Pages

Monday, 26 August 2013

నిషిద్ధ గానంనిషిద్ధ  గానం 

ఆహ్వానించలేదు.... అయినా అరుదెంచావు.

త్యజించ లేదు... అయినా నిష్క్రమించావు. 

మనస్సు వుంది ...... అయినా మరబోమ్మని చేశావు. 

అలుపనేది ఎరుగను.... అయినా సేదతీర్చావు. 

వులిదెబ్బలు ఎరుగను... అయినా శిలను చేశావు. 

ఎల్లలు ఎరుగను .... అయినా వెలివేశావు.

ప్రేమ కావ్యం రాశాను ..... అయినా నిషేదించావు.

కలవో,కల్పనవో ఎరుగను.....అయినా కనికట్టు చేశావు.

బ్రతుకుపై తీపి ఎరుగను ......అయినా సజీవ సమాది చేశావు.

విరాగిలా మిగిలాను..... అయినా బ్రతకాలనే కసి నాలో పెంచావు.

నీ చేతిలో చచ్చాకే తెలిసింది బ్రతుకంటే ఏమిటో.....అయినా ఎప్పటికీ గుర్తుంటావు.

Saturday, 24 August 2013

ఆత్మ వేదన


ఆత్మ వేదన 

నింగినున్న  సోముని అందుకోవాలనే  ఆశతో 
మసిబారిన  గుడ్డిదీపపు వెలుగులో 
ఎగిరే  మినుగురులా...

గమ్యం  ఎరుగని  నడకని ఆశ్రయిస్తూ.. 
తొణికిన హృదయాన్నీ, వలికిన కన్నీళ్ళనీ..,
ఆశ్రయించిన  అనామికలా.. 

విషాద ,నిశీద,సిధిల  జ్ఞాపకాలతో ... 
సాయం సంద్యల  మసక వెలుతురులో.. 
ఎదురుచూసే అభిసారికలా... 

పరిచిత పాద ముద్ర సవ్వడి కై  చూస్తూ... 
కలల  అలలపై  ఊహల,ఊయలూగుతూ... 
చలించని చెకోరంలా..... 

సహారా ఎడారుల ఇసుక  తుఫానులో.. ,
ఎండమావుల వెంట  సాగిపోతూ...,
అలమటించే దాహార్తిలా... 

నిత్యం ఉరకలెత్తే  జ్ఞాపకాల  పరుగులలో
నీడని  సైతం  అందుకోలేని నిరాశతో..,
నిర్భాగ్యపు పరాజితలా.. 

సదా సలిపే  రాచపుండు మనస్సుతో..,
నిర్దయ హృదయ  ఘోషపు పోరులో...,
గాయపడ్డ క్షతగాత్రిలా... 

దిగులుతో, గుబులుతో, నిరాశతో.. 
మది కాగితంపై  అక్షరించలేని అనాశక్తి తో..,
వొలికిన  సిరా మరకలా... 

నిరాశామయ  ఛీకటి  వనాలలో..,
ఆశల  కన్నుల  దివిటీలతో వెదుకుతూ ...,
అలుపెరుగని అన్వేషిలా.....

శిశిరములో ఎడారి తెరువరియై  సాగుతూ..., 
నీ మార్గం  శత వసంతం  కావాలని కోరుతూ..,
దీవించే అమ్మలా... 

విధి  వధ్యశిలపై  తల ఉంచి  చిరునవ్వుతో...,
మరుజన్మలో కూడా  నీ మైత్రిని  కోరుతూ..,
మౌనిలా...,విరాగిలా...,తాపసిలా....  
Thursday, 22 August 2013

బూచి..

బూచి..


పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో  
కలిసిపోయి ఆడుకుంటూ...,

గాలిలో,దూళిలో కలతిరుగుతూ,
పావురంలా,పాలపిట్టలా ,గాలిపటంలా,

వేపచెట్టుకింద   నేనూ,చిట్టీ,
మొగుడూ,పెళ్ళాం ఆట  ఆడుతున్నాం.

