Pages

Sunday, 30 December 2012

దాహార్తి
దాహార్తి 

దేహాన్ని మరచిపోయిన తలపులు.
గొంతును తడుపుకొనే పలుకులు.

మదిలో ఎగిసిపడే ఆవేశపు ఘోష,
గుండెలో మిడిసిపడే అబద్దపు శ్వాస.

తనువును  కాల్చేసే  భగ్న  హృదయం,
మనువును కూల్చేసే  నగ్న నిర్ణయం.

అస్థిర పయనంలో ఎరుగని  గమ్యం,
అబద్ద గమనంలో తరిగిన సత్యం.

నిర్జీవి  రాతిపై  చెక్కిన  వేదనా  శిల్పం.
సజీవ  సమాదిపై  చిక్కిన శిదిల శల్యం.

అన్వేషిత  హృదయం  నిత్య  దాహార్ది,
స్వర్ణశోభిత  సమయం  నిత్య ప్రేమాన్వేషి.....ఇదీ జీవితం. 

Saturday, 29 December 2012

ఇదీ జీవితం.

ఇదీ జీవితం. 


నిన్నటి అలలమీద ఎగసిన   విచిత్రం, 
నేడు   కలలలో  నిగూడ  చిత్రం.

ప్రతి   పలుకులోనూ  ఓ  ఒప్పందం,
ప్రతిరోజూ తొణికిసలాడే గాలి దీపం.

చలాకీగా సంద్రాన్ని ఈదటం  నైపుణ్యం.
ఆగని నావకు లంగరె  అనవసరం.

అవాస్తవ బాటని ఎన్నుకోవటమే శరణ్యం.
అందుకే దారంతా  ఒంటరి ప్రయాణం.

ప్రేమ నేర్పే  పలుకులే  మోసపు గుళికలు.
కానీ  కార్చే కన్నీరే కళ్ళకు  కొస మెరుపులు.

వేదనలో రోదనై  ఇంకిన రక్తపు కన్నీరు.
దేహమంతా పారదర్శకమై  పారుతుంది.

రంగును   కోల్పోయి  రాలిన   హరిత పత్రం.
హంగును కోల్పోయిన  చెల్లని హామీపత్రం. 


ఆక్రోశ, అసహనాల  అభ్య ర్దనల  మద్య, 
కాలం  వెంబడి వర్తమానమై  సాగిపో...ఇదే  జీవితం.

Monday, 24 December 2012

దగా గాడుదగా గాడు 

మనముందు  బిచ్చ మెత్తుతూనే.. 
మనకు  పచ్చనోటు  ఆశ  చూపేటోడు.

పల్లె  దీపాలని  ఆర్పేసి మనల్ని
కటిక  చూకట్లోకి  తోలేసేతోడు.

ముక్కిపోయిన దుడ్డు  బియ్యాన్ని 
మనకు ముష్టిగా  ఎసేటోడు.

సర్కారీ  కొలువులన్నీ చంకనెట్టుకొనేటోడు.
బాష  బాగాలేదని  బదనాం  చేసేటోడు.

బొంద  పెట్టటానికి  కూడా చందా అడిగేటోడు.
కమ్మగా మాట్లాడి  కళ్ళుగప్పె  కతర్నాకోడు.

కులచిచ్చు బెట్టి  కుమ్ములాటబెట్టేతోడు.
పొరగాళ్ళని  మట్టుబెట్టి  కళ్లజూసేటోడు.

శవాలమీద  చిల్లరేరుకొనే  చత్తగాడు.
సావుకబురు  మోసుకొచ్చే సోదిగాడు.

నిలెయ్యి  ఊరినడి బొడ్డున  నక్కజిత్తులోడిని.
పాతెయ్యి  పచ్చనోటితో  నినుకొంటానన్నోడిని.

Sunday, 23 December 2012

శ్వేత పత్రం

శ్వేత పత్రం


నా మది ఒక తెల్ల కాగితం.

నీ చేతి రాతతో  చలనం పొందింది.

నీ పదాలకు  పల్లకీ అయింది.

నీ ఊహలకు ఊపిరి పోసింది.

నీ భావాలకు భాండాగారం అయింది.

నీ చిలిపితనానికి  చిరునామా అయింది.

నీ విరహానికి విహంగం అయింది.

నీ సందేశానికి మేఘమైంది.

నీ కమ్మకి  కపోతం అయింది.

నీ ఆర్ద్రతకు  ఆలంబన అయింది.

నీ వేదనకు వేదిక అయింది.

నీ ప్రతి కదలికకు హంస తూలిక అయింది.

నీ ప్రతి స్పందనకూ  ప్రతిబింభమైంది.

నీ ఒంటరితనానికి  ఓదార్పు అయింది. 

నీ తుంటరి తనానికి ఆటవిడుపు అయింది.

నీ సంతకానికి సహవాసి అయింది.

నీ సంతోషానికి సహపంక్తి అయింది.

నీ సరసానికి కొలువుకూటం అయింది.

నీ నిరసనకు నిలువుటద్దం  అయింది.

నీ తలపుల  తడి ఇంకా ఆరకుంది.

నీ వలపు సిరా ఇంకా ఒలికే  ఉంది.
.

Thursday, 20 December 2012

మరో హింస.


మరో హింస.


జలగండం, పాము గండం, నా తద్దినం గండం, పిండాకూడు గండం అంటూ రక రకాల గండాలు విన్నా, కానీ ఈ టి.వి. గండం ఒకటి ఉందని జోతిష్యుడు  చెప్పే వరకూ నాకు తెలీదు. అదీ నాకే ఉండాలా? అందుకే ఆ దిక్కుమాలిన టి.వి. ని  తప్పించుకు తిరగడం. నేను ఇంట్లో ఉండేది ఆదివారం ఒక్కరోజే కనుక ఆ ఒక్క రోజు టి.వి పెట్టనని ఒట్టేయమని నా శ్రీమతి మాధవినడిగాను. కాస్త తటపటాయించినా, పసుపు కుంకాలతో వ్యవహారం కాబట్టి ఆవిడ సరేనని అన్యమనస్కంగానే ఒట్టేసింది.

ఆరోజు ఆదివారం.  నాకు ఆదివారం కాస్త  ఆలస్యంగా లేచి  ఏమాత్రం హడావిడి లేకుండా హాయిగా పేపర్ చదువు కుంటూ గడపటం చాలా ఇష్టం. కానీ ఆ రోజు పొద్దున్నే హడావిడిగా  నన్నూ పాపనీ, బాబునీ  నిద్రలేపెసింది  మా ఆవిడ.
ఏంటీ హడావిడీ? అన్నాను చిరాగ్గా. 
"ఏడిసి నట్లుంది...  మా అన్నయ్య వదినా వస్తున్నారని  చెప్పానా, లేవండి, లేచి తయారవ్వండి", అంటూ విసురుగా ఓ తోపు తోసి, ఒక్కచోట నిలవకుండా  హడావిడిగా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంది మా శ్రీమతి.

తన వదిన ముందు తాను ఏ విషయంలోనూ  తక్కువ కాకూడదని మాధవి ప్రయత్నం. అస్సలు విషయం చెప్పలేదు కదా! మా శ్రీమతి గారికి అన్నీ టి.వి. సీరియళ్ళలో  జరిగినట్లే జరగాలి. మా పిల్లలు అప్పుడప్పుడూ టి.వి. పిల్లల్లా ముదురు మాటలు మాట్లాడి వాళ్ళ అమ్మదగ్గర  మార్కులు కొట్ట్టేస్తూ ఉంటారనుకొండి.
మమ్మల్ని స్నానాలకి తోలేసి ఇల్లు సర్దటం  మొదలెట్టింది, అన్నీ కొత్త సామానులతో ఇల్లు ఎగ్జిబిషన్ లా ఉంది. నన్నూ బాబునీ టి.వి. సీరియల్లోలాగా సూటూ, బూటుతో  కట్టిపడేసింది. పాపకి  జుట్టు నిన్ననే కట్ చేయించేసింది. దానికి ఓ చిన్న మిడ్డీ  తొడిగి, తానూ ఓ మిడ్డీ.. ఛి.. ఛీ.. మిడ్డీ కాదు, జుట్టు విరబోసుకొని కొంత ముఖం మీద వేసుకొంది, చెప్పొద్దూ ఆ వేషం చూసి నాకు నవ్వొచ్చింది, నవ్వితే జరిగబోయే పరిణామాలు ఊహించుకుని నోరు మూసుక్కూర్చున్నా.

