Pages

Friday, 29 August 2014

నీడనిచ్చిన నా చెలి    


   నీడనిచ్చిన  నా చెలి 

   
    


   అను నిత్యం  నన్ను వెన్నంటి ఉండే నా చెలి 
    హటాత్తుగా అదృశ్యమైంది. 

    తన  అంతరంగ  బందీఖానా  నుండి

    నన్ను విముక్తుణ్ణి  చేసింది. 

    తన మాటల  స్పర్శతో  లాలిస్తూ,

    నా  అనాలోచిత పలుకులనే 
    అమృతగుళికలుగా,
    స్వీకరించేది. 

    అడుగడుగునా  అక్షర సుగంధమై,

    భావ సోపానమై నా పాదాల కింద,
    తన  అరచేతులుంచేది. 

    తనో   అనుభవ వటవృక్షమైననూ ,

    నా ముందు నేల తంగేడులా,
    తలవంచేది . 

    ఎన్నోసార్లు  అనుకోని ఒప్పందాలూ ,

    మరెన్నోసార్లు నిశ్శబ్ద  సంకేతాలూ,
    పలితంగా..,కమ్ముకొనే కారుమేఘాలూ . 

    నా చుట్టూ  ఆమె కట్టే సాలీడు దారాలను సైతం,

    భరించలేని సున్నితుడనై ,
    భావోద్రేకుడనై ...,
    మన:చంచిలుతుడనై ,
    మౌనరోదితుడనై,..హోరెత్తే కడలి తరంగాన్నై,
    ఆమె కాలికింది భూమిని లాగేసుకున్నాను. 

    ఆ సమయాన  అలిగిన నా అభిసారిక,

    నన్ను  పరాదీనుని చేసి ,
    పయనమై  సాగిపోయింది. 
    అర్దంలేని అపోహలతో, అపార్దాలతో,
    అదృశ్యమై  పోయింది. 
    ఆమె నీడ మాత్రమే నాకు మిగిలింది.  
  


   

Friday, 22 August 2014

అది నీవే... ,
      అది  నీవే... ,


    ఆశవై ,
    అశాంతి వై,
    ఆత్మవై ,
    ఆవేశానివై,
    అనాలోచితవై,
    ఆరాటానివై,
    ప్రాప్తివై,
    ప్రారబ్దివై ,
    మర్మమై ,
    ఖర్మమై,
    అనంతమై,
    మోహమై ,
    మోదమై,
    వ్యామోహమై ,
    స్పర్శవై ,
    స్పర్ధవై ,
    కలవై,
    అలవై ,
    ఊహవై ,
    ఊపిరివై,
    హోరెత్తే  కెరటానివై...ఎగసి పడతావు.

    కలవరమై,
    పలవరమై,
    అస్థిరమై ,
    అస్తిత్వమై,
    అమాయకమై,
    అయోమయమై,
    అనుమానమై,
    పరోక్షమై,
    పక్షపాతమై,
    ప్రజ్వలమై,
    ప్రతికూలమై,
    ప్రాప్తమై,
    పాదరసమై ,
    జలమై,
    జ్వలనమై,
    అంతుదోరకని  అయోమయాన  అలమటిస్తుంటాను.

    ఆత్మను కమ్మేసే చీకటిలో,
    ఆకలిని మింగేసే  ఆలోచనల్లో,
    అర్ధం కాని మనో వత్తిళ్ళలో,
    ఊపిరి సలపని ఉక్కిరి బిక్కిరి క్షణాలలో ,
    ఆశ,నిరాశల మద్య అలమటించే వేళ....,
    మాటవి,
    పాటవై ,
    ఆటవై ,
    పూదోటవై,
    మానసిక వేటవై,
    అభినందనాక్షరానివై,
    అంత:సంతసానివై,
    మనోదన్వంతరివై ,
    మది గాయాన్ని  మాన్పెందుకే  మనువాడావు 
Saturday, 16 August 2014

మేరీ ప్యారీ....మా.
    
    మేరీ ప్యారీ....మా. 


