Pages

Tuesday, 29 April 2014

నేనెవరినో తెలుసా..?

    


   నేనెవరినో తెలుసా..?

    విరుల  సిరులకై  దోసిలొగ్గిన,
    వనమంతా తిరిగే  వనమాలిని. 

    నిత్యం నీ సమయాన్ని కొలిచే,
    చంచలిత   కొలమానాన్ని. 

    తలపుల దారిలో నీతో అడుగు కలిపే,
    ఊహల బాటసారిని. 

    అంతర్ గవాక్షం నుండి నిను గాంచె,
    అదృశ్య  నయనాన్ని. 

    నీవు రగిల్చిన  నిప్పుల నెగడులో,
    రాలి  పడుతున్న  నివురుని. 

    నీలి మేఘాల చీకటి  మాటున,
    జాబిలికై నిరీక్షించే  అభిసారికని. 

    మరణ రహిత  అమృత  కలశాన్ని. 

Monday, 28 April 2014

స్పందన రావాలి         స్పందన రావాలి  


    కష్టాలను  గట్టేక్కించాలి అనుకున్నప్పుడు ,
    కాళ్ళు  ముడుచుకు కూర్చోకూడదు. 

    నిశ్శబ్దాన్ని  కౌగిలించుకొని,
    నీరసంగా  తూగుతూ ఉండిపోకోడదు. 

    కులం రొచ్చులో, మతం ఉచ్చులో ,
    ముక్కు మూసుకు మునగ కూడదు. 

    వ్యూహాలూ, దాహాలూ ఈ నాటివి కావు,
    ఏనాటి నుండో వెన్నంటే ఉన్న నీచపు నీడలే. 

    నాటు సారాకు అమ్ముడుపోయి ,
    ఓటు అమ్ముకొనే రోజులింక రాకూడదు,

    కళ్ళుతెరిచి చూడు,

    మందిరాల ముందూ..,మసీదుల ముందూ ,
    బాల్యం బిచ్చమెత్తుతూ....కనిపిస్తుంది.  

    మతాల ముసుగులో మనవిశ్వాసాల ఈటెలు
    ఎంత రక్తాన్ని చిమ్ముతున్నాయో తెలుస్తుంది 

    మన  మతులకు అడ్డుగోడలు  కట్టే,
    కుటిల  చాణిక్యుల  ముఖాన ఉమ్మేయాలి. 

    మెత్తగా ఉంటే గట్టిగా మొట్టి ,
    నెత్తిన శఠగోపం  పెడతారు,

    మూర్ఖుల ఆటలో పావులం కావటం కన్నా,
    అందత్వం, అమాయకత్వం మరొకటి  లేదు. 

    మనల్ని విడదీసేది దేవుడైనా  సరే,
    బహిష్కరిద్దాం,భావి కుసుమాన్ని ముళ్ళనుండి రక్షిద్దాం  
Friday, 25 April 2014

మరొక జన్మకై...,

    
మరో జన్మకై..,


కనులు తెరిచి కాంచే స్వప్నానివి నీవు.

గతజన్మ జ్ఞాపకానివి నీవు.

అద్దములో నీది కాని ప్రతిబింభముతో..,

సంభాషించే...,మనోభాష్యానివి నీవు.


పగిలిన ప్రతిమని అతికించాలనుకొనే,

సున్నిత మానసిక స్నేహానివి నీవు,

అనుభవించే దేహం నీది కాదు,

ఆలోచించే మనో వికాసానివే నీవు.

నిప్పులు పూచే నీ గుండెలపై,

తాను విశ్రాంతికై తలవాల్చితే...,

శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,

మరుజన్మకి తనమెడలో...దారమౌతానని.


Tuesday, 22 April 2014

కొందరంతే..,

    


   కొందరంతే..,

    కొందరంతే....,
    కల్మష  పాకీ  గిడ్డంగుల్లో,
    గాలి బుడగలు.

    అర్దాంతరంగా పగిలి,
    హుందాగా ఉండేవారి,
    హృదయంపై  పడే
    అసహ్యపు మరకలు.

    తులసి వనములో,
    మొలచిన గంజాయి మొక్కలు,
    మొక్కను నాశనం చేసే,
    వేరుపురుగులు.

    చరిత్ర పుఠల్ల్లో,
    నిలిచే చీడపురుగులు,
    రక్తాన్ని ఇష్టంగా పీల్చే 
    పీడ జలగలు.

    చూపుల్నిండా,
    అసూయ మెక్కి,
    మాటల్నిండా,
    అసభ్యాన్ని దట్టి,
    దెయ్యాలై  దాడిచేసే రాతి గుండెలు.

    సమాజం లోని వెలితి నంతా,
    దుర్గందం లో నింపి,
    కడిగినా పోని,
    అశుద్దాలు.

