Pages

Monday 21 July 2014

కంటి (ఇంటి) దీపం

    





    కంటి (ఇంటి) దీపం 

    మునిమాపువేళ  బారులు తీరిన కొంగల 


    రెక్కల చప్పుళ్ళ రొదలో ,


    నా ఆలోచనలను చెదరగొడుతూ 


    ఎవరెవరివో  బాదాతప్త  హృదయరోదనలో


    పేగు బంధాల  మూగ వేదనలో 


    గిర్రున తిరుగుతున్న నా తలలో


    ఎన్ని  ఆలోచనలో.. ఉప్పగా జారేకన్నీరు 


    నాపెదవులను తడుపుతూ....కన్నీటి తలపువై  


    నన్ను నా నుండి దూరం చేసి,  


    అదృశ్యమైన నీవు అనివార్యమరణమై,


    అర్ధంలేని వార్తవై ,అంతు దొరకని పరిశోదనవై,


    అంతర్దానమై,అపఖ్యాతివై,అఘోచరమై,... 


    నా గుండెపై నిత్యం రగిలే ప్రేమజ్వాలవై...,


    నా  అసమర్ధతకు బలైన నిస్సహాయవై ...,


    నా గుండెను నిత్యమూ సలిపే జ్ఞాపకానివై..,


    నా చుట్టూ శిరశ్చేదిత  చలన  దేహాలే..,


    చిక్కు ముడి విప్పలేక 


    బేతాళ శవాన్ని మోసే విక్రమార్కులే..,


    పక్కన పిడుగు పడ్డా వినిపించని బదిరులే..,


    అర్దంలేని  ఊసుపోని  వ్యర్ద ప్రేలాపాలే... 


    నా వేదనకు అంతం లేని వృదా ప్రయత్నాలే,


    నువ్వు మాయమైంది జనారణ్యములో,


    జంతు అరణ్యానైతే కేవలం ప్రాణమే పోయేది. 


    నీ కన్నీళ్ళ నిస్సహాయ రోదన 


    ఆ కామాందులను  కరిగించగలిగితే, 


    నీవెప్పుడో మానవీయ  వంతెనపై నడిచి,


    మరో మంచు ముత్యానివై మమ్ము చేరవా..,


ఈ గాంధారీ  సుతుల  వస్త్రాపహరణానికి  తెరపడి,
కలియుగ  కురుక్షేత్రం జరిగేదెప్పుడు 
ఒంటరి సీతమ్మలనెత్తుకెళ్ళిన  రావణాసురులకు 
వాయుపుత్రుని వాసన తగిలేదెప్పుడు...?????     

     

Saturday 19 July 2014

మరోసారి ఓడిపోతూ...,

    




   మరోసారి  ఓడిపోతూ..., 

    ఈ  నిశ్శబ్ద  నిశి  రాతిరిని,
    రెప్పలార్పుతూ ..తదేకంగా  చూస్తున్నా..,

    తూర్పు  పవనమొకటి  తేలివచ్చి,
    పసితనపు  తలపుని  తాకించి వెళ్ళింది. 

    ఆనాటి సౌధమింకా  అలాగే ఉంది,
    ఎప్పటిలాగే చంద్రునితో పహారా కాయిస్తుంది. 

    ఎత్తిపట్టుకున్న  పట్టుపావడాతో,
    మూసుకున్న కళ్ళతో...వెన్నెటి గుడ్ల  ఆటాడుతూ..,

    చిన్నమ్మా...అక్కడ ముళ్ళుంటాయి...,
    అర్దింపూ,అర్ద్రతా... అవే అరచేతులు,
    నా అరికాళ్ళ కింద మెత్తటి తివాచీలై.....,  

    అరే ఇక్కడో పారిజాతం ఉండాలి,
    రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవీ...,
    గొప్ప తోడుని అడిగిన ఆ మొక్కులేవీ..?

    గుడ్డబొమ్మలకి  పెళ్ళిళ్ళు  చేసిన,
    చిన్నారి ముత్తయిదువ ఆ చిన్నమ్మ ఏదీ..?
    ఆమె నడిచిన   చిట్టి పాద  ముద్రలేవీ..?

