Pages

Tuesday, 10 December 2013

అమ్మా... మరోమారు కనవా..






   అమ్మా... మరోమారు  కనవా..


     నా చిట్టి  చేతులపై   తనచేతులుంచి   సుతారంగా,
     అక్షరాలు దిద్దించిన  తొలిగురువు.

     బడినుండి  వచ్చే  నాకొసం  వీధి  చివర  నిల్చుని,
     అలసిన నా ముఖాన్ని కొంగుతో తుడిచే పాలవెల్లి,

     ఉన్నతంగా  ఎదగాలని  నాకై నిత్యం  పాటుపడే,
     పవిత్రమైన  ప్రాణ వాయువు.

     ఉన్నత  శిఖరాలనెక్కించేందుకు  అరచేతులనే,
     సోపానాలు చేసిన  ప్రేమ ఆయువు.

     గోరుముద్దలు  తినిపించిన   అమ్మతనమూ,
     వెన్నను  మరపించిన కమ్మదనమూ,

     అమ్మంటే జన్మకే శ్రీకారం ,అమ్మంటే  మమకారం,
     నిలువెత్తు నిర్మలాకారం.మమతల ప్రాకారం,

     వేల,వేల విన్నపాల అనంతరం,
     నేనో  నేలకు  దిగిన శశావతారం. 

     కానీ.... జరిగిపోయిందో.. ఘోరం. 

     ఆదరణకు నోచుకోని  ఆ ముసలి ప్రాణం,
     కోడళ్ళాడిన  బంతులాటలో విసిరేయబడీ, విసిగీ, వేసారీ,

     పనికిరాని పాతవస్తువులా, వెలికి తీయని నిక్షిప్తంలా, 
     అడుగంటిన  అక్షయపాత్రలా,మాసిన దేవతా చిత్రంలా,

     ఆరిపోతున్న దివ్వెలా, ఒదిగిపో్యిన గువ్వలా,
     ఒడలిపోయిన పూదండలా,ఒంగిపోయిన హరివిల్లులా, 
     అనాథలా, అభాగినిలా,ఆకరి క్షణాలలో ఆశ్రమవాసియై. 
     శూన్యంలోకి   ధైన్యంగా  చూస్తుంటే.. 

     నన్ను గుర్తించమనీ, ఒక్కసారైనా వంక  చూడమనీ,
     తన ఒడిలో చోటివ్వమనీ,గుండెపగిలేలా ఏడవాలనీ,
     మన్నించమని వేడుకొవాలనీ,

     ( ఊహూ... అలా ఎన్నటికీ చేయలేను  ఎందుకంటే నేను ఎదిగిన  మనిషిని,
     ఒదిగిన తనయుణ్ణి  కాను, కాలేను, వేలమంది చరిత్ర హీనులలో నేనూ ఒకణ్ణే.) 

  



8 comments:

  1. కొంచెం ముందు ,వెనుక ప్రతి ఒక్కళ్ళం ఆ వయసుకు చేరుకునే వారిమే అనే జ్ఞానం చాలా మంది కోడళ్లలో లోపించడం ఎంతో విచారించదగిన విషయం . ఆ జ్ఞానమే వారిలో ఉంటే ఏ కొడుకు అంతలా బాధ పడడమో. పెద్దలను బాధ పెట్టడం క్షమించరాని నేరం . దేవుడు అన్ని తాను చేయలేక తన ప్రతిరూపంలో మన కోసం మన దగ్గరికి పంపిన వారే తల్లిదండ్రులు . మీరజ్ ! ఓ కొడుకు అంతర్మధనం చాలా బాగా లిఖించారు వేదన కలముతో .

    ReplyDelete
    Replies
    1. నేరమంతా కోడళ్ళదే అనలేము వారివెనుక కొడుకు అర్దాంగీకారం ఉంటుంది.
      ఏ కొడుకైనా నాకు అమ్మ కూడా ముఖ్యమే అంటే కోడలు సంసారాన్ని వదులుకొని వెళ్ళదు.
      నేటి సమాజములో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాన్ని తోసుకోవటం బాగా తెలుసుకున్న విద్య.

