Pages

Tuesday, 26 February 2013అమ్మంటే..... ?చిట్టితల్లీ నిన్ను తనివి తీరా చూద్దామంటే,
కన్నీటి పొర అడ్డు పడి  కనిపించటం లేదు.

వరాలతల్లీ  అక్కలేరీ   అని అడగకు,
అన్నలు   నావెంట  రారా అనీ అడగకు.


అడుగులు వడిగా పడనీ...అడ్డురాకు.
చీకటికి  తడబడుతున్నా చప్పుడు చెయ్యకు.


ఆడపిల్ల వద్దనుకున్న ఈ ఇంట,
నా అమ్మతనాన్నే వదిలేసుకుంటున్నా
.

నా  తల్లీ  నిన్ను నిర్జీవిగా చూడటం కన్నా,
పరజీవిగా  చూడటమే  మేలనుకున్నా


అమ్మనే కానీ దానికంటే ముందు ఒకరికి ఆలిని,
అంతకంటే  ఆర్దిక స్థోమత  లేనిదాన్ని.మిన్నగా ఉన్న ఈ మేడ ముందు నిన్నొదిలి  వెళ్తున్నా,
క్షమించరా కన్నా ..నాకే  దారీలేదు ఇంత కన్నా. 


చిన్ని కన్నా...   నిన్నే దర్మాత్ముడో  ఆదరిస్తే,
నా వరాల పంటా.. ఈ అజ్ఞాత  అమ్మ  దీవెనలతో,


దిక్కులేని ఎందఱో ఆడపిల్లలకి ఆలంభనవై ,
ఈ అజ్ఞాత అమ్మ ఆయుషు కూడా పోసుకో.. Sunday, 24 February 2013


నిశి శాంతి 


అప్పుడే  ఎంత దూరం 
వెళ్ళావో   కదా
నేను  నీకోసం  కార్చిన  
కన్నీరింకా  ఇంకనే లెదు. 


ప్రణయ  విహంగాల్లా 
ఎగిరిన  ఆ రోజులు,
ఇంకా  నను విడిచి 
వెళ్ళనే  లేదు. 


నీకై  తపించే   నా మనస్సు,
నీకై  స్పందించే  నా హృదయం,
నీకై  శ్వాసించే  నా శ్వాస
నన్నింకా   వీడనే లెదు. 


వీడలేక  విడిపోయిన  ఆ రోజు,
వణికే  నీ పదవులు  పలికిన
వీడ్కోలు  నాకంటి   పాపాలను 
ఇంకా  వీడి  పొలెదు. 


ఆ మొదటి  ఆలింగనం,
అ మొదటి  ముద్దూ,
ఆ వెచ్చటి  స్పర్శా ,
గువ్వలా ఒదిగిన  నీ మెత్తదనం 
నాకు  దూరంకానే లేదు


మూసిన  నా కనురెప్పల  వెనుక,
నీ చూపులింకా గుచ్చుతూనే 
ఉండటం, నా మెడ  వంపులో,
నీ  వెచ్చటి  శ్వాస  వేడిమి ఇంకా ఆరిపొలేదు.  


ఎవరూ  చూడకుండా,
నీవు  నన్ను కలిసే
సంకేత స్థలాన ,నీ పాద ముద్రలు 
ఇంకా చెరిగి  పోనేలేదు. 


నువ్వు  ఏడ్చి, ఏడ్చి
నన్నేడి పించిన 
ఆ రాత్రి, నిను సాగనంపి, 
సమాదినై  ఈ స్థలాన్ని  వీడనే లేదు   చూడు, చూడు,  నీ  హృదయంలోనే 
నీకోసం  నేను  దాగి ఉన్నాను 
నిత్య  మల్లియనై  
ఇంక ఎప్పటికీ ఎడబాటే లేదు. 
Friday, 22 February 2013
తప్పుకుం(టా)టూ కుక్కలు గతికిన
ఎంగిలాకుల్లో
పరమాన్నాలు వెతుకుతూ ... 


పందులు దొర్లే 
మురికి గుంటల్లో,
చిరుగు బట్టలు ఉతుకుతూ... 


పాలితిన్ సంచుల
చిల్లు డేరాల్లో,
జీవనం సాగిస్తూ,


దోమల దండులో,
నా శరీరాన్ని  నేనే,
రాత్రంతా  వెతుకుతూ... 


మాంత్రికుని శాపంలో,
చిలకగా మారి,
ఆకలి పంజరంలో  బందీ అవుతూ... 


జనాబా లెక్కల్లో ,
ఆడో,మాగో అర్ధం కానట్టూ,
అసలు మనిషినన్న స్పృహే లేనట్టూ.... 