    కాలమంతా రంగుల రాట్నమై,
    గిర,గిరా,తిరిగే చలన చక్రమై,స్ఖలన దు:ఖమై..,
    యుగాల నాటి  ప్రశ్నాపత్రమై.., 

    మరణాంతరం సమాదులపై  పాతిన,
    శిలా పలకమై,బాల్యాన్ని  పాతిపెట్టిన,
    శిథిల సౌధమై.., 

    ఇనుప చట్రాలలో  ఇరుక్కున్న చిన్నమ్మ,
    ఈ నిశీథి  సౌధాన  ఆత్మను వదలి ,
    విలువలేని శరీరాన్ని  శిలువ వేసుకుంది.     








Friday 18 July 2014

నడిచే కల,

     




     


     నడిచే కల

     ఆమె నడుస్తుంది,
     కలలతో కలసి
     అడుగు కలుపుతుంది.
     అడవి మల్లె  అందాన్నీ..
     ఆత్మీయ బంధాన్నీ..,
     తనలో ఇముడ్చుకుంది.

     ఓ సుందర స్వప్నాన్ని
     కలవాలనీ..,
     వశీకరణంతో,
     ఒడిచేర్చుకోవాలనీ..,
     ఆశతో జీవిస్తుంది. 

    మనస్సంతా  
    ఎదురుతెన్నుల కన్నులైతే..,
    దూరమయ్యే అడుగుల 
    చప్పుడు ఎదపై వినిపిస్తుంది. 

    చిక్కటి చీకటి గదిలో..,
    తుదిలేని  మది  తలపులతో..,
    బ్రతుకంతా  పయనిస్తుంది.
    శబ్దమై పాకుతూ.., 
    శ్వాసై  తాకుతుంది. 





Wednesday 16 July 2014

అంకురమై....,

    


    అంకురమై....,  

    వాళ్ళు  ఉరి తీసింది  రైతు(త)లని కాదు,
    పచ్చటి  పంట కలని.

    ఆరుకాలాల పాటు ఆటలాడే పంటకాలువ,
    కుంటిదై కుంచించుకు పోయింది . 

    ఇసుక  పోగొట్టుకొన్న ఏటిగట్టు,
    కబ్జాబాబుల చుట్టమై బడాబాబుల చేతుల్లో చట్టమైంది. 

    అంగడి సరుకు(గా మారిన) మాగాణి,
    పచ్చనోట్ల  పోటుకి  పడుపుగా మారింది. 

    విస్తరించే  వింత  సౌధాలను చూసి,
    అడవులు సైతం ముడుచుకుపోతున్నాయి. 

    నెత్తురు  పులుముకున్న  సూర్యుడు,
    దుర్బిక్ష  అనంతపై  కాలుదువ్వుతున్నాడు.

    వలస ప్రజతో  నిండుచూలాలైన నగరం,
    పల్లె బిడ్డలకు సవతి తల్లయిపోయింది.

    జనకాలుష్యానికి , ధనకాలుష్యం  తోడై.,
    కృషీవలుడంటే కూలివాడనుకుంటుంది. 

    మట్టి తల్లిని  గొడ్డుమోతుని చేసి,
    పిజ్జా,బర్గర్ల, టెస్ట్యూబ్  బిడ్డలతో కాలక్షేపం. 

    అప్పుల ఊబిలో ఆత్మహత్య  చేసుకున్న రైతుకు ,
    తీర్పులూ,ఓదార్పులూ,కంటితుడుపు రాయితీలూ...,

    కుళ్ళు రాజకీయపు కుడ్యాలు  కూల్చెయ్యి,
    సరిహద్దు యుద్దాలను రద్దు చెయ్యి.  

    నల్లబజారులో నడిచే బియ్యాన్ని  తెచ్చి,
    బీదల కడుపు  నింపెయ్యి.  






