మేమిద్ద్డరం ఉద్యోగస్తులం కావటం వల్ల, మా పిల్లల్ని చూసుకొనేందుకు ఎవరైనా పెద్ద దిక్కు ఉంటె బాగుంటుంది అని ఆలోచించి, మా వారికి మేనత్త వరసైన మంగమ్మత్తను పిలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం.వెంటనే మా ఆలోచనను అమలుపరిచాం ఆవిడగారు రావటానికి ఒప్ప్పుకున్నారు కూడా.
***
ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైంది. నేను వాకిట్లో కూరలబ్బాయిని కేకేస్తూ అక్కడే ఉన్నాను. ఆటో ఆగిన చప్పుడుకు ఎవరా అని అటువైపు చూసాను.
ఆడ సూమో పహేల్వాన్ లాగా ఉన్న ఓ భారీకాయం ఆటో దిగి, హడావిడిగా వెనక్కి వెళ్ళి అక్కడ ఆటోకి ఆనుకొని సెల్లులోకి చూసుకుంటున్న ఆటోడ్రైవర్ని చూసి నెత్తిమీద ఒక్కటిచ్చింది, ఆ దెబ్బకు అతనికి కళ్ళలో నక్షత్రాలు కనిపించాయిగానీ ఎదురుగాఉన్న శాల్తీ కనిపించలేదు పాపం.
"అరె, అగ్గో, ఏందివమ్మా గట్ల మీదబడి కొట్టబడ్తివి? మీదబడి కొట్టనీకె నేను ఏమిచేసినా" ... చిరాగ్గా అన్నాడు ఆటోవాలా.
"అరె, మొండికేసిన కొల్లు దున్నలా గట్ల నిలబడ్తివేమిరా అమ్మాయినడిగి పదో పాతికో పుచ్చుకొని ఈ సామాన్లు లోపల పెట్టి తగలడు" గట్టిగా అరుస్తూ నన్ను చూపెట్టింది ఆటోలో దిగినావిడ.
సందేహం లేదు ఈమె గారు మేము ఎదురుచూసే మంగమ్మత్తే .. నేనూ నవ్వుతూ ఎదురెళ్ళి ప్రయాణం బాగా జరిగిందా పిన్ని గారూ అన్నాను.
"ఆ.. ఏమి ప్రయాణం లెమ్మా...ఇదిగో ఈ తింగరి భడవ ఊరంతా తిప్పితెచ్చాడు, గుంటల్లో పడిలేచి వచ్చాను, కాస్త వేడినీళ్ళు పెట్టి కాసింత టిఫిను నాముఖాన పడెయ్యి తల్లీ, ఆ,, మర్చిపోయాను ఆ సచ్చినోడి ముఖాన పదో పరకో పడెయ్యి, దారంతా ఒకటే సణుగుడు దిక్కుమాలిన అర్ధం కాని భాషా వాడూనూ..ఏదడిగినా క్యా..క్యా అంటున్నాడు కాకిలా". అంటూ ఆటొవాలాను మరోమారు ఉరిమిచూస్తూ లోపలికెళ్ళారావిడ.
"అరె బిచ్చం గిట్ల ఏస్తున్నారామ్మ? పదో పరకో ఇవ్వనీకి. అడ్రసు మంచిగ తెల్వదు, మా అబ్బి తెల్వదార నీకు? వాళ్ళ తాత ఎంత మోతబరి మనిషి. గాయాన పేరుగూడ తెల్వ బట్టవు, అంటూ పెద్ద లొల్లిజేసింది. "మీటరు మీదికెల్లి పచ్చీస్ ఎక్కువివ్వాలే " గట్టిగా అరిచాడు ఆటో డ్రైవరు. అతనడిగిన డబ్బు ఇచ్చి వంటింట్లోకి వెళ్లాను. వాడు వెళ్ళాడా లేదా అని చూడటానికి బైటకి వచ్చి నిల్చున్నారు పిన్నిగారు.
