Pages

Sunday, 26 August 2012

అంతరాన...


అంతరాన...

అప్పుడప్పుడూ నా అంతరంగం తనలోకి నన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది.

లోపల ఎంత భయంకర నిశ్శబ్దమో...ఎన్ని మణుగుల తిమిరమో.

అప్పుడప్పుడూ ఓ కాంతి పుంజం, ఆశగా మిణుగురు పురుగులా మెరుస్తూ మురిపిస్తూ ఉంటుంది.

బ్రతుకు పేజీలు తిప్పటానికి బైటకి వస్తాను.

ఇక్కడంతా గజి,బిజీ అడుగులే, అసంధర్బపు ఆరాటాలే.

అక్కర లేని అనుబంధాలే, అనవసరపు ఆర్బాటాలే.

కావిళ్ళ కొద్దీ కాలయాపనలే, కలల నిండా కల్పనలే.

భావాలకందని భాషలే, బలవంతపు బాద్యతలే.

మాటల గారడులే, మంచు అక్షర కావ్యాలే.

అపనమ్మకాల అంపశయ్యలే, అలసట ఎరుగని నిరీక్షణలే.

అంతస్థులు ఎరుగని అత్యాశలే, అందనివాటికై నిచ్చేనలే .

కాలిన గుండెలో ఘోరమైన గాయాలే, అవి నిత్యం పలికే గేయాలే.

అదిగో అప్పుడే నా అంతరంగం నను ఆహ్వానిస్తూ ఉంటుంది.

నాలోకి నేను చొచ్చుకొని, నాకై నేను నొచ్చుకొని,

నన్ను నేనే హత్తుకొని, నన్ను నేనే మెచ్చుకొని,

నన్ను నాకే అర్పించుకొని, నన్ను నేనే శిక్షించుకొని.

నన్ను నేనే ఓదార్చుకొని, నన్ను నేనే రక్షించుకొని.


నా... నేను.... నాకై ...నాలో... దాగిపోతున్నాను...

Monday, 20 August 2012

బయ్యం
బయ్యం 

పొద్దుగాల  మొదలు పెడతాది  మాయమ్మ నన్ను నిద్దర లేపటం, నేను అట్ట బొల్లి,ఇట్టబోల్లి ,  నీలిగి నిక్కి లేస్తా, ఆమైన(ఆ తర్వాతా) పొంత పోయ్యి కాడ  బొగ్గుతో పొళ్లు  తోముకుంటా, నిమ్మకాయ బద్దతో  సద్దన్నం తిని బడి కిబోతా.


మా నాయిన బోయినప్పుడు మాయమ్మతో అందరూ జెప్పినారు మేముండాములే నీకు నీకోడుక్కి ఇబ్బందిరానీము అని. నిజమే గావాలా అనికున్నానేను. ఎవురూ ఏమి ఆదుకోలా పెట్టలా. మాయమ్మకి కూలీ తప్పలా, మాకు పస్తులూ తప్పలా.

నాకు అర్దంగానిది  ఏందంటే, మాయమ్మ  కొన్నేసి   సార్లు నన్ను మరిసిపోద్ది. లేకపోతే మద్దేనం నేను అన్నం బెల్లులో  ఏమైనా తినాలగదా  ఏమీ బెట్టదు  అట్టని  అమ్మ కూడా ఏమి తీసుకొని పోదు. నేను అన్నంబెల్లు కొట్టినప్పుడు  బడి ఎనకాల  గుబ్బలచెట్టు (చీమ చింత) కాడికి బోయి వాటిని దింటా. పిలకాయిలు చూస్తారనుకో  ఓరే  ఈడికి అన్నం  లేదురా అడక్కతినే  నాయాలు  అంటారు. అందుకనే నేను  బాల్  తెచ్చుకోని ఆడుకున్నట్లు  యాక్సన్  చాస్తా. మా పక్కింటి అనసూయ  నా పెండే  ఆయమ్మి, పిలస్తాది రాఅబయా  నేను బెడతాలే  అంటాది, నేనే బోను  పొయ్యి, పొయ్యి ఆడపిల్ల దగ్గరా వన్నం వణ్ణం? అంతకంటే నీళ్ళు లేని బాయిలో బడి సావటం మేలుగదా. 
***
రెండు దినాలబట్టి  ఒకటే వాన.ఇల్లు మొత్తము  ఉరస్తా ఉండాది. అమ్మ కూడా పనికిబోలేక  ఇంట్లో ఉండిపోయింది. నాకు మాయమ్మ ఇంట్లో ఉంటె బలే  ఇష్టం అమ్మతో మాట్లాడుకుంటా ఏడి, ఏడి సెనిక్కాయలు ఏపుకొని తినాలని కుశాల. అయినా అట్టా ఎట్టా  జరగతాదిలే  మేమేమన్నా  మారాజులమా?