Tuesday 8 July 2014

మనో వేదన


    

    





   మనో వేదన 

    ప్రతిరాత్రీ.... నా కళ్ళలో ..,
    నెత్తుటి నదులు ప్రవహిస్తూ...,
    నన్ను గాయపరుస్తుంటాయి.

    చిక్కటి ఈ చీకటి గదిలో...,
    అకాల దు:ఖానికి ఆనకట్ట వేయలేనంటూనే..,
    ఊపిరి ఉరికొయ్యెక్కుదంటుంది .

    తుది లేని మదిలోగిలిలో..,
    అడుగిడేందుకు అయిష్టపడుతూ..,
    నీ పాదాలు పారిపోతుంటాయి.

    నిరసించే...నీ పలుకుల ములుకులతో
...,
    మౌనమే  సరైందేమో అంటూ...,
    ముక్కలైన గుండె ఒక్క ఉదుటున మూగపోయింది.

    శిధిల దేవాలయపు పాకుడు మెట్టునై....,
    జారే నీ పాదానికి ఆసరా నేనంటూ..,
    అరచేతులు సోపానాలవుతున్నాయి.

    సఖుడా....,ఎవరూ లిఖించని భావాలతో'
    అక్షర సాలీడునై...అంతుచిక్కని కావ్యానికై...,
    వ్యధా సిరానై ....అక్షరాలను నీ ఎదపై సందిస్తున్నా..,




Saturday 5 July 2014

విహంగ విలాపం

    



   విహంగ  విలాపం

    నిద్రలెమ్మనే .. 
    కువకువల  మేలుకొలుపు,
    రెక్కల చప్పట్లతో....,
    రాగాల మేళవింపూ...,

    తరువు తల్లి తలారా స్నానించి,
    విరబోసుకున్న  జుట్టులా... 
    పరచుకున్న కొమ్మల్లోనుండి,
    నీటి బొట్ట్లుల్లా  రాలే పండుటాకులూ...,

    పల్లె పడుచు నడకలో ..,
    వయ్యారాన్ని తలపించే..,
    అందెల చిరు సవ్వడిలా.. .,
    కొమ్మల రాపిళ్ళూ ...,

    ఓ సాయంత్రం..,

    చెట్టునీడలో..,
    నులకమంచం మీద  
    కొలువు  దీరిన  కామందు,
    అపార్టుమెంటుల ఆవాసాలకై....,బేరసారాలూ..,

    అమ్ముడు పోయిన,
    తరువు తల్లి,..కసాయి గొడ్డలి పెట్టుకు,
    ముక్కలై మూలపడింది. 

    సాయం సంధ్య, గొదూళి  వేళా..,
    విత్తులు ముక్కున పట్టుకొచ్చిన ,
    తల్లి పక్షి కంటికి 

    చిద్రమైన  తన పేగు బంధాలూ...,
    చిట్లిన వాటి  లేత అంగాలూ..,
    నేలంతా నెత్తుటి రంగవల్లుల్లా..,

    అయ్యో, రెక్కలు రాలేదే..,
    ముక్కులూ  ఆరలేదే...,
    పుట్టి  మూణ్ణాళ్ళయినా కాలేదే..,

    ముద్దులొలికే..  ఈ బుజ్జి పిట్టలు,
    నేల తల్లికి నెత్తుటి  అభిషేకం చేస్తూ...,
    కన్న తల్లికి  కడుపు శోకం మిగులుస్తూ.. 

    పక్షులన్నీ...,నిరాశ్రయులై.. 
    కొంగు చాటున... అమ్మ గుండె మాయమైతే..,
    వెక్కి పడే  శిశువులై...,

    తమ పెద్ద దిక్కునెవరో  హత్య చేస్తే,
    గగ్గోలు పెట్టే ఇంటి సభ్యుల్లా...,
    పగిల గుండెలతో... ,ప్రార్దిస్తున్నాయి.

    తరువుల  తల్లిని  లేపి నిలబెట్టూ..,
    మా బిడ్డల ఊపిరి ఇకనైనా  నిలబెట్టూ..  

     (మానవా....నీవిక ఇలాంటి  పనులు మానవా?)