Pages

Wednesday, 2 October 2013

రైతన్నా,











   రైతన్నా,

   కాలిపోయిన కలలు మరచిపొదాం.
   రాలిపోయిన కంకులు ఏరుకుందాం.

   గుప్పెడు గింజల పలహారం చాలు,
   గుక్కెడు  నీటితో గొంతు తడుపుకుందాం.

   కరవురక్కసి  కాళ్ళు విరిచేద్దాం.
   కలో,గంజో  కలసితాగుదాం.

   మట్టి పొరలకింద బంగారముంది,
   తట్టి చూడు చిరుమొలకై  పైకి వస్తుంది.

   గొంతులో గూడు కట్టుకున్న గరళాన్ని దిగమింగు.
   గుండెలో ఆశల గూటిని కట్టుకుందాం.

   నీవు ఊగిన  ఉరికొయ్యని  నాగలి చేసి చూడు,
   అన్నదాతవై  అందరికీ   అన్నం పెడతావు. 

   పొలిమేరలపై   నీ  తమ్ముళ్ళ  పొలికేకలు చూడు,
   విత్తము కంటే విత్తు గొప్పదని చెప్పిచూడు.

   అమ్మ  రూపంలో ఉన్న అన్నవని తెలుస్తుంది,
   అన్నపూర్ణ గా  మరోమారు అవతారమెత్తిచూడు 

18 comments:

  1. రైతు కేక పెడుతూనే వున్నాడు, వినేవాళ్ళే కనపడటం లేదు. :(

    ReplyDelete
    Replies
    1. రైతు కేక ఆగిపోయిన నాడు మట్టికూడా మనమీద తిరగబడుతుంది సర్.

      Delete
  2. "కాలిన కలలు మరచి, రాలిన కంకులు ఏరుకుందాం. గుప్పెడు గింజల పలహారం చాలకపోతే గుక్కెడు నీటితో గొంతును తడుపుకుందాం. కరవురక్కసికాళ్ళు విరిచి, కలో,గంజో తాగుదాం. గొంతులో గరళాన్ని దిగమింగి. గుండెలో ఆశల గూడు కట్టుకుందాం.
    అప్పటివరకూ పొలిమేరల్లో ఆ పొలికేకలు విను, అమ్మ రూపంలోనో అన్నరూపం లోనో, మరోమారు అవతారమెత్తుదువు కాని."

    రైతన్నా మంచి రోజుల కోసం నిన్ను నీవు కొవ్వొత్తిని చేసి కరిగిపోతున్నావు అమ్మవై అన్నవై ....
    పొందికైన అక్షరాలు కవయిత్రి కలం నుంచి దూకి మీదిమీదికొస్తున్న భావన

    అభినందనలు ఫాతిమా జీ!

    ReplyDelete
    Replies
    1. రైతు మనకు అన్నం పెడుతున్నాడు అనే విషయాన్ని యావత్ప్రపంచం మరచిపోయింది. భవిషత్తులో రైతు పరిస్థితి ఎలా ఉన్నా ఆకలి కేకలు ఎలాఉంటాయో. ఇదే చంద్రగారూ నేను నిత్యం ఆలోచించేది.

      Delete
  3. హ్మ్మ్,
    రైతు పరిస్థితి ని బాగా తెలిపారు

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ హర్షా, రైతు బిడ్డలగా మనకు తెలుసు ఎండిన నేలా, పొంగే వరదా ఎలా ముంచుతుందో రైతును. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. కారు మబ్బులకై పరితపించి చూసే రోజు నీ జ్ఞాపకం రాదేవ్వరికి
    స్వేదాన్ని అన్నం గా మార్చే క్రమం లో పడే కష్టాన్ని నువ్వు పడుతూ ఉంటె
    నాగలి పట్టి జానెడు భూమిని దున్నుతున్న వేళా, ఎండలో ఎండి వానలో తడిసి నువ్వు నిలువెత్తున కడుపు మాడ్చి పండిస్తుంటే చాలీ చాలని మద్దతు ధర పాము కాటులా కాటేస్తుంటే అన్ని ఉన్న ఏమిలేని వాడివి మిగిలిపోతున్న ఓ రైతన్న రావాలి నీకు మంచికాలం