"పేపర్" ఓ గావుకేకతో పాటు పేపర్ వచ్చి పిన్నిగారి ముఖానికి ఫాట్ మని తగిలి ఆవిడ కళ్ళజోడుని ఆమడ దూరం ఎగరగోట్టింది.
"అయ్యో, అయ్యో, ఇదేమి చోద్యమే తల్లీ, ముఖానికేసి కొట్టాడు. నా అద్దాలెక్కడే ముదనష్టపు ఊరు, వేర్రికేకలూ, పిచ్చి అరుపులూ,, అంటూ శివాలెత్తి పోయిందామె. నేను వెళ్లి కళ్ళజోడు తీసి ఇచ్చాను అవి దుమ్ము కొట్టుకున్నాయి కానీ పగల లేదు. ఇక్ష్వాకుల కాలం నాటివి లా ఉన్నాయి బాగా పాతవి మరి.
"పిన్నిగారూ టిఫిన్ తీసుకుందురుగాని రండి" అన్నాను.
"పదవే తల్లీ " అంటూ నా వెనుక వస్తూ ఉండగా .. డబ డబా చప్పుడయ్యింది. చెడి పోయిన విమానం చెవిలో దూరినంత చప్పుడుతో ఇంటి ముందు ఓ స్కూటర్ ఆగింది. దాని చుట్టూ రకరకాల సైజుల్లో స్టీల్, ఇత్తడి, సిల్వర్ క్యాన్లు తగిలించి ఉన్నాయి. ఆ చప్పుడుకు కంగారు పడిన పిన్నిగారు శరీరమంతా లోపలే ఉంచి ముఖం మాత్రం బైట పెట్టి వచ్చింది ఎవరా అని చూశారు.
"దూద్ " గట్టిగా కేక వేసి, నా మొఖం నా ఇష్టం అన్న ఫీలింగ్ లేని ముఖం తో ఓ శాల్తీ కనిపించాడు. మంగమ్మత్త గబగబా బైటికెళ్ళి "ఏంటబ్బాయ్ అది" అని అడిగారు. అతని నుండి జవాబు రాలేదు సరికదా అసలక్కడ ఎవరూ లేరు అన్నట్లుగా నడుమ్మీద చెయ్యేసుకుని సిగరెట్టు పొగ మామ్మగారి మొఖం మీద ఉఫ్ఫూ, ఉఫ్ఫూ అని ఊదుతూ నిల్చున్నాడు.
"ఇదిగో అమ్మాయ్! వీడెవడో చెడ్డీలో గండుచీమ దూరినట్లు ఓ గావు కేక వేసి అంతలోనే వానకు తడిసిన నులకమంచంలా నీలుక్కుపోయాడు చూడు" అంటూ వాడినే చూస్తూ నుల్చున్నారు.
"పాలబ్బాయి పిన్నిగారూ, మీరు రండి టిఫిన్ చల్లారి పోతుంది." అని అంటూ పాలుపోయించుకుంటున్నాను.
ఇంతలో, గేటు చప్పుడయింది ఇంటి ఓనర్ జాగింగ్ నుండి తిరిగొచ్చి తమ పోర్షన్ లోకి వెళ్తూ నన్ను చూసి "గుడ్మార్నింగ్ విమలా" అన్నారు.
"హలో అంకుల్, గుడ్మార్నింగ్ " అన్నాను. పిన్నిగారు అతన్ని చూస్తూనే కొంగు నిండుగా కప్పుకొని హడావిడిగా లోపలికెళ్ళారు. ఆమె వెనుకే నేనూ లోపలికెళ్ళాను.
కాసేపటికి "ఇదిగో అమ్మాయ్, పాపం ఆపెద్దాయన కి సరైన బటలున్నట్లు లేవు, పాపం చెడ్డీ వేసుకొని ఆ చలిలో ఇంత పొద్దున్నే ఏ పని మీద వెళ్లి వస్తున్నాడో" అంటూ కాసేపు శ్వాస తీసుకొని "ఏంటో పాపం పెద్దవాళ్ళ తిప్పలు, అవునూ మన చందూవి ఏమైనా పాత బట్టలు ఉంటే ఇవ్వొచ్చు కదా, అన్నారు, నాకు నవ్వు ఆగలేదు. "అయ్యే పిన్నిగారూ, ఆయన ఈ ఇంటి ఓనరు, పొద్దున్నే వాకింగ్ వెళ్లి వస్తున్నారు అన్నాను.
