Pages

Friday, 22 September 2017

ఆశల ఉలినై.


ఆశల ఉలినై. 

ఓ చిన్న విరామం,
వేయివేదనలు మోసిన హ్రదయం,
రెండు వెచ్చటి కన్నీటి చుక్కల అనంతరం,
సుద్దీర్ఘ  నిట్టూర్పుతో ...,

ప్రతి క్షణమూ రగిలే పగల  నెగళ్ళూ ..,
ప్రతి కణమూ ఆక్రోశాన్ని దాచుకొన్న వైనాలూ ...,
సుదీర్ఘ  నిరాశతో ..... ,

ముక్కలైన చుక్కలన్నీ..., వెలివేసిన ఆకాశం వాకిట,
మబ్బుల  చాటున తలదాచుకోనిమ్మని ,
సుదీర్ఘ  శోకంతో ..... ,

సువిశాల ప్రపంచాన  మన చూపు మాత్రమే  సోకె  గవాక్షాన్ని,
అమర్చుకొన్న  మానవ నైజాన,

తాత్విక పునాదులవైపు దృష్టి సారిస్తూ... 
మార్మిక కామితాన్ని ఆహ్వానించే  జనసంద్రాన,

ఎంత తొలిచినా, ఒలిచినా ...పెచ్చులూడిపోయే...,
రాతి శిల్పం , ఓటి శిల్పం ...... ఈ  అస్థిర  హ్రదయం. 

Sunday, 11 June 2017

ఎవరైనా చూశారా ?


ఓ అధ్బుత మయూఖ శకలం ,

శూన్యపుదారుల్లో నడిచి వెళ్లింది ..,

సరిగమలు పలికిస్తూ వెళ్ళింది ,

మర్మరహిత మనోఫలకం పై ,

ఆత్మీయ మధుర సంతకమై .

తెగిపోయిన స్వర్గపు దారులను

వెన్నెల దారాలతో కలిపిన అద్వితీయ వారథి ..,

తొలకరి జల్లులో తడిచిన ఆరుద్ర పురుగు

పసితనపు పలవరింతల పచ్చిపాల నురుగు .

వెదురు వేణువు నుండి ...,

అల్లన ,మెల్లన సాగే ...అమర గానం ..

నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలైతే.
వేగు చుక్కయి సందించిన వింటి నారి నుండి .....

మింటి కెగిరిందేమో......మీరెవరైనా ..చూశారా..???


" నీ నేను "వెండిపంజరానికి అందం తెచ్చిన బంధీ నేను
పుత్తడి కత్తిపై నెత్తురులా పూసిన అత్తరు నేను ,
ఎన్నో అసాధారణ , నిరాధారణ వాక్యాల మద్య
అసంబద్ద కావ్యాన్ని నేను ,
ముంచెత్తే మానసిక కల్లం లో,
పలుకుల పరిగి ఏరుకునే పసిదాన్నే నేను,
నీకు తెలుసా
జీవితం అంటే ఏమిటో....?
కాలి గోటికి తగిలి ఎగిరపపడే గులకరాయి కాదు,

కొంగుకు కట్టుకున్న చెల్లని రూక కాదు ,

వశీకరణ ఒడిలోకి లాక్కునే చంచల వ్యామోహం కాదు ,

శిశిర వనాల పై వీచే...వడగాలి జీవితమంటే ,

కరకు చెరలను చేదించే కరవాలం జీవితమంటే ,

విషాదాన్ని తుడిచే వెన్నెల తుషారం జీవితమంటే ,

కామాన్నీ,భోగాన్నీ ఉసిగొలిపే వన్నెల విహారం జీవితమంటే ..,

నీకు తెలుసా..?

స్పృహనై ..