నన్ను చూసీ  చూడనట్టు,
నటించే  నీతో, నావంతుగా 
నేనూ నీతో    ఏకీభవిస్తూ .... 


భారతీయులంతా,
నా  సహోదరులే  కానీ  
నేను  మాత్రమే  మీకేమీ  కానని  అనుకుంటూ.... 

Wednesday, 20 February 2013

చిరాకెందుకో .... 

చీటికి,మాటికి చిరాకు పడతాడు,
మా బావ చచ్చినోడు,
అయినా  ఏమిచేయలేను,
ఎందుకంటే  వాడు నాకు నచ్చినోడు . 


పొద్దుగాలనే లేపు 
పొలాని కెళ్ళాలి అన్నాడు,
ఆడి  కాలికి  కోడెదూడని  కట్టేసాను,
అదీడ్చు  కెళితే  నా తప్పా..?


సినిమా  కెళ్లదామె,
నీ  చెల్లిని  వెంట పెట్టుకురా అన్నాడు,
ఆడి  చెల్లిని  తీసుకెళ్ళాను,
అరె  మూతి ముడుసుకున్నాడు... 


అత్తంటే  పెద్దదిక్కే  ఎర్రిమోఖమా,
అంటాడు  కదా, ఆడి  అత్తయితే,
సంతోషిస్తాడని  మా అత్తని ఎల్లగొట్టి ,
ఆడత్తని  పిలిపించినా..  అయినా మూతి ముడుపే... 


నన్ను  "నువ్వే నా బంగారం" అంటాడు,
అందుకే  నా ఒంటిమీది బంగారం 
మా చెల్లికేట్టి  దాని మనువు జరిపించినా 
మంచిపనే  కదా చేసినాను  అయినా చిర్రు,బుర్రులె. 


మేడారం జాతర కెళ్లితే,
సందట్లో  తప్పిపోటాడని,
పక్కన తప్పెట్లు  పెట్టిన్చినా,
అరె, అగమానం అంటాడే..... 

Tuesday, 19 February 2013

    
      (అ )న్యాయవాది 


      జీవన పోరాటంలో,
      గెలుపు,ఓటమిలను,
      తరాజులో బేరీజు 
       వేసి చూస్తాను.

       ఏళ్ళ తరబడి,
       ఒకే కేసును, 
       వెనక్కినడిపించి,
       నేను ముందుకు నడిచాను.

       రెప్ప కాలంలో,
       కత్తులు దూసుకొనే,
       కారుడు కట్టిన ఫ్యాక్షనిస్టుల
       పక్షాన చేరి నక్కజిత్తుల నాయం 
       నడిపేవాడిని.

       కాఖీలతో  కుమ్ముక్కై ,
       కల్లలనే ఎల్లలు గా చేసుకొని,
       కథను నడిపే,
       కలహ భోజుడిని.

       తెల్ల కోటుతో కలిసి పోయి,
       శవాలకు  సైతం  
       సవాలు విసిరే,
       కలియుగ తాంత్రికుడిని  

       ఉరి వరకూ,తెచ్చిన నిర్దోషిని,
       భుజం తట్టి  తన ఆత్మకి 
       శాంతి కూరే  వరకూ 
       పోరాడతానని బల్లగుద్ది చెప్పిన 
       ల్ల గౌను న్యాయ వాడిని.

       న్యాయవాది పై నేను రాసిన ఈ కవిత ఎవరినీ ఉద్దేశించి  రాసినది కాదు. ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటె మన్నించగలరు....మెరాజ్ 

Saturday, 16 February 2013

చేతులు.


చేతులు


పాలబువ్వ  తినిపించి,
నిన్ను  మరిపించిన  చేతులు .

వళ్ళంతా  రుద్ది
నిన్ను శుద్దిచేసిన చేతులు.

ముక్కు తుడిచి,
నిన్ను ముద్దుచేసిన చేతులు.

వేడి అన్నాన్ని,ఆర్చుకు,మార్చుకు,
ఊది తినిపించిన చేతులు

గుండెకు హత్తుకొని,
పాలిచ్చి  పాలించిన చేతులు.

పోలమారిన నీకు పలుమార్లు,
నెత్తిన సుతారంగా కొట్టిన చేతులు.

కాల చక్రాన్ని తిప్పి,
కాయలు కాచిన చేతులు.


నీ రాత దిద్దుతూ..తన రేఖలను అరగదీసుకున్న  చేతులు.
పొట్టకోసం, బట్టకోసం శక్తి ఉడిగి  నీ ముందు చాపిన  ఆ చేతులు.

