Pages

Friday 30 November 2012

ఏల ఈ తిరస్కారం ?




ఏల ఈ తిరస్కారం ?

నీ హృదయం నవనీతం కదా..మరి ఎందుకు,
నా కాలిన  గుండెగాయాన్ని  మాన్పదు ?

నీ మనస్సు అమృతం కదా మరి ఎందుకు,
నా మది బాధను  ఎమార్చదు ?

నీ అడుగులు ప్రతి పదం వైపే కదా మరిఎందుకు,
నా నడకలకు గమ్యం చూపవు?

నీ స్నేహం సాగరం కదా మరిఎందుకు,
నా బ్రతుకునకు  ఎదురీత నేర్పదు ?

నీ జ్ఞానం దీపం లాంటిది కదా,మరిఎందుకు,
నా తలపులకు దారి చూపదు?

నీ బంధం ఆదర్శమైనది కదా మరిఎందుకు,
నా సాన్నిహిత్యాన్ని ఏమారుస్తుంది ?

నీ భోదన ఓదార్పు కదా మరిఎందుకు ,
నా వేదన ఎన్నటికీ  తీరదు?

నీ ప్రేమ సెలయేరు కదా మరిఎందుకు,
నా అనురాగార్తిని  తీర్చదు ?

నీ కరుణ మేఘం కదా మరిఎందుకు,
నా మీద దయా వర్షం కురిపించదు?

నీ శాంతం ఓ కపోతం కదా మరి ఎందుకు
నా ఆవేశాన్ని  సమర్దించదు ?

నిన్ను వరించటం నేను చేసిన దోషమా?
నిన్ను ప్రేమించటం నేను చేసిన నేరమా?

ఎందుకీ మౌనం ,ఏల  ఈ తిరస్కారం?
ఎందుకీ దైన్యం, ఏది పరిష్కారం?

అపరిచితురాలిలా..అపరాదిలా ..అనామికలా ..
ఎన్నాళ్ళిలా..తెరువరిలా..సాగిపోవాలా.......




















Wednesday 28 November 2012

వ్యధ


వ్యధ 

దిగులు  మొగలి పొదలా  గుచ్చుకుంటూ ఉంటుంది.

సమయాన్ని  చావగొట్టి  చెవులు మూస్తుంది.

చైతన్యాన్ని చెంత చేరనీయక  తరిమేస్తుంది.

అంతరంగాన్ని అంధురాలిని చేస్తుంది.

వివేకానికి  వినికిడి  లేకుండా  చేస్తుంది.

వర్తమానానికి  అందత్వవం, భవిషత్తుకు  వ్యంధత్వం  ఇస్తుంది.

ఆచరణని  పాతరవేసి ,వేదాంతాన్ని  వేదికనెక్కిస్తుంది.

ఆకలికి  చరమగీతం పాడి, వేదనతో యుగళగీతం పాడుతుంది.

సమూహంలో  కలసిపోయామా..చంకనెక్కి కూర్చుంటుంది.

పోనీలే  గుండెమూల  పడిఉంటుంది  అనుకోన్నామా...

అరబ్బీషేకు గుర్రంలా...డేరాలో  మకాం  వేస్తుంది.

సరే  వెంటరానీ అనుకున్నామా.. దింపుడు  కల్లాం  వరకూ  దిగబెడుతుంది.

Monday 26 November 2012

నా కనకానివి



నా   కనకానివి


కళ్ళు తెరవకముందే  నా వడి చేరావు.
అమ్మ నుండి విడదీసానని  అల్లరి చేసావు.

బుడి,బుడి అడుగులతో బుడతలా తిరిగావు.
చిట్టి,చిట్టి అరుపులతో చిడతలు వేసావు.

విడిచిన  బట్టల్లో ఇష్టంగా దోర్లేవు.
విడిచిన చెప్పుల్ని ఇష్టంగా కోరికేవు.

పాలబువ్వంటే పసందుగా తింటావు.
కారు టైరు  కనిపిస్తే ఇష్టంగా తడిపేవు.

దూషించానో..దూరంగా పోతావు.
శాసించానా  గారంగా వస్తావు.

మాటలు రావు కానీ మారాం తెలుసు,
భాష తెలీదు కానీ భావం తెలుసు.

ఒరే కన్నా నేను   శిక్షణ ఇస్తే
నీవు నాకు   రక్షణ ఇస్తావు.

నేను నీకు నివాసం చూపాను,
నీవు నాకు విశ్వాసం చూపావు.

నువ్వు మాలిమైన శునకానివే  కాదు,
నువ్వు  మేలిమైన కనకానివి కూడా..










Saturday 24 November 2012

ఏమిచేప్పనే చెలీ....


ఏమిచేప్పనే చెలీ....