స్పూర్తినై ...,

స్పర్దనై... ,

స్పర్శనై.. ,

సాహసినై ..,

సహవాసినై ..,

సంతసం తో...సదా నీకై ...అద్దరిన వేచి ఉండే హిమాని నేను ,

జీవితానికీ..... జీవించటానికీ..,

భాష్యం చెప్పే ...నీ సహచరినే నేను

మెత్తని పూల బాటనై సాగిపోయే కాలాతీతం నేను ,

అచ్చ్హోట నీకై ప్రేమ ఫలాలను పరచిన శబరిని నేను,

అందరికీ అందని అద్దరిన ఉన్న అమృతాన్ని,

నీకై వేచిన హిమగిరిని నేను...,

Saturday, 23 April 2016
గిజిగాడు

కిటికీ ఊచలకు  తలవాల్చి ,
తలపులు తోడుకుంటున్న  వేళ,
కిటికీ  రెక్కలపై  వాలి  తన రెక్కలు  విదిల్చాడు,
నా  బంగారు  గిజిగాడు.

నిశ్శబ్దం లో  ఒదిగిపోయిన  నాపై,
తడి  రెక్కల  టప ,టపల  విదిలింపు తో,
చిరుతడి చేసి తమాషా  చూస్తాడు,
నా బంగరు  గిజిగాడు.

నా  తపస్సును  బంగం చేస్తూ,
నా సమాధిపై  నాట్యం చేస్తూ,
తమస్సు  నాకే వదలి   వెళ్ళిపోయాడు,
నా బంగారు  గిజిగాడు.


వెతికి,వెతికి అలసిన  నేను ,
ఆకసాన  కనిపిస్తాడనే ఆశతో....,
ఇంటికప్పునే  తీసేశాను.....,


ఓ  శుభోదయాన .......,

పచ్చటి  వేపమానుపై
అందంగా తానల్లుకున్న  గూటిలో,
భార్యా ,పిల్లలతో ఊయలలూగుతూ..,
నన్ను చూసి  గర్వంగా  మీసం  దువ్వి కన్ను గీటాడు,


 నేనూరుకున్నానా ....?
దోరగా నవ్వుతూ ..,
దోసిట  గింజలతో... ,
మరోమారు వాడి ముందు అమ్మలా అవతరించాను ...,

 

  

Monday, 14 December 2015

ఏకాంత శిల
ఏకాంత  శిల 

శబ్దాన్ని   మరచి చలనాన్ని  విడిచిన ,
అనిశ్చత ,అంధకార, నిరాకార ,ఆవాహన ,
ఉద్విగ్న  అక్షర ప్రియం ...,

వేన వేల భావాలకు   బాసటగా నిలిచినా ,
పదాల ,పెదాలపై ..పల్లవించే  తీయని  పరిమళాల,
హృది దోసిలి  నిండా  సజీవ  జ్ఞాపకాలు ...,


పారిజాతాలై  
మది  మందిరాన  రాలుతూ...   ,
మౌనాన్ని  తట్టి లేపి ,మాటను  పట్టి  తెచ్చి ,
మనస్సుకు  లిపి  నేర్పిన  సమయాన ..,

 ఏదో  రూపం ,మరేదో  మోహం...,
జీవన  గతిని  మార్చాలనీ,
అనివార్య ,నిర్వికారత ,విఘాత  తలపుల ,
వికృత  శాపమై ....,

నను  సుషిప్తిలోనికి  జార్చాలని ,
విశ్వ ప్రయత్నం చేసే ....  ఓ .... ఏకాంతమా...,ఉలిని  చేతబట్టి ..,
శిలను  చెలిగా  మలచిన ..,
మనోహరుని  సాన్నిహిత్యం ...,
నీకు  అల్విదా   పలుకుతుంది .... వినుమా... .,


Wednesday, 25 November 2015

ఓ సారి ఇటు చూడుఓ సారి   ఇటు  చూడు చందురూడా .... !
నీ సిరివెన్నెల   సిరులోలుకుతూ ..,
చిరుజల్లుల  మరులోలుకుతూ ..,
రేరాణి  మధుపర్కములను  తమీతో   తడుపుతూ ..,