ఇంచుమించు మద్యాహ్నం  వరకూ ఎదురుచూస్తూ ఆ ఇరుకు బట్టల్లొ  ఇరుక్కుపొయాము. మా పిల్లలకి  మొఖాలు పదిసార్లు  కడిగి  పది సార్లు పౌడర్ వెసింది  మాదవి, వాళ్ళ  మొఖాలు  పాత ఇంటికి  సున్నం  కొట్టి నట్లు మరకలు, మరకలుగా ఉన్నాయి. 

సాయంకాలం  ఆరు  గంటలు. మూకుమ్మడిగా తయారై కూచున్నాం మేమంతా.  పెళ్ళిలో మా అత్తగారు పెట్ట్టిన బిగుతుగా వొంటికతుక్కుపోయిన  సూటూ, బూటూ లో ఇరుక్కుపోయి, మొఖానికి పౌడరు రాసుకుని  మూకాభినయ కళాకారుడిలా నేనూ,ఫస్ట్ బర్త్ డే  నాటి బట్టల్లో ఇరుక్కుపోయి "జగన్మోహిని" సినిమాలో పిల్ల రాక్షసుడిలా మా బాబూ తయారై ఉన్నాం. 

ఇంతలో వాళ్ళు రానే వచ్చారు. 
"ఆ... ఏం బావగారూ, బావున్నారా? కాస్త లావైనట్టున్నారే? హి .. హి .. హి ... " మా బామ్మర్ది పలకరింపు.

"అవున్రా, నీ బాబు సొమ్ము తిని లావయ్యాను" మనసులో అనుకుంటూ మొహమాటానికి హి..హి.. హి.. అంటూ నేనూ సకిలించాను.. సారీ.. ఇకిలించాను. చెప్పొద్దూ నాకు ఎవరైనా లావైయ్యారు అంటే తెగ కోపం వచ్చేస్తుంది.

"బావగారు సూట్లో బావున్నారు... అన్నట్టు ఇది మీ పెళ్ళిలో పెట్టిన సూటు కదండీ" బామ్మర్ది చురక.

బామ్మర్దికి తిరిగి చురక అంటించడానికి నోరు తెరవ బోయిన నేను "నోరు తెరవకండి"  అన్నట్టున్న మా శ్రీమతి హావ భావాన్ని గ్రహించి, బామ్మర్ది కుళ్ళు జోకు జీర్ణం చేసుకుని సైలెంట్ అయిపోయ్యా.

బిగుతు దుస్తుల్లో చిరాగ్గా ఉన్న నాకు "మల్లిక్" కార్టూన్లా ఉన్న మాధవి వాళ్ళన్నయ్యను చూసి కాస్త ఊరట కలిగింది. వాళ్ళు రావటం చూసినా ఆబిగుతైన బట్టలతో త్వరగా లేవలేకపోయాం. పాపకి జుట్టు ముఖం మీదికి  పడేట్టు దువ్విందేమో వాళ్ళమ్మ పాపం అది కళ్ళు కనిపించక   డోర్ మ్యాట్ తగిలి గడపలో పడింది. ఇక మాధవి వదిన అరవ యాంఖర్ లాగావిపరీతమైన  అలంకరణతో నల్ల కళ్ళజోడుతో  నానా అవస్తా పడుతూ గడపదాటబోయి  అప్పుడే బిగుతు ప్యాంటు సరిచేసుకొని లేవబోతున్న నా మీద తాటకిలా కూలింది.  మొదలే బక్కప్రాణిని, ఇంకేముందీ వెనకున్న సోఫాలో కూలబడ్డాను  ఆమెతో సహా. 

"అయ్యో, అయ్యో వదినా పడిపోయారా? అంటూ హడావిడి చేసిన మాధవి ఆమెను  లేపటానికి వాళ్ళ అన్నసాయం తీసుకుంటోంది. సరే ఆఘట్టం ఎలాగో  ముగిసింది.

కాసేపు పలకరింపుల ప్రాయోజిత కార్యక్రమం  అయ్యాక  టిఫిన్ల  కార్యక్రమం  మొదలెట్టింది మాధవి. ఆకలి దంచేస్తుంటే (బట్టలు  పాడు చెసుకుంటామని మద్యాహ్న బొజన పదకం  రద్దయింది) హదావిడిగా  లేచాను. నా వెనుక బిగుతు బట్టల్లో మా వాడు నా షర్ట్ పట్టుకు లాగాడు,  నాకు పిచ్చి కోపం వచ్చింది  కానీ తమాయించుకొని, ఎంటినాన్నా  కంఫర్ట్ గా లేదా అన్నాను, కాదు నాన్నా వెనుక మీ పాంట్ చిరిగిపోయింది అని చిరుగు కబురు  "ఛిల్డ్"  గా చెప్పాడు. నా గుండె జల్లుమంది. ఇప్పుడు ఈవిడ  చూడకుండా ఎలాగో బెడ్ రూమ్ వరకూ వెళ్ళగలిగితే  చాలు అనుకుంటూ వెనుక బాగం కనిపించకుండా  ఓ తువ్వాలు చుట్టుకొని  ఎలాగో జారుకోబోతున్నాను  అంతే.. వంటింట్లో నుండి ఎప్పుడొచ్చిందో  మాధవి  ఒక్క ఉదుటన తువ్వాలు లాగేసి, చేతులు తుడుచుకోండి  వదినా అంటూ మీరూ  రండి త్వరగా అని నన్ను ఓ గుంజు గుంజింది. ఆ గుంజుడికి పంట్లాం ఇంకొంచం  చిరిగింది. అయితే చటుక్కున కుర్చీ లాగి ఆ  చప్పుడులో  పంట్లాం చిరిగిన చప్పుడు కలిసిపోయేలా మ్యానేజ్ చేశాను. మా వాడు  నా సమయానుకూలమైన తెలివితేటలకు ఓ ఆస్కార్ అవార్డ్ గ్రహీతను చూసినట్టు ఆరాధనగా చూసాడు. ఎట్టకేలకు వాళ్ళ కంట నా చిరుగు కనపడకుండా  టిఫిన్ కార్యక్రమం ప్రారంబించాను. 

"అయ్యో అయ్యో  ఎవరన్నా టి.వి. పెట్టండీ"  టిఫిన్ చేస్తున్న మాధవి వదిన గారు  ఒక్కసారిగా గంగవెర్రులెత్తినట్లు   అని గుండెలవిసేలా ఓ పొలికేక పెట్టింది.  
నాకు  పోలమారి తింటున్న ఇడ్లీ  అందరి ముఖాలపైకీ స్ప్రే  చేసినట్లు పడింది.
సారీ.. సారీ. అంటూ లేవబోయాను. 
ఒక్కసారిగా చిరుగు చింత నన్ను లేవనియ్యలేదు, సిగ్గుతో కూర్చుండిపోయాను. అవేమీ పట్టించుకోని మహిళా మణులు  టి.వి.కి  కళ్ళు అప్పగించేశారు. నా పరిస్తితి ఇరకాటాన పడింది. చచ్చినట్లు టి.వి. కి బలయ్యాను.

ఏదో తెలుగు ధారావాహికం వస్తుంది."శ్రీ నిలయం" ఆడవాళ్ళందరూ వంటింట్లో కూడా పట్టుచీరలతో ధగ ధగా నగలతో మెరిసిపోతున్నారు.  ఓ పెద్దావిడ ఏదో తెలుగులాంటి బాషలో ( తెలుగే) భారీ డైలాగులు చెప్తుంది.

