Pages

Monday, 30 June 2014

నీకై... నిరీక్షణ

    

   


     నీకై... నిరీక్షణ 


    మన్నూ,మిన్నూ  ఏకం చేసి,
    ఎదురు తెన్నుల  నయనాలు నీకై , 
    దారంతా పరచి ఉంచాను.

    తనివి  తీరని  ఆశా దాహంతో,
    గుండె  ఆర్చుకుపోతుంటే,
    ఎద తలపుల తడితో  తమీ తీర్చాను. 

    సడిచేయని  నిశిరాతిరి ... ఈ వీధి  నిశ్శబ్దంతో
    జత కడుతూ.. నా కన్నీటి మడుగులో,
    నీ ప్రతిబింభాన్ని  చూస్తున్నాను.

    ఊహల చరణాలను వల్లెవేస్తూ,
    ఊపిరి  నిట్టూర్పులతో పల్లవిస్తూ,
    నీకై  అన్వేషిస్తున్నాను .

    నెమరువేతలు పచ్చిగాయాలై,
    నిదురలేని నయనాలు  నిప్పుకణికలై,
    నెత్తురొలుకుతున్నాయి.

    నిప్పుల నెగడులో  ఎదకాగు నిండా,
    వ్యద వంపుకొని  మరణరహిత సమీరాన్నై,
    సంచరిస్తున్నాను. 

    నీ తలపుల తోటలో..,
    నెత్తుటి  పూల నెత్తావినై..,
    నీకై  పరాగమై  పరుగెత్తుతున్నాను. 

    నా ప్రాణమా..., 

    ఓ మారు ఈ దారివంట నడిచి వెళ్ళు,
    నీపాదాలు కందకుండా..,  
    నా అరిచేతులపై  నడిపిస్తాను.   

Thursday, 26 June 2014

నీకై...వేచి.

    


    


    నీకై...,

    నీ ప్రతి కదలికా 
    ఓ కడలి అలై...,

    నీ ప్రతి చర్యా..,
    ఓ  సంకేతమై....,

    నీ ప్రతి  తలపూ...,
    ఓ నిట్టూరుపై .., 

    ఈ  జీవితమూ..,
    బహు భారమై..,

    నీవు  ఊహించగలవా..?
    నేనిలా గుండెకోతను  రాతగా మార్చుకున్నానని. 

    నీకు తెలుసా...? 
    బ్రతుకు  పరాదీనమైనదనీ..,
    అగోచర అభిమానాల్లో..... , 
    అక్షరీకరించలేని కావ్యమైనదనీ... ,
    కంటి నీటిని  కలం సిరాగా   వాడుకొని,
    కరకు పాళీతో  విరహపు   కవిత రాస్తుందనీ...., 


  

Tuesday, 24 June 2014

రాగం పరాగమైతే....

    

    రాగం  పరాగమైతే.... ,

    ముందుకు వేసే  ప్రతి అడుగూ ..,
    చీకట్లో తడబడుతూ.. తూలిపోతున్నట్లూ ,

    కొన్ని కల్పనలు  వాస్త రూపాన,
    చిక్కటి  అభిమానాన్ని  చిలుకుతున్నట్లూ,

    నాకు నేనే నప్పని ఎన్నో వైనాలు,
    నన్ను నేను చిన్నబుచ్చుకునే 
    ఎన్నో సందర్బాలూ....,

    అంతరంగ  మనొవేధనే  ఎప్పుడూ..,
    అజ్ఞాత  తెరువరిలా....,అరుదెంచుతుంటే,

    మినుగురునై వెతికే సమయాన రెక్కలు తెగి,
    గాయం మీది గాయం.. 
    నను మరింత మానవీయం  చేస్తుంది. 

    దూరాన  నీవున్న  పూలసౌధమూ ,
    నీ చుట్టూ నర్తించే  దీపకాంతీ..., 
    నా  జైలు  గోడలను పరామర్శిస్తుంది. 

    ఆ కాంతి  ఏ నడిరేయినో..నన్నాలింగించుకొని,
    ఓదార్చి  నా గుండెలపై  క్రీనీడలా తేలుతూ,
    నా మనోగతమై  నిలుస్తుంది. 

    అందుకే..., 

    తెగనరికిన  ఈ మోడును,
    చిగురులెత్తించటము  నీ తరం  కాదు,
    స్వాతి చినుకువై..... అమని చెక్కిలి ముద్దాడు, 

    అలిగిన  ఇంట  మలిగిన  దివ్వె,
    వడిశిల  తగిలిన విహంగమై..,
    నుసిగా...... నేలరాలి ..,
    నీ  అరికాలిని  దిష్టి చుక్కగా  ముద్దాడునేమో.....  