"ఏడిచినట్లే ఉంది, అలాపిక్కలు కనపడేలా చెడ్డీ వేసుకుని పరిగెడితేనే ఆరోగ్యమా.. పంట్లాం వేసుకుని పరిగెత్తోచ్చుకదా! ఏమో పిదపకాలం" అంటూ చిరాకు పడ్డారు. అప్పట్నుంచి మామ్మ గారు మా ఇంటి ఓనరు కనబడితేచాలు పురుగుని చూసినట్టు చీదరగా చూసి లోపలికెళ్ళేవారు.
పిన్నిగారొచ్చి వారం రోజులు అవుతున్నా ఆమె ఈ వాతారణానికి అలవాటు పడ లేదు కదా, రోజురోజుకీ సణుగుడు ఎక్కువయ్యింది.
పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కిస్తూ... క్లీనర్ కుర్రాణ్ణి జబ్బ పట్టుకు కిందికి లాగి "అంట్ల వెదవా మా పిల్లని గుడ్డీ, గుడ్డీ అంటావా..బిడ్డకి చక్రాల్లాంటి కళ్ళు ఉంటే నీకు గుడ్డిదానిలా కనిపిస్తుందా, తాట తీస్తాను ఏమనుకున్నావో" అని పెద్ద గోలచేశారు. (హిందీలో గుడ్డి(గుడియా) అంటే బొమ్మ అనే అర్ధం అని ఆమెకు తెలీదు కదా). ఎదురింటావిడ జబ్బాల దాకా రవిక వేసుకుందనీ, పక్కింటి కాలేజీ పిల్ల మోటారు సైకిలు వేసుకొని మగ రాయుడిలావెళ్తుందనీ .., ఇలా ఎన్నో..
ఒక్కోసారి, ఆవిడ మాటలు గొడవలు తెచ్చి పెట్టేవి. చిరాకేసేది, కానీ మా పరిస్థితి అలాంటిది, సర్దుకుపోవాలి మరి.
ఆరు నెలల తర్వాత.
ఓరోజు మేము ఆఫీసు నుండి వచ్చేసరికి పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు , పిన్నిమాత్రం దిగాలుగా కూర్చుని ఉన్నారు, నేను ఈయనగారికి కళ్ళతోనే సైగ చేశాను పలకరించమని.
"అత్తయ్యా, ఏంటి అలాఉన్నారు?" పక్కన కూర్చుంటూ పలకరించారీయన.
"ఏమీ లేదు నాయనా, ఒక్కోసారి దేవుడెండుకో చిన్నచూపు చూస్తాడు" అన్నది వేదాంత ధోరణిలో.
"ఎవరిని తీసుకెళ్ళాలో, ఎవరిని ఉంచాలో, తెలీదేమో ఆయనకి " అన్నది ఆమె మళ్ళీ.
"మామయ్యగురించా " అన్నారు ఈయన. (ఈయనెప్పుడూ నాతో అంటూ ఉంటారు ఈవిడ పోయి ఆయన ఉన్నా బాగుండేది, అని.)
"అయ్యో కాదురా తండ్రీ " పేపర్ కుర్రాడి గురించి" అన్నది ఎటో చూస్తూ,
"ఏంటీ ,మీరు మన కాలనీలో వాళ్ళే కాకుండా పేపర్లో వాళ్ళని కూడా వదలటం లేదా"? "రెస్ట్ తీసుకోండి, అన్నీ సర్దుకుంటాయి" ఈయనగారికి కాస్త గందరగోళంగా, తలతిక్కగా అనిపించిందేమో కాస్తా చిరాగ్గా అన్నారు. అక్కడి నుండి మెల్లగా లేస్తూ. నేను పిల్లల్ని పిలిచి విషయం ఏంటని అడిగాను.