    కళ్ళకు కనిపించని,
    అమీబాలు,
    జనారణ్యం లోని,
    జంభుకాలు.

    ముద్రించని పుస్తకము లోని,
    అక్షర దోషాలు.
    ఉప్పెనలా ఉరికే,
    మురికి కూపాలు.

Saturday, 19 April 2014

గాజు తలపు.
   గాజు తలపు. 

    స్వప్న పుఠలు  తిరగేస్తున్న 
    ఓ చల్లని సాయంత్రం,
    ఊహల శిఖరాలను కొలుస్తూ....,

    గుర్తొచ్చిన నిన్ను ,
    ఆక్రుతీకరించాలనే  ఆత్రుతతో,
    కలల కుంచెను కదిలిస్తే,

    రక్తాన్నిఉమ్మి ,పచ్చినెత్తుటి గాయాన్ని,
    మరోమారు  కెలుకుతూ.. ,
    నా నరాల్లో లావాలా ఉరకలెత్తుతుంది,

    అంతస్తులూ...,అంతరాలూ వేసిన,
    నిప్పుల పందిటి  సందిట్లో,
    ఒదగలేక పరుగెత్తిన మనల్ని,

    కులపు అదిలింపులూ,మతం మందలింపులూ,
    చెరో చేయి పట్టుకు గుంజినప్పుడు,
    నేనిటూ.... ,నువ్వెటో...???

    వీడలేని తనం,వీగిపోయిన హృదయం,
    నీ చేయి గట్టిగా పట్టుకున్న  నాకు,
    చిట్లి  చిక్కిన  నీ చేతి   గాజు ముక్క...,

    ఇంకా... ,ఇప్పటికీ, .....,
    కొత్త కత్తిలా నా అరచేతిని చీరుస్తూ.....,
    రక్తం గూడుకట్టుకున్న  నా కళ్ళలో,
    అగ్ని కక్కుతూ..,

    ఆ  పచ్చటి  గాజుముక్క,

    నా నెత్తుటిని  వెచ్చబరుస్తూ....,
    ఉక్రోషాన్ని  రెచ్చగొడుతూ,
    బతుకుతాడుకు  బందీని చేసి ఉరితీస్తూ...,   
Wednesday, 16 April 2014

గో(డు)డ.

    
   గో(డు)డ.

    నా ఇరుకు గది  కటకటాల  వెనుక,
    ఉన్న గోడ నాతో మాట్లాడుతుంది.

    నా నినాదాన్ని మానవ సమూహానికి,
    చేరవేస్తుంది.

    భయంతో ముడుచుకొనే నా వెన్ను నిమిరి,
    నన్ను  తనకు  హత్తుకుంటుంది.

    నేను  చూసే ఎర్ర,ఎర్రని అశాంతి చూపులకు,
    దవళ హసితమై  దర్శనమిస్తుంది.

    గోతాముల్లో మూతి బిగుంచుకున్నపిరికి వాళ్ళను 
    భుజానికెత్తుకుంటుంది. 

    నైతిక,అనైతిక సూత్రాలను  వల్లెవేస్తుంటే,
    తెల్లబోయిన  ముఖంతో చూస్తుంది.

    విశ్వాస,విప్లవ,విద్వంస, రక్తాక్షరాలకు,
    శిలా ఫలకమై స్థిరంగా ఉంటుంది.

    కులపు కంపులో కుంచె ముంచి రాసినా..,
    వర్షపు తడిలో ఒళ్ళు  తుడుచుకుంటుంది.

    ఎదురుగా మోకాళ్ళపై మోకరిల్లినా,
    తథాస్తూ... అంటూ దీవిస్తుంది.

    స్వార్ద శక్తులు బలా,బలాలు ప్రదర్శించినా,
    బీటలు వారి  భూమద్యరేఖగా  మారుతుంది.

    ఒకటిమాత్రం నిజం శవాల ఆవాసాల మద్య,
    మంచు ముద్దలా మౌనంగా ఉంటుంది.

    బ్రతుకు   భాగాహార  భూబోగాతాల్లో..,
    తానూ భాగస్వామ్యమై అడ్డంగా అఘోరిస్తుంది.

    ఆవలి ప్రపంచానికి అడ్డుగా అనిపించినా,
    నాకు  మాత్రం  అద్దంలా  అనిపిస్తుంది. 


Monday, 14 April 2014

మేలుకో....,(ఏలుకో)


    మేలుకో....,(ఏలుకో)

    మట్టిబిడ్డల కన్నీటిని తుడవలేని,
    మతిమాలిన పాలన మాకొద్దు. 

    కరువు రక్కసి  కాళ్ళు నరికే,

    సత్తాలేని నీ పెత్తనం  మాకొద్దు. 

