Pages

Sunday, 18 November 2012

మట్టి మనిషిని








సబ్సిడీలో  ఇచ్చిన  తాలుగింజల్ని సగం  నేలతల్లి  మింగేసి
నెలతక్కువ  బిడ్డల్ని ప్రసవించింది.

ఎదిగీ ఎదగని  చిరుమొలకలు పాలిపోయిన పసిమోఖాలతో,
పవనుని  పాటకు తలలూపుతున్నాయి.

నా చెమట వాసననూ ,చిరిగినా  బట్టలనూ చూసిన 
మేఘమాలికలు పక్కున నవ్వి పరుగులెడుతున్నాయి.

అన్యం పుణ్యం  ఎరుగని రైతునూ.. 
చదువూ సంద్యా లేని పల్లెటూరి బైతునూ.
మాయా మర్మాలు  నాకేమి తెలుసూ..

బావినుండి  తోడిన నీటితో  తానమాడుతున్న 
నా మొలకల  కూతుళ్ళను తొంగి చూసేది సూరీడనీ 

నారుమడులన్నీ పసల పోరగాడి  తోర్రిపళ్ళలా 
నంగి నవ్వులు నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నాయనీ   

నా అంతరాంతరాలలో  అప్పుల భయాన్ని పారదోలే  
ఆశల కంకులు కీటకాల పాలవుతాయననీ 

నా నెత్తిమీద ఎండా నిప్పులు చెరుగుతుంటే, 
ఎండిన పెదాలు ఎండమావుల్ని వెతుకుతాయనీ..

చద్దన్నంలో నేను ఉల్లిపాయ కొరుకుతుంటే 
వెంట ఉన్న నీ కళ్ళు మంటలెత్తుతాయనీ..

కాలువ గట్టున కూర్చ్చున్న నా కళ్ళలో 
నువ్వు వెళ్ళే కారు దుమ్ము కొడుతుందనీ..

నేలతల్లిని అమ్ముకొనీ , కన్నతల్లిని వదుల్చుకొనీ
పట్నమెల్లి బతకనేర్చిన  సదూకొన్నోడివనీ..

అన్నదాత  అంటే  అప్పుల దుప్పటి  కప్పుకున్నోడనీ 
రాయితీ  అంటే రాత  తెలిసిన  వాడాడే నాటకమనీ.. 

పల్లె నిండా  బతికున్న శవాలే  తిరుగుతున్నాయనీ 
నా ఇంట కూడా  చావు మేళం మోగుతుందనీ..

మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టిలో ఆడి , మట్టిని నమ్ముకొని, మట్టిని హత్తుకొని,మట్టిని కప్పుకొని, మట్టిలో కలిసిపోయే పేద రైతుని..నీ ఆకలి తీర్చటం తప్ప అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు  అన్నదాతని.

14 comments:

  1. అన్నదాత అంటే అప్పుల దుప్పటి కప్పుకున్నోడనీ
    రాయితీ అంటే రాత తెలిసిన వాడాడే నాటకమనీ..
    బాగా చెప్పారు ఫాతిమాజి..రైతుల వెతల పట్ల మీ స్పందనకు హృదయపూర్వక అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. వర్మగారూ,
      అన్నదాతలు ఎలా దీన స్థితి లో ఉన్నారో మంకు తెలీనిది కాదు.
      స్పందించిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  2. బాగుంది ఫాతిమాజీ.

    ReplyDelete
  3. చాలా బాగా రాసారు అక్కా!
    >>సబ్సిడీలో ఇచ్చిన తాలుగింజల్ని సగం నేలతల్లి మింగేసి
    నెలతక్కువ బిడ్డల్ని ప్రసవించింది.<<

    ప్రతి లైన్ చాలా బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ, ఎలా ఉన్నావు.
      అంతపురం రైతుబిడ్డవి నీకు తెలుసు అన్నదాత దీన పరిస్థితి.
      ఎప్పటికీ మార్పులేని జీవితం రైతుదే,

      Delete
  4. పొలాలనన్ని హలాన దున్ని
    శ్రమించి నోటికి నాలుగు మెతుకులు పోని రైతు
    పరిస్థ్తితి బాగుపడే వరకు దేశానికి సౌభాగ్యం రావడం కల్ల.
    ఈ మధ్య పాత చందమామ కథలను నెట్ లో చదువుతున్నా!
    ఒక కథలో అన్న తమ్ముడికి ఒక సంచెడు నూకలిచ్చి, బదులుగా ఒక కన్ను పొడిచేస్తాడు.
    నమ్మశక్యంగా లేదు అనిపించింది.
    కని మీ కవిత చదివాక గుర్తుకొచ్చింది,
    ఈ సంఘటన లాంటివి రోజూ జరుగుతున్నాయని!
    నగరంలోని అన్న పల్లెలోని తమ్ముడి కళ్ళు పొడుస్తూనే ఉన్నాడని!!
    బాగా రాసారు. ఇంకా ఇంకా మీరు ఇలాంటి కవితలు ఎన్నో రాయాలని
    ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. సర్, అన్నని ఆడదుకోకపోవటం, అమ్మని ఆదరించలేక పోవటం మన వాళ్ళ దోర్భాగ్యం.
      ఓ సామెత ఉంది "అన్నం పెట్ట్టిన ఇంటికే కన్నం వేసారు " అది అక్షరాలా నిజం.
      కవితమేచ్చి నన్ను దీవించిన మీకు కృతజ్ఞతలు

      Delete
  5. వావ్! మీ కవితా హృదయానికి జోహార్లు మెరాజ్ గారూ!
    "సబ్సిడీలో ఇచ్చిన తాలుగింజల్ని సగం నేలతల్లి మింగేసి
    నెలతక్కువ బిడ్డల్ని ప్రసవించింది..."
    అంటూ మొదటి రెండు లైన్లలోనే మట్టిలో అన్నం పుట్టించే "మట్టిమనిషి"ని, నమ్మలేని మనిషే కాదు నమ్ముకున్న మట్టీ కనికరించటం లేదన్న వాస్తవాన్ని హృద్యంగా చెపారు.
    అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ, నేలతల్లి తప్పకుండా కనికరిస్తుంది.. ఇక్కడ నేను చెప్పింది తాలుగింజలను మింగింది అని..
      అంటే ప్రభుత్వం తర్క గింజలు సబ్సిడీ గా ఇస్తుని అదీ నా ఆవేదన .
      కవిత మెచ్చిన మీ సహృదయం పొగడదగినది. ధన్యవాదాలు.

      Delete
  6. ఈ అన్నదాతగోడు రాతతెలిసినవాడు వింటాడంటారా?

    ReplyDelete
  7. meraj gaaroo!
    మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టిలో ఆడి , మట్టిని నమ్ముకొని, మట్టిని హత్తుకొని,మట్టిని కప్పుకొని, మట్టిలో కలిసిపోయే పేద రైతుని..నీ ఆకలి తీర్చటం తప్ప అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు అన్నదాతని...chalaa baagaa chepaaru raitanna vyadhani...@sri

    ReplyDelete