"మనకు ఇంతక్రితం పేపర్ బోయ్ ఉండే వాడు కదా, వాడు రోజూ మేం స్కూల్ కెళ్ళే టైంకి బస్ స్టాప్ లో ఉంటాడు, బస్ వచ్చే లోగా కాసేపు మాతో ఆడుకుంటాడు, బామ్మ వాడిని రోజూ తిడుతూ ఉంటారు,మా పిల్లలతో నీకు ఆట్లేంటిరా అంట్లవెధవా అని. వాడీమధ్య కనిపించట్లేదు, ఈరోజు బామ్మ ఆరా తీయగా వాడికి అమ్మా, నాన్నా చిన్నప్పుడే పోయారట, మామ్మ దగ్గర ఉంటూ పేపర్ వేయడం, ఎవరికైనా సరుకులు తెచ్చిపెట్టడం చేసి పైసలు అడుక్కునేవాడట, ఈ మద్య వాళ్ళ మామ్మ కూడా చనిపోతే వాడిని ఎవరో అనాథశరణాలయం లో చేర్చారట, వాడిగురించి బామ్మ స్పీకుతుంటే మాబస్సువచ్చింది మేం వెళ్లాం "(ఇదీ పిల్లలు చెప్పిన సారాంశం )
పిన్నిగారిలో చాలా మార్పు వచ్చింది. చాలా వరకు ముభావంగా ఉంటున్నారు.
ఓరోజు ఉన్నట్లుండి, మావారిని పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకొని,
"బాబూ,నేను ఊరెళ్ళి రావాలి" అన్నారు.
"అలాగే అత్త్తయ్యా" కానీ ఏమిటంత ముఖ్యమైన పని? పైగా పిల్లలకి హాలిడేస్ కూడా లేవు. అన్నారు.
"లేదు, ఇంకో వారం రోజుల్లో మీ మామయ్య వర్దంతి ఉంది, ఆరోజుకి ఆయనకీ ఇష్టమైన పని ఒకటి చేయాలి" అన్నారు.
(జీవితాంతం ఈమెకు ఇష్టమైనవి మాత్రమే జరిగేట్లు ప్రవర్తించారాయన. ఆవిషయం అందరికీ తెలుసు.)
"ఇంతకీ విషయం చెప్పలేదు మీరు" కొంచం అసహనంగా అన్నారు మావారు.
"ఊరెళ్ళి, మరిదిగారితో నా వాటా గురించి మాట్లాడి, ఎంత వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పటివరకూ నాకు ఖర్చులకి ఇస్తే చాలు నా తదనంతరం ఎవరైనా తిననీ అనుకున్నాను, ఇప్పుడు అలా కాదు, నేను ఆ పసివాడిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను" చివరి మాటలు స్థిరంగాఅన్నారామె."బిడ్డలులేని మనం ఏ అనాథ బిడ్డనో పెంచుకుందాం అనేవారు ఆయన" స్వగతంగా అనుకున్నట్లు చిన్నగా పలికారామె.
నేను రోజూ చూసే పిన్నిగారికీ ఈమెకీ పోలికే లేదు, ఎప్పుడో ఎవరిమీదనో విరుచుకు పడుతూ, చిరాకు పడుతూ కనిపించే ఈమెగారిలో ఇంత ఉన్నతమైన ఆలోచనా, దయాగుణముందా???.
"ఏమోయ్ చూసావా.... మరక మంచిదే అన్నట్లు మా మంగమ్మత్త మంచిదే" నవ్వుతూ అన్నారు మావారు ఆమె నిర్ణయం విన్నతర్వాత.
prati vaari pravarthanalonu komtha varaku moorkhatvam umtumdi. adi parivarthana chemditene
ReplyDeletemamchi manushulavuthaaru ,alaane "magammatta " kooda mamchidayimdi .
TILL NOW SHE DIDN'T FACE THIS TYPE OF INCIDENTS I THINK .ANYWAY GREAT CHANGE.
దేవీ.. మీరన్నట్లు మగమ్మలాంటి ఇంకెందరిలోనో ఇలాంటి పరివరతన రావాలని ఆశిస్తున్నాను.