      Delete
  2. నా చేతులపై తనచేతులుంచి సుతారంగా, అక్షరాలు దిద్దించిన తొలిగురువు. నాకొసం వీధి చివర ఎదురుచూసి నా ఔన్నత్యాన్ని ఆశించి, అరచేతులను సోపానాలు చేసి, గోరుముద్దలు తినిపించిన కమ్మదనం, అమ్మ ....
    ఆదరణను కోల్పోయి,
    పనికిరాని పాతవస్తువులా, మాసిన దేవతా చిత్రంలా, ఒడలిపోయిన పూదండలా, ఒక అనాథలా, ఒక అభాగినిలా .... అనాధాశ్రయం లో .... శూన్యంలోకి ధైన్యంగా చూస్తుంటే .... నన్ను గుర్తించమనీ, గుండెపగిలేలా ఏడవాలనీ, మన్నించమని వేడుకొవాలని ....
    అయినా, అలా ఎన్నటికీ చెయ్యలేక .... నేను.

    కృత్రిమ కుహానా అంతస్తులు పెద్దరికాలు నాగరికతలుగా భావించే మానవజాతి ఆరంభం కాకుండానే అంతం అవుతుంది. అమ్మను ఆదరించలేన్నాడు.
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు .... ఎందరికో కనువిప్పు కలిగించే ఒక మంచి కవిత పోస్ట్ చేసినందుకు!

    ReplyDelete
    Replies
    1. ముఖ్యంగా నగరాలలో చూడండి ముసలమ్మలు తక్కువగా కనిపిస్తున్నారు,
      కనిపించేవారు కూడా కాళ్ళూ, కళ్ళూ బాగా ఉండి మనవళ్ళనూ, మనమ్రాళ్ళనూ స్కూల్ నుండి తీసుకురాగలిగి,
      కొడుకూ,కోడలు ఉద్యోగస్తులైతే ఇల్లు కనిపెట్టుకొని ఉండగలిగితే ఉండనిస్తున్నారు. (అందరూ అలాంటివారు అని నేను అనటం లేదు)

      Delete
  3. అమ్మ కన్నది నిజమే.
    మళ్ళీ కనమని అడగడం కూడా బాగుంది. అర్థం చేసుకోవచ్చు.
    ముసలితనంలో అమ్మను, నాన్నను కనాల్సింది ఎదిగిన కన్నపిల్లలే.
    కొడుకా కనవా నన్ను అంటుంది అమ్మ.

    ReplyDelete
    Replies
    1. అంధులైన కొడుకులు ఎలా కనగలరు?
      అందుకే అమ్మను చూడగల కొడుకూ, కూతురూ, మాత్రమే తమ సంతానానికి విలువలు నేర్పగలరు.
      మీరన్నట్లు ఆ ఎదిగిన పిల్లలలో మార్పు రావాలి.

      Delete
  4. ఊహూ... అలా ఎన్నటికీ చేయలేను ఎందుకంటే నేను ఎదిగిన మనిషిని,
    ఒదిగిన తనయుణ్ణి కాను, కాలేను, వేలమంది చరిత్ర హీనులలో నేనూ ఒకణ్ణే........ ఎంత సత్యం.. జీవితాల్ని ఎంతో దగ్గర్నుంచీ పరిశీలిస్తే తప్ప ఇలా రాయటం సాధ్యం కాదు.. నా వరకు నేను ఇలా రాయలేనేమో... గుండెల్ని మెలిపెట్టేలా ఉందక్కా..

    ReplyDelete
  5. శోభా, మీ అభిమానానికి, ప్రశంసకూ ధన్యవాదాలు.
    మీ బ్లాగ్ " కారుణ్య " నాకు చిరపరిచితమే.చాలా బాగా రాస్తారు.
    అయినా తమిళమ్మాయి అయిపోయారు కదా:-))

    ReplyDelete