ఎమిచెప్పను ..ఎలాచెప్పనూ..

కలిచివేసే  కన్నీటి  కథచెప్పనా...
కరిగిపోయిన కలను గూర్చిచేప్పనా...

పారిపోయిన గతాన్ని గూర్చిచెప్పనా...
మారిపోయిన నేస్తాన్ని గూర్చి చెప్పనా...

కూలిపోయిన కలల సౌధంగూర్చిచెప్పనా..
వాడిపోయిన  పూల తీగ గూర్చి చెప్పనా..

ఎడతెగని శోకం వలదని చెప్పనా..
చంచల  ప్రేమ  నమ్మ వలదని చెప్పనా...

ఏమిచెప్పను  సఖీ.
నిన్నెలా ఉండమని చెప్పనూ....

ఉద్వేగాలు, ఉద్రేకాలూ వలదని చెప్పనా..
నిరసనలూ, నిష్టూరాలూ  వలదని చెప్పనా..

మందారంలా విరియమని చెప్పనా..
మల్లెలా మనసారా నవ్వమని చెప్పనా..

హరిణి లా పరుగిడమని చెప్పనా..
హంసలా నడయాడమని చెప్పనా...

కీరంలా పలకమని చెప్పనా...
మయూరంలా నర్తించమని చెప్పనా...

అమ్మలా ఆదరించనా ...
అక్కలా అక్కున చేర్చుకోనా..


ప్రియ సఖిలా ప్రేమించనా..
నెచ్చలిలా లాలించనా....

 ఏమిచేప్పనే చెలీ.... ఎమిచెప్పను ..ఎలాచెప్పనూ.  


Thursday 22 November 2012

మనసా కవ్వించకే..







మనసా కవ్వించకే.

గమ్యమెరుగని గాలిపటానివి  
నిన్ను అందుకోలేను.

తప్పించుకు తిరిగే నీకోసం 
తపించనూలేను.

ఆప్తులను అల్లుకొనే నీకోసం 
ఆశల తీగను కాలేను.

చీకటి మాటున దాగే నీకోసం 
కాన్తిరేఖను తేలేను.

నిదురను దొంగిలించిన నీకోసం 
కలవరించలేను.

అక్షరాన్ని హత్య చేసిన నీకోసం 
ఏదీ లిఖించను.

ఎప్పుడో చనిపోయిన నేను నీకోసం 
తిరిగి శ్వాసించను.






Tuesday 20 November 2012

ఓదార్పు






ఓదార్పు 

నా నుండి  నేను  నిష్క్రమించాటానికి ,
ఆత్మస్థైర్యం  కావాలి.


చీకటి వంటి నిను  సోధించటానికి,
కాంతి  తత్వం కావాలి.

బహిర్గత పలుకులు  పలకటానికి,
ధైర్యం కావాలి.

ఎడారివంటి  నిను  వదిలి పోవటానికి,
ఇసుకతత్వం  కావాలి.

మౌన దేహాన మార్పు  తేవటానికి 
మాటల ఊరట  కావాలి.

స్పందనలేని  కాలాన్ని కదల్చటానికి,
కాల్పనికత  కావాలి.

మదిలోని  అవ్యక్త  భావాలను అల్లటానికి,
అక్షర సాలీడు కావాలి. 

మనమధ్య  మానవీయ  వారధి కట్టటానికి,

విలువల  ఇటుకలు కావాలి.

గగనంతో  కరచాలనం  చేయటానికి,

మేఘాల  మెట్లేక్కాలి.

కొత్త చరిత్ర కి  నాంది పలకటానికి,

పాత  పునాది  పెకలించాలి.

నాలో నీ  జ్ఞాపకాలు  భస్మం కావటానికి,

గుండెలో చితాగ్ని మండాలి.

నా  క్షత  వేదనా హృదయాన్ని ఓదార్చటానికి,

అమ్మతనం కావాలి.

శాపగ్రస్త   నైన  నన్ను నేను  ఓదార్చు కోవటానికి,

కొన్ని కన్నీళ్లు కావాలి.


Sunday 18 November 2012

మట్టి మనిషిని








సబ్సిడీలో  ఇచ్చిన  తాలుగింజల్ని సగం  నేలతల్లి  మింగేసి
నెలతక్కువ  బిడ్డల్ని ప్రసవించింది.

ఎదిగీ ఎదగని  చిరుమొలకలు పాలిపోయిన పసిమోఖాలతో,
పవనుని  పాటకు తలలూపుతున్నాయి.

నా చెమట వాసననూ ,చిరిగినా  బట్టలనూ చూసిన 
మేఘమాలికలు పక్కున నవ్వి పరుగులెడుతున్నాయి.

