Pages

Monday, 29 October 2012

ఇలా చేయాలని ఉందిఇలా చేయాలని  ఉంది 

మౌనాన్ని  ఛేదించాలనీ,     
మనస్సులో మగ్గుతున్నమాటల బంధనాలను,
తెంచుకోవాలనీ ...

ఏదో అడగాలనీ...
అది  నీకే  చెందినదై  ఉండాలనీ...,

పలికే ప్రతి మాటా మృదువుగా ఉండాలనీ..,
నిన్ను నొప్పెంచనే రాదనీ...

నే  విసిరిన మంచు ఈటెలు, 
నిను ఎంత  గాయపరిచాయో అడగాలనీ...

సతత హరితమైన నీ సహనాన్నీ,
కంచే లేని నీ మంచితనాన్ని,
స్తుతించాలనీ...

ఎంత ఎదిగినా  ఒదిగి ఉండే నీ ఉన్నత  గుణాన్ని,
అక్షరాలతో ఆలంకరించాలనీ..,

మర్మమెరుగని  నీ మనస్సుకు,
వడిశిల తగిలినా చలించని  నీ నిగ్రహానికి,
సాష్టాంగ  పడి నమస్కరించాలనీ..,

స్వయం ప్రకాశమైన  నీ ముందు,
వెల వెల బోయే దివిటీనైనా.,
కావాలనీ..,

హిమాలయమంతటి  నీ ముందు,
ఓ చిన్ని  హిమబిందువునైనా,
కావాలనీ..,

అక్షర శ్రీగంధమైన  నీ పక్కన,
అగరు ధూపమైనా  కావాలనీ..,

నా అణువణువూ  రెండు హస్తాలుగా  చేసి, 
నీకు.నమస్కరించాలనీ...Saturday, 27 October 2012

A Movie made by my daughter Zeba Kulsum.

Wednesday, 24 October 2012

నేను నేనుగా మిగిలాను


నేను నేనుగా మిగిలాను  

ఎవరితోనూ పోలికలేని,

దేనిలోనూ పొంతనలేని నేను నేనుగా మిగిలిపోదాం అనుకున్నాను..


కానీ వెక్కిరించే బంధాలే ఎక్కువయ్యాయి.

విస్మరించాల్సిన సంఘటనలే దిక్కయ్యాయి.


బతుకు ఎంత బలీయమైందంటే నాచేతులతో

నా గొంతు నొక్కుకొనేలా చేస్తుంది.


జీవితం ఎంత చలాకైనదంటే..పదునైన ఆయుధంతో

నా గుండెను నేనే ముక్కలు చేసుకొనేలా చేస్తుంది.


విధి ఎంత విచిత్రమైనదంటే...వెతల రంగులద్ది,

నా ముఖాన్ని నేనే గుర్తుపట్టనట్లు చేస్తుంది.


నేను ఎంచుకొన్న బాట ఎంత 
చంచలమంటే 


నడుస్తున్న నన్ను చాపలా చుట్టివేస్తుంది.


నేను గడిపే కాలం ఎంత కఠినమైనదంటే..

క్షణ,క్షణం కాలనాగై కాటువేయాలని చూస్తుంది

నేను ఎక్కిన భలిపీటం ఎంత దయలేనిదంటే..

కాలికింద ఆసరా ఇస్తూనే  తల తలారికిచ్చింది.నను  తోలిచేసే   జ్ఞాపకాలు  ఎలాంటివంటే..

నాతోనే ఉంటూ అందని నీడలా దూరమౌతున్నాయి.


అందుకే నేను నేనుగా మిగిలిపోయాను.


Saturday, 20 October 2012

వారఫలాలు
వారఫలాలు 

ఎప్పుడూ హోలీ పండక్కి వచ్చే అల్లుడు అమ్మాయి ఈసారి రామా రావు దంపతుల్ని హైదరాబాదు రమ్మని ఆహ్వానించారు. పెద్దగా ఇష్టం లేకున్నా వాళ్ళ మాట కాదనలేక కూతురింటికి వెళ్ళారు రామారావు దంపతులు.