ఎవంషీ..నా మాంగల్యం  కోసం ఏమైనా చేస్తాను  అంటూ సెల్ తీసి నంబర్  నోక్కకుండానే ఎవరెవరికో పోన్లు చేసి తలా ఒక కోటి ఇస్తానని తన భర్తను పట్టుకొని వదలకుండా ఉండే అవతలిఆడ శాల్తీని మట్టు పెట్టమనీ గాండ్రించింది, సారీ.. హుంకరించింది.

సదరు భర్తగారు మాత్రం దిగులుగా సూటూ, బూటు లో (పసుపు రంగు ) ఒక్కోవేలికి నాలుగేసి ఉంగరాలతో కూర్చుని ఉన్నాడు.  ఇంతలో అవతలి    మహిళ ని  చూడాలి  ఆడ బీష్మునిలా  ఉంది. పగలైనా నల్ల కళ్ళజోడుతో. అప్పుడు అర్దమైంది నాకు మాధవి వదిన  ఎందుకు నల్ల కళ్ళజోడు పెట్టుకుందో.  ఇంట్లో కూడా  హై హీల్ చెప్పులు వేసుకొని అసహనంగా తిరుగుతుంది.

"ఎయ్, నేను పదికోట్లు ఎడం చేత్తో పడేస్తానే  నీ మొగుడు పరిగెత్ట్టుకొంటూ వస్తాడే" అవునూ కుడిచేతికి ఎమైందా అని చూసాను, బహుసా సెల్ ఉంది కదా అందుకేమో.. మొత్తం మీద  ఆ హింస అయిపొయింది, ఏదో పిల్లల ప్రోగ్రాం వస్తుంది. అమ్మయ్య బతికాను అనుకున్నాను.

చిన్న చిన్న పిల్లలు పీలికల్లాంటి బట్టలు కట్టుకొని డ్యూయట్లు పాడుతూ తెగ మెలికలు తిరుగుతున్నారు. జడ్జి గారు "చింపేసారు" అని  పేపర్ చింపి తన అభిప్రాయాన్ని చెప్పేశారు.

"ఏమి సేస్తిరి, నాన్ దా  రొంబ సంతోషంపుడిస్తిని. డార్లింగ్ నీకు దా మంచి ఫ్యూచర్ ఉంది" అన్నాడు గారపళ్ళు మొత్తం బైట పెట్టి. ఫ్యూచర్ లో ఇంకా చాలా మందిని చంపుకోవచ్చని ఆ పిల్ల ఒక్క గెంతు గెంతి కింద పడి తన  సంతోషం తెలియ జేసింది.... ఇలా నరకం నిరంతరాయంగా సాగుతుండగా కరంట్ పోయింది .

ఆహా.. ఏమి నా భాగ్యం.   నా సంతోషం అంతా ఇంతా కాదు.. యురేకా అని అరిచాను... ఎందుకో మీకు తెలుసు కదా చిరుగు కనిపించకుండా బెడ్ రూం లోకి  వేల్లోచ్చోచ్..

అయ్యో భలే గుర్తుచేశారు ఇప్పుడు "యురేకా" తో ఇంటర్యూ ఉందండీ ఆమె 10,000 ఎపిసోడ్స్ పూర్తి  చేసినందుకు.. అయ్యో ఈ దరిద్రపు కరంట్ ఇప్పుడే పోవాలా... అయ్యో ఎక్కడున్నారండీ కరంట్ వాళ్ళకి  ఫోన్ చేయండీ, చిందులు తొక్కింది మాధవి. నేను చీకట్లోనే వెళ్లి   అల్మారీలో లుంగీ తీసుకొని దానిలోదూరిపోయి  ఇదిగో వెళ్తున్నా అంటూ హడావిడిగా బైటికి వెళ్లాను. వీదిలో చీకట్లో నడుస్తున్నా  ఎందుకో అడుగులు సరిగా పడటం లేదు, వెనుక నా సుపుత్రుడు వస్తున్నాడు. "నువ్వేక్కడికిరా చీకటిలో" అన్నాను.

నేను " షవర్ చెంజస్ " చూడాలి అందుకే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా " అన్నాడు. అప్పటికి కరంట్ వస్తుంది కదా  అన్నాను అసహనంగా. వచ్చినా తన టి.వి. లోనే చూడాలి  అన్నాడు. "ఏం మన టి.వి. కంటే బాగుంటుందా, వేలు పోసి కొనిపించారు కదరా!  ఇప్పుడు పనికి రావట్లేదా? చిరాగ్గా అన్నాను, మొదలే లుంగీ చిన్నదైందో.. లేక నేను లావయ్యానో నడవటానికే ఇబ్బందిగా ఉంది...

"అబ్బా  డాడీ మీకేమీ తెలీదు  "తన" అనేది ఓ చానల్ పేరు. మన పాల అంకుల్ బెటర్  రోజూ నేను చూడకున్నా ఏం జరిగిందో చెప్తాడు. అన్నాడు. మొదటి సారిగా థూ .. నాదీ ఒక బతుకేనా అనిపించి, అప్పుడర్థమయ్యింది, ఓ సినిమాలో రవి తేజ అద్దంలో చూసుకుని తన మొఖంపై తనే ఎందుకు ఊసుకుంటాడో.  సివిల్స్  పాసయ్యి  పెద్ద ఆఫీసర్  పోస్ట్ లో ఉన్నా కూడా .. పాలవాడికి ఉన్న నాలెడ్జ్  లేదనిపించుకున్నాను.

"డాడీ" గాట్టిగా  అరిచాడు  మావాడు. వీది  మలుపులో స్ట్రీట్ లైట్  కిందకి వచ్చాము.
ఏమైందిరా ?  చిరాగ్గా అన్నాను.

"డాడీ  మీ లంగా ? నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని  ముసి.ముసి గా నవ్వుతూ అన్నాడు. లుంగీ చూసుకున్న నాకు  గుండె ఆగినంత  పనైంది, ఇప్పటికే మీరు ఊహించి ఉంటారు, అయ్య బాబోయ్.. నేను కట్టుకుంది  మా ఆవిడ  లంగా, లుంగీ కుట్టి కట్టుకొనే అలవాటు  వల్ల తేడా తెలీలేదు. అరె ఇప్పుడు ఇంటికి వెళ్ళ లేను, కరంటు వాణ్ణి కలవ లేను. ఆ...  ఐడియా..  బాబుని పంపి లుంగీ తెప్పించుకుంటా, అనుకుంటూ వెనక్కి తిరిగానా...  మావాడు ఎప్పుడో పలాయనంచిత్తగించాడు. ఖర్మ, ఏదీ మన చేతిలో లేదు అని వేదాంతం వల్లించుకుంటూ నిర్వికారంగా వెనక కుక్కలరుస్తుండగా, ఇంటివైపు బయల్దేరాను.

                                                *  *  *


Tuesday, 18 December 2012

పొగచూరు బతుకులు.పొగచూరు బతుకులు. 

వింటావా  దుర్బర దారిద్య వాతపడ్డ  ఆకలి కేకలు.
చూస్తావా గూడులేని రోడ్డు బతుకులు.

వింటావా  ఆకలి పేగుల ఆగని  కేకలు.,
చూస్తావా చెత్తకుప్పలలో ఏరుకు  తినే ఎంగిలి ఆకులు.

అటు చూడు  ఓ చెల్లి చిరుగుల చీరలో సిగ్గుతో చితికిపోతుంది.
ఇటు చూడు ఓ తల్లి  ఊపిరితిత్తుల్లో గాలిని బిడ్డ పుండుపై ఊదుతుంది.

ఇదిగో ఈ బుజ్జిముండ చూడు ఆరిపోయిన  ఐసు పుల్ల చీకుతుంది.
అదిగో ఆ బుడ్డోడు చూడు ఆగిన బండ్లు తుడిచి  అడుక్కుంటున్నాడు.

ఇక్కడ చూడు  దొరలు తాగేసిన ఖాళీ సీసాలకోసం  యుద్ధం తీరు,
అయ్యో అక్కడ చూడు ఇసిరిపారెసిన  ఎంగిలాకుల కోసం  జరిగే పోరు.