    ఆశ  నిరాశల సుఖదు:ఖాల ఆటవిడుపుల్లో 
    మరణిస్తూ,జీవిస్తూ..,
    సతమవుతుంది  భారతమ్మ. 

    కొత్త చిగురుల  ఆవిష్కరణలో,
    పాత తెగులును పోగొట్టుకోవాలని 
    చూస్తుందీ  కొమ్మ. 

    నెత్తురోడుతున్న రహదారుల్లో ,
    పచ్చటి పాదాలను మోపలేక ,
    కుంటినడక నడుస్తుందీ  అమ్మ . 

    పల్లె నుండి  పట్టణాల దాకా   
    నాగరికత   బట్టలూడదీసుకొని  బలాదూర్గా,
    తిరుగుతుంటే  గాంధారిలా.., 
    కళ్ళకు  గంతలు కట్టుకొని  గడిపేస్తుంది 

    రక్కసి  రాబందులు  
    లేత గువ్వలను ముక్కున కరచుకొని,
    పొడిచి,పొడిచి  ఈకలు పీకి వీధిలోకి విసిరేస్తుంటే, 
    జెండా కప్పి  సంతాపం  తెలియజేస్తుంది. 

    అంతము  కాని  మతం మంటల్లో,
    కుళ్ళిపోతున్న  కులం కంపులో,
    ముక్కు మూసుకొని మునుగుతుంది. 

    ఓటు  పడవలో  పయనిస్తూ ,
    ఎప్పుడు మునుగుతారో తెలీని తన బిడ్డలకు,
    మువ్వన్నెల  తెరచాపను  అడ్డుపెడుతుంది. 

    దిగాలు పడే అమ్మకు ,
    దైర్యం చెప్దాం,


    గండుచీమలు కొండను మింగలేవనీ..,
    ఏనుగు ను కుక్కలెప్పుడో గెలవలేవనీ..,
    అమ్మపాల  రుణాన్ని అసురులడ్డుకోలేరనీ...., 
Friday, 15 August 2014

నా రాతలు    నా  రాతలు.

    

    దోసెడు  అక్షరాలను ,
    ఎప్పుడొ  బడి కొమ్మ నుండి
    ఒడిలోకి రాల్చుకున్నా...,

    అను నిత్యం ఆ ముత్యాలను,
    మెరుగు పెడుతూ,
    మురిసిపోతున్నా..,

    అప్పుడప్పుడూ అవి నక్షత్రాలై,
    మినుకు,మినుకు మని వెలిగి,
    నన్ను గగనాన నిలుపుతుంటాయి.

    అక్కడక్కడా వేదనలై..,
    జ్వాలలా ఎగసి,
    నన్ను కాలుస్తుంటాయి.

    కొన్నిసార్లు  నీటిమీద రాతలై,
    చెరిగి పోతూ,
    కనుమరుగవుతుంటాయి.

    చాలా సార్లు విలువలేని,
    ప్రేమ సందేశాలై..,
    వెక్కిరిస్తుంటాయి.

    ఎక్కువసార్లు
    ఆకలి కేకల నినాదాలై,
    అంగలార్చుతుంటాయి.


    ఇహానికీ,పరానికీ...,
    నిజానికీ,ఇజానికీ, మద్య నలుగుతూ,
    మరణానికి సమీపాన,......... ఊపిరి సంతకాలై  ఉరితీస్తుంటాయి .

Tuesday, 12 August 2014

అతి (వల) లు

          అతివ(ల)లు

    మా కలలపై సుపరిచిత చిరునవ్వుల వలలు వేసి,
    వలపు ఎరవేసి ,సహవాస గాలమేసి ,
    ముద్దుచేసి ముచ్చటగా వలవేస్తారు.

    మా ఉద్రేక  సహిత భావాలపై ,
    ఉద్విజ్ఞ భరిత ప్రేమలపై ,రంగుల కలలపై,
    హంగుల,హంగామా గుప్పించి,
    కనిపించని కఫన్  కసితీరా కప్పుతారు.

    మా  సున్నిత హృదయాలపై,
    సూటిగా అనుమానపు అంకుశాన్ని గుచ్చి ,
    మా కన్నీటి తిరుగుబాటుపై ,
    విరుగుబాటై వంటింటి కుందేళ్ళను చేస్తారు.