నేను  తొడలకంటిన  మట్టి దులుపుతూ,
చెడ్డీలేకున్నా, పొడుగు చొక్కాచేతులు  మడతపెడుతూ,
పనికెళ్తున్నా  తలుపెసుకోవే.. అన్నాను దర్జాగా.

తలలో రిబ్బను  పైటలా వేసుకొని,
పోట్టిగౌను ఎగ్గట్టుకొని, పప్పూ,ఉప్పూ  తెండీ,
పిల్లగాళ్ళకు  వన్నం వండుతా  అన్నది చిట్టి,

అదిగో..అదిగో.. అదిగో  అప్పుడొచ్చింది 
బూచి.

అమ్మా, అయ్యా, తరిమేయలేని   బూచీ,
తరాల తరబడి  మమ్ము తన్ని తమాషా చూస్తున్న బూచి.

మా చిట్టి చేతుల్లో మట్టికొట్టి,
మా పొట్టలో జొరబడి  మమ్ము పట్టి పీడించే బూచి.

ఎంగిలి ఆకులు నాకించి,
కుక్కలతో కరిపించి, కక్కిన  కూటిని  తినిపించే,
ఆకతాయి బూచి, అల్లరి బూచి, 

మా వంటి  వేలాది మందిని,
కబళించే బూచి, కాటేసే బూచి.

ఎన్నితరాలైన  ఆయువు తరగని బూచి,

ఆకలి బూచి. అవును ఆకలి బూచి.


Wednesday, 21 August 2013

సముద్రమంత గాయం
సముద్రమంత గాయం 

నీకూ నాకూ మద్య ఆ అడ్డు గోడ ఏమిటి ?
నీవు చిరునవ్వు నవ్వితే
నేను ఉడుక్కోవటం

నీవు చేయి చాపి ఆహ్వానిస్తే,
నేను ముఖం తిప్పుకోవటం.

నీకూ నాకూ మద్య ఆ అడ్డుగోడ ఏమిటి? 

నేను వెన్నెలను దోసిట తెస్తే,
నీవు కన్నులను మూసుకోవటం.

నేను ఎదురు చూపును పరిస్తే
నీవు కను మరుగవటం.

నీకూ నాకూ మద్య ఆ అడ్డుగోడ ఏమిటి? 
కదలని కొన్ని క్షణాలూ,
నిదుర లేని కొన్ని రాత్రులూ.
కన్నీటి సంద్రాన మిగిలిన
కొన్ని వేదనా తరంగాలు

నీకూ నాకూ మద్య ఆ అడ్డుగోడ యేమిటి?
నీవు నన్ను గాయపరిచావు,
సముద్రమంతా గాయమది.

నేను నిన్ను వేదించాను,
ఆకాశమంత రోదన అది.

కరగని మౌనాలూ ,తరగని భింకాలూ,

చెరగని కోపాలూ, ఇవే మనం పేర్చిన ఇటుకలు .

Monday, 19 August 2013

"ఎడారితనం "
"ఎడారితనం "బోలీ,బొంతా  నెత్తికెత్తుకొని,
ఊరూరా  తిరుగుతూ,
అరిగిపోయే కాళ్ళతో,
తరిగిపోయే దూరాన్ని కొలుస్తూ.

చెట్టుకింద చదును చేసుకొని,
చిరుగు  చీర  ఊయలలూగుతూ,
అల్లరిగా ఆడుకుంటూ,
ఆకలీ జయించాలని చూస్తూ,

ఏ ఇంట దొంగతనం జరిగినా,
మమ్మల్నే వెతుక్కుంటూ ,
ఖాకీ లొచ్చి అమ్మా నాన్న బొక్కలిరగొట్టి,
బోనులో తోస్తే  బైట బోరుమని ఏడుస్తూ. 