 Monday, 23 June 2014

నీ తోడుకై.....,

    

     
     


    నీ తోడుకై.....,

    నిరీక్షణో..... తపస్సో తెలీదు,

    ఉలి చేతపట్టి  కాలాన్ని తొలుస్తూ,

    మదినిండా ఎదురుచూపుల కవాతులైతే..,
    ఎదరంతా..,ఎగిసిపడే సాగర ఘోషే..,

    కాలమంతా  కాలుడై కాటేస్తుంటే..,

    కొత్త  స్వర్గాన్ని  సృష్టించాలనే   ఆశతో..,

    గుండెలో పాకుతున్న పొడి,పొడి పదాల్లో..,

    తడి నింపుకున్న తడబడే  తమకంతో... ,

    ఒలుకుతున్న  వాలు  పొద్దు,

    గాయం  చేసి  వెక్కిరించి సాగిపోతుంటే..,

    లోన  దాగిన  నీ తలపుల  వలపురంగును ,

    మనోపలకంపై  చిత్రించాలని చూస్తూ.., 

    కొత్త  కొమ్మవై  విస్తరిస్తూ  నీవూ...,

    రాలుపూవునై...,రంగు కోల్పోతూ నేనూ..,

    నిస్సారమైన  ఈ నిరీక్షణ,

    నిక్షిప్త  హృదయం  చాటున...,
    లక్ష్మణ రేఖను దాటలేనంటుంది.  

Saturday, 21 June 2014

సరిగా...అడుగేద్దాం


   


    సరిగా...అడుగేద్దాం 


    ప్రతిరాత్రీ  నా నుండి నిద్ర, 
    అలిగి తొలిగి పోతుంది. 

    వేలవేల నూలుపోగులను 
    వస్త్రం గా మలచే  మగ్గం 
    మూలపడిఉంది. 

    నట్టింట  తిష్టవేసి ,
    అమ్మ తాళానికి నాట్యమాడే
    కుట్టు మిషను  
    వయసు పైబడి పాడెక్కింది.

    పొలం గట్లలో  పహారా కాస్తూ.. 
    వీరజవానులా
    ఫోజులిచ్చె నాన్న
    షాపింగ్  మాల్ ముందు 
    సలాములు కొడుతున్నాడు. 

    నాకు ఉద్యోగం కావాలి,
    కాదు,కాదు కొలువు కావాలి,
    అందుకు నేను 
    ఎక్కడ పుట్టానో తేలాల్సి  ఉంది.

    నాచెళ్ళెల్లకు 
    చదువులు కావాలి,వారికి 
    రక్షణ నివ్వలేని  
    నాలుగో  సింహాలు
    నవ్వుల పాలవుతున్నాయి   
      

    దేహరహిత  కీటకాలు 
    నన్ను చుట్టి ముట్టి నట్లుంది.
    మునిగిన చేదలా బావినుండి
    బైటపడాలంటే.... 
    చేయూత కావాలి. 

    ఏమి చేద్దాం,.......భాయ్,


    "ఈజీగోయింగ్" 
    బాటసారులం  మనం,
    పక్కనున్నోళ్ళను 
    పట్టించుకోం. 

    మనకెందుకులే
    మనదాకా రాదులే
    అనుకొని మడుగులో 
    పడే దుర్యోధన  వారసులం . 

    ఇసుక తుఫానులు 
    ఎగరేసుకుపొతుంటే,
    పిచ్చుక గూళ్ళు కట్టుకొనే
    పిరికివాళ్ళం. 

    కడలి కెరటాలు 
    ముంచెత్తుతుంటే
    మునిగి తేలే.. ,
    నత్తగుల్లలం  మనం 

    ఇకపైనా... వద్దు..,

    శ్రమను చరిత్ర చిహ్నం గా,
    ఎగరేసే  శ్రామికులమౌదాం ,
    ఆకలి తీర్చే 
    పాలనా  జండాలవుదాం. 
  

Monday, 16 June 2014

పుస్తక విలాపం    పుస్తక విలాపం 

    నీ తాలూకూ  వాసనలింకా...,
    ఈ  ప్రాంతాన్ని  వదలిపోలేదు,
    నీవు నన్ను వదలి వెళ్ళగలవని, 
    నేనూ  అనుకోలేదు. 

    నీ చెలిమిలోనే సంస్కారం 
    అలవడింది అన్నావు. 
    ఎక్కడికెళ్ళినా... నా చేయి, 
    నీ చేతిలోనే ఉండేది. 

    ఎవరైనా సాహితీ మిత్రులొస్తే,
    నన్ను గర్వంగా వారికి , 
    పరిచయం చేసేవాడివి,
    నా గూర్చి ఎన్ని గొప్పలో.... ,

    ఎన్నో వస్తువులను,
    ఈ ఇంటినుండి మోసుకెళ్ళావు,
    నన్ను దాటుకుంటూ, 
    ఒక్కసారైనా నన్ను  చూడలేదు. 

