Pages

Monday, 20 August 2012

బయ్యం
బయ్యం 

పొద్దుగాల  మొదలు పెడతాది  మాయమ్మ నన్ను నిద్దర లేపటం, నేను అట్ట బొల్లి,ఇట్టబోల్లి ,  నీలిగి నిక్కి లేస్తా, ఆమైన(ఆ తర్వాతా) పొంత పోయ్యి కాడ  బొగ్గుతో పొళ్లు  తోముకుంటా, నిమ్మకాయ బద్దతో  సద్దన్నం తిని బడి కిబోతా.


మా నాయిన బోయినప్పుడు మాయమ్మతో అందరూ జెప్పినారు మేముండాములే నీకు నీకోడుక్కి ఇబ్బందిరానీము అని. నిజమే గావాలా అనికున్నానేను. ఎవురూ ఏమి ఆదుకోలా పెట్టలా. మాయమ్మకి కూలీ తప్పలా, మాకు పస్తులూ తప్పలా.

నాకు అర్దంగానిది  ఏందంటే, మాయమ్మ  కొన్నేసి   సార్లు నన్ను మరిసిపోద్ది. లేకపోతే మద్దేనం నేను అన్నం బెల్లులో  ఏమైనా తినాలగదా  ఏమీ బెట్టదు  అట్టని  అమ్మ కూడా ఏమి తీసుకొని పోదు. నేను అన్నంబెల్లు కొట్టినప్పుడు  బడి ఎనకాల  గుబ్బలచెట్టు (చీమ చింత) కాడికి బోయి వాటిని దింటా. పిలకాయిలు చూస్తారనుకో  ఓరే  ఈడికి అన్నం  లేదురా అడక్కతినే  నాయాలు  అంటారు. అందుకనే నేను  బాల్  తెచ్చుకోని ఆడుకున్నట్లు  యాక్సన్  చాస్తా. మా పక్కింటి అనసూయ  నా పెండే  ఆయమ్మి, పిలస్తాది రాఅబయా  నేను బెడతాలే  అంటాది, నేనే బోను  పొయ్యి, పొయ్యి ఆడపిల్ల దగ్గరా వన్నం వణ్ణం? అంతకంటే నీళ్ళు లేని బాయిలో బడి సావటం మేలుగదా. 
***
రెండు దినాలబట్టి  ఒకటే వాన.ఇల్లు మొత్తము  ఉరస్తా ఉండాది. అమ్మ కూడా పనికిబోలేక  ఇంట్లో ఉండిపోయింది. నాకు మాయమ్మ ఇంట్లో ఉంటె బలే  ఇష్టం అమ్మతో మాట్లాడుకుంటా ఏడి, ఏడి సెనిక్కాయలు ఏపుకొని తినాలని కుశాల. అయినా అట్టా ఎట్టా  జరగతాదిలే  మేమేమన్నా  మారాజులమా?