కలువలరాయడా ...!
తారకలన్నీ దివి  తోరణాలై  వెలుగుతూ..,
మబ్బుల   సెజ్జపై  వెలుగులద్డుతూ..,
మింటి  ఇంటికి    ఇంద్రధనువు   గొళ్ళెం పెడుతూ ..,


రేరాజా...!
అనిలుని  కవ్వింతను  అనలముగా   తలంచుతూ..,
ఇనునికి,వారిజమునకూ  ఈర్ష్య  కలిగించుతూ.., 
మనో  మందిరాన  పూలశరాలను  సందించుతూ ...,
కలువభామ  ఆకసానికి  మేఘాల  మెట్లు కడుతున్నది   

Saturday, 22 August 2015

రంగులడబ్బా సరిజేసుకో బిడ్డా ....     
రంగులడబ్బా  సరిజేసుకో బిడ్డా ..... 

పొద్దుగాల నుండి  గా  రంగుల  డబ్బాలోకెల్లి ,
ఒకటే  ఒర్లుడు , పోరగాల్లు  తినేటివేన్దో   పాడయి  జచ్చినాయంట ,

అస్సలు  గీళ్ళకి  తెల్సా.. ..,
మా ఇంట్ల  పోరగాల్లకి  బువ్వ దొరుకుడే  కష్టం ,

గాయమ్మ   ఎవ్వరో   సిన్మాపోరినట  ఎవ్వనినో  ప్రేమించినదనీ... ,
పెళ్ళిలో  కెల్లి  పారిపోయినాదనీ .... ఒకటే    సూపెట్టుడే ,


కులపోల్ల    అదిలింపుల్లో ... ..పురుగుల మందు దాగి,
ఊరిపొలిమేరల్లో  పోయిన  మన   ఊరి పోరి  కనిపించలేదారా...? 

అరె  బస్టాపలకెల్లి    బద్మ్మాష్ గాళ్ళు ,
ఆడపోరిలను  ఆగమ్జేస్తుండ్రు   గదా...  గది  కన్పడదా.... ?

గాయనెవరో   పైదేశానికెల్లి    పైసలుబోసి  పొట్ట  మెలికలు  దిప్పుచ్చుకున్నాడంట ,
ఇక్కడ   కడుపుతోనున్న  ఆడకూతురు  ఆసుపత్రిబైటనే  పురుడుబోసుకొని  పీనిగయ్యింది,
గది కానొస్తలేదారా  మీకు ,

సూటూ  బూటూ   ఏసుకున్నోల్లనో,
సినిమా  హీరోలనో,
కాలేజీ పోరగాళ్ళనో,
సైబరు కేటుగాళ్లనో ,
షాపింగ్ బేరగాళ్లనో ,
దొంగనోట్ల  దొరగాల్లనో ,
కబ్జాల  గజ్జిగాల్లనో,
దొంగ బాబాగాల్లనో ,
రంగుటుంగరాల్లోల్లనో , కాదురా  మీ  ఇంటర్యూలతో   ఊదరగొట్టుడు....,

ఇల్లులేనోళ్లనీ,  కళ్ళులేనోళ్లనీ, రోగాలు  ముసురుకున్నోల్లనీ, మురికి  కాలువల్లో  కాపురమున్నోల్లనీ, దోమలతో దోస్తీజేసేటోల్లనీ, ముస్టోల్లనీ, కుస్టోల్లనీ,  అనాథలనీ, అన్నార్తులనీ ...ఇంటర్యూ  జేయండి ...., గాళ్ళ  లొల్లి  ఏందో   ఎల్లబెట్టుండ్రి . 

రంగుల డబ్బాకు   హంగులే   కాదు  ఆకలి    జూపించుడు  ఎప్పటికీ  తెల్వదా ???