అన్యం పుణ్యం  ఎరుగని రైతునూ.. 
చదువూ సంద్యా లేని పల్లెటూరి బైతునూ.
మాయా మర్మాలు  నాకేమి తెలుసూ..

బావినుండి  తోడిన నీటితో  తానమాడుతున్న 
నా మొలకల  కూతుళ్ళను తొంగి చూసేది సూరీడనీ 

నారుమడులన్నీ పసల పోరగాడి  తోర్రిపళ్ళలా 
నంగి నవ్వులు నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నాయనీ   

నా అంతరాంతరాలలో  అప్పుల భయాన్ని పారదోలే  
ఆశల కంకులు కీటకాల పాలవుతాయననీ 

నా నెత్తిమీద ఎండా నిప్పులు చెరుగుతుంటే, 
ఎండిన పెదాలు ఎండమావుల్ని వెతుకుతాయనీ..

చద్దన్నంలో నేను ఉల్లిపాయ కొరుకుతుంటే 
వెంట ఉన్న నీ కళ్ళు మంటలెత్తుతాయనీ..

కాలువ గట్టున కూర్చ్చున్న నా కళ్ళలో 
నువ్వు వెళ్ళే కారు దుమ్ము కొడుతుందనీ..

నేలతల్లిని అమ్ముకొనీ , కన్నతల్లిని వదుల్చుకొనీ
పట్నమెల్లి బతకనేర్చిన  సదూకొన్నోడివనీ..

అన్నదాత  అంటే  అప్పుల దుప్పటి  కప్పుకున్నోడనీ 
రాయితీ  అంటే రాత  తెలిసిన  వాడాడే నాటకమనీ.. 

పల్లె నిండా  బతికున్న శవాలే  తిరుగుతున్నాయనీ 
నా ఇంట కూడా  చావు మేళం మోగుతుందనీ..

మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టిలో ఆడి , మట్టిని నమ్ముకొని, మట్టిని హత్తుకొని,మట్టిని కప్పుకొని, మట్టిలో కలిసిపోయే పేద రైతుని..నీ ఆకలి తీర్చటం తప్ప అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు  అన్నదాతని.

Friday 16 November 2012

ఎదురుచూపు




చల్లగాలి నీ ఆలోచనలనీ ..
పిల్లగాలి నీ ఆగమనాన్నీ .. 
గుర్తుతెస్తాయి.

రాత్రి నీ వలపునీ.. 
మైత్రి నీ తలపునీ..
మోసుకోస్తాయి.

మేఘాలు  నీ ఆకృతినీ..
రాగాలు నీ  ఆలాపననీ..
తలపిస్తాయి.

మౌనం నీ మోహాన్నీ ..
గానం నీ రాగాన్నీ..
వినిపిస్తాయి.

మనస్సు నీ మనుగడనీ ...
వయస్సు నీ ఒరవడినీ..
కూర్చి చూస్తాయి.

చిలిపితనం  నీ కోరికనీ..
కలికితనం నీ కౌగిలినీ..
కోరుకుంటాయి.

పిరికితనం నీ రాకనీ..
వంటరితనం నా రాతనీ..
పరిహసిస్తాయి.

Friday 9 November 2012

కోకిల










కోకిల 

కూతవేటు దూరానున్నా, 
కూయలేను.

అల్లంత దూరాన ఉన్నా,
అరవలేను.

పిసరంత దూరాన ఉన్నా 
పిలవలెను.

ప్రకృతిని చూసి 
పలకలేను.

ఊపిరి ఉన్నా,
ఉలకలేను.

దేవా...

మానవ  కోకిలల  గానానికి జోగుతున్నావా? 
మధుమాసపు  కోకిలనైన  నన్ను మరిచావా?
ఆమని  అందాల సృష్టి నీదే కదా..
కృత్రిమ  కుసుమాలనేల  ఇష్టపడుతున్నావు?

ప్రభూ ...

చిరుగాలి  సృష్టి కర్తవు, శుష్క జీవుల ప్రాణ దాతవు,
శీతల పవనాలు నీ కనుసైగతో వీస్తాయి కదా..
మరి ఎందుకు  కృత్రిమ శీతల భవనాలలో బందీవయ్యావు?

స్వామీ...

జాబిలి  తలను వంచి  అవనిపై  వెన్నెల కురిపించావు,
మరి  ఈ నియాన్ వెలుగుల నిర్భాగ్యం నీకెందుకు?

తండ్రీ ..

ప్రమిద వెలుగులో  దేదీప్యమానంగా ప్రజరిల్లెవాడివే,
మరి ఎందుకు ఈ విద్యుద్దీపాలలో  విహరిస్తున్నావు?