అక్కడ చెత్త కుండీ వెనుక చూడు  రేపటి పౌరులు  కనిపిస్తారు.
అక్కడ చెట్టు కింద చూడు దిక్కులేని వృద్దులు  కనిపిస్తారు. 

నిబద్దతలేని  జీవితాలు, తెగిన గాలిపటాలు.
అంతటా  పొగచూరిన బతుకులే, వెలుగులేని చీకటి బతుకులే..


గాడితప్పిన  ఈ  బడుగు బండిని  దారిలో పెడదాం.

శ్రమ జీవుల  స్వేదాన్ని   దోచేసే  ధనజీవులను ఎండగడదాం.

అశ్లీలపు చూపులనుండి  అక్కచెల్లెళ్ళకు రక్షణనిద్దాం.

చదువుకునే   తమ్ముళ్ళ కు  సాయమందిద్దాం.

చేయి, చేయి కలిపి  చెలిమి బాట వేద్దాం.

ఆత్మీయతనే అక్షయ పాత్ర చేద్దాం.

మనుషులమని మరోమారు  చాటుకుందాం.


Sunday, 16 December 2012

కన్నీటి తోడు.కన్నీటి తోడు. 

గాలివానకు కుప్పకూలిన పంటను చూసి ,
పేద రైతు  గుండెపగిలినప్ప్పుడు.

కన్నకూతురు కాలి బూడిదైన వార్త,
అమ్మానాన్నలు  విన్నప్పుడు.

నిస్సహాయురాలైన అంధురాలిని,
కామందులు కాటువేసినప్పుడు,

కట్ట్టినవాడే తాళిని ఎగతాళి చేసి,
ఇల్లాలిని వెళ్ళగొట్టినప్పుడు.

నచ్చిన వారు పరాయివారిలా ,
పరామర్శించినప్పుడు.

దూరతీరాలకెళ్ళిన  ఆత్మీయులు,
విగతజీవులై ఇల్లు చేరినప్పుడు.

కలల పంట అనుకున్న బిడ్డడు,
వికలాంగుడుగా జన్మించినప్పుడు.

మొర  ఆలకించమని మొండిచేతులతో,
దేవుని  వేడుకొంటున్నపుడు. 

నివురుగప్పిన  దిగులు తెరలు,
కళ్ళను  స్పర్శించినప్పుడు.

వేదనకు  వీడ్కోలు చెప్పే,
అమృత కలశాలు  నీ కన్నీళ్లు.

నిన్ను ఓదార్చే ఆత్మీయ హస్తాలు,
ఈ కన్నీటి నేస్తాలు నీకు మరపు మందులు.


కవితాసుమహారం లో నూరో  సుమం  మీ ముందుంచుతున్నాను.


నా వందో  కవితను  మీ ముందు ఉంచేందుకు సాహసించాను. చాలా సంతోషంగా ఉంది.
ఇంతవరకూ నా ప్రతి కవితనూ,చదివి,విశ్లేషించి, విమర్శించి, మెచ్చుకొని, నొచ్చుకొని  నన్ను ఓ కవయిత్రిగా  గుర్తించిన మిత్రులకూ, నన్ను ఆశీర్వదించిన  అక్షర గురువులు  శ్రీగంగ గారికి, లక్కాకుల రాజారావ్ గారికి, కష్టేఫలిగారికి, గోపాలకృష్ణ గార్లకు, ఈ బ్లాగ్ పలకని నా కిచ్చి  నా కవితలను  రాసుకోమన్న మా శ్రీ వారికి, నా కృతజ్ఞతలు.
                                                          మెరాజ్ ఫాతిమా.Thursday, 13 December 2012

శాపగ్రస్త

శాపగ్రస్త.


క్షణకాలమే  నేను నిన్ను చూసింది,
సాటి బాట సారిగా,

ఇద్దరిచూపులు కలసింది క్షణమే ,

వేటాడే నీచూపులు నేను మరచిపోను

నీ కళ్ళలో ఏమిటా భావం,

నిన్నెలా అడిగితెలుసుకోను?

ఎర్రటెండలో ఎర్రమందారంలా నీవు.

మంచులో మల్లెపూవులా నేను.

కాలినడకన నీవు, కారులో నేను.

వెన్నెల సోయగాల సౌధంలో నేను,

కూలిపోయే గుడిసెలో నీవు,

నా దాహం తీర్చటానికి,

నీ చేతిలోని నారికేళ విన్యాసం,

నీ  కళాత్మకతను చాటింది.

నా వేళ్ళ మద్య నిర్లక్ష్యంగా ఎగిరే పదినోటు,

నీ చూపుకి  సిగ్గుతో ఒదిగిపోయింది. 

నా కారు ముందు నడి  ఎండలో నడిచే నీవు,

సగం ప్రపంచాన్ని వెనక్కి నెడుతున్నావు.

గుక్కపెట్టే నా బిడ్డని సముదాయించలేకుంటే ,

చొరవ చూపి నువ్వు నా బిడ్డను తీసుకున్నావు, 


నన్ను, నీవు చూసిన చూపు 

నేను మరచిపోలేను.


ఏ డబ్బూ, ఏ దర్పమూ, తీర్చలేని  

నా బిడ్డ దాహం, నా బిడ్డ ప్రాణం, 

స్తన్యమిచ్చిన  నీ అమ్మతనం ఆదుకుంది.

నా  నాగరికత సిగ్గుతో నన్ను వెక్కిరించింది.

ఈ సారి వంద నోటు నీ చూపుకి చిన్నబోయింది.

నీ కంటి అద్దమందు నేను  మరోమారు, 

పగిలిన అద్దంలో అనాకారి ప్రతిబింబాన్నయ్యాను   

నేను శిల్పినై ,నిన్ను శిలను చేసి , 

నీ జీవితం పై  నేను పయనిస్తున్నాను.

నీ సమాదిపై  నా పునాది వేసుకుంటున్నాను.

కానీ, నీ మానవత  ముందు...ప్రతి సారీ తలవంచుతున్నాను.

ఆవేదనఆవేదన 

మా ఇంట్లో నేను ఆరో ఆడ  సంతానం, మా  ఇంటిని చుట్టేసుకుని ఉన్న చుట్టం గరీబీ. నాకు చదువంటే చాలా ఇష్టం. అక్కల చదువులు  అలీఫ్ ..బె ., దగ్గరే ఆగిపోయినా,  నా చదువు మాత్రం ఏడో  తరగతి వరకూ సాగింది. అబ్బాజాన్ కు  తన కుట్టు మిషనే ప్రపంచం.   నమాజుకు మజీదుకు వెళ్ళడం కోసం తప్ప వీధి ముఖం  ఎరుగడు, కుట్టు మిషను  తనతోనే పుట్టినట్లు భావిస్తాడు. తలకి మించిన భారమైనా ఊరిబట్టలన్నీ  తీసుకొని రాత్రి పగలూ కుడుతుంటాడు. ఆయన కుట్టే రంగు, రంగుల బట్టలు చూస్తుంటే  అవి మా వంటి మీద ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్ళం. అవి కుట్టిన తర్వాత ఎదో వంకతో మా వయస్సు వారైతే ఆల్తీ చూసినట్లుగా మమ్మల్నిఆ బట్టల్లో   కాసేపు చూసుకొనే వారాయన.  రంజాన్ పండక్కి  అమ్మిజాన్ మా కోసం కొనే సరుకులు చూడటం కోసం  అందరంచుట్టూ మూగే వాళ్ళం. మా పెద్దక్క మాత్రం  అన్నీ మాకోసం త్యాగం చేసేది, వంటిల్లు గడప దాటి ఎరుగదు. ఐదుపూటలా అల్లాను  తలవటం. అబ్బాజాన్ కి కలాం షరీఫ్ (ఖురాన్ గ్రంధం)  చదివి  వినిపించటం ఆమెకి నచ్చిన/వచ్చిన పనులు.దాదీ చెప్పే కధల్లో "పరీ" (ఫెయిరీ) ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకెప్పుడూ. ఆఖరి చేల్లినైన నేనంటే అక్కకి ప్రాణం. మిషన్ దగ్గరి బట్ట ముక్కలతో రంగు రంగుల రిబ్బన్లు చేసి నాకు జడలు వేసేది. నా చిట్టి అరిచేతుల్లో పండిన గోరింటాకును చూసి మురిసి పోయేది.