    అన్నదాతలను అనాథలను చేసే,

    ఎత్తుపోతల  పథకాలసలే  వద్దు. 

    బక్కరైతును  బతికున్న శవాన్నిచేసే,

    బలాదూర్ కాలయాపనలొద్దు. 

    అప్పులకు బయపడే కృషీవలునికి,

    పురుగుమందును విందుగా ఇవ్వొద్దు. 

    వేదికలెక్కి రత్నరాసుల రత్నగర్బనాదనే,

    తాతల నేతులమూతుల మాటలొద్దు. 

    కన్నెర్రజేసిన రైతన్న మండేసూరీడు కాకముందే,
    అన్నం పెట్టిన ఆచేయి ఆయుధం పట్టక ముందే...,

   మేలుకో....,పాలకా....మేలుకో..., 


Saturday, 12 April 2014

శ్వాసకై...,


    శ్వాసకై...,

    మాటలు పోగొట్టుకున్న బాష,
    రాతలకే  అంకితమైంది,

    మౌనాన్ని వీడని గుండె ఘోష,
    గొంతులో తచ్చాడుతుంది,

    మది  చేస్తున్న తప్పుల తమాషా,
    విధికి  తాంబూలమవుతుంది,

    ఎటూ  తేల్చుకోలేని బంధం,
    మేఘాల మాటున అరుణ తేజమైంది.  

    నిదురలేని  రాత్రులూ...,
    పనిచేయలేని పగళ్ళూ...,

    కళ్ళుమూసుకున్నా కనిపించే,
    ఆత్మీయ ఆనవాళ్ళూ...,

    అలిగిన అతిధివై సుదూరాన నీవూ...,
    అలసిన కనులతో కాలాన్ని కొలుస్తూ నేనూ...,

    జీవశ్చవాలమై..,శిలాజాలమై...,
    ఒకరినొకరం  మరచిపోవడమనే, 
    మరణాన్ని ఆహ్వానిస్తూ...,


Wednesday, 9 April 2014

రుమాలు

       రుమాలు 

    మెత్తగా సుతారంగా,
    మధుర జ్ఞాపకాల మయూఖమై,
    మంటలు రేపుతుంది.

    చిన్ని పువ్వుల నేతతో,
    కొన్ని నవ్వులనింకా మూటగట్టుకొని,
    మురిపిస్తుంది.

    చేయిమారిన వైనాన్ని మరచి,
    చెలిమిని తవ్విపోసి,
    నిన్ను గుర్తుచేస్తుంది.

    కన్నీటిని తుడిచే నెపంతో,
    ఆత్మీయ స్పర్శను,
    అక్కున చేరుస్తుంది. 

    అప్పుడప్పుడూ,
    ఆత్మ పగుళ్ళను పూడుస్తూ,
    అమ్మలా హత్తుకుంటుంది.

    నీ తలపుల గాయాలతో,
    నెత్తుటి పూలనెత్తావినైతే,
    నొప్పి తీసే సంజీవనవుతుంది.

    చెక్కిలిపై జారే కన్నీటిని,
    చెలిమితో చెంత చేరి, 
    నెచ్చలిలా తుడుస్తుంది.

    నీ జ్ఞాపకాలు  నన్ను చుట్టుకొని,
    వేదనతో ఉసురు  తీసే వేళ,
    ఊపిరి సంతకమే అవుతుంది.Monday, 7 April 2014

కలం వెక్కిరిస్తుంటే..,

     

    కలం వెక్కిరిస్తుంటే..,

     రోజూ రాజుకొనే ఆలోచనలను,
     లోకమంతా విస్తరించాలని  చూస్తూ...,

     జ్వాలా కెరటమై పోటెత్తాలనీ..,

     సునామీలా విరుచుకు పడాలనీ..,

     కళ్ళముందు చందమామలు పూయించాలనీ,

     ప్రచండ  తిమిరాన్ని  పారద్రోలాలనీ.., 

     దు:ఖం కక్కే కరువు రక్కసిని తరిమేయాలనీ..,

     రక్తం పీల్చే  పన్నుల పీక నొక్కాలనీ..,

     నిర్విరామ బాదా, నిస్సహాయ క్షోభా,

     నిరసన  సిరాతో నినదించాలనీ..,

     కానీ,


     వాల్లా సంచరించే శరీరాంగాలలో..,

     చైతన్యం నింపటం నాకు సాద్యమా?