ఆమని ఆగమనం  నీ ఆజ్ఞే కదా..,
శ్రావ్యమైన  నా గొంతుక నీ బిక్ష కదా..,

కరుణామయా.. 

యేమని చెప్పను నా ఆవేదన, ఎవరికి చెప్పగలను  నా వేదన  ..
చెట్లకై  వెతికే మాకు  సెల్లు టవర్లూ,
చిగురుకై వెతికే మాకు టి.వీ టవర్లూ తగులుతున్నాయి.

కరంటు తీగలు మాగొంతు కోస్తున్నాయి.
నగరజీవితం నను తరిమికొడుతుంది,

ఎగిరి,ఎగిరి, నా చిన్ని రెక్కలు విరిగి పోతున్నాయి.
అనంతలోకాన నా ఆమని ఎక్కడుందో చెప్పవా? 

ప్రభూ .. నేనిపుడు  రాగ కోకిలను కాను మూగ కోకిలను.













Thursday 8 November 2012

దీపపు పురుగు.










సోగ కళ్ళ  బాష అందమైనది అనుకోకు,
ఆ భాషకు  తర్జుమా  వేరుగా ఉంటుంది.

మృదు మదుర  మాటలను  ఆర్తిగా ఎరుకోకు 
ఆ  మాటల వెనుక  వాడియైన గాలం ఉంటుంది.

లాంతరు  వెలుగును  హత్తుకోవాలి  అనుకోకు,
గాజు బుడ్డిపై  పేరుకొన్న వెలిగారమై పోతావు.

స్వార్ధం స్వాగతిస్తే  దాని వెంట పరుగులు తీయకు,
వ్యర్ధ జీవిగా   పదిమందిలో  ముద్ర పడుతావు.

ప్రతి నిమిషమూ మోహపు మంత్రాన్ని జపించకు, 
అబద్దపు ఆసనంపై  కూర్చోకు అవివేకిగా మిగిలిపోతావ్ 

మరుభూమిలో, మల్లెలు పూస్తాయి అనుకోకు,
కల్పనకూ, వాస్తవానికీ ముడిపెట్టకు సహజత్వం  కోల్పోతావ్.

గుండెను  అమ్ముకోకు, మనస్సును  మభ్య పెట్టకు,
సహచరి  సమక్షంలో   అపరాదివవుతావు.

ఆకర్షణకు, అందానికీ, అబద్దానికీ  అమ్ముడుపోకు  
అయిన వారిని కోల్పోయి ఆనాధవి  అవుతావు. 







Tuesday 6 November 2012

ఇలా చేస్తాను

ఇలా చేస్తాను 

చాలా రాత్రి గడచి పోయింది 
ఇక మీరు నిద్రపోండి.
నన్ను నా పని చేసుకోనివ్వండి. 

నా కలలకి  రెక్కలు కట్టాలి,
వాటికి  వాస్తవాల ఈకలు కట్టాలి.

నా ఆశలకు  ఊపిరి పోయాలి,
వాటిని ఊయలలూపాలి.

నా  వారికోసం భాషించాలి, 
అది ప్రియమైనదిగా ఉండాలి. 


అక్క  చెల్లెళ్ళ కోసం  వలువలు నేయాలి,

అమ్మో! వెలుగొస్తే  వారి  దేహాలను   

డేగకళ్ళు గుచ్చేస్తే...



గూడులేని  నా ఆడపడచులు 

ఆదమరచి నిద్రపోతున్నారు.. 

అమ్మో, నడిరేయి ఏ మానవ మృగమో..దాడి చేస్తే..


చిల్లు బంతి ఊది ఊది 
బుగ్గలు  బూరెలు కాగా..బుంగమూతితో
నిద్రపోయే నా చిట్టి తమ్ముడు బంతి కోసం కలవరిస్తే...

పంక్చరైన  సైకిలు  తొక్కి తొక్కి,
అది తనను మోయకున్నా..
తాను  దాన్ని  మోసే మా నాన్న నిద్ర చెడిపోతే..

జీవితాంతం  చాకిరీతో  సావాసం  చేసే అమ్మ 
ఉప్పూ, పప్పూ  నిండుకున్నట్లు 
నిదురలో ఉలిక్కిపడితే ..

ఇలలో వరించని వరుని  కలలో  కంటూ , 
కట్న కానుకలిచ్చుకోలేని ఇంట  పుట్టిన  
తనను తాను నిదించుకొనే  అక్క  కలత పడితే..

అందుకే నేను నిదురపోను ..
గుండెలో  కుంపటి రాజేసుకొని,
కళ్ళలో ఆశల దివిటీ వెలిగించుకొని, 
పహారా కాస్తుంటాను...నా వారి కోసం పహారా కాస్తూ ఉంటాను.