Pages

Saturday, 11 February 2012

నువ్వే నేను

నా     అధరాలపై దరహసానివీ
నా     ఎదపై వెన్నెల సంతకానివీ
నా     గమనానికి గతివీ 
నా     గానానికి శ్రుతివీ 
నా     భవితకి బాటవీ
నా     కవితకి భావానివీ
నా     ఆశల సౌధానివీ
నా     ఆశయాల సారదివీ 
నా     మాటలలో మధుర్యానివీ 
నా     ఆటలో సారధ్యానివీ 
నా     పాటలో పల్లవివీ
నా     తోటలో మల్లెలవీ 
నా     శ్వాశలో స్వచ్చానివీ
నా     ధ్యాసలో నిత్యానివీ
నా     నా ఆలోచనలలో పూలజల్లువీ 
నా      ఆస్వాదనలో జాబిల్లివీ 
నా      నా వయస్సుకి సరిజోదివీ 
నా     ఊహలకి ఊపిరివీ 
నా     ఊసులకి సరిగామవీ 
నువ్వే ఈ కోకిల కోరిన ఆమనివి 
నువ్వే ఈ కోవెలలో కొలువైన దైవానివి.

(ఆంద్ర భూమి వారపత్రిక 02 June 2011)  

Friday, 10 February 2012

మౌన రణం


మౌన రణం

ఇద్దరి మధ్యా నిశబ్దం రాజ్యం ఏలుతుంది,   
మాటల సౌధానికి మౌనపు వెల్ల వేసినట్లుంది. 

ఒకరి ఆలోచనలు ఒకరు పసిగట్టినట్లు ఉలికిపాటు, 
ఒకరి మాటలు ఇంకొకరు పలికినట్లు ఏమరుపాటు. 

ఏమైనా జరిగితే బావుండు,  ఎవరైనా వస్తే బావుండు,
ఎంతపోసినా పొంత నిండని పోగవంటి ఆలోచనలు.

వెలుగో వెడిమో తెలియని స్తబ్దత, 
ఆకలో అలకో తెలియని నైరాస్యత,

ఉండి   ఉండి చెళ్ళుమనిపించే    గత స్మృతులు. 
                            ***
చేయి చేయి పట్టుకొని భావి కలలకు రెక్కలు కడుతున్నప్పుడు,
హెచ్చవేతలేకాని  తీసివేతలు ఉండవని  లెక్కలు కట్టినపుడు. 

ఒకరి శిల్పాన్ని ఒకరు ఇష్టంగా చేక్కుకున్నప్పుడు,
అనుభందపు ఆకుపై అనుమానపు ముల్లు పడుతుందనీ.

అంతరాలను అసహనాల సెగలు అంటుకుoటాయనీ,   
మాటల తూటాలు  మనసు మర నుండి బయటకొస్తాయనీ,
తెలియని అవివేకం . . . . . . .  మాయమైన వివేకం. 
                             ***
ఏకాంతం కోసం అందరికీ దూరం అయ్యాం,       
రాజీ కుదర్చమని  ఎవరిని దేవురించలెం.    

కదిలే శవాల్లా . . . .  . . కాలాన్ని దోర్లిస్తున్నాం, 
పడిన ముడిని విప్పుకోవాలని చూస్తున్నాం, 

ఇద్దరిలో ఎవరో ఒకరు దూరాన్ని చెరిపేస్తే . . . . . రాబోయే ఆ చిన్ని ఆకారం సాకారమైతే . . . . .
రగులుతున్న మౌనరణం ముచ్చటైన పలుకుగా మారదా.

(సాహితీ ప్రస్తానం మాస పత్రిక May నెల సంచికలో ప్రచురితం)
Sunday, 5 February 2012

సాక్షులు


సముద్రుడు వినలేదా మన సరాగాలు
సైకత కనలేదా మన సరసాలు

మేఘుడు తరించాలేదా మన మధ్య   కురవాలని
పవనుడు తపించలేదా మన మధ్యకు   రావాలని

వసంతుడు విహరించలేదా మన ప్రేమ వనంలో 
వరుణుడు వర్షిన్చాలేదా మన భావ కవనంలో 

గిరి ఎరుగడా మన ఒడుపు  పట్టుని 
తరువు ఎరుగడా మన వలపు జట్టుని

అగ్ని ఎరుగడా మన భగ్న ప్రేమని
ధాత్రి ఎరుగాదా మన జన్మ ఆర్తిని

సోముడు చూడలేదా మన శృంగారాన్ని 
తారక పాడలేదా మన విరహ గీతాన్ని

హంస ఎరుగదా మన అలకని
హరిణి  ఎరుగదా మన అలసటని

మన ప్రేమ హర్షించని ఈ ప్రజకి పంచ భూతాలే సాక్షి పలకవా.


("బెంగుళూరు తెలుగు తేజం" మాసపత్రిక మార్చ్ 2012 లో ప్రచురితం)