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.
మంగమ్మత్త ఒక సగటు స్త్రీ. ప్రతిది తన కోణం నుంచి మాత్రమే చూసే స్వార్ధ మనస్తత్వం .... అలాంటి ఆమె కూడా మనసు మార్చుకుని ఒక ఆదర్శ వ్యక్తిత్వం గా మారినట్లు చూపించడం కథనం లోని గొప్పదనం
ReplyDeleteఅభినందించకుండా ఉండలేకపోతున్నాను.
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!
సర్, మీ అభినందనలు నాకు స్పూర్తిదాయకాలు. కథలు రాయాలనే ఉంటుంది కానీ వాటిని చదివించగలిగే పట్టు కోసం చాలా కష్టపడతాను. .
Deleteమీ పిన్ని గారు మీ బాటలోనే నడిచి నట్లున్నారు.
ReplyDeleteమీ చేతి తిండి మహిమ అనుకుంటా!
కథ బాగుంది, చదివించింది.
ఇంకా రాయండి.
సర్, నా బాట ఆదర్శవంతమైనది అనే మీ ప్రశంసా,దీవెనా దొరకటం సంతోషంగా ఉంది,
Deleteకథ చదివించగలిగింది కనుక మళ్ళీ ఇంకో కథతో వస్తాను,(కథలు రాయటానికి మా శ్రీవారి సహాయం తీసుకొంటాను ) తప్పదు చదవాల్సిందే:-))
ధన్యవాదాలు మీ స్పందనకు.
భలే మం గమ్మత్త (యిన ) కధ రాశారు !
ReplyDeleteసర్, కథ గమ్మత్తుగా ఉంది అన్నారు, చాలా సంతొషం.
Deleteచక్కటి మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
మెరిసేదంతా బంగారం కాదు. మనసు మెత్తన మాట కరుకు పాతవారి లక్షణం
ReplyDeleteనిజమే, ఆ కాలం వారికి లవుక్యంగా మాట్లాడటం రాదు, పెద్దమనసు ఉంటుంది(చాలా మందిలో)
Deleteసర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
చాలా బావుంది . ముగింపు హాస్యంగా ఉంటుంది అనుకున్నాను. కదిలించారు. ఇంకా ఇంకా ఇలాగే వ్రాయండి నేస్తం . చాలా బావుంది . . శుభాభినందనలు.
ReplyDeleteవనజా, మీరు చదవటం ఆనందాన్నిచ్చింది.
Deleteఇంకారాయమన్న మీ ప్రోత్సాహం స్పూర్తినిస్తుంది,
పైకి కరుకుగా ఉండే రాతిలో నీళ్ళున్నట్టు, మనుష్యుల్లో కూడా కరుణ ఉంటుంది. మంగమ్మత్తకూడా అట్లాంటిదే. అవసరం వచ్చినప్పుడు కరుణకురిపించింది. మంచికథ.
ReplyDeleteవర్మగారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు,
Deleteనిజమే మీరన్నట్లు మనుషుల్లో కరుణ దాగి ఉంటుంది, దాన్ని పైకి తేగలిగితే వారి నుంచి సమాజానికి మేలు జరుగుతుంది.
మీ మంగమ్మత్త గారి మాటల్ని వింటుంటే ముచ్చటేసింది. చివరకు వెన్నలాంటి ఆమె మనసు చూసి హృదయం ద్రవించిందండీ. చాలా బాగా రాశారు. హాస్య రసాన్ని అలవోకగా ఒలికించారు మీరిందులో... :-)
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు. మీ కామెంట్ ఇంకా రాయలనే స్పూర్తిని కలిగిస్తుంది.
Deleteమీ స్పందనకు ధన్యవాదాలు. మీ కామెంట్ ఇంకా రాయలనే స్పూర్తిని కలిగిస్తుంది.
Deleteమీ స్పందన ఇంకా స్పూర్తిని కలిగిస్తుంది..మీ స్పందనకు ధన్యవాదాలు
Delete