శైధిల్య  మబ్బుతెరల మాటున,
మిణుకు,మిణుకు మనే జాబిల్లిలా,
సుదీర్గ జీవితపు చీకటి నీడల్లో,
వెలుతురు  వెతికే వంటరితనంతో. 

నెత్తురు నాళాల్లో  పరుగులు తీసే,
పసితనపు  పవురుషాన్ని,
కట్టలు తెంచుకొన్న కోపాన్ని 
వాస్తవానికి తెచ్చి వణికిపోతూ . 

చిట్లిన  అమ్మానాన్నల  
అంగాంగాలను గుండెకు హత్తుకొంటూ,
అమానుషం  అని అరవలేక,
ఎదిరించాలేకా  ఏడుస్తూ..,

రుదిర స్నానిత శోఖితనై  ,
హృదయ  శఖలాల సమాదుల్లో 
వెక్కిళ్ళ మద్య  వెక్కిపడుతూ,
హరితహీన మోడులా విలపిస్తూ... 
  

Thursday, 15 August 2013

నీవు


నీవు 

    
     అందని చందమామవైన  నీవు 
                                   "పగటివెన్నెలైనావు"

    నిరీక్షణా  నిశీధిలో  నీవు,
                                     "నిశాచరవైనావు"  

         
   ఏకాంత వనాంతర విహారంలో నీవు,
                                      "విహంగమైనావు " 

   సౌందర్య శోధనా సంచారంలో నీవు,
                                      "విమలగాన్ధర్వమైనావు".

   అందాల ఆమని ఆస్వాదంలో  నీవు,
                                      "వసంతుడివైనావు"

   నిశ్శబ్ద మానస మందిరాన నీవు,
                                       "మోహమూర్తివైనావు "

   ప్రేమ భావనలో యుగాలు గడుపుతూ నీవు,
                                       "ప్రణయ మూర్తివైనావు" 

Tuesday, 13 August 2013

చూడు


గుండెను  తట్టి  చూడు,
తలపుల తడి  తగుల్తుంది. 

మనస్సును తవ్వి చూడు,
వలపుల వేడి  తెలుస్తుంది. 

కళ్ళను కళ్ళతో కలిపి చూడు,
చూపుల సఫలం కనిపిస్తుంది. 

ప్రాణాన్ని ప్రేమించి చూడు,
మృత్యువుతో  పోరాడుతుంది. 

జన్మను తరచి చూడు,
జాతిగూర్చి అడుగుతుంది. 

ప్రేమసాగరాన్ని ఈది చూడు,
లంగరు అవసరమే లేదంటుంది.  

రక్తాన్ని మరగించి చూడు,
అగమ్యమై  ఆహా కారం చేస్తుంది. 

లోకాన్ని ప్రశ్నించి చూడు,
అహంకార పైత్యాన్ని  అంటగడుతుంది. 

రాత్రిని కదిపిచూడు,
కలల  దుప్పటి కప్పుతుంది. 

సమాదిని గమనించి చూడు,
నీ మదిలాగే  అనిపిస్తుంది 
Monday, 5 August 2013

కాడు (పాడు) జీవితం


కాడు (పాడు) జీవితం


ఊపిరి  ఆగి  విశ్రమించే   చోట,
జీవి  ఊపిరి  పోసుకుంటూ.

వైరాగ్యం  వేణుగానమైన చోట,
వినిపిస్తుంది  ఓ  జోలపాట.

గుండె  దడ, దడ  మనే చోట,
బుడ,బుడ  అడుగుల  బాట.

నిశిరాతిరి శవాల కమురు కంపు,
హోరుమనే  దప్పుల జోరే  ఇంపు .

శవం వెనుక  చిట్టి అడుగుల  ఉరుకులాట,
విసిరిన చిల్లర డబ్బులకై   కుమ్ములాట.