మన్నాడు  పొద్దుగాలనే  బడికి బోవాలని పుస్తకాల సంచి  ఇదిలిస్తా ఉండా, "అబ్బయ్యా  బడి ఉండాదా ఉంటెమాత్తరం  ఎట్టాబోతావు ?" అమ్మ అడగతా  ఉండాది నేను జవాబు సెప్పలా, ఏమి జెప్పేది,  ఉన్న నూకలు  నాకు ఒండి పెట్టి  అమ్మ  పస్తుబొనుకునే, ఈయాల  గూడా   ఇంట్లో ఉన్నానా  అమ్మ తిప్పలు చూడలేను. "ఒరే  నాయినా ఇనవేందిరా తడిసిపోతావు" అమ్మ అదిలిస్తూనే ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరగతా  ఉండాయి. లేదుమా  పోకబోతే లెక్కలయ్యోరు  తంతాడు " అనేసి  సంచి బుజానికి తగిలిచ్చుకొనే  వానలో పరిగెత్తినా. రోడ్డు మీదకి  వచ్చినానేగాని అమ్మే  కనిపిస్తాఉండాది. ముందుగా బడికి బోయిన పిలకాయిలు  బడి లేదని  కుశాలుగా  చెప్పినారు, అయినా సరే నేను ఇంటికిబోలా  దినవంతా  ఆడా, ఈడా  తడస్తానే ఉండినా  నా కోసం అమ్మ కష్టపడొద్దు,  సాయింత్రానికి తడిసి  ముద్దాయి ఇల్లు సేరినా.
***
తలదిమ్మగా  ఉండాది, అమ్మ నా తలకాడనే  కూకోనుండాది. పక్కింటి  శంకరక్క కూడా  నిల్చోనుంది, నాకిష్టమైన  బూబమ్మ బొంకులో బొరుగులుండలు   గంప   డబిలించి (బోర్లించి) దానిమీద  పెట్టి ఉండాయి. వాళ్ళ  మాటల్ని  బట్టి  అర్దమైంది  నేను  మూడు  రోజులనుంచి  జరంతోబడి  ఉండానన్నమాట.  అమ్మ  శంకరక్కని   ఏందో  మెల్లింగా  అడగతా  ఉండాది. నాకు  మాత్రం  ఆయక్క  గొంతు  ఇనిపిచ్చింది "ఏందిమే ఏడ  దెచ్చిస్తావు, నీకేమన్నా  మిద్దిలా, మేడలా,  ఈ రకంగా అప్పులు సెయ్టానికి.., సరె..పో  పిలగాడికోసరం  అంటాఉండావ్  రొండు రోపాయిలు  ఉండాయి  నాకాడ " ఇదీ  నాకు  ఇనిపించింది. చెపోద్డా  నాకు  బలే  కోపం వచ్చింది   ఎందుకా? ఆయక్క  ఇంకో  మాటన్నది   అది  చెప్పాలంటే  మీకు  ఇంగో  ఇసయం  సెప్పాల. "ఇన్ని బాదలెందుకు ఎంకురెడ్డిని  అడిగితె  ఇస్తాడుగదా"  అన్నది  ఆయక్క  మాయమ్మతో. అయితే  నాకు కోపమెందుకో  చెప్తా  ఇని  ఆనాయాలు  ఎట్టాటోడో  మీరే       చెప్పుదురుగాని.


ఒకరోజు  పోద్దుబోయినా   మాయమ్మ  ఇంటికిరాలా,  ఎంకురెడ్డి  ఇటికల సూల  కాడికి  పనికిబోయిందని  తెలిసి  నేనే అక్కడికి  పోయినా, నేను బోయ్యేకాడికి  అమ్మ యాపమానుకి  ఆనుకొని  యాడస్తా ఉండాది, రెడ్డి  నులకమంచం  మీద  పడుకొని  ఎదురుగ్గాఉన్న  అమ్మనే  సూస్తా  ఉండాడు  గుడిసంగం  తిరణాల   చూసినట్లు. నేను  పొయ్యి అమ్మ కొంగు పట్టుకొని  నిలబడ్డా." ఊ..నీ కొడుకొచ్చినాడు  కలక్టరు  ఈడు కలక్టరయ్యి  నీ కస్టాలు  తీరస్తాడుపో"  అని పకపక  నవ్వినాడు. " అయ్యన్నీ ఉండనీ రెడ్డా  నా కూలిడబ్బులియ్యి"  అమ్మ యాడస్తానే అడిగింది.  ఎవ్వురీనన్నారు  నా మాటకి  ఊ అను డబలు  కూలిస్తా .. అంటూ  బీడీలు   తాగితాగి  గార పట్టిన  పళ్ళు  చూపిస్తూ  నవ్వాడు."ఏందీ  ఇనేది  సావనైనా  సస్తాగానీ అట్టాంటి  రోతపన్లు  నేను  చెయ్యను " కచ్చితంగా చెప్పింది."అందుకే  నాకు మండతాది నా నోటికి  మంచి కూతలు రావు   కడుపులో గాలితే  నువ్వే దారికోస్తావ్  కూలి రేపిస్తాపో  అనేసి  తుండుగుడ్డ  ఇదిల్చి బుజాన ఏసుకొని  లేసిపోయినాడు. అమ్మ ఆడనే కూచుని  యాడస్తా  ఉంటె  ఏమి చెయ్యాలో తెలీక కింద  మట్టి తీసుకొని  రెడ్డి  పోయినదిక్కు  పోసి" ఒరే  నాయాలా  నన్ను పెద్దగానీరా  సెప్తా" అని  అరిసినా. అమ్మ నన్ను తీసుకొని ఇంటికొచ్చింది,  ఆరాత్రంతా  యాడస్తానే  ఉండాది.  ఇదిగో అందుకే నాకు  ఆ నాయాలి  మాట ఇని కోపమొచ్చింది.
***    
అమ్మ  అన్ని పెయత్నాలూ  సేసింది  జరంతగ్గలా. ఎవురెవురో  వచ్చి సూసిపోతాఉండారు,  ఎంకురెడ్డి  వచ్చి దబ్బులిస్తానన్నాడు  "నా బిడ్డని సంపుకుంటా  గాని  నీడబ్బులోద్దు   నాకు  అనేసింది   మాయమ్మ.
  