పేపరు వస్తూనే ముందుగా వారఫలాలు చూసే అలవాటున్న రామారావు, వారఫలాల శీర్షికలో "ఆకస్మిక ధన ప్రాప్తి, కళ్ళు మూసుకుని ఆత్మీయుల కోసం వెచ్చిస్తారు" అని చూసి ఆనందపడ్డాడు. శుక్రవారం కావటం మూలాన అలవాటు ప్రకారం లలితమ్మ ప్రొద్దున్నే లేచి... స్నానం వగైరాలు కానిచ్చి, తాపీగా పేపరు చూస్తున్న రామారావును గుడికి బయలుదేరమని పురమాయించింది. రామారావు చిరాగ్గా "నీతో పెద్ద చిక్కొంచిందే, చెట్టు కనిపిస్తే మొక్కేస్తావు, కొట్టు కనిపిస్తే కొనేస్తావు, ఇక్కడ ఏ దేవుడో తెలీకుండా ఎలా వెళతాం ... అన్నారు రామారావు గారు. ఆ.. ఏ దేవుడైతేనేమిలెండి, బయల్దేరండి అంటూ బయల్దేరదీసింది భర్తను. చేతిలో కొబ్బరికాయ, హారతి పళ్ళెంతో రోడ్దేక్కారో లేదో, రోడ్డంతా రంగులు చల్లుకునే జనాలతో కోలాహలంగా ఉంది. ఎదురుగా ఓ ఇద్దరు కుర్రాళ్ళు మోటార్ సైకిలుపై వచ్చి రామారావుపై పిచికారితో రంగు చల్లి అదే స్పీడుతో వెళ్ళిపోయారు. ఆ రంగు కాస్తా కళ్ళల్లో పడటంతో రామా రావు కుయ్యో... మొర్రో అంటూ కూలబడి పోయాడు. లలితమ్మ వాళ్ళను శాపనార్థాలు పెడుతూ, ముదనష్టపు వెధవలు ఎంతపని చేసారు, ఇలా కూర్చోండి నీళ్ళు తెస్తాను అని పళ్ళెం రామారావు చేతిలో పెట్టి, చెట్టు కింద కూచోబెట్టి నీళ్ళ కోసం వెళ్ళింది. రామారావుకు ఏమీ కనపడ్డం లేదు. ఉస్సో .. బుస్సో.. అంటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ అవస్థపడుతున్నాడు. కాసేపటికి పళ్ళెంలో టప టప ఎదో పడిన చప్పుడయ్యింది. ఆ తర్వాత పక్కన హి... హి ... హి ... అంటూ ఓ నవ్వు వినిపించింది, ఆ నవ్వుతోపాటు "కొత్తా" అని వినిపించింది రామారావుకు. ఊరికి కొత్తా అని అడుగుతున్నాడేమో అనుకుని, ఆ... అవును అన్నాడు. ఊరికే అలా కళ్ళు ఆర్పుతూ ఉండకు, జనాలకి అనుమానం వస్తుంది.. గట్టిగా అరవాలి... అలా కూర్చింటే ఎవరూ వేయరుమరి అన్నదా కంఠం.

ఒక్క ముక్క అర్థం కాలేదు రామారావుకు. ఈవిడింకా రాదేమిటీ అంటూ గట్టిగానే సణుక్కున్నాడు. అదివిన్న పక్కనున్న శాల్తీ .. ఈ పక్కనే ఎగ్జిబిషను ఉంది.. అక్కడ మరీ కాంపిటీషను అంది. భజన అయిపోయినట్లుంది అన్నదానం మొదలయ్యింది అంటూ వెళ్ళిపోయింది ఆ శాల్తీ. అర్థంగాక ఎదో అడిగేలోపు, జనాలుపరిగెత్తే చప్పుడు, ఆ తర్వాత రామారావును తోసుకుంటూ, తొక్కుకుంటూ మూకుమ్మడిగా జనాలు గుళ్లోకెళ్ళారు.

