Pages

Thursday 19 March 2015

సంహిత.

    





   సంహిత. 

    నేను  కలలు  కనటం  మానేసినప్పుడల్లా,
    నన్ను వెతుక్కుంటూ వస్తుంది. 

    నాపై రవ్వంత చిరునవ్వునీ,కొండంత కోపాన్నీ,
    కుమ్మరించి హడావిడిగా, 
    వెడలిపోతుంది. 

    నా  ముంజేతి పై ముద్దు పెట్టి,  చెవి మెలిపెట్టి, 
    నెత్తిపై  మొట్టి, తడబడుతుంటే  
    తమాషా చూస్తుంది. 

    అనంత  జనాంబుధిలో  ఉక్కిరిబిక్కిరై ,
    దిక్కుతోచక నేనుంటే, 
    లంగరేసి పక్కకు లాగుతుంది. 

    నన్ను పొద్దు తిరుగుడు పువ్వులా తిప్పి,తిప్పి,
    రాత్రికి తులాభారమేసి, 
    సత్యకు అమ్మేస్తుంది. 

   కునుకుపడేవేళ  కురంగిలా వచ్చి,
   అంతులేని ఈర్ష్యతో,
   సివంగిలా  గర్జిస్తుంది. 

    వెదురు వేణువునై  నేను  వేదన వినిపిస్తే..,
    నన్ను పొత్తిళ్ళలో పాపాయిని చేసి,
    హత్తుకుంటుంది. 

    చిరు గడ్డాన్ని చివుక్కున  కొరికి,
    బిక్కమొఖం వేసిన నన్ను, 
    అక్కున చేర్చుకుంటుంది.