ఎవరు  చచ్చినా  వాళ్లకు  పరమానందం ,
ఎవరు   పెట్ట్టినా  పిండమే పరమాన్నం.

బొందలగడ్డలో ఇప్పుడు రాబందులు లేవట,
అక్కడున్నదంతా  కబ్జా గద్దలేనంట.

పట్నం పెరిగి పెద్దది అవుతుందంట,
గోప్పోడి  గోరీ  ఊరిమద్యేనంట.

సమాదులపై  సంసారాలు రద్దయినాయంట.
అపార్టుమెంటుల  పునాదులు లేసాయంట.

ఓరి గరీబొడో  ఎక్కడికి పొతావురో...
సచ్చినోడికే చోటులేకుంటే...
నీ సంసారమెక్కడ  సాగిస్తావురో.

గోరీనొదిలి  ఎక్కడికి  పోతావురో...
నిను తరిమినోడి  గోరీ ఎప్పుడు కడతావురో..
Thursday, 1 August 2013

పచ్చదనం

కాడెద్దులు  కడగడమే  తెలుసు,
కారు కడగటం తెలీదు. 

సూడి  అవుకు మొక్కటమే  తెలుసు,
సూటు,బూటుకు  మొక్కాలని తెలీదు. 

బందు,మిత్రులకు విందులు ఇవ్వటమే  తెలుసు,
బడా బాబులకు మందు నింపాలని(గ్లాసులు ) తెలీదు. 

విస్తళ్లలో  విందులు,ఇంటినిండా  బందువులే  ఉండాలని తెలుసు 
హోటళ్ళలో కప్పులు కడిగి టిప్పుకై  చేయిచాపాలని తెలీదు. 

పచ్చదనాన్ని ప్రేమించటం  తెలుసు,
పచ్చనోటుకై  పరుగులేత్తాలని తెలీదు. 

పురుగుల మందు  తాగితే  కొంప కొల్లేరవుతుందని  తెలుసు,
పట్నం  వలస వస్తే  తనను తానూ చంపుకున్నట్లేనని  తెలీదు.. 
                                * * *

( అన్నా....  అనిపిలిపించుకున్న   ఆ మనిషే   "అరె.."   అనిపిలిపించుకుంటూ.. రోజుకోలీగా మారి, అన్నం పెట్టిన ఆ  చేతులతో  దణ్ణం పెడుతున్నాడు.. చూడండి,  రైతన్న పరిస్థితి.. పట్నంలో  ఇమడలేకా.. పల్లెలో బ్రతకలేకా  రైతన్న పడే  అవస్థ చూడండీ,...   రైతుకు  న్యాయం చేసే  పాలన కావాలని కోరుకుందాం..  అన్నదాతను బ్రతికిద్దాం  అన్నం తిందాం..) 

(ఓ  పేద రైతు  సిటీలో  షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ గార్డ్  గా  పనిచేస్తున్నాడని  విన్న తర్వాత కలిగిన ఆవేదనతో........ మేరాజ్ ఫాతిమా) అమూల్య బంధం

ఓ అందమైన  సాయంత్రం  
చల్లగాలిలా  నీ ఆగమనం 

యెదురు చూపుల అంతరం 
వెలుగునిచ్చు  సూరూడిలా

కనురెప్పల వాకిట  వెలసిన  
పారిజాత  తోరణంలా 

అనేక  శిశిర గాడ్పుల అనంతరం 
అరుదెంచిన ఆమనిలా 

కోటి మొక్కుల తర్వాత  
ఇల్లు చేరిన ఇలవేలుపులా

ఎడారి  వేడిమి  అనంతరం 
చెంత  చేరిన  వాసంతునిలా


నిదుర మరచిన   కనులకు 
కరిగిపోని  స్వప్నంలా 

తరిగి పోని   శుభ తరుణం లా 
ఆకరి  శ్వాస వరకూ తోడుండే  నేస్తంలా .