మన్నాడు  పొద్దుగాలనే  బడికి బోవాలని పుస్తకాల సంచి  ఇదిలిస్తా ఉండా, "అబ్బయ్యా  బడి ఉండాదా ఉంటెమాత్తరం  ఎట్టాబోతావు ?" అమ్మ అడగతా  ఉండాది నేను జవాబు సెప్పలా, ఏమి జెప్పేది,  ఉన్న నూకలు  నాకు ఒండి పెట్టి  అమ్మ  పస్తుబొనుకునే, ఈయాల  గూడా   ఇంట్లో ఉన్నానా  అమ్మ తిప్పలు చూడలేను. "ఒరే  నాయినా ఇనవేందిరా తడిసిపోతావు" అమ్మ అదిలిస్తూనే ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరగతా  ఉండాయి. లేదుమా  పోకబోతే లెక్కలయ్యోరు  తంతాడు " అనేసి  సంచి బుజానికి తగిలిచ్చుకొనే  వానలో పరిగెత్తినా. రోడ్డు మీదకి  వచ్చినానేగాని అమ్మే  కనిపిస్తాఉండాది. ముందుగా బడికి బోయిన పిలకాయిలు  బడి లేదని  కుశాలుగా  చెప్పినారు, అయినా సరే నేను ఇంటికిబోలా  దినవంతా  ఆడా, ఈడా  తడస్తానే ఉండినా  నా కోసం అమ్మ కష్టపడొద్దు,  సాయింత్రానికి తడిసి  ముద్దాయి ఇల్లు సేరినా.
***
తలదిమ్మగా  ఉండాది, అమ్మ నా తలకాడనే  కూకోనుండాది. పక్కింటి  శంకరక్క కూడా  నిల్చోనుంది, నాకిష్టమైన  బూబమ్మ బొంకులో బొరుగులుండలు   గంప   డబిలించి (బోర్లించి) దానిమీద  పెట్టి ఉండాయి. వాళ్ళ  మాటల్ని  బట్టి  అర్దమైంది  నేను  మూడు  రోజులనుంచి  జరంతోబడి  ఉండానన్నమాట.  అమ్మ  శంకరక్కని   ఏందో  మెల్లింగా  అడగతా  ఉండాది. నాకు  మాత్రం  ఆయక్క  గొంతు  ఇనిపిచ్చింది "ఏందిమే ఏడ  దెచ్చిస్తావు, నీకేమన్నా  మిద్దిలా, మేడలా,  ఈ రకంగా అప్పులు సెయ్టానికి.., సరె..పో  పిలగాడికోసరం  అంటాఉండావ్  రొండు రోపాయిలు  ఉండాయి  నాకాడ " ఇదీ  నాకు  ఇనిపించింది. చెపోద్డా  నాకు  బలే  కోపం వచ్చింది   ఎందుకా? ఆయక్క  ఇంకో  మాటన్నది   అది  చెప్పాలంటే  మీకు  ఇంగో  ఇసయం  సెప్పాల. "ఇన్ని బాదలెందుకు ఎంకురెడ్డిని  అడిగితె  ఇస్తాడుగదా"  అన్నది  ఆయక్క  మాయమ్మతో. అయితే  నాకు కోపమెందుకో  చెప్తా  ఇని  ఆనాయాలు  ఎట్టాటోడో  మీరే       చెప్పుదురుగాని.


