Pages

Saturday 29 September 2012

తోలు బొమ్మలు





తోలు బొమ్మలు 

నిదుర లేచిన నీ ఎదుట  నీ సేవకై  హాజరైన
సుప్రభాత గీతాలు వీళ్ళు.

నీ ఇంటి గచ్చునేలను  నిత్యం  మెరిపించే
చిరుగుపాతలు వీళ్ళు.

ధన పునాదియైన  నీ ఎత్తైన  సౌధానికి
కాపలా కాసే  శునకాలు వీళ్ళు.

నీకోసం  పెరటి పరిమళ  మల్లియ పూయించిన
చెమట  చలమలు  వీళ్ళు.

నీవు  విదిల్చిన ఎంగిలి మెతుకులు కతికే
క్షామ పీడితులు వీళ్ళు

నువ్వు విసిరేసే  నాలుగు రూకలకోసం నీ చుట్టూ
భ్రమించే  ఆకలి సూరీళ్ళు  వీళ్ళు.

పల్లకినెక్కిన  నిన్ను శ్రమనెరుగక  మోస్తున్న
కదిలే శవాలు వీళ్ళు.

నీవు వెతకనక్కరలేని  నీ కాళ్ళు చుట్టుకొనే
వెతల తీగలు వీళ్ళు.

గుప్పెడు మెతుకుల కోసం  బండెడు  చాకిరీ చేసే 
దారిద్ర  దౌర్భాగ్యులు  వీళ్ళు.

శ్రమలో  కాయాన్ని కొవ్వొత్తిలా  కరిగించి
మట్టిలో కలుస్తున్న మూగ జీవులు వీళ్ళు.

నిరంతరం నీ చేతి  వేళ్ళ  మద్య  ఆడే
తాళ్ళు లేని తోలు బొమ్మలు వీళ్ళు.

              ***
 వీరిని చైతన్య రహిత ,యాంత్రిక జీవులను చేసి నీ కనుసన్నలలో ఉంచుకున్న కాలాంతకుడివి  నీవు.

తలే కాని  తలపులు లేని  వీరిని  నీ పనుల కోసం  నియమించుకున్న నియంతవు నీవు.

నిర్మించుకో  వీరి బానిసత్వం  పై  నీ భవిత భవనాన్ని. దానికి రంగుగా అద్దుకో  వీరి రుధిరాన్ని

ఏదో ఒకరోజు పోటెత్తిన ఈ జనమే  నీ  భవనాన్ని పునాదులతో సహా  పీకి పారేయగలరు.

అంతవరకూ  సాగనీ  చాప కింద  నీరులా  ఉన్న  నీ  దౌర్జన్యాన్ని,












Sunday 23 September 2012

నిరుక్త





నిరుక్త

కలలకి ఆకారమయిన చిరు మొలకవి.

కష్టాలకొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి.

నిరుపేద ముంగిట వెలసిన చలువ పందిరివి.

కలల పంటవైన