* * *

ఆ రోజు రంజాన్ పండుగ రోజు. నేను ఆటలతో అలసిపోయి ఇంటికొచ్చాను. ముందు గదిలో ఇద్దరు ముగ్గురు మొగవాళ్ళు, వారి మధ్యలో ఇస్త్రీ చేసిన తెల్లటి కుర్తా పైజామా, టోపీతో అబ్బా జాన్ కూచుని ఉన్నారు. పెరటి తోవనుంది వంటింట్లోకి చేరాను. ఇల్లంతా అత్తరు వాసన. అబ్బాజాన్ పక్కన తెల్లటి గడ్డంతో,  "త్వాబ్" మరియు  "ఇగల్" ధరించి  (అరబ్బులు ధరించే సాంప్రదాయాక అంగ వస్త్రం మరియు తలపై ధరించే వస్త్రం) తెల్ల్లటి ఓ ముసలాయన. వాళ్ళను చూస్తూ వంటింట్లోకి వెళ్లాను. వంటింట్లో పళ్ళాల నిండా మిఠాయిలు ఉన్నాయి. ఆపాజాన్ (పెద్దక్క) శుబ్రమైన బట్టాల్లో ఓ మూల కూర్చుని వుంది. నేను అక్క ముఖం వంక చూసాను. ఎదురుగా బొలెడన్ని మిఠాయిలున్నా మంచి బట్టలు కట్టుకున్నా అక్క ముఖాన నవ్వు లేదు. అమ్మీజాన్ ఓ నడి వయసు ఆవిడతో  మాట్లాడుతూ ఉంది. నాకు కొంత వింతగా అనిపించినా మిఠాయి చేతికోస్తూనే తుర్రుమనబోయాను. ఆ పెద్దావిడ నన్ను దొరకబుచ్చుకుని ఏమే మున్నీ! నువ్వూ  ఎక్కుతావా విమానం మీ అక్కతో అంది. నా కళ్ళు మెరిసాయి. ఓ, మా ఆపాజాన్ ఎక్కడుంటే నేనూ  అక్కడే అన్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది  ఆపాజాన్  ని "అల్మాస్ బిన్ సులేమాన్" అనే పేరు గల ఆ ముసలి అరబ్బు షెకుకిచ్చి  పెళ్లి చేసారని.

* * *

ఐదేళ్ళకోసారి ఆపాజాన్  వసంతంలా  వచ్చేది. మెరిసిపోయే అక్కని చూసి మురిసి పోయే వాళ్లం. ఆపాజాన్ తెచ్చిన కానుకలతో మా ఇల్లు కళ కళ లాడేది. మా ఇంట్లో గరీబీని అక్క కొంత తరిమేసింది. అక్క సాయం తోనే  మిగతా అక్కలందరూ అత్తవారింటికి వెళ్లారు. కానీ నాకు మాత్రం ఎదో అనుమానం. అక్క మొఖంలో ఎదో వెలితి కనిపించేది.  ఎవరు లేని సమయంలో అమ్మ, అక్క ఒకర్నొకరు పట్టుకుని ఏడవటం నా దృష్టిని దాటి పోలేదు. మొత్తం మీద ఆపాజాన్ జీవితం సాఫీగా సాగిపోవటం లేదని నాకు అర్థం అయ్యింది. నా చిన్ని బుర్రకి పరిష్కారం తట్టేది కాదు. ఆపాజాన్ ఉన్నన్ని నాళ్లు  ఈద్ (పండగ) లాగా ఉండేది. ఆమె వెళ్తుంటే వసంతంవెళ్ళిపోతున్నట్టు అనిపించేది.

***

ఆఖరి అక్క పెళ్ళిలో ఆపాజాన్ ప్రస్తావన వచ్చింది. ముసలి షేకు అల్మాస్ ఓ శాడిస్టు అని ఆపాజాన్ నానా హింసలు పెడతాడని, అయినా సరే డబ్బుకోసం అఖ్తర్ సాయిబు, కూతుర్ని అమ్ముకున్నాడని తూలనాడారు. అన్నీ తెలిసినా కూతురు మీద ప్రేమ కంటే ఆకలి, బీదరికమే జయించింది అమ్మీ అబ్బాని. అక్క పంపే రక్తం అంటిన రంగు కాయితాలు మా ఇంట రుమాలి రోటీలయ్యేయి.
***

ఆ రోజు చాలా మన్హూస్ రోజు. అక్క బదులుగా ఓ పెద్ద చెక్క పెట్టె వచ్చింది.  మా అక్క మొఖం చూపకుండా కఫన్ కప్పుకుని వుంది. నా గుండె పగిలింది, మా గూడు చెదిరింది. ఆ దుర్మార్గుడు అక్కకి కఫన్ కానుకగా ఇచ్చి దఫన్ చేయమని మాకు పంపించాడు. పరామర్శించడానికి వచ్చిన పెద్దలందరూ తలో రకంగా విమర్శలు, సానుభూతీ ప్రదర్శిస్తున్నారు.
***

కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది అంటారు, కానీ అన్ని గాయాల్నీ మాన్పే  కాలం  నా గుండెకు మరో  గాయాన్ని చేస్తుందని నేనూహించలేదు. మరోమారు గరీబీ జయించి అక్క స్థానంలో నన్ను కూచోబెట్టింది. నా రోదన అరణ్య రోదనే అయ్యింది. ఆడ పిల్లని, పైగా బీద పిల్లని ఎవరు ఆదుకుంటారు ఈ దేశంలో. బీదరికానికి తలవంచాను. నా నికాః-  పెళ్ళికొడుకు షేకు లేకుండానే ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు సాక్షుల సమక్షంలో జరిగింది. నా అసమ్మతికి  ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. పెళ్ళంటే ఎన్నో ఊహించుకుంటుంది ప్రతి ఆడపిల్ల, కాబోయే పతి  తనను  ఏంటో అపురూపంగా చూసుకుంటాడని ఆశ పడుతుంది. నలుగురు స్నేహితురాళ్ళు హాస్యాలాడుతుంటే  సిగ్గుల మొగ్గ్గై తన వైవాహిక జీవితం ప్రారంబిస్తుంది ప్రతి ఆడపిల్లా.. అలాంటి అనుభూతి నోచుకోని నా దురదృష్టం  నన్ను వెక్కిరించింది.ఆకలి  పోరాటంలో  ఓడిపోతూ   భారమైన హృదయంతో అసహ్యం, అసహనంతో, కోపంతో విమానం ఎక్కాను.
***

అప్పుడు తెలిసింది నాకు అక్క దుఖానికి కారణం. ఆమె ఒక నరరూప రాక్షసుడితో కాపురం చేసిందని. అక్కడున్నన్ని రోజులూ నరకమంటే ఏమిటో, అవమానం అంటే ఏమిటో తెలిసింది.మూడుపూటలా తిండి దొరికిందని సంతోషించాను, అందరినీ వదులుకొని దేశం కాని దేశాన ఈ దుర్మార్గుడి రాక్ష క్రీడలో పావునై  నలిగి పోతున్నందుకు  నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను.  నేనక్కడ ఓ యంత్రంలా చూడబడ్డానే  గాని మనిషిలా కాదు. ఏ చట్టాలూ,  ఏ మానవ హక్కులు నన్నాదుకోవడానికి రాలేదు. ఆ నరకం లో నిస్సహాయంగా ఒక సంవత్సరం గడచింది.

