాలా బాగుంది..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ,
      ఎమిచేయాలండీ యెంత వలపు సిరా అద్దినా అది స్వేతపత్రంగానే కనిపిస్తుంటే,
      హృదయం లేదండీ చదివే వాళ్లకి:-))).
      మీ అభిమానం సదా నా పై ఉండాలని కోరుకుంటూ.. మీ మెరజ్

      Delete