    మా కడుపుతీపీ,గర్భసావ్రాలకూ ,
    మా  అంతర్యుద్దాలకూ, అశ్రువులకూ ,
    ఇసుమంతైనా చలించక ,
    నిరసనగా..,నిష్క్రమిస్తారు.

    దిక్కుతోచక అంధులమై ,
    నాలుగు  గోడలమద్యనే,
    పదే,పదే పరాజితులమై,
    నెత్తుటి కన్నీళ్ళతో వెక్కుతూ ఉంటాము.

    గోనె సంచులకెత్తిన  అనాథ శవాల్లా,
    అడవి మృగాల అభిరుచులకు అనుగుణంగా,
    మలచబడ్డ మంచు శిలలమై ,
    కరిగిపోతుంటాము.

    అందం తగ్గుతుందనో,ఆడపిల్ల పుడుతుందనో,
    రహస్య గర్భాసావ్రాల  రక్తచరిత్రలమై,
    పుఠలనిండా ,పరిగెడుతూ,
    ముఖచిత్రాలమై  సిగ్గుపడుతుంటాము.

    ఇంటిగుట్టు అనే ముళ్ళకిరీటాలను  పెట్టుకొని,
    పలుమార్లు  మమ్ము మేమే ,
    శిలువ వేసుకుంటూ ఉంటాము.

    కానీ,

    వచ్చేతరాన్ని  రక్షించేందుకై,
    మమ్ము మేము  పుస్తకాలుగా మలచుకొని,
    ప్రతిమలుపువద్దా...,సలివేంద్రమై,
    మా చిట్టి తల్లులకు సేద తీరుస్తాము.


   

Thursday, 7 August 2014

చలన శిల.
  
    చలన శిల. 

   ఒక  స్వప్నం  ఊపిరి సలపక 

   సతాయిస్తుంది. 
   చిరునవ్వుకూ,కన్నీళ్లకూ ,
   సమన్వయం  కుదర్చలేకుంది. 

   అసమాన  అభిమానాన్ని,

   మది  మోయలేకుంది. 
   స్పందనకై..క్షణ ,క్షణమూ  
   ప్రాణాన్ని వెతుకుతుంది  

   నిద్రరాని అశాంతి రాత్రుల్లో,

   చలన రహిత  తలపులను,
   తలనుండి  మరల,మరలా,
   తోడి పోసుకుంటుంది. 

   పలాయనమయ్యే ఆత్మ బంధాలను,

   పలకరించి,పలవరించి,
   నిరసన రుచి చూసి,
   నిస్సహాయతతో... నిదురిస్తుంది. 

   భయంతో చీకటి గదిలో 

   ముడుచుకున్న,ముఖాన్ని ,
   అరచేతుల్లో తీసుకున్న ,
   ఆత్మీయ స్పర్శ...,

   అకాల దు:ఖాన్ని పారద్రోలుతూ,

   మనో మందిరాన,
   మత్స్య యంత్రాన్ని  చేదించే,
   మహా వీరుడొస్తాడని ఎదురుచూస్తుంది..  

Wednesday, 6 August 2014

మనో...విన్నపం

     


    మనో...విన్నపం 

     నిన్ను నువ్వు కాదేమో అన్నానో  ..,కోపం నీకు. 
     కానీ...  నువ్వు నువ్వు కాదనే  నమ్మకం నాకు. 

     నిన్ను వెతికే నెపంతో నన్ను నేను,

     జారవిడుచుకుంటుంటాను.  
     వ్యక్తిగతం  నుండి  నిన్ను గతం గానే ,
     స్వీకరిస్తాను నేను . 

     వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు, 

     చలనానివే కావచ్చు,
     కానీ, నా మనోదారిలో  ఎదురైన  ..,
     పసిపాపవే  నాకు. 

     నీకు తెలుసా...?


     నిను నెలవంకను  చేసి ,

     వేల తారకలు నీ చుట్టూ బ్రమించే వేళ,
     విరిగిపడిన వెన్నెల కిరణ్ణాన్నై ..,
     నేలరాలుతుంటాను. 