ఒకరోజు  పోద్దుబోయినా   మాయమ్మ  ఇంటికిరాలా,  ఎంకురెడ్డి  ఇటికల సూల  కాడికి  పనికిబోయిందని  తెలిసి  నేనే అక్కడికి  పోయినా, నేను బోయ్యేకాడికి  అమ్మ యాపమానుకి  ఆనుకొని  యాడస్తా ఉండాది, రెడ్డి  నులకమంచం  మీద  పడుకొని  ఎదురుగ్గాఉన్న  అమ్మనే  సూస్తా  ఉండాడు  గుడిసంగం  తిరణాల   చూసినట్లు. నేను  పొయ్యి అమ్మ కొంగు పట్టుకొని  నిలబడ్డా." ఊ..నీ కొడుకొచ్చినాడు  కలక్టరు  ఈడు కలక్టరయ్యి  నీ కస్టాలు  తీరస్తాడుపో"  అని పకపక  నవ్వినాడు. " అయ్యన్నీ ఉండనీ రెడ్డా  నా కూలిడబ్బులియ్యి"  అమ్మ యాడస్తానే అడిగింది.  ఎవ్వురీనన్నారు  నా మాటకి  ఊ అను డబలు  కూలిస్తా .. అంటూ  బీడీలు   తాగితాగి  గార పట్టిన  పళ్ళు  చూపిస్తూ  నవ్వాడు."ఏందీ  ఇనేది  సావనైనా  సస్తాగానీ అట్టాంటి  రోతపన్లు  నేను  చెయ్యను " కచ్చితంగా చెప్పింది."అందుకే  నాకు మండతాది నా నోటికి  మంచి కూతలు రావు   కడుపులో గాలితే  నువ్వే దారికోస్తావ్  కూలి రేపిస్తాపో  అనేసి  తుండుగుడ్డ  ఇదిల్చి బుజాన ఏసుకొని  లేసిపోయినాడు. అమ్మ ఆడనే కూచుని  యాడస్తా  ఉంటె  ఏమి చెయ్యాలో తెలీక కింద  మట్టి తీసుకొని  రెడ్డి  పోయినదిక్కు  పోసి" ఒరే  నాయాలా  నన్ను పెద్దగానీరా  సెప్తా" అని  అరిసినా. అమ్మ నన్ను తీసుకొని ఇంటికొచ్చింది,  ఆరాత్రంతా  యాడస్తానే  ఉండాది.  ఇదిగో అందుకే నాకు  ఆ నాయాలి  మాట ఇని కోపమొచ్చింది.
***    
అమ్మ  అన్ని పెయత్నాలూ  సేసింది  జరంతగ్గలా. ఎవురెవురో  వచ్చి సూసిపోతాఉండారు,  ఎంకురెడ్డి  వచ్చి దబ్బులిస్తానన్నాడు  "నా బిడ్డని సంపుకుంటా  గాని  నీడబ్బులోద్దు   నాకు  అనేసింది   మాయమ్మ.
  
నా కళ్ళముందు   ఏందో  గుండ్రాలు, గుండ్రాలుగా  నల్లంగా  పిడకల మాదిరిగా   తిరగతా  ఉండాయి. చేవ్వుల్లో  ఏందో  గుయ్యి  మంటా ఉండాది నేను  చానా  ఎత్తుగా  పోతాఉండా,  అమ్మచెయ్యి  పట్టుకొనే ఎక్కడికొనే ఉండా పైకి పోతా  ఉండాము. ఒకచోట  ఎన్నముద్దలు, మిద్దింటి  బుజ్జమ్మ వాళ్ళింట్లో  ఐస్ పెట్టిలో  నీళ్ళు  ఉన్నట్టు   ఉండాయి  నీళ్ళు. రేగి కాయిలూ, పచ్చరిటిపొళ్లు, నిప్పట్లు (అరిసెలు) ఇంకా  ఏమేమో  ఉండాయిలే  అమ్మ నాకు  తినబెడతా  ఉండాది. అప్పుడే ఎంకురెడ్డి ఒచ్చినాడు. ఆ నాయాలుకి రెండు కొమ్ములుండాయి  బలే నవ్వొచ్చిందిలే నాకు  అమ్మని సూడబోయ్యి  కళ్ళు మూసేసుకున్నాడు   ఎందుకంటే  అమ్మ  ఇప్పుడు  తెల్లంగా  లైటు ఎలిగినట్టా  ఎలిగి  పోతుళ్ళా. 