చిరుగు కొంగున దాచిన తాయిలం .. నీకీ రోజు,
సిల్క్ కొంగున దొరుకుతుందేమో చూడు.... చూడు, చూడు,

నువ్వు ఓ సారి  బాల్యం లోకెళ్ళి.. చూడు.
అక్కడ  నీ ప్రతి  అడుగూకూ  ... ఆసరా ఇచ్చింది  ఈ చేతులే


ముసలితనంలో  ముడతలు పడ్డ ఆ చేతులు,
ముద్ద  కోసం  నీ ముందు   చాపిన రోజు,
నువ్వు దాటింది ఉమ్మ నీరు కాదు, స్వార్ధపు  సెలయేరు.
ఆశావాదిని

ఆశావాదిని 


చెట్టంత కొడుకు     
శవంగా మారితే..
తల కొరివి పెట్టిన  నష్ట జాతకుణ్ణి.

నట్టింట కోడలి గాజులు
పగలగొడుతున్నా,
కట్టుబాట్లకు  తలవంచిన అసమర్దుణ్ణి.

భుజాలమీద  ఆడించిన,
నా రక్త బంధాన్ని,
భుజం మీద మోసిన దౌర్భాగ్యుణ్ణి.

విధి కి ఎదురొడ్డి
పోరాడ  డానికే   నిర్ణయించుకున్న  
మట్టి పాము  వంటి  మధ్యతరగతి  మనిషిని.

కోడలికి పూలూ, గాజులూ పెట్టి,
సీమంతం చేయించి,
కూతుర్ని చేసుకొన్న త్యాగపరుణ్ణి.

కొన్ని నెలల్లో ,
నా ఇంట బుడి బుడి  అడుగులేసే,
నా  రక్త  బంధాన్ని  ఆహ్వానించే  ఆశావాదిని.

నా వంశం  నిలవాలని,
మనవని  కోసం  కోడలిని,
నా ఇంటి చాకిరీకి వాడుకొన్న  స్వార్దపరుణ్ణి.

Friday, 15 February 2013(ప) రాయి  నన్ను చూస్తూనే  
వెలిగిపోయే.. ఆ కళ్ళు,
ప్రేమ వాకిళ్ళు ..

వాలిపోయే పొద్దులో,
నాకోసం ఎదురుచూస్తూ,
నా అరికాలి గుర్తులు ముద్దాడే... నా ప్రేయసి.

గాయాల పూదోటలో,
సోమ్మసిల్లిపోతూ, నాకోసం,
విరహ గీతం పాడే...నా ప్రేయసి.

శిశిరఋతువులో,
వసంతాన్ని  ఆహ్వానిస్తూ,
కలల పచ్చిక తివాచీ పరచిన..నా ప్రేయసి.

పెను తుఫానులో,
చిగురుటాకులా  లేలేత ప్రాయాన్ని,
విరహ వేదనలో త్యజించిన....నా ప్రేయసి.

దూరాన ఉన్నా,
తన తేనెల మాటలతో,
నా గుండెలో వలపు ఊయలలూగే..నా ప్రేయసి.

ఊసుల, ఊహల మద్య,
నా కోసం ఊపిరి నిలుపుకొని,
నన్ను చూడాలనుకొనే  నా ప్రేయసి.

నిత్య సమస్యల నడుమ,
సతమత మయ్యె,
రెక్కలు తెగిన విహంగం..నా ప్రేయసి.

Tuesday, 12 February 2013కుంపటి 


అయ్య పంపిన  ఇంటికే
వెళ్ళింది.

అన్న  తెచ్చిన వాడినే
మనువాడింది.

అమ్మ చెప్పినవన్నీ,
ఆలకించింది.

అక్క వెళ్ళినట్లే ఏడుస్తూ,
వెళ్ళింది.

అయినా  అత్తింట  కొత్త కుంపటి అయింది.......

మామగారి  మీసానికి
వెరసింది,

మగని మగ  రోషానికి
జడిసింది.

అత్తగారి  ఆరళ్ళను,
భరించింది,

ఆడపడచుల కోరికల చిట్టా,
తీర్చింది.

అయనా  కుంపటి వారికీ భారమైంది(పాతదైంది )

అందుకే  కుంపటి  చితిపై కూర్చుంది.
కాలి బూడిదైంది... తేలికైంది.


నిప్పుల పాదం 

నిన్ను హక్కున చేర్చుకున్నట్లే 
నటిస్తూ ,
పక్కకి నెట్టేస్తాడు.

నీ ముందు ఇకిలిస్తూనే  
నీ రంగు గూర్చి,
నీ వెనుక సకిలిస్తాడు.

నీ  శవం ముందు చేరి,
నీ  చర్మపు  డప్పే,
మోగిస్తాడు.

నీ తాతలు కుట్టిన  చెప్పులు
తొడుక్కొని,
నిను తొక్కాలని చూస్తాడు.

