Pages

Monday, 4 November 2013

రోగం

      



      రోగం 

       పచ్చని ప్రాణాన్నిచప్పరించి  
       పిప్పిచేసేదే రోగం.
       చెట్టంత మనిషిని  ముప్పెనలా 
       ముంచేదే రోగం.

       కలల నుండీ, జీవన అలల నుండీ 
       తోసివేసేదే రోగం,
       కుటుంబం నుండీ,ఇంటినుండీ 
       దూరంగా నెట్టేదే రోగం.

       మంత్రాల,తంత్రాల  నమ్మకాల, 
       నిచ్చెనెక్కించేదే రోగం.
       తాయత్తుల, దిగదుడుపుల,బూడిదలకు 
       గంగిరెద్దును చేసేదే  రోగం . 

       పిడికిట్లో  పిచ్చికపిల్లవైనా,
       గూటిలో గువ్వపిల్లవైనా,
       వాకిట్లో గండుబిల్లిలా  పొంచి , 
       నిన్ను నోట కరచుకొనేదే రోగం 

       పడుకున్న మంచమే లోకంగా,
       చమట శరీరమే దుప్పటిగా,
       నీకు నీవే  గొంగళివేమో  
       అనిపించేలా  చేస్తుందీ రోగం. 

       ప్రపంచమంతా అంధకారంగా, 
       రంగులన్నీ మసిపూసుకున్నట్లుగా,
       నీ కళ్ళముందు చీకట్లు పులిమి 
       అంధుని చేసి  ఆనందిస్తుందీ రోగం. 

       పక్షిపిల్లని పొట్టచీల్చినట్లూ,కళ్ళనుండి కనుగుడ్లు లాగి 
       కర,కర నమిలినట్లూ,
       ఎంతో మందిని  ఒంటి చేత్తో 
       ఓడించాలని చూస్తుందీ రోగం. 

       రోగం ఒక వైతరణీ...... 
       రోగం ఒక మృత్యుకుహరం,.... 
       రోగం  ఒక నిర్దయ శోకం.......  

      కానీ..... ,

       ఓ  ఆత్మీయుని కర స్పర్శకే  కరిగిపోతుందీ రోగం.
       ఓ  ఊరడింపు  మాటకే ఊరవతలకి పారిపోతుందీ రోగం.
       ఓ  చిన్ని చేయూతకే  చెంతలేకుండా పోతుందీ రోగం.







22 comments:

  1. రోగం అంతు చూసేట్టున్నారు, మీ కవిత తో !

    ReplyDelete
    Replies
    1. ఏమి చేయమంటారూ? మాలాంటివారు అక్షరవైద్యమే చేయాలి.
      రోగాన్ని కుదర్చాల్సింది మీలాంటి డాక్టర్సే కదా.:-))

      Delete
  2. పచ్చని ప్రాణాన్నిచప్పరించి పిప్పిచేసేదే రోగం. ముప్పెనలా ముంచి, కలలు, కుటుంబం, ఇంటినుండీ దూరంగా నెట్టేసి, మంత్ర, తంత్ర, తాయత్తుల, దిగదుడుపు బూడిదలకు గంగిరెద్దును చేసి .... నీకు నీవే గొంగళివేమో అనిపించేలా చేసేదే రోగం. నీ కళ్ళముందు చీకట్లు పులిమి అంధుని చేసే .... రోగం, ఒక మృత్యుకుహరం,.... ఒక నిర్దయ శోకం.......
    కానీ..... ,
    ఓ ఆత్మీయ కర స్పర్శ, ఊరడింపు మాట. చిన్ని చేయూత .... ఉపశమనం రోగానికి.
    అనారోగ్యం తో పడే బాధకు అక్షర రూపం లా ఉంది ఈ కవిత. రోగం తో మంచం పాలైన మనిషిని మనస్పూర్తిగా పలుకరించాలనే ఆలోచన అవసరాన్ని గుర్తు చేస్తూ, అభినందనలు ఫాతిమా గారు. శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రశేఖర్ గారూ, రోగి కి కొంచమైనా దగ్గరి వారి అండదండ ఉండాలన్నదే నా కవితా భావం.

      Delete
  3. నవ్వడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు జంధ్యాల. రోగం, రోగం కుదర్చాలి :)

    ReplyDelete
  4. అలా రోగమొచ్చిన వాళ్ళకి ఎంతమంది ఉపచర్యలు చేసేవారు ఎందరు?

    ReplyDelete
    Replies
    1. రోగికి రోషమెక్కువ అంటారు ఎందుకో తెలుసా తన పనులు తాను చేసుకోలేని నీరసం.
      అందుకే వారికి సపర్యలు అవసరం.
      మా తెలుగమ్మాయికి బోలెడు ధన్యవాదాలు.

      Delete
  5. Fathima gaaru... Rogaaniki thikka kudirelaa chivarlo bhale shock icchaaru...:-):-)

    ReplyDelete
    Replies
    1. రోగాన్ని తరమటమే కాదు దరిచేరనివ్వరాదు.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  6. Healing Touch Treatment.....Pic is so heart touching.

    ReplyDelete
    Replies
    1. ఆత్మీయ స్పర్శ మానసిక గాయాన్ని మాపుతుందనే నమ్మకం గొప్పది కదా...
      చిత్రం నచ్చిన అభినవ చిత్రకారిణీ....ధన్యవాదాలు.

      Delete
  7. ఆరోగ్యం బాగా లేనివారిని పరామర్శించడం వారికి కొండంత ధైర్యాన్ని స్తుంది. మీ కవితా శైలి ఎప్పట్లాగే చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ, మీ స్పందన నా కవితకు స్పూర్తినిస్తుంది.
      ధన్యవాదాలు మీకు.

      Delete
  8. Replies
    1. సర్, మెచ్చిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  9. జంకు గొంకు లేని వంకర నడతల
    జరయు రుజయు గల్గు జగతి కన్న
    రుగ్మతలను ద్రోచి ఋజు వర్తనము నేర్పు
    కవుల చేతి మేటి కలము మిన్న

    ReplyDelete
    Replies
    1. కలముపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు రాజారావ్ గారూ,
      మీ వ్యాఖ్య నా కవితకు స్పూర్తిదాయకం

      Delete
  10. టచ్ థెరపీ గురించి బాగా రాసారు.
    రోగాన్ని చక్కగా అభివ్యక్తీకరించారు.
    కవిత చదివితే మా నాన్న గారు గుర్తొచ్చారు.
    ఆయన వెన్ను నిమిరితే జ్వరం తగ్గినట్లుండేది.
    నాకూ అదే అలవాటు వచ్చింది.
    టచ్ చేయడానికి వీల్లేనంత దూరం ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, బంధువులను, కనీసం నెలకొక్కసారైనా పలకరించగలిగితే ఎంత బాగుంటుంది కదా!

    ReplyDelete
    Replies
    1. సర్, నిజమే కదా, ఆత్మీయుల స్పర్శ సగం బాదని తొలగిస్తుంది.
      ఈ సందర్బంగా మీరు మీ తండ్రిని గుర్తుచేసుకోవటం బాగుంది.
      కవిత మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  11. మీ శైలిలో చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ, మీ ప్రశంసకు నా ధన్యవాదాలు.

      Delete