***

ఎన్నో రోజులు ఆ నరకంలో గడిపాక అల్మాస్ నన్ను అమ్మీ జాన్, అబ్బా జాన్ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు నాకింకా గుర్తే, అమ్మ ఒళ్లో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను.మరోమారు అమ్మ  పెద్దక్కని  తలచుకొని గుండె పగిలేలా ఏడిచింది, అమ్మ వడిలో సేదతీరిన నేను,  నిశ్చయించుకున్నాను ఇక ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళకూడదని. బాగా అలోచించి నిశ్చయించుకున్నాను ఆ  రాక్షసుడికి "ఖుల" (ఇస్లాం లో స్త్రీ తరపునుంచి ఇచ్చే విడాకులు) ఇవ్వాలని. ఐతే  "ఖుల" ఇవ్వాలంటే వరుడు ఇచ్చిన "మహార్"  సొమ్ము (వరుడు వధువుకు వివాహ సమయంలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన డబ్బు లేక వస్తువులు) తిరిగి ఇవ్వాలి. నిఖానామా (వివాహ ప్రమాణ పత్రం) చూస్తే అందులో  "మహార్" వెయ్యి దీనార్లు గా రాసి వుంది, అంటే మన విలువలో ఐదు వేలు. వెంటనే నా చిన్ననాటి స్నేహితురాలైన వకీలు కౌసర్ సాయంతో  ఐదు వేలు  "మహార్" సొమ్ము ఆ రాక్షసుడి అకౌంట్లో వేసి ఇంటర్నెట్ ద్వారా  ఆ రాక్షసుడికి   ఇచ్చాను" ఖుల "  ఖుల్లం  ఖుల్లా.
***
మనసుకు ప్రశాంతంగా ఉంది. కానీ ఎదో అసంతృప్తి... ఎందుకిలా జరుగుతుంది? ఇలా ఎంతమంది ఆడ పిల్లలు బలైపోతున్నారు? తప్పెవరిది? వ్యక్తులదా, వ్యవస్థదా?  అసలు సమస్య బీదరికమా? బీదరికానికి కారణం? అధిక సంతానమా? చదువూ సంధ్యా లేని నా చిన్ని బుర్రకు అర్థమౌతోంది... దేశ సామాజిక సమస్యల్లో చాలా వరకు సమస్యలకు అధిక జనాభాయే కారణం అని . అయితే సర్కారు ఎందుకు ఈ సమస్య పై దృష్టి సారించదు. ఎందుకు  ప్రజల్లో, ముఖ్యంగా అవగాహన లేని వర్గాల్లో, అవగాహన కల్గించే ప్రయత్నం చేయదు? ఏమో...Tuesday, 11 December 2012

తేనెల మూట


నీ మాట  తేనెల ఊట,
నువ్వో  మమతల తోట, 
నా జీవన గమ్యానికి పూలబాట,
బుద్దూ.. అని పిలిస్తే.. ఊ...అంటూ వస్తావు.
వెళ్ళూ..అంటే వెక్కిరిస్తావు.
నీతో ఎన్ని సాంగత్యపు  శుభదినాలో..
ఎన్ని కమ్మని మాటల గారాలో.. 
ఏమైనా రాదామంటే, నా  కన్నా
ముందే చేరిపోతావ్,
పోనీ నువ్వు చెప్పిందే రాద్దామంటే,
మూతి గుండ్రంగా పెట్టి  దూ..జూ.. అంటావ్.
లాచావా... అని కళ్ళు ఎగరేస్తావ్.

బుద్దూ..

నీవు నా ఆశల రెక్కల హంసవు.
నా కన్నుల మిన్నవి,
నా కలల చిట్టి రాకుమారునివి.
ఛిమ్మ చీకట్లోనూ  నీ చిరునవ్వే,
చందమామలోనూ  నా నువ్వే,

కన్నా..
నా కళ్ళజోడు దాచేసి,అల్లరిచేస్తావ్,
నీ చిన్ని స్వెటర్లో నన్ను వెచ్చబెడతావ్,
నూరేళ్ళ నీ జీవితాన,
నిత్యవసంతం విరియాలి.
అందనంత  దూరం వెళ్ళకు,
ముద్దుగా పిలిచే నీ పిలుపులో,
వేల బంధాలను వెతుక్కొనే,
మీ అమ్మ కే అమ్మను నేను.
Sunday, 9 December 2012

అర్జీఅర్జీ 

నింపలేకపోయింది మా పొట్ట, చేతికందిన పట్టా,
దరఖాస్తు చేసుకున్న కొలువు అడిగింది నోట్ల కట్ట.


నిస్సహాయపు జిందగీ, అసహాయపు బందగీ,
చుట్టాల వెక్కిరిపులూ, నిరసన చూపులూ.

బేకారుగాడు, బేవార్సు గాడూ అనే నీచులూ,
అరిగిన చెప్పులకు అతుకువేసుకుంటాననీ,
చిరిగిన టోపీకి పడిన చిల్లులు కుట్టుకుంటాననీ,
గల్లీ, గల్లీ నను చూసి వేసుకునే జోకులూ.

అప్పిచ్చిన పహిల్వాన్ల ఆగడాలూ,
ఆదీ అంతం లేని ఆలోచనలూ,
వడ్డీపై వడ్డీ, వడ్డించిన వడ్డనలూ.

తల్వార్ అంచున సాగే జీవితం,
అబ్బాజాన్ పరువునే పెట్టింది ఫణం.

చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, దాదీజాన్ రొగాలూ,
ఆపాజాన్ ప్రసవాలూ, సరీసృపాల్లా సాంఘిక బంధాలు.

వాటికై అబ్బాజాన్ వేస్తూన్న వేలుముద్రలు,
అప్పుడు పడతాయి ఆయన చేతిలో డబ్బులు.

అసమర్దపు పాలకులు, వాళ్ళకు అన్నీ సందేహాలు,
నిరుద్యోగినైన నాపై, ఆటంక వాదిననే అనుమానాలు,
ఫజర్ నమాజ్ కెళ్ళి వస్తున్న నన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు,
నిర్దోషినైన నా ముఖానికి ముసుగులు, చేతులకు బేడీలు.

అప్ప్పులోళ్ళ అసాంఘిక చర్యల్లో, అబ్బాజాన్, అమ్మీజాన్ దోషులు,
అబ్బాజాన్, అమ్మీజాన్ కళ్ళల్లో కన్నీళ్ల సుడులు.

ఘనీబవించిన పహిల్వాన్ల కఠిన హృదయాలు,
ద్రవీభవించిన మా బీద హృదయాలు.

అసమర్ధపు బాటసారినై, గరీబీ రక్కసికి చిక్కి,
వేలాడుతున్నా నిరుద్యోగపు కొక్కానికి.

పాపపుణ్యాల చిట్టా నాకు తెలీదు,
ఈ రెక్కలు తెగిన పక్షులకు నీవే దిక్కు.

అన్నీ తెలిసిన అల్లా! నీకు నా అర్జీ ఏమిటో తెలుసు,
అనంత కరుణామయుడా! అపార క్రుపాశీలుడా!

ఆలకించు మా దువా, చుక్కానివై నువ్వే చూపు మాకు తోవ.
Thursday, 6 December 2012

అశ్రు వేదన


అశ్రు వేదన

ఒక్క అశ్రువు   వర్షించటానికి
గుండె చేసుకున్న గాయపు  మేఘాలెన్నో..

మనస్సు రోదన వినటానికి
వేదనతో  తెగిపోతున్న నరాలెన్నో,

భ్రమల   బతుకు  సాగించటానికి
దేహపు  పొరలకింద  చలనాలెన్నో..

ఘనీభవించిన   కాలాన్ని కరిగించటానికి
బ్రతుకు  బందీఖానాలోని  ఖైదు  క్షణాలెన్నో.

యెదలో  మెదిలే  ఊసులను  దాచటానికి,
పెదవులు  పలకలేని   పదాలెన్నో..

కళ్ళముందే  కలల నావ సాగిపోతుంటే,
దీర్ఘ వియోగాన్ని  మోసే  క్షణాలెన్నో...

అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో  ...

కడుపున  దాచుకోని  కడలి వెడలగోడుతుంటే ..
తీరం వెంబడి  వేసే అడుగులెన్నో...

Monday, 3 December 2012

నీవెప్పుడూ చూడలేవు.


నీవెప్పుడూ చూడలేవు.

ఆకలి తన కబంధహస్తాలతో కబళిస్తుంటే....
మురికి గుంటనుండి కుళ్ళిపోయిన జాంపండు తీసుకుని తింటుంటే....
అది జామపండా, రోగపు చెండా నువ్వెప్పుడూ  చూడలేవు.....