నా కళ్ళముందు   ఏందో  గుండ్రాలు, గుండ్రాలుగా  నల్లంగా  పిడకల మాదిరిగా   తిరగతా  ఉండాయి. చేవ్వుల్లో  ఏందో  గుయ్యి  మంటా ఉండాది నేను  చానా  ఎత్తుగా  పోతాఉండా,  అమ్మచెయ్యి  పట్టుకొనే ఎక్కడికొనే ఉండా పైకి పోతా  ఉండాము. ఒకచోట  ఎన్నముద్దలు, మిద్దింటి  బుజ్జమ్మ వాళ్ళింట్లో  ఐస్ పెట్టిలో  నీళ్ళు  ఉన్నట్టు   ఉండాయి  నీళ్ళు. రేగి కాయిలూ, పచ్చరిటిపొళ్లు, నిప్పట్లు (అరిసెలు) ఇంకా  ఏమేమో  ఉండాయిలే  అమ్మ నాకు  తినబెడతా  ఉండాది. అప్పుడే ఎంకురెడ్డి ఒచ్చినాడు. ఆ నాయాలుకి రెండు కొమ్ములుండాయి  బలే నవ్వొచ్చిందిలే నాకు  అమ్మని సూడబోయ్యి  కళ్ళు మూసేసుకున్నాడు   ఎందుకంటే  అమ్మ  ఇప్పుడు  తెల్లంగా  లైటు ఎలిగినట్టా  ఎలిగి  పోతుళ్ళా. 


కళ్లుబోయ్యి  ఓడు (వాడు) యాడస్తా  ఉంటె నాకు ఒకటే  నవ్వు. నవ్వతా ఉండా.. నవ్వతా  ఉండా .......అవునూ  నేను  నవ్వతా  ఉండా  కదా  మరి ఏడిసేది  ఎవురూ?? అరె  ఇచిత్రంగా  ఉందే  శంకరక్క  గూడా  యాడస్తా ఉండాది.

"అయ్యో  నీలవేనా  ఎందిమే..ఇంత  అన్నాయమా?  సిన్న  పిల్లోన్ని గూడా  తీసకపోయ్యినావా., నాయమ్మే  ఏమి  కష్టమోచ్చిందే తల్లీ.."

అరె  ఒక్కొక్కరూ   వస్తా  ఉండారు  నాతరగతి  పిలకాయలు  వాళ్ళ  అమ్మల సాటున  జేరి  చూస్తా  ఉండారు.


ఇప్పుడు  అర్ధం  అయ్యింది  నాకు,  నేను అమ్మా సచ్చిపోయ్యామన్నమాట పో. పోనీ పో   ఈ రకంగాఅయినా  బతికి పోయ్యాం. ఆకలి బాధలనుండి. ఇక  మీరు  దెయ్యాలు అనుకున్న బయ్యం లేదు, బూతాలు  అనుకున్నా  బయ్యం లేదు. బతుకంటేనే   బయ్యం. 


ఆకలంటే  బయ్యం ఉండేది.  ఇప్పుడు  అదీ  లేదు. బాధ ఎందుకంటే  నేను పెద్దయ్యి  అందరు  కడుపునిండా అన్నం తినేట్టు   ఏమైనా  చెయ్యాల  అనుకొనే వోడిని. కాని,   ఆ  ఆకలే   నన్ను  సిన్నోడిగా   ఉన్నప్పుడే సాగనంపిందే... ఇలా  ఎంత  మందిని   సాగానంపుతుందో  అదీ..... అదే              నా బయ్యం.


  

29 comments:

 1. ఎంత దయనీయం.ఆకలికేకలకు ఎంతమంది బలవుతున్నారో కదా !

