Pages

Monday, 28 April 2014

స్పందన రావాలి         స్పందన రావాలి  


    కష్టాలను  గట్టేక్కించాలి అనుకున్నప్పుడు ,
    కాళ్ళు  ముడుచుకు కూర్చోకూడదు. 

    నిశ్శబ్దాన్ని  కౌగిలించుకొని,
    నీరసంగా  తూగుతూ ఉండిపోకోడదు. 

    కులం రొచ్చులో, మతం ఉచ్చులో ,
    ముక్కు మూసుకు మునగ కూడదు. 

    వ్యూహాలూ, దాహాలూ ఈ నాటివి కావు,
    ఏనాటి నుండో వెన్నంటే ఉన్న నీచపు నీడలే. 

    నాటు సారాకు అమ్ముడుపోయి ,
    ఓటు అమ్ముకొనే రోజులింక రాకూడదు,

    కళ్ళుతెరిచి చూడు,

    మందిరాల ముందూ..,మసీదుల ముందూ ,
    బాల్యం బిచ్చమెత్తుతూ....కనిపిస్తుంది.  

    మతాల ముసుగులో మనవిశ్వాసాల ఈటెలు
    ఎంత రక్తాన్ని చిమ్ముతున్నాయో తెలుస్తుంది 

    మన  మతులకు అడ్డుగోడలు  కట్టే,
    కుటిల  చాణిక్యుల  ముఖాన ఉమ్మేయాలి. 

    మెత్తగా ఉంటే గట్టిగా మొట్టి ,
    నెత్తిన శఠగోపం  పెడతారు,

    మూర్ఖుల ఆటలో పావులం కావటం కన్నా,
    అందత్వం, అమాయకత్వం మరొకటి  లేదు. 

    మనల్ని విడదీసేది దేవుడైనా  సరే,
    బహిష్కరిద్దాం,భావి కుసుమాన్ని ముళ్ళనుండి రక్షిద్దాం  
8 comments:

 1. స్వార్ధపు ముసుగులో
  మతాన్నీ దేవుడినీ కప్పుకుని
  కులాల కంపులో
  ధనికుల దాహానికి
  అధికారపు ఆకలికి
  మడి మసై
  మోడులయే
  బడుగు బతుకులెన్నో,
  పిడికిలి చాచి యాచించే
  పిడికెడు జీవుల
  కడగండ్లకు
  బిగించిన పిడికిల్లే
  కడ తేర్చాలి దీదీ.. 

  ReplyDelete
  Replies
  1. అవును సంఘటిత సమూహం పిడికిళ్ళు బిగించాలి,
   అన్నం పెట్టిన చేతులే అస్త్రాలు పట్టాలి,అప్పటి వరకూ ఈ వ్యవస్థ మారదు,
   మీ స్పందన కు సంతోషం జాని

   Delete
 2. "" మందిరాల ముందూ..,మసీదుల ముందూ ,
  బాల్యం బిచ్చమెత్తుతూ....కనిపిస్తుంది.
  మతాల ముసుగులో మనవిశ్వాసాల ఈటెలు
  ఎంత రక్తాన్ని చిమ్ముతున్నాయో తెలుస్తుంది ""

  ఫాతిమా గారూ ... మీ భావాలకు ప్రాణం పోసిన పదజాలం ఇది.
  ఓ సృజనాత్మక దృష్టితో కుల మతాలకతీతంగా పలికిన మీ మాటలు ఎంతో ఊరటను కలిగించాయి.

  "' మూర్ఖుల ఆటలో పావులం కావటం కన్నా,
  అందత్వం, అమాయకత్వం మరొకటి లేదు. ""

  అక్షరాలా నిజం .
  నవ సమాజంలో ఏదో నూతనత్వాన్ని చూడాలనే ఆశ ఆశగానే మిగిలిపోయింది.
  అయితే మీ ఈ కవిత రవంత ఆశను రేకిత్తించింది .సమాజానికి మెలుకొలుపులా మరో మంచి కవితనందించి........
  ధన్యులు అనిపించుకున్నారు.

  అభినందనలు ఫాతిమా గారూ .

  *** శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, ఎంత కవిత్వం అనుకున్నా..మన భావాలలోని బాదని కప్పిపుచ్చలేము,
   అంతరాన రగిలీ జ్వాలల్ను ఆర్పలేము,
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 3. మీ కలం యొక్క పదును రోజురోజుకూ పెరుగుతుంది. కవితావేశం, సామాజిక స్పృహ కలగలిసిన పంక్తులు హృదయానికి హత్తుకొంటున్నాయి. అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. వర్మాజి, ఆదరించే మీ వంటి బ్లాగ్ మిత్రులు ఉన్నతకాలం నా కలానికి అలుపురాదు.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 4. సమాజరుగ్మతలకు అన్నింటికీ బాల్యమే బలైపోవడాన్ని అందరూ గుర్తించగలగాలి......మీరజ్ చాలా బాగుంది.

  ReplyDelete
 5. కష్టాలు గట్టేక్కాలనుకున్నప్పుడు, సోమ్రివి కాకు కులం రొచ్చు, మతం ఉచ్చులో మందులో మునిగితేలకు.
  వ్యూహాలూ, దాహాలూ ఏనాటి నుండో వెన్నంటే ఉన్న నీచపు నీడలు
  కళ్ళుతెరువు
  మందిరాల ముందూ..,మసీదుల ముందూ బాల్యం బిచ్చమెత్తుతూ .... మతాల ముసుగులో విశ్వాసాల ఈటెలు ఎంత రక్తాన్ని చిమ్ముతున్నాయో చూడు
  ఎవరో ఆడే ఆటలో పావులం కావటం అందత్వం, అమాయకత్వమే .... మనిషిని మనిషినుంచి విడదీసేది దేవుడైనా సరే, బహిష్కరిద్దాం! భావి కుసుమాన్ని కాపాడుకుందాం!

  అంటూ ఎంతో చిక్కని భావనలతో చతన్యాన్ని పల్లవిస్తూ రాసిన కవిత చాలా చాలా బాగుంది
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభమధ్యాహ్నం!!

  ReplyDelete