హడావిడిగా వచ్చ్హిన లలితకు నీరసంగా గుడిముందు కూలబడి ఉన్న భర్త కనిపించాడు. "ఏమండీ నీళ్ళు తెచ్చాను " అన్నది లలిత. "ఇంతసేపూ ఎక్కడి కేళ్ళావ్ " మండుతున్న కళ్ళను ఆర్పుతూ తెరుస్తూ చిరాకు పడ్డాడు రామారావ్.

"అయ్యో మరిచేపోయాను, మీకు నీళ్ళు తేవాలని వెళ్ళానా ఈ పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారు, ఓ కొట్టులో చిన్ని రాగి చెంబు బుజ్జిముండ చాలా బాగుంది, వెధవది సమయానికి డబ్బులు తేలేదు, వదలబుధ్హి కావటం లేదు బుజ్జిముండ ఎంత బాగుందో.."ఏదైనా ఒకటి కొంటె ఒకటి ఫ్రీ.." సంబరంగా చెప్పుకుపోతుంది లలిత.

"నీ షాపింగ్ మండిపోనూ నన్నిలా కభోదిని చేసి, ఎక్కడికేల్లావే..పాపిష్టి దానా.." ఇంచుమించు ఏడిచినంత పనిచేసాడు రామారావు. "అర్రే.. పళ్ళెంలో చూసారా ఎంత చిల్లరో...."సంబరంగా అరిచినంత పనిచేసింది. లలిత.

"చిల్లరేమిటే? పళ్ళెంలో ఎందుకుంది..కొపదీసి నన్ను ముష్టి వెదవని అనుకున్నారా జనాలు?అయితే ఇందాక నా పక్కన చేరి మాట్లాడిందీ, నన్ను తొక్కుకుంటూ వెళ్లిందీ ముష్టి వాడా? ఎంత ఖర్మ పట్టిందే ఛి..ఛీ, ఆకరికి నన్ను ముష్టి వెధవని చేసి ఎక్కడ ఊరేగుతున్నవే ఇంత సేపూ.. ఇదేనా నీ పతి భక్తీ ?, కళ్ళు మండుతున్నాయే చేయి ఆసరా ఇవ్వు ఎక్కడ తగలడ్డావ్? అర్రుస్తున్నాడు రామారావ్.

"ఏమండీ కాస్సేపు అలాగే అరవండీ, కొంచెం సేపే, ఇంకో ఇరవయ్ రూపయిలితే చాలు, మీరిక్కడెవరికీ తెలీదు కదా! డబ్బులు ఆకొట్టు వాడి మొఖానకొట్టి చెంబు తెచ్చేస్తాను,  డబ్బులు లేకుండా ఎందుకు బేరం చేస్తారు అంటాడా.. అరవండీ, అంటూ చెట్టుచాటుకు వెళ్ళింది లలిత (తన పట్టు చీర చూస్తె డబ్బులు రాలవని).

చూసారా వారఫలాల ప్రకారం రామారావ్ గారికి ఆకస్మికంగా వచ్చిన ధనం ఎలా వినియోగమైందో... :-))


Thursday, 18 October 2012

ఇలా అనిపిస్తుందిఇలా అనిపిస్తుంది 

అలజడి రేపే  ఈ మనస్సు  కంటే  చలించని  శరీరమే  నయమనిపిస్తుంది.

అనుభవించే   వాస్తవాలకంటే   దుస్వప్నాలే  నయమనిపిస్తుంది.

నిదురరానిరాత్రి కంటే ,జ్ఞాపకాలతో  వీగిపోయే  వేకువే నయమనిపిస్తుంది.

నిశ్శబ్ద మోహపూరిత మనువు కంటే ,ముఖ పరిచయమే  నయమనిపిస్తుంది.