కళ్లుబోయ్యి  ఓడు (వాడు) యాడస్తా  ఉంటె నాకు ఒకటే  నవ్వు. నవ్వతా ఉండా.. నవ్వతా  ఉండా .......అవునూ  నేను  నవ్వతా  ఉండా  కదా  మరి ఏడిసేది  ఎవురూ?? అరె  ఇచిత్రంగా  ఉందే  శంకరక్క  గూడా  యాడస్తా ఉండాది.

"అయ్యో  నీలవేనా  ఎందిమే..ఇంత  అన్నాయమా?  సిన్న  పిల్లోన్ని గూడా  తీసకపోయ్యినావా., నాయమ్మే  ఏమి  కష్టమోచ్చిందే తల్లీ.."

అరె  ఒక్కొక్కరూ   వస్తా  ఉండారు  నాతరగతి  పిలకాయలు  వాళ్ళ  అమ్మల సాటున  జేరి  చూస్తా  ఉండారు.


ఇప్పుడు  అర్ధం  అయ్యింది  నాకు,  నేను అమ్మా సచ్చిపోయ్యామన్నమాట పో. పోనీ పో   ఈ రకంగాఅయినా  బతికి పోయ్యాం. ఆకలి బాధలనుండి. ఇక  మీరు  దెయ్యాలు అనుకున్న బయ్యం లేదు, బూతాలు  అనుకున్నా  బయ్యం లేదు. బతుకంటేనే   బయ్యం. 


ఆకలంటే  బయ్యం ఉండేది.  ఇప్పుడు  అదీ  లేదు. బాధ ఎందుకంటే  నేను పెద్దయ్యి  అందరు  కడుపునిండా అన్నం తినేట్టు   ఏమైనా  చెయ్యాల  అనుకొనే వోడిని. కాని,   ఆ  ఆకలే   నన్ను  సిన్నోడిగా   ఉన్నప్పుడే సాగనంపిందే... ఇలా  ఎంత  మందిని   సాగానంపుతుందో  అదీ..... అదే              నా బయ్యం.


  

Sunday, 19 August 2012

ఈద్ ముబారక్
In the name of Allah the most beneficent and merciful
రంజాన్ "ఈద్" శుభ సందర్భంగా మిత్రులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. 
కరుణామయుడు, కృపాశీలుడు అయిన అల్లా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శాంతి సుఖాలు ప్రసాదించాలని, మీ పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని  ప్రార్థిస్తున్నాను.

సర్వోత్తముడైన ఆ భగవంతుడిని మానవ జాతికి శాంతిని, పరమత సహనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.

యా అల్లా 

మాకు నిజాయితిగా  ఉండే స్థైర్యాన్ని, మంచికోసం పోరాడే ధైర్యాన్ని, నిస్సహాయులను ఆదుకునే శక్తిని ప్రసాదించు.

ఇతరులను క్షమాభిక్ష అడిగే వివేకాన్ని మరియు క్షమించే క్షమాగుణాన్ని మాకు ప్రసాదించు. 


آمین 
శ్రీ
శ్రీగంగ
హర్ష
ఫణి
శర్మ
సాయి
కే క్యూబ్
పద్మార్పిత 
సీత
రాజీ
వనజ
ప్రేరణ
అక్షర కుమార్
సురేష్ పెద్దిరాజు
జ్ఞానప్రసూన
భాస్కర్
సృజన
శ్రీవత్స
తనూజ్
రసజ్ఞ
అనికేత్
సందీప్
బోనగిరి
జీడిపప్పు
ఓడుల రవి శేఖర్
లక్కాకుల రాజా రావ్
జాడ సీతాపతి రావ్
జలతారు వెన్నెల
చిన్ని ఆశ
శ్యామలీయం
లక్ష్మీ రాఘవ
కాయల నాగేంద్ర
హరి పొదిలి
జ్యోతిర్మయి
అనురాధ
వల్లి
ప్రిన్స్
బాలవర్ధి రాజు
రాధా రవికిరణ్  
వీణా లహరి
వాసుదేవ్
చెప్పాలంటే
మధురవాణి
జై గొట్టిముక్కల
పూర్వ ఫల్గుణి
మిర్జాఅఫ్రోజ్ బేగ్ 
రమేష్ బాబు
అక్షరమోహనం
మానస
బాలకృష్ణారెడ్డి
దండు 
దాస్ 
శ్రీకర్ 
మల్లయ్య
కవితా లహరి
శ్రీనివాస్ అదరి
  హరి.పి    
గార్లకు