    ఒక్కసారి వెనక్కి తిరిగి,
    చూసి ఉంటే.., 
    పాలిపోయిన నాముఖాన ,
    దిగులు రేఖలు నీకు  కనిపించేవి,

    నన్ను విరాగిని చేసి వెళ్ళావు,
    వెక్కిరించే  ఖాళీ గదిలో..,
    వెక్కి,వెక్కి  ఏడ్చాను,
    దిక్కులేనిదాన్నయ్యాను. 

    అపరిచితులు 
    నన్ను బైట నెట్టారు,
    ఇప్పటికీ ఆరుబైట,
    నీకోసం ఎండా,వానా అనక 
    ఎదురుచూస్తున్నా..,

    ఓరోజు...,

    ఇదే దారిన వెళ్తూ...,
    నాకు కనిపించావు, 
    పాలిపోయిన ముఖంతో,
    మట్టికొట్టుకున్న  నన్ను చూసి,
    గుర్తుపట్టలేదు,

    అవును  మీ చేతిలో  
    తన చేయి నుంచిన,
    మరో  నెచ్చలి,
    అవును హస్తభూషణం . 

    హుందాగా నడిచి వెళ్ళే,
    నిన్ను చూసి,
    గర్వంగా  నవ్వుకున్నాను,
    నిజమే నా వల్లనే నీకు గుర్తింపు,

   

  


Sunday, 8 June 2014

అమ్మవై..మన్నించు
   అమ్మవై..మన్నించు 

    కణాల కౌగిలినుండి  విడివడిన,
    పిండం నువ్వు,

    జీవనాళాలను  మేళవించుకొని, 

    ఊపిరికై  తపించావు. 

    మగత  కమ్మిన   మీఅమ్మ  కళ్ళకు,

    దూరమైన  దీపం   నీవు. 

    తను  చేజార్చుకున్న  కాలం  కౌగిట్లో,

    అదృశ్యమైన  ఆనందం  నీవు. 

    అంతరించిన సంతోషపు చాయల్లో,

    బుడి,బుడి,అడుగుల  ఆత్మీయ తడి నీవు. 

    కసాయిలకు  బయపడి  వారికి  నీ కుత్తుకనిచ్చి,

    మూడునెలలకే  సాగనంపిన పిరికి పంద  మీ అమ్మ. 

    కన్నీరింకిన  ఎద ఎడారిలో ,

    నిన్ను సైకతచిత్రం గా  చిత్రించాలని  చూస్తుంది. 

    హఠాత్తుగా నిన్ను సాగనంపి,అన్నివేళలా శిశిరమై,  

    నీకై రక్తాశ్రువులు  రాలుస్తుంది. 

    అంతర్వేదనలో  ఆవిష్కరించిన నిజాలను,

    నీ  న్యాయస్థానమందు  ఉంచి, 
    వద్యశిలపై... తలనుంచి  శిక్షకై  ఎదురుచూస్తుంది. 

    అమ్మా.. అనేపిలుపును కోల్పోయినా...,

    కనుల వాకిళ్ళు  నీకై తెరచి  
    నీ నవ్వుల పువ్వులు రాలుతాయనీ...,

    ఏ ఇంటనైనా ఊపిరి పోసుకొని,

    కాంతి  పుంజమై.... కనిపిస్తావనీ.... ,
    ఎదురుచూసే  నీ తల్లిని  మన్నించు.   


   

Monday, 2 June 2014

కొత్త (బాట) చోట

    


    కొత్త (బాట) చోట 

    నీ వంతుగా  మిగిలిన  మెతుకుల్ని ,
    ముద్ద చేసుకు  తినటం  నేర్చుకో. 

    తేనెటీగల జోలె నీకెందుకూ..,
    పూ.. మకరందం నీదే అనుకొ... 

    వర్షం వెలిసిందా.. అని చూడు,
    ఇల్లు ఉరుస్తుందా అని చూడకు.

    అడ్డదారుల  సూత్రాలూ..,అర్దం లేని అపార్దాలూ,
    దారితప్పిన  దారిద్ర్యపు  తలపులే తెలుసుకో..,

    రాజ్యం మారిందా  అని  రంకెలేయకు,
    రాచమార్గం  వెతుక్కొని  నడువు.

    మూర్ఖుల  కార్కానాలో నమూనా కాకు,
    ముప్పు  ఎరిగి మసలుకో. 

    కొత్త వింతా కాదూ, పాత రోతా కాదు.
    నవ్యదారిలొ... నీ భవిత వెతుక్కో. 

    కాల చరిత్రలోకఠిన  సత్యమే ఇది.
    నేటి నుండీ  నీ  బాటవెతుక్కో..., ఇంత చోటు చూసుకో.