ఎదలోని  ఘోర  నిశ్శబ్ద యద్ధము కంటే , పెదవి దాటిన పలుకే  నయమనిపిస్తుంది.

ముఖం  తిప్పుకొనే  నిరసన కంటే, పలకరింపు లేని  విరహమే  నయమనిపిస్తుంది.

హృదయం మెలిపెట్టే  ఘోరనిరీక్షణ  కంటే , మనస్సును  మభ్యపెట్టే  ఊహే  నయమనిపిస్తుంది.

స్పందన  కలిగించలేని  స్పర్శ  కంటే,  రక్తమోడే  గాయమే   నయమనిపించింది 

రగిలించే  వర్తమానం  కంటే, నిదురించే గతమే   నయమనిపించింది.

వేదనను  భరించటం  కంటే, మనసారా  రోదించటమే   నయమనిపించింది.

శిక్షించే  అక్షరాలను  చదివేకంటే, నిరక్షరాస్యతే  నయమనిపించింది.

వేళ్ళ   చివర వేలాడే   ఈ జీవితం  కంటే  మరణమే  నయమనిపిస్తుంది. Monday, 15 October 2012

అడగకు చిరునామా

   నా గుండె  గుడిని  నీకోసం  వదలి  వెళ్తున్నా.

   వసంతాన్ని నీకైవదలి  శిశిరాన్నై  సాగిపోతున్నా.

   నీ చల్లని  చూపులని కన్నుల్లో దాచుకొని వెళ్తున్నా.

   నీ పాద ముద్రలను ముద్దాడి  వెళ్తున్నా.

   రాలిన పారిజాతాలతో నీ పేరు రాసి వెళ్తున్నా.

  తపననీ, తాపాన్నీ ఇంటిగుమ్మానికి తోరణంగా కట్టి వెళ్తున్నా.

  మదురమైన నీ మాటలను మనస్సులో  నింపుకొని వెళ్తున్నా.

  నా ప్రేమలేఖలను  వాకిటి పరదాలుగా కట్టి వెళ్తున్నా.

  నీవిచ్చిన చిరుకానుక  నీకే అర్పించి వెళ్తున్నా.

  నీ అరచేతిలో ఆరుద్రను  చూసి, మినుగురునై ఎగిరి వెళ్తున్నా.

  నీ నీడను నీకే వదలి నా జాడనే  దాచి వెళ్తున్నా.

  నేనుభవించిన శిక్షను  ప్రతి అక్షరాన అద్ది  నీకంకితమిస్తున్నా. 

 నా చిరునామా నీకిచ్చి,ఇకముందు ఏ  ఉత్త్తరానికై  ఎదురుచూడక   వెళ్తున్నా.Friday, 12 October 2012

కంటి దోషమా?


కంటి దోషమా?

ప్రత్యూష  హిమబిందువుల   అందాలు  కనిపించవు  నాకు.
టీ  కొట్టుముందు బెంచీలు తుడిచే  చిరుగు చెడ్డీ బుడ్దోడే  కనిపిస్తాడు.

నిద్రలేస్తూనే    ఏ  ప్రభాతగీతాలూ   వినిపించవు  నాకు, 
ఆరేళ్ళ  చిన్నది  బంగాళామెట్లు  తుడిచే  చీపురు  చప్పుడే వినిపిస్తుంది.

యజమానివెంట  వాకింగ్ చేసే  బొచ్చుకుక్కల  విన్యాసాలు  కనిపించవు నాకు,
పాచిపోయిన అన్నం  కతికి   కక్కుకునే  బక్కకుక్కలే  కనిపిస్తాయి.

స్కూలు బస్సులో వెళ్ళే  పావురాళ్ళలా  ఉన్న పసి పిల్లలు కనిపించరు  నాకు
మెకానిక్ షెడ్డులో స్పానరుదెబ్బలు తినే మరకలంటిన  పసి మొఖాలు కనిపిస్తాయి.