నా  రచనలను  అచ్చులో చూసుకొనే  భాగ్యం  కల్పించిన   
పత్రికా సంపాదకులు శ్రీయుతులు:

 కలిమిశ్రీ (మల్లిపందిరి)
వేణుగోపాల్ (ఆశ)
జగన్నాధశర్మ (నవ్య), 
ఏ.ఎస్ లక్ష్మి(ఆంధ్రభూమి)
మాల్యాద్రి (బెంగుళూరు తెలుగుతేజం
పొత్తూరి సుబ్బారావు (సాహితీ కిరణం
తేలక పల్లి రవి, వరప్రసాద్ (సాహితీ ప్రస్థానం)
లక్కిరాజు దేవి (నెలవంక నెమలీక)
బైసదేవదాస్ (నేటినిజం)
గురూజీ (ధ్యాన మాలిక).
గార్లకు 

రంజాన్  ఈదుల్ ఫితర్  ముబారక్.  

Monday, 13 August 2012

ఎవరు దోషులు?ఎవరు  దోషులు?

ఆడపిల్లగా,అవిటిపిల్లగా  పుడితే  పెంచటానికి  చావ లేని 
పార్కులో   పారవేసిన   కన్నవాళ్ళా?

చేతికెత్తుకొని ,  చంకనేసుకొని  ఎర్రటెండలో  అడుక్కునేందుకు   
ఆయత్తమయిన   యుక్తి తెలిసిన   యాచకులా  ?

అడుక్కున్న  అన్నాన్ని  పంచలేదని   అలకబూనిన 
చెంత నుండే    చిన్న నాటి    నేస్తగాళ్ళా  ?

అడ్డుపడే   చింకి లంగా   చీకిపోయి  చినిగిపోతే
చొంగకార్చే  రోతమాలిన   కొంటెగాళ్ళా ?

చెట్టుకింద  కూర్చున్నా ,మెట్టుమీద  కూర్చున్నా 
చీదరించుకొనే   కోట్లు  సంపాదించే   కొట్టుగాళ్ళా ?

చీటింగూ,  చైనుస్నాచింగూ   కేసులు  బనాయించి 
బొక్కలోతోసే   కనికరం  లేని  ఖాకీ గాళ్ళా ?

నడిరోడ్డు  మీద  అడుక్కుంటూ  అమ్మా, అయ్యా  అంటున్నా 
చలించక  తలతిప్పక   కూర్చున్న   సిటీ గాళ్ళా ?

హంసలా  ఉన్నా  కాకిలా ఉన్నా  అర్ధరాత్రి  ఆడవాసనకు 
అలవాటుపడి   వెంటపడే   వేట గాళ్ళా ?

ధరలు  మండుతున్నా , దరిద్రం  వదలకున్నా ,
పదవిపట్టుకు   పాకులాడే  నేతగాళ్లా ? ( నేత అంటే ఇక్కడ మంత్రి  ) 

అర్ధ రాత్రి దందాలను ,  అసాంగిక కార్యాలను   దారి కాచి , 
కెమెరాల్లో   బంధించి  కథలుగా  చూపే  మీడియాగాళ్లా ?


(ఇల్లూ,వాకిలీ, కూడూ,గూడూ, తోడూ,నీడా ,దారీ ,తెన్నూ 
లేక ,రోగాలకీ, ఆకలికీ, బలై   జీవచ్చవాల్లా  బ్రతికే  బడుగు జీవుల ;
ఆనాదల జీవితాలు  కోకొల్లలు  కంటిముందు  కనిపిస్తున్నా , ఏమి చేయాలో తెలీక ,
ఏమిచేయకుండా  ఉండలేక, మనసును  మబ్యపెట్టి , అంతరాత్మను  అదిలించి ,
పాపబీతిని  పాతిపెట్టి , మానవత్వానికి  మంటబెట్టి  కళ్ళున్నా కబోదుల్లా  కాలాన్ని లాగేస్తున్న  సగటు  మధ్యతరగతి  మనుషులం మనమంతా.... సమాజంలో  మనమూ బాగమే కనుక  మనమూ కొంతవరకు  దోషులమే  ఏమంటారు? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు.?)  