  ReplyDelete
  Replies
  1. సర్, ఆకలి చాలా భయకరమైనది. ప్రతి మనిషికీ పట్టెడన్నం దొరికితే మన దేశం అన్నపూర్ణే.
   మీ స్పందనకు ధన్యవాదాలు...మెరాజ్.

   Delete
 2. ఆకలి, నిస్సహాయత ఎంత భయంకరమైనవో....ఈ కథ చాలాకాలం వరకు మనసునంటే వుంటుంది.

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ, నా కథ మీ మనసుని అంటి ఉంటుంది అన్నారు.
   చాలు ఇలాంటి సున్నిత హృదయమే ప్రతి మనిషిలో ఉండాలి.
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 3. రవిశేఖర్, జ్యోతిర్మయి అవును చాలా నిజం ఆ బాధకి విముక్తి ..... ఆదేనా అని అనిపిస్తుంటుంది. మనసులో నిలిచిపోయే కధనం... ఫాతిమాగారు.

  ReplyDelete
  Replies
  1. రాజారావ్ గారూ, బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.
   మీ స్పందనకు కృతజ్ఞతలు.కథ నచ్చినందుకు సంతోషం.

   Delete
 4. ఆ ఆకలే నన్ను సిన్నోడిగా ఉన్నప్పుడే సాగనంపిందే...
  ఇలా ఎంత మందిని సాగానంపుతుందో అదీ..... అదే నా బయ్యం...
  ఈ భయం మరెవరికీ కలగకూడదని ఆశిద్దాం ఫాతిమా గారూ!
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. సర్, ఈ ఆకలి మహమ్మారి ఎందరిని పొట్టన పెట్టుకుంటుందో,
   నిరుపేదల ఆకలి కేకలు లేని దేశం కావాలి మనదేశం.
   మీ స్పందనకు ధన్యవాదాలు..మెరాజ్.

   Delete
 5. వెంకురెడ్డి లాటి వాళ్ళు పెరిగిన సమాజంలో నీతి, నిజాయితీలు బతకవు, దారిద్ర్యం మరీ పెరుగుతుంది.

  ReplyDelete
  Replies
  1. సర్, నిజం చెప్పారు. ఇలాంటి వారికి చదువు, వివేకం లేకపోవటం ధనమదం కూడా కారణం.
   నిరుపేదలకు తమ హక్కును కాపాడుకోవటానికి సరైన రక్షణ లేకపోవటం వల్లా ,,
   ఈ భూస్వాముల ఆటలుసాగుతాయి. కథ చదివిన మీకు నా కృతజ్ఞతలు.

   Delete
 6. కథ దయనీయంగా ఉంది. మీరు చెప్పిన తీరు హృద్యంగా ఉంది. ఎక్కడో ఉత్తరాంద్రలోఉండే మా నాయనమ్మ అన్నాన్ని వణ్ణం అనేది.( చాలా కాలం క్రిందటి సంగతి) ఇక్కడ ఆ పదం నాకు ఆశ్చర్యం గొలుపుతోంది.ఈ పదం ఇంకెక్కడెక్కడ వాడుకలో ఉండేదో?

  ReplyDelete
  Replies
  1. సర్, నా బ్లాగ్ దర్శించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
   సర్, ఈ వణ్ణం అనే పదం నెల్లూరు మాండలీకమే కానీ తమిళ్నాడు బోర్డర్ లో ఉన్న నెల్లూరుజిల్లా పల్లెలనుండి వినిపిస్తుంది.
   మీకు కథ నచ్చటం సంతోషాన్నిచ్చింది. కృతజ్ఞతలతో... మెరాజ్.

   Delete
 7. "నేను పెద్దయ్యి అందరు కడుపునిండా అన్నం తినేట్టు
  ఏమైనా చెయ్యాల అనుకొనే వోడిని."

  పాపం ఆ పసి మనసు కోరిక తీర్చాలని ఆ దేవుడికి కూడా అనిపించలేదండీ..
  నిజంగా మనతో పాటూ ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా
  అని ఇలాంటివి చదివినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది..