భాగ్యవంతులిచ్చే  విందులో   పళ్ళూ , పలహారాలూ    కనిపించవు  నాకు,
ఎంగిలి  ఇస్తర్లలో కుక్కలతో కలబడి  కతికే   నిర్భాగ్యులే  కనిపిస్తారు.

కారులో తిరిగే కలవారి   ఆడబిడ్డల  సుకుమారం  కనిపించదు  నాకు,
సిమెంటులో  పనిచేసే  ఆడకూలీ అరిగిపోయిన కాళ్ళే కనిపిస్తాయి.

అట్టహాసంగా  సీమంతం  చేసుకొనే  సినీతారలు   కనిపించరు నాకు,
నెత్తిమీద  తట్టనెత్తుకొని  నిచ్చెనెక్కే   నిండు చూలాలే కనిస్పిస్తుంది.

బాబు సంపాదిస్తే  బలాదూర్ గా  తిరిగే  బడుద్దాయిల  డాబు కనిపించదు నాకు 
బతుకు  పుస్తకానికి  భవిత  అట్టలేసుకొనే మధ్యతరగతి  యువతే కనిపిస్తుంది.

వనోత్సవంలో  అరటిఆకులో తెల్లటి మల్లిపూలంటి   వరియన్నం   కనిపించదు  నాకు
పురుగుల మందు తాగిన రైతన్న నోటివెంట వచ్చే తెల్లటి  నురగే  కనిపిస్తుంది 

నా కంటిపాపల నిండా ఒలికిన జీవిత విషాదాలే,
నా చెవుల నిండా  తెగిన కంఠ మూగరోదనలే,

నాకీ ప్రపంచమంతా  వింతగా కనిపిస్తుంది,,అందమైన అద్దంలో వికృత రూపంలా..
                                                  

Saturday, 6 October 2012

నిన్నేమనుకోను

అలజడి అంబుధిలో మునుగుతున్న నాకు ఆధారంలా అనిపించావు,

ఆశగా పట్టుకుంటే... విదిలించి వదిలించుకున్నావు.


చింత సంద్రాన మునిగిన నాకు చిరుహాసంలా చేరువయ్యావు.

పట్టుకొని అధరంపై అద్దుకోనేలోగా..నిట్టూర్పువై నిష్క్రమించావు.


అంధకార పయోధిలో పడిపోయిన నాకు కాంతిరేఖవై కనిపించావు.

పట్టుకుని కళ్ళలో పెట్టుకొన్నానో లేదో .. కంటిపాపనే ఎత్తుకెళ్ళావ్.


కలల కడలిలో మునుగుతున్న నాకు స్వప్న కెరటంలా కనిపించావ్.

కళ్ళుమూసుకొని స్వాగతించానో లేదో..కలతనిద్రవై కష్టపెట్టావ్.


దిక్కులన్నీ ఏకం చేసి వెతికి,వెతికి జనసమూహాన నినుగాంచి,

పరుగున వచ్చి పలకరినచానో లేదో...అపరిచితునిలా వెడలిపోయావ్.


ద్రవించే హృదయం,మతిలేని మనస్సూ నీ చుట్టూ భ్రమిస్తున్నాయని ,

తెలుసుకోన్నావో లేదూ, కక్షగా వాటి కక్ష్య మార్చివెళ్ళావ్.


విసిగి,వేసారి ఈ వెక్కిరించే ఊహలన్నీ నను ఊపెస్తుంటే ఊపిరి సలపని,

ఉరిఊయల ఊగాలనుకున్నానో లేదో..ప్రాణవాయువై పలకరించావ్.


ప్రతి రోజూ నన్ను నేను గుర్తుచేసుకుంటాను శాపము మోసే శకుంతలలా,

చిరునవ్వుతో పలకరిస్తావ్ అసలేమీ నీకు తెలియదన్నట్లుగా...