     కవులంతా మడుగులో మునిగిన,

     దుర్యోధనుని  వారసుల్లా..,

     ఏమీచేయలేని నిస్సహాయ,నిస్సార,

     అక్షరాల ఆటుపోటులతో..,

     అస్థిత్వాన్ని  పళ్ళకింద బిగబట్టి,

     మరోమారు కలాన్ని క్షవరపు  కత్తిలా..,
     అరచేత రాసి..,తిరిగి రాతకు ఆయత్తమౌతుంటే.....,


,

Thursday, 3 April 2014

నాతో ప్రవహిస్తూ..,

       నాతో ప్రవహిస్తూ..,

    ఆలోచనలు ఆవిరై  దు:ఖాన్ని గుర్తించని వాడినై,
    ఎడారిప్రస్తానములో ఎండమావులతో  స్నేహిస్తూ,

    స్వప్నారాదికుడనై... ,మౌనరోదితుడనై ఉన్నవేళ,
    సన్నజాజితీగలా...,వెన్నెల వెల్లువలా..,

    నన్ను సృజించిన ఆమె,

    మెల్ల,మెల్లగా నాలోకి చూస్తూ, లాలన ఒంపుతూ,
    పగిలిన జీవితాన్నీ, తెగిన కలలనూ అతికిస్తూ,

    నన్నో వీణియను చేసి  సృతించాలని  చూస్తుంది,
    తన  మదిలో పాకే సజీవ స్పర్శను నా ఎదపై మీటి,

    ఎన్నో జీవితానుభవాలను నా ముందు రాశిగా పోసి, 
    తనను తాను  ఆవిష్కరించుకున్న,

    అద్వైత మంత్రం ఆమె. 

    నా కళ్లలో పత్తి పువ్వులా, నా వడిలో పసిపిల్లలా,
    ఒదిగిపోతూనే, నన్ను బంధించిన వెన్నెల పంజరం,

    హితంగా,సన్నిహితంగా నను చేరదీసిన,
    ప్రేయసీ... ,ప్రియబాంధవీ... ఆమే.   


Wednesday, 2 April 2014

స్తబ్దత చిట్లితే...

    
    స్తబ్దత  చిట్లితే...,

    నిశ్శబ్ద  శూన్యం లోనికి చూస్తూ,
    నిలువెత్తు  ధైన్యాన్ని మోస్తూ,

    కనురెప్పల  వెనుక  కొలువైన,
    కన్నీటినే  భాష్యం అడుగుతూ,

    హృదయాన విరిగిన అక్షరాలను,
    అతికించి లిఖించాలని చూస్తూ, 

    అలసిన మనస్సున హత్యగావించబడ్డ,
    నిర్జీవ  జ్ఞాపకాలను  తడుముతూ, 

    ఏదో రూపం.ఏదో మోహం  అంతరాన చేరి,
    దాచుకున్న కలల తుట్టెను రేపుతూ,

    నిన్నలో  నిలచిపోయిన  నన్ను ,
    నేటిలోకి  ఈడుస్తూ కళ్ళతోనే ప్రశ్నిస్తూ,

    తమస్సులో కూరుకున్న నాకళ్ళలో,
    తిరిగి  ఉషస్సును  మొలిపిస్తూ,

    స్తబ్ద  ప్రపంచాన్ని  బద్దలుచేస్తూ,
    శబ్ద భావమై  నీవు ఎదుట నిలిస్తే,

    అనంత ఆకాశాన  విహరించే  నీ కోసం,
    రెక్కలు రాని పక్షికూన విహారాన్నై..... ,Tuesday, 1 April 2014

కన్నీటి తోడు.

    


   కన్నీటి తోడు. 

    గాలివానకు కుప్పకూలిన పంటను చూసి ,
    పేద రైతు  గుండెపగిలినప్ప్పుడు.

    కన్నకూతురు కాలి బూడిదైన వార్త,
    అమ్మానాన్నలు  విన్నప్పుడు.

    నిస్సహాయురాలైన అంధురాలిని,
    కామందులు కాటువేసినప్పుడు,

    కట్ట్టినవాడే తాళిని ఎగతాళి చేసి,
    ఇల్లాలిని వెళ్ళగొట్టినప్పుడు.

    నచ్చిన వారు పరాయివారిలా ,
    పరామర్శించినప్పుడు.

    దూరతీరాలకెళ్ళిన  ఆత్మీయులు,
    విగతజీవులై ఇల్లు చేరినప్పుడు.

    కలల పంట అనుకున్న బిడ్డడు,
    వికలాంగుడుగా జన్మించినప్పుడు.

    మొర  ఆలకించమని మొండిచేతులతో,
    దేవుని  వేడుకొంటున్నపుడు. 

    నివురుగప్పిన  దిగులు తెరలు,
    కళ్ళను  స్పర్శించినప్పుడు.

    వేదనకు  వీడ్కోలు చెప్పే,
    అమృత కలశాలు  ఈ  కన్నీళ్లు.

    నిన్ను ఓదార్చే ఆత్మీయ హస్తాలు,
    ఈ కన్నీటి నేస్తాలు.