( నా కవిత   ఏ  వర్గం   వారినయినా  నొప్పించి ఉంటె  మన్నించాలి )

Saturday, 11 August 2012

బందీ

బందీ

నిను నీవు బంధించుకున్నప్పుడు, నీ చుట్టూ నీవే ప్రదక్షిణ చేసుకున్నప్పుడు...
మొదట మందగమనంలా  వీచిన సమీరం ..తర్వాతా సుడిగాలిలా వీస్తుంది. 

వలపుగాటులా అనిపిస్తుంది, కానీ వడిశిలలా తగులుతుంది .
నిను శిలగా చేసి,..ఉలి చేత పట్టుకుని  తాను  శిల్పి అవుతుంది .

నీ తలపుల  సరాగాలకు, సరదాలకూ, సరసాలకూ పరదా పడుతుంది.
నిత్యం తానె  అయి ..నీతోనే ఉంటూ, నీకై తానేనంటూ...హారతి పడుతుంది.

దేనికోసం  ఏది విడవాలో, ఎవరికోసం  ఎవర్ని వదలాలో..,
అస్సలు మరచిపోవాల్సింది  ఏమిటో..గుర్తుకు రానిదేమిటో.?? 

నీకు మాత్రమే గుర్తున్న  నీ జ్ఞాపకాలని ఎదుటివారినుండి
ఎలాదాచాలో, అసలెందుకు దాచాలో తెలీని పరిస్థితి.

అమ్మా, నాన్నలకు  యువరాజుగా  అభయం  ఇవ్వటం.
చెల్లికి  తగిన జోడిని తెస్తానని  ప్రగల్బాలు పలకటం.
తన ప్రేమ గొప్పదని,   నమ్మమని  ప్రేయసికి  మాటివ్వటం.

అప్పుడప్పుడూ  వాటితాలూకు  వాసనలూ, వాస్తవాలూ,
ఇంట్లో  చర్చలై సాగుతుంటాయి. జవాబు లేని  ప్రశ్నలే  ఉంటాయి . 
కలతలంటే  కలవరపాటు, తగవులంటే తత్తరపాటు.

బిడియంతో బిగుసుకు పోయే  బిత్తరపాటు, తమకంతో  తత్తరపాటు.
ఎవరైనా చూస్తె  ఎలా అనే తడబాటు, తెలిసిపోతే ఎలా అనే  గ్రహపాటు.   

మౌనిలా, జ్ఞానిలా ఉండేందుకు  ప్రయత్నం, యోగిలా, విరాగిలా అంతరంగం.
తలపుల తుంపరలో  తడుస్తూ, మణుగుల కొద్దీ మౌనాన్ని  మోస్తూ.

మనస్సు పడే మధనాన్ని  చేదిస్తూ, ఎద వేదనని ఖండిస్తూ,  
అడుగడుగునా అర్ధాంగిని అనుసరిస్తూ,(అనుకుంటూ).

ఇంతకీ  నీవెవరూ  నీకైనా తెలుసా  అస్తిత్వానివి 

నిత్యం మానసిక మైదానంలో  ఇరుపక్ష  పోరు నీవే  సాగిస్తూ, 
నీటిని దోసిట నిలపాలని చూస్తూ, నిప్పును మూట కట్టాలనుకుంటూ.

ఒంగిపోతూ, క్రుంగిపోతూ ఒక బంధం కోసం వేయి బంధాల ముందు,
ఓడిపోయిన అవిజేయుడివి..జీవితాన్ని కుదవ పెట్టిన  వివాహితుడివి. 

Wednesday, 8 August 2012

తోడు


తోడు

మాసిపోయిన  పసితనం ,మరచిపోయిన  హసితం.
రుతువులు మారుతున్న వేళ, మనసున  నాటుకున్న ముళ్ళు.