మంచు వాడియైన ఖడ్గంతో తనను కోస్తున్నా....
చిరుగుల కొంగును కప్పుకుని పాచి పనికి వెళ్ళే ఇల్లాలి పగిలిన పాదాలు.... 
వణికే పక్కటెముకలూ నువ్వెప్పుడూ చూడలేవు.

రాత్రంతా మానవ మృగాలు వేటాడుతుంటే.....
చీకటి చాటున నక్కి నక్కి బిక్కు బిక్కు మంటూ గడిపిన అనాధ చెల్లి మూగవేదన
నువ్వెప్పుడూ చూడలేవు.

అమ్మా, అయ్యా లేని చిన్నారులు .... 
ఆకలికై  ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన సైకత సరోవరాల రోద 
నువ్వెప్పుడూ వినలేవు.


ఆకలి మంటలు నిను దహించవు. 
వెతల కొడవళ్లు  నిను కోయవు. 
అప్పుల బాధలు నిను అంటవు. 
పంచేంద్రియాలూ పని చేయని నీకు 
బతుకు బండి కింద నలిగే జీవచ్చవాలు,
ఆకృతులూ, ఆక్రందనాలూ ఎప్పటికీ తెలియవు .
  

Friday, 30 November 2012

ఏల ఈ తిరస్కారం ?
ఏల ఈ తిరస్కారం ?

నీ హృదయం నవనీతం కదా..మరి ఎందుకు,
నా కాలిన  గుండెగాయాన్ని  మాన్పదు ?

నీ మనస్సు అమృతం కదా మరి ఎందుకు,
నా మది బాధను  ఎమార్చదు ?

నీ అడుగులు ప్రతి పదం వైపే కదా మరిఎందుకు,
నా నడకలకు గమ్యం చూపవు?

నీ స్నేహం సాగరం కదా మరిఎందుకు,
నా బ్రతుకునకు  ఎదురీత నేర్పదు ?

నీ జ్ఞానం దీపం లాంటిది కదా,మరిఎందుకు,
నా తలపులకు దారి చూపదు?

నీ బంధం ఆదర్శమైనది కదా మరిఎందుకు,
నా సాన్నిహిత్యాన్ని ఏమారుస్తుంది ?

నీ భోదన ఓదార్పు కదా మరిఎందుకు ,
నా వేదన ఎన్నటికీ  తీరదు?

నీ ప్రేమ సెలయేరు కదా మరిఎందుకు,
నా అనురాగార్తిని  తీర్చదు ?

నీ కరుణ మేఘం కదా మరిఎందుకు,
నా మీద దయా వర్షం కురిపించదు?

నీ శాంతం ఓ కపోతం కదా మరి ఎందుకు
నా ఆవేశాన్ని  సమర్దించదు ?

నిన్ను వరించటం నేను చేసిన దోషమా?
నిన్ను ప్రేమించటం నేను చేసిన నేరమా?

ఎందుకీ మౌనం ,ఏల  ఈ తిరస్కారం?
ఎందుకీ దైన్యం, ఏది పరిష్కారం?

అపరిచితురాలిలా..అపరాదిలా ..అనామికలా ..
ఎన్నాళ్ళిలా..తెరువరిలా..సాగిపోవాలా.......
Wednesday, 28 November 2012

వ్యధ


వ్యధ 

దిగులు  మొగలి పొదలా  గుచ్చుకుంటూ ఉంటుంది.

సమయాన్ని  చావగొట్టి  చెవులు మూస్తుంది.

చైతన్యాన్ని చెంత చేరనీయక  తరిమేస్తుంది.

అంతరంగాన్ని అంధురాలిని చేస్తుంది.

వివేకానికి  వినికిడి  లేకుండా  చేస్తుంది.

వర్తమానానికి  అందత్వవం, భవిషత్తుకు  వ్యంధత్వం  ఇస్తుంది.

ఆచరణని  పాతరవేసి ,వేదాంతాన్ని  వేదికనెక్కిస్తుంది.

ఆకలికి  చరమగీతం పాడి, వేదనతో యుగళగీతం పాడుతుంది.

సమూహంలో  కలసిపోయామా..చంకనెక్కి కూర్చుంటుంది.

పోనీలే  గుండెమూల  పడిఉంటుంది  అనుకోన్నామా...

అరబ్బీషేకు గుర్రంలా...డేరాలో  మకాం  వేస్తుంది.

సరే  వెంటరానీ అనుకున్నామా.. దింపుడు  కల్లాం  వరకూ  దిగబెడుతుంది.

Monday, 26 November 2012

నా కనకానివినా   కనకానివి


కళ్ళు తెరవకముందే  నా వడి చేరావు.
అమ్మ నుండి విడదీసానని  అల్లరి చేసావు.

బుడి,బుడి అడుగులతో బుడతలా తిరిగావు.
చిట్టి,చిట్టి అరుపులతో చిడతలు వేసావు.

విడిచిన  బట్టల్లో ఇష్టంగా దోర్లేవు.
విడిచిన చెప్పుల్ని ఇష్టంగా కోరికేవు.

పాలబువ్వంటే పసందుగా తింటావు.
కారు టైరు  కనిపిస్తే ఇష్టంగా తడిపేవు.

దూషించానో..దూరంగా పోతావు.
శాసించానా  గారంగా వస్తావు.

మాటలు రావు కానీ మారాం తెలుసు,
భాష తెలీదు కానీ భావం తెలుసు.

ఒరే కన్నా నేను   శిక్షణ ఇస్తే
నీవు నాకు   రక్షణ ఇస్తావు.

నేను నీకు నివాసం చూపాను,
నీవు నాకు విశ్వాసం చూపావు.

నువ్వు మాలిమైన శునకానివే  కాదు,
నువ్వు  మేలిమైన కనకానివి కూడా..


Saturday, 24 November 2012

ఏమిచేప్పనే చెలీ....


ఏమిచేప్పనే చెలీ....

ఎమిచెప్పను ..ఎలాచెప్పనూ..

కలిచివేసే  కన్నీటి  కథచెప్పనా...
కరిగిపోయిన కలను గూర్చిచేప్పనా...

పారిపోయిన గతాన్ని గూర్చిచెప్పనా...
మారిపోయిన నేస్తాన్ని గూర్చి చెప్పనా...

కూలిపోయిన కలల సౌధంగూర్చిచెప్పనా..
వాడిపోయిన  పూల తీగ గూర్చి చెప్పనా..

ఎడతెగని శోకం వలదని చెప్పనా..
చంచల  ప్రేమ  నమ్మ వలదని చెప్పనా...

ఏమిచెప్పను  సఖీ.
నిన్నెలా ఉండమని చెప్పనూ....

ఉద్వేగాలు, ఉద్రేకాలూ వలదని చెప్పనా..
నిరసనలూ, నిష్టూరాలూ  వలదని చెప్పనా..

మందారంలా విరియమని చెప్పనా..
మల్లెలా మనసారా నవ్వమని చెప్పనా..

హరిణి లా పరుగిడమని చెప్పనా..
హంసలా నడయాడమని చెప్పనా...

కీరంలా పలకమని చెప్పనా...
మయూరంలా నర్తించమని చెప్పనా...

అమ్మలా ఆదరించనా ...
అక్కలా అక్కున చేర్చుకోనా..


ప్రియ సఖిలా ప్రేమించనా..
నెచ్చలిలా లాలించనా....

 ఏమిచేప్పనే చెలీ.... ఎమిచెప్పను ..ఎలాచెప్పనూ.  


Thursday, 22 November 2012

మనసా కవ్వించకే..మనసా కవ్వించకే.

గమ్యమెరుగని గాలిపటానివి  
నిన్ను అందుకోలేను.

తప్పించుకు తిరిగే నీకోసం 
తపించనూలేను.

ఆప్తులను అల్లుకొనే నీకోసం 
ఆశల తీగను కాలేను.

చీకటి మాటున దాగే నీకోసం 
కాన్తిరేఖను తేలేను.