  ReplyDelete
  Replies
  1. రాజి గారూ, మీరన్నది నిజమే మన మద్యనే ఉన్నారు.
   మన చుట్టూ ఉన్నారు. పెరిగే దరల మద్య కాలే కడుపులతో
   నా ప్రతి పోస్ట్ ఓపిగ్గా చదివే రాజీ గారికి మరో మారు కృతజ్ఞతలతో ....మెరాజ్.

   Delete
 8. katha chala బాగుంది..బాధ కూడా అయ్యింది.. మీకు మా "సె నిక్కాయలు " వచ్చింది చాలా వరకు రాయలసీమ భాషే...నేనూ చదివింది..పని చేసింది అంత హైదెరాబాద్ లోనే..అయినా..ఇలా అనిపించింది...ప్రాంతీయ భావన బయటపడే రోజులు కావు బాబోయ్!!

  ReplyDelete
 9. కథ చదివిన మీకు ధన్యవాదాలు.
  నేను వాడినది నెల్లూరు మాండలీకం మీకు అర్ధం అయినందుకు సంతోషం.
  మేడం మరోమారు కృతజ్ఞతలు.

  ReplyDelete
 10. కధనం బాగుంది. కధాంశం కన్నీళ్ళు పెట్టించింది. హృద్యమైన కొందరి వాస్తవాన్ని చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. భారతి గారు, కథ చదివిన మీకు ధన్యవాదాలు.
   నచ్చినందుకు సంతోషం. బ్లాగ్ చూసిన మీకు థాంక్స్....మెరాజ్

   Delete
 11. ప్చ్.. ఇలా తెల్లారిన బ్రతుకులెన్నో! కథ బాగుంది.

  రాయలసీమ బొరుగుండలు, కమ్మర్‌కట్ తిని ఎన్నేళ్ళయ్యిందో.

  Snkr

  ReplyDelete
  Replies
  1. snkr gaaroo,కథ నచ్చినందుకు సంతోషం.
   అవును కమ్మర్ కట్ అనే పదం విని ఎన్నాళ్ళయిందో.

   Delete
 12. ఫాతిమ గారు కథ, కథనం చాలా బాగుంది కన్నిళ్ళు తెప్పించింది

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారూ, బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.
   కథ నచ్చినందుకు కృతజ్ఞతలు.

   Delete
 13. ఆకలి దప్పికలే....ప్రాణభీతిని కలిగిస్తాయి, అవి అంటే నాకు భయమే.

  ReplyDelete
 14. prerana gaaru, katha chadivina meeku thanks.

  ReplyDelete
 15. మీ కథ గుండెలను పిండేసింది.
  అ చిన్ని బాబు బయ్యానికి మందు
  పిడికెడు బియ్యం. అది కూడా అందలేదే అని
  మనసు రోదిస్తోంది

  ReplyDelete
  Replies
  1. సర్, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
   కథ నచ్చినందుకు, చదివిన మీకు కృతజ్ఞతలు.
   మీ కథ "బినామి" ఇప్పుడే మీ బ్లాగ్ పోస్ట్ చూసాను, ఇంత క్రితమే అది నవ్యలో చదివాను.
   ఇప్పుడు నవ్య లో "మెయిన్ టీన్ " బాగుంది... మెరాజ్.

   Delete
 16. ఇన్ని దినాలు పవర్ కట్ తో ఈ కథను మిస్సయ్యానే..గుండెలను పిండే కథనంతో ఆకలి బాధను వర్ణించిన తీరుకు మీకు జయహో ఫాతిమాజీ...ఈ కథను ఆంధ్రజ్యోతికైనా వార్తకైనా ఆదివారం సంచికకు పంపించండి...హృదయపూర్వక అభినందనలు మేడం..

  ReplyDelete
 17. వర్మ గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు.
  మీకు ఈ కథ నచ్చుతుందని తెలుసు ఎందుకంటే మీరు కూడా సామాజికసమస్యల మీద స్పందిస్తారు.
  మీరన్నట్లే ఈ కథను "నవ్య " వార పత్రికకు పంపాను. వేసుకోలేదు సాటి రచయితగా మీకు తెలుసు పత్రికల ఆదరణ ఎలాంటిదో.
  నా కథ చదివిన బ్లాగ్ మిత్రుల ప్రశంసలే నాకు కోటి దీవనలు. మరో మారు ధన్యవాదాలతో...మెరాజ్.

  ReplyDelete