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారూ, మద్దతు దరవరకూ వచ్చారు మీరు, మొలకదశలోనే ఎండిన పైరు చూస్తూ రైతు కార్చే కన్నీరు ఏసీ రూముల్లో కూర్చుని రాయితీలు రచించే గొప్పవారికి తెలీదు. హరితవిప్లవం, హరితవిపలముగా మారింది, స్పందించిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  5. అమ్మ రూపంలో ఉన్న అన్నవని తెలుస్తుంది,
    అన్నపూర్ణ గా మరోమారు అవతారమెత్తిచూడు
    చావు నుంచి బతుకు వైపు నడిపించే
    ఆశావాదం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. సర్, ఈ ఆశావాదమే కరువౌతుంది రైతుకు నిరాశే మిగులుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మార్పులేదు కానీ అందరు పాలకులూ అన్నమే తినటం విశేషం.

      Delete
  6. "మట్టి పొరలకింద బంగారముంది,
    తట్టి చూడు చిరుమొలకై పైకి వస్తుంది."
    మంచి ఎక్స్‌ప్రెషన్! బాగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా కిషోర్ గారూ, మట్టిపొరలను చీల్చి ఎన్నో లాభాలు పొందుతున్నారు మరి విత్తుకై నేలతల్లి పులకించదా.

      Delete
  7. మట్టి పొరలకింద బంగారముంది,
    తట్టి చూడు చిరుమొలకై పైకి వస్తుంది.

    పొలిమేరలపై నీ తమ్ముళ్ళ పొలికేకలు చూడు,
    విత్తము కంటే విత్తు గొప్పదని చెప్పిచూడు.

    చాలా మంచి కవిత .... ఉన్నతముగా ఆలోచిస్తున్నారు ....
    మీరు క్రీస్తు పూర్వములోనివారా ?

    ReplyDelete
    Replies
    1. సాగర్ గారూ, నేను ఇప్పటి కాలము అయితే కాదు.
      మళ్ళీ పాత రోజులు వస్తాయనీ అన్నదాత అందరికీ అన్నము పెడతాడనీ నా ఆశ.

      Delete
  8. ఫాతిమా గారూ ! మీ బ్లాగు మొదటిసారి చూస్తున్నాను. కవితలు చాలా బాగున్నవి. ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అభినందనలు.

    కందము:
    సుమహారము కవితలదిది
    యమ హాయిగనుంది చదువ నాహాహా ! ఫా
    తిమగారూ ! మీ కవితల
    సుమ మాలోచింపజేయు చూడగ మదితో !

    ReplyDelete
    Replies
    1. గొప్పవారులిట
      కేదెంచుట మాకు దెచ్చు కడు ముదము
      అందుకే మేమంతా...ఎదురుచూచుట తద్యము.
      మా "కవి" తలలో..మేము ఉండ కోరెదము...
      సర్, మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete

  9. దుక్కి దున్నినా, పంట దక్కదు !
    వాన రానిదే, నారు మొలవదు !
    పంట దక్కినా, ధర దక్కదు ,
    గుంట నక్క దళారి ,
    చేస్తాడు, నీ జీవితం ఎడారి !
    నీ కళ్ళు ఎండుతాయి, తడారి !
    నమ్ముకున్న భూమిని అమ్ముకున్నా ,
    నీ కంచం లో మెతుకులు సున్నా !
    'శరాఘాతాలతో ' శల్యం అవుతున్న రైతన్నా !
    మోసాల విషాలు మింగుతున్న శివన్నా,
    నీ బాధ వినేదేవరన్నా !
    వదలి పోకు, నమ్ముకున్న నీ వారినన్నా !
    బలుసాకు తినవచ్చు, బ్రతికున్నా !
    నీ ఆశలు చిగురిస్తాయి, ఎప్పటికైనా !


    ReplyDelete
    Replies
    1. తప్పకుండా... మీ ఆశ్శీస్సులు తప్పకుండా రైతన్నకు వినిపిస్తాయి.
      సుధాకర్ గారూ నా కవితకన్నా మీ స్పందన బాగుంది. ధన్యవాదాలు.

      Delete