వదిలించుకున్న సన్నిహితులూ, మన్నించలేని సన్నివేశాలు.
నిస్సారమైన వాస్తవాలు,   నిలువ నీయని  గతాలూ,

నాకు తోడు నిలిచిన  నీవు  ఎవరని చెప్పనూ .......  


చందమామ  చలువ  కన్నులనుండి జారిన  వెన్నెల  తునకవు 
దిక్కుతోచని   నా జీవన నావకు   దారి చూపిన  చుక్కానివి.

ప్రేమకై   తపించిన వేళ   తడబడే  అడుగులకు    గమ్యానివి.
పసిడి ధారలా   ధాత్రిని  తాకిన    వర్షపు  సోయగానివి.

ఎదురు  చూడని ఆమనివి,   ఎద నిండిన పూవనివి. 
కదలి  వచ్చిన  దైవానివి , కాంతులీను కిరణానివి.
భవిత బాటలో   వెలుగు నింపిన  భానుడివి.

హృదయ  ఘోషని   మధురబాష  చేసిన  మహాత్మునివి.
మండుతున్న మదిలోన వాత్సల్యం   నింపిన అమృత మూర్తివి

గగనసీమ  నుండి  దిగివచ్చిన  గంధర్వుడివి.
సేదతీర్చి  చెంత చేరిన    వలపు  చెలికాడివి.

విరుల  వీవనతో  విసిరి   అలక తీర్చిన   జతగాడివి.
తోడుగా నిలిచి  చిటికిన వేలు అందుకున్న  సహచరుడివి.

జీవన దారిలో వెన్నెల పుప్పిడి అద్దిన శశాంకుడివి.
ఏడడుగులు నడచి  ఎల్ల కాలం  నాతో ఉంటానన్న  పతిదేవుడివి .

నీవే   నా సాహసానివీ ......   నీవే    నా సైన్యానివీ.
నీవే   నా   గతివీ.............    నీవే  నా   పతివీ. 

( నా జీవితపుస్తకానికి   ముఖచిత్రమైన   మా  శ్రీ వారికి   పై కవితను  సమర్పించుకుంటున్నాను ) 
  

Sunday, 5 August 2012

అంతర్లాపిఅంతర్లాపి
నా  "అంతర్లాపి " ఎగిరి  వచ్చి నీ యెదుటనే  వాలింది, 
నీ అంతరాత్మనే సంతకం గా  చేయమన్నది.
ముఖ్యమే  అనుకుంటావో..ముసాయిదా అనుకుంటావో, 

చేదు విషపుసిరాతో  నింపిన  అక్షర వ్రణం.
ఆఖరి  వీడ్కోలు వరకూ  ఎదురుచూసిన  ప్రణయం.

భగభగ మండే  అగ్శిశిఖ సలసల కాగే తైల సెగ. 
అనుభూతులను పాతిపెట్టిన  వాస్తవ  గాధ.

ముచ్చటైన  పలుకులను గొంతులోనే  నొక్కేసిన హత్యారి 
హృదయాన్ని అర్పించి,  శ్వాసని  ఆపేసిన తలారి.

ఆరిపోయిన కణాలను  సాగిపోతున్న  క్షణాలతో  కలిపే   ప్రయోగి .
నమ్మకాన్ని అమ్ముకొని, ఆశను  నమ్ముకున్న  విరాగి.

కరిగిపోయిన కలను, తిరిగి   కాంచాలనుకునే  అత్యాశి.
తానూ  పులిలా  కానరావాలనుకునే వాతలు పెట్టుకొనే జంబుకం..

ఎత్తైన  సౌధాలను, ఒత్తైన అందాలను  ఎదుర్కోలేని  అనాకారి.
ఏడు అడుగులనూ, మూడు ముళ్లనూ నమ్మిన సంసారి.

నీటిపలక  మీద గోటితో  రాసిన అక్షర  శోకం.
కంటికొలికిలో ఒదగలేక  ఒలికిపోయిన అశ్రుకణం.

కళ్ళముందే ఉన్నా కనిపించని  శ్వేత పత్రం.
చెవి  చెంతనే ఉన్నా వినిపించని  మరణ మృదంగం.