సమాజం మొండి గోడపై,
నిన్ను విసర్జపు పిడకలా,
ఎండ బెట్టాలని  చూస్తాడు.

నీ దేహంపై " వెలి"  ముద్రలు  వేసి,
దిస  మొలతో,
నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు.

వథ్య శిలపై నిన్ను నిలబెట్టి ,
ఉరితాడుతో ఊపిరి తీసి,
క్షుద్ర తాండవం చేస్తున్నాడు.

"దళిత భుజంగం" నీవు,
బుసకొట్టు, పడగ విప్పు,
కాటువేయి  నీకు చేటు చేసినోడిని.Friday, 8 February 2013

బ్రతుకంటే...బ్రతుకంటే... 


పత్తి  దూదిలా  మెత్తదనం కాదు,
ఇనుపముక్కలా విరగనితనం.

మధువును గ్రోలే భ్రమరం  కాదు,
ఎద్దుపుండుపై  కాకి చలగాటం.

ప్రేమల రంగుల రాట్నం కాదు,
పోకిరీల  వెకిలి ఆరాటం.

మమతల తేనే ఊట  కాదు,
ఉట్టిపై  అందని చద్ది మూట.

అనురాగపు  వలపు బాట కాదు,
తీగపై  ఆడే గారడీ  ఆట.

కడుపు నిండిన పండగ కాదు,
పేగులెండిన  ఆకలి. 
Tuesday, 5 February 2013

శరం


శరం

నిన్ను గుచ్చే బాణం,
నిన్ను చేదించే బాణం ,
నిన్ను బాదించే బాణం.

మలినం  లేని  నవ్వును,
కాల్చి మాడ్చి  వేసి,
ముఖానికి  మసి  పూస్తుంది.

కళ్ళలోని కాంతిని ,
వెతికి,వెతికి కోసి,
నేల చూపుల్లోకి విసిరేస్తుంది.

నిన్ను వేదించి,
వెటకారంతో  శోదించి,
ఎదుట పడకుండా చేస్తుంది.

మాటల తూటాలతో,
ముఖం లో నవ్వును,
మాయం చేస్తుంది.

నీ చితిమంటల్లో,
ఎవరి  ఆకృతినో  వెతికి,
నీ తలపులనూ తరిమేస్తుంది.

గురి చూసి వదిలిన,
అనుమానపు శరం,
గుండెనే చీల్చుతుంది.Monday, 4 February 2013

మూగ వేదన


మూగ వేదన 

గుండెకు  స్పందన నేర్పి,
బ్రతుకు  బాటను  చూపి,
శ్వాసను   తీసుకెళ్ళావు.

కనుపాపల  పలకలపై,
నే నచ్చిన  నీ చిత్రాన్ని  గీసి,
చూపును  తీసుకెళ్ళావు.

మది వాకిట వలపు తోరణమై,
తనువును  పులకింపజేసి,
బాటసారివై  సాగిపోయావు.

ఎడారి   ప్రస్తానములో,
సైకత  తెరువరినైతే,
ఎండమావువై  వెక్కిరించావు.

నా  మది  విషాద  వేదికపై,
నిశీది   నాటకానికి,
కన్నీటి  అంకం  పలికావు.

ఆశల   అంపశయ్యపై,
మూన్నాళ్ళ ముచ్చటకై,
మూగ సాక్షిని  చేసావు.  

Sunday, 3 February 2013


"నేను   కవిత్వీకరించిన  కవిత,నేను తిరిగి చదువుతున్నప్పుడు, 
గాజుపెంకులపై  నగ్న పాదాలతో నడుస్తున్నట్లు అనిపిస్తుంటుంది."

Saturday, 2 February 2013

అనాద
అనాద

గోరుముద్దలు  పెట్టలేదు,
చిట్టికతలూ  చెప్పలేదు,

లాల పోయలేదు,
లాగు వేయలేదు.

చెత్త బుట్టలో పడేశావు,
చేతులు  దులుపుకున్నావు.

మాసిపోయిన పాతలూ,
మట్టి కోట్టుకున్న చేతులూ.

విదిలింపులూ, కదిలింపులూ,
ఇకిలింపులూ,సకిలింపులూ.

అమ్మ ఎలా ఉంటుందో  చూడాలనీ,
ఎందుకు కన్నదో నిలదీయాలనీ.

ఎలాంటి దయనీయ స్థితి  ఈ పనికి  పురికొల్పిందో?
ఎలాంటి కమనీయ స్థితి నీ కడుపున ఊపిరి పోసిందో?

పారవేసిన అమ్మ రాదు,
చేరదీసే అమ్మే లేదు.

జన్మనిచ్చిన  అమ్మని  జగమంతా వెతుకుతూ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో  తన జన్మని  వెతుకుతూ.....