నిదురను దొంగిలించిన నీకోసం 
కలవరించలేను.

అక్షరాన్ని హత్య చేసిన నీకోసం 
ఏదీ లిఖించను.

ఎప్పుడో చనిపోయిన నేను నీకోసం 
తిరిగి శ్వాసించను.


Tuesday, 20 November 2012

ఓదార్పు


ఓదార్పు 

నా నుండి  నేను  నిష్క్రమించాటానికి ,
ఆత్మస్థైర్యం  కావాలి.


చీకటి వంటి నిను  సోధించటానికి,
కాంతి  తత్వం కావాలి.

బహిర్గత పలుకులు  పలకటానికి,
ధైర్యం కావాలి.

ఎడారివంటి  నిను  వదిలి పోవటానికి,
ఇసుకతత్వం  కావాలి.

మౌన దేహాన మార్పు  తేవటానికి 
మాటల ఊరట  కావాలి.

స్పందనలేని  కాలాన్ని కదల్చటానికి,
కాల్పనికత  కావాలి.

మదిలోని  అవ్యక్త  భావాలను అల్లటానికి,
అక్షర సాలీడు కావాలి. 

మనమధ్య  మానవీయ  వారధి కట్టటానికి,

విలువల  ఇటుకలు కావాలి.

గగనంతో  కరచాలనం  చేయటానికి,

మేఘాల  మెట్లేక్కాలి.

కొత్త చరిత్ర కి  నాంది పలకటానికి,

పాత  పునాది  పెకలించాలి.

నాలో నీ  జ్ఞాపకాలు  భస్మం కావటానికి,

గుండెలో చితాగ్ని మండాలి.

నా  క్షత  వేదనా హృదయాన్ని ఓదార్చటానికి,

అమ్మతనం కావాలి.

శాపగ్రస్త   నైన  నన్ను నేను  ఓదార్చు కోవటానికి,

కొన్ని కన్నీళ్లు కావాలి.


Sunday, 18 November 2012

మట్టి మనిషిని
సబ్సిడీలో  ఇచ్చిన  తాలుగింజల్ని సగం  నేలతల్లి  మింగేసి
నెలతక్కువ  బిడ్డల్ని ప్రసవించింది.

ఎదిగీ ఎదగని  చిరుమొలకలు పాలిపోయిన పసిమోఖాలతో,
పవనుని  పాటకు తలలూపుతున్నాయి.

నా చెమట వాసననూ ,చిరిగినా  బట్టలనూ చూసిన 
మేఘమాలికలు పక్కున నవ్వి పరుగులెడుతున్నాయి.

అన్యం పుణ్యం  ఎరుగని రైతునూ.. 
చదువూ సంద్యా లేని పల్లెటూరి బైతునూ.
మాయా మర్మాలు  నాకేమి తెలుసూ..

బావినుండి  తోడిన నీటితో  తానమాడుతున్న 
నా మొలకల  కూతుళ్ళను తొంగి చూసేది సూరీడనీ 

నారుమడులన్నీ పసల పోరగాడి  తోర్రిపళ్ళలా 
నంగి నవ్వులు నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నాయనీ   

నా అంతరాంతరాలలో  అప్పుల భయాన్ని పారదోలే  
ఆశల కంకులు కీటకాల పాలవుతాయననీ 

నా నెత్తిమీద ఎండా నిప్పులు చెరుగుతుంటే, 
ఎండిన పెదాలు ఎండమావుల్ని వెతుకుతాయనీ..

చద్దన్నంలో నేను ఉల్లిపాయ కొరుకుతుంటే 
వెంట ఉన్న నీ కళ్ళు మంటలెత్తుతాయనీ..

కాలువ గట్టున కూర్చ్చున్న నా కళ్ళలో 
నువ్వు వెళ్ళే కారు దుమ్ము కొడుతుందనీ..

నేలతల్లిని అమ్ముకొనీ , కన్నతల్లిని వదుల్చుకొనీ
పట్నమెల్లి బతకనేర్చిన  సదూకొన్నోడివనీ..

అన్నదాత  అంటే  అప్పుల దుప్పటి  కప్పుకున్నోడనీ 
రాయితీ  అంటే రాత  తెలిసిన  వాడాడే నాటకమనీ.. 

పల్లె నిండా  బతికున్న శవాలే  తిరుగుతున్నాయనీ 
నా ఇంట కూడా  చావు మేళం మోగుతుందనీ..

మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టిలో ఆడి , మట్టిని నమ్ముకొని, మట్టిని హత్తుకొని,మట్టిని కప్పుకొని, మట్టిలో కలిసిపోయే పేద రైతుని..నీ ఆకలి తీర్చటం తప్ప అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు  అన్నదాతని.

Friday, 16 November 2012

ఎదురుచూపు
చల్లగాలి నీ ఆలోచనలనీ ..
పిల్లగాలి నీ ఆగమనాన్నీ .. 
గుర్తుతెస్తాయి.

రాత్రి నీ వలపునీ.. 
మైత్రి నీ తలపునీ..
మోసుకోస్తాయి.

మేఘాలు  నీ ఆకృతినీ..
రాగాలు నీ  ఆలాపననీ..
తలపిస్తాయి.

మౌనం నీ మోహాన్నీ ..
గానం నీ రాగాన్నీ..
వినిపిస్తాయి.

మనస్సు నీ మనుగడనీ ...
వయస్సు నీ ఒరవడినీ..
కూర్చి చూస్తాయి.

చిలిపితనం  నీ కోరికనీ..
కలికితనం నీ కౌగిలినీ..
కోరుకుంటాయి.

పిరికితనం నీ రాకనీ..
వంటరితనం నా రాతనీ..
పరిహసిస్తాయి.

Friday, 9 November 2012

కోకిల


కోకిల 

కూతవేటు దూరానున్నా, 
కూయలేను.

అల్లంత దూరాన ఉన్నా,
అరవలేను.

పిసరంత దూరాన ఉన్నా 
పిలవలెను.

ప్రకృతిని చూసి 
పలకలేను.

ఊపిరి ఉన్నా,
ఉలకలేను.

దేవా...

మానవ  కోకిలల  గానానికి జోగుతున్నావా? 
మధుమాసపు  కోకిలనైన  నన్ను మరిచావా?
ఆమని  అందాల సృష్టి నీదే కదా..
కృత్రిమ  కుసుమాలనేల  ఇష్టపడుతున్నావు?

ప్రభూ ...

చిరుగాలి  సృష్టి కర్తవు, శుష్క జీవుల ప్రాణ దాతవు,
శీతల పవనాలు నీ కనుసైగతో వీస్తాయి కదా..
మరి ఎందుకు  కృత్రిమ శీతల భవనాలలో బందీవయ్యావు?

స్వామీ...

జాబిలి  తలను వంచి  అవనిపై  వెన్నెల కురిపించావు,
మరి  ఈ నియాన్ వెలుగుల నిర్భాగ్యం నీకెందుకు?

తండ్రీ ..

ప్రమిద వెలుగులో  దేదీప్యమానంగా ప్రజరిల్లెవాడివే,
మరి ఎందుకు ఈ విద్యుద్దీపాలలో  విహరిస్తున్నావు?

ఆమని ఆగమనం  నీ ఆజ్ఞే కదా..,
శ్రావ్యమైన  నా గొంతుక నీ బిక్ష కదా..,

కరుణామయా.. 

యేమని చెప్పను నా ఆవేదన, ఎవరికి చెప్పగలను  నా వేదన  ..
చెట్లకై  వెతికే మాకు  సెల్లు టవర్లూ,
చిగురుకై వెతికే మాకు టి.వీ టవర్లూ తగులుతున్నాయి.

కరంటు తీగలు మాగొంతు కోస్తున్నాయి.
నగరజీవితం నను తరిమికొడుతుంది,

ఎగిరి,ఎగిరి, నా చిన్ని రెక్కలు విరిగి పోతున్నాయి.
అనంతలోకాన నా ఆమని ఎక్కడుందో చెప్పవా? 

ప్రభూ .. నేనిపుడు  రాగ కోకిలను కాను మూగ కోకిలను.