     కానీ ,సమూహాన్ని వీడి,

     నా నెత్తుడి అడుగుల  వెంట చూపు సారించి,
     నను అందుకొనే వరకూ  
     విశ్రమించని నెలరేడువు నీవు. 

     నా శిరస్సుపై మోసే  నమ్మకాన్ని 

     అతి పదిలంగా చూసుకుంటూ..,
     అలుపెరుగని అభిసారికలా....,
     అను నిత్యం  నిరీక్షిస్తుంటాను. 

     ఓ వెన్నెల  సంతకమా..,

     ఓ అరవిరిసిన వసంతమా..,
     అలుపెరుగని సమీరమా...,
     నా అపురూప వరమా..,

     ఏ కొనలో విరిసినా..,పరిమళమై  కదలి రావా...?

Saturday, 2 August 2014

నా గదిలో... సమాదినై.

    


    నా   గదిలో... సమాదినై. 

     రోజంతా పరుగెత్తిన జీవితం,
     రాత్రికి గదిలో బంధీ అవుతుంది. 

     విశాలమైన  గదియైనా..,
     ఏదో ఇరుకు భావన. 
     గది వారగా మేజాపై  సగం రాసిన, 
     కాగితాల వెక్కిరింతలు,
     తలుపులు  బిగించుకున్నా.., 
     వెంటాడుతున్నట్లున్న ,
     చింపిరి లేత దేహాలు. 
     నేను రోజంతా లిఖించినా,
     అక్షర రూపం లేని 
     సిరామరకలు. 
     

     ఓ పసిదాని  ప్రశ్న ,
     నన్నింకా  నిలదీసి,
     ఉరికొయ్యకు  బిగదీసినట్లుంది. 

     మేడమ్ ఇక్కడ అన్నం పెడతారా? 

     అక్షరాల అగాధాలమద్య, 
     కూరుకుపోయిన నేను,
     అర్దంలేని   ప్రశ్నేంటి అన్నట్లు ,  
     స్వార్ధపు నవ్వు నవ్వాను. 
     అక్షరమే తప్ప ఆకలి ఎరుగను,
     గొంతు నొక్కిన ఆకటి అరుపులను, 
     ఎలా వినగలను?  

     శవపేటిక వంటి ఈ గదిలో,
     స్వయంకృత బంధీనై ,
     గుండెను నిప్పుల నినాదాలలో, 
     కవాతు చేయిస్తున్నా,  
     ఆ ..పసిదానికి  ఆకలి తర్వాతే 
     అక్షరం నేర్పాలని, 
     తెలుసుకున్న విద్యార్ధినై..,
     మదిలో రేగే  జ్వాలల్లో, 
     అసమర్ధపు సమాదినై..., 

      

  

Friday, 1 August 2014

రెప్పలు మూయని కల

   

   రెప్పలు  మూయని  కల 

    నిదురించే లోకాన్ని 
    నిషేదిస్తూ..,

    సగం రాసిన రాతల 
    కళ్ళును  కడిగి మేల్కొలుపుతూ ..,

    పదాలను కూర్చి 
    బొమ్మచేస్తూ ..,

    దాని పేరును 
    పెదాలతో  పలుకుతూ ..,

    ప్రేమో,స్పర్శో ...
    దేన్నో వెతుకతూ ...,

    శిరశ్చేదిత   దేహాన్నై..,

    ఈ కిటికీ  కటకటాలకు  
    తలవాల్చి ,

    కనులనుండి 
    రాలిన కలలను,

    తిరిగి రెప్పలపై 
    అద్దుకుంటూ  ...,

    తిరణాలలో తప్పిపోయిన  
    పసి పిల్లాడిలా...,

    అల్లాడే గుండెను  
    ఆశల తల్లినై  హత్తుకుంటూ..,

    నీవు తెచ్చే వసంతానికై ..
    దోసిలొడ్డుతూ ...,

    నేనిక్కడ  శిశిరాన్నై.., 
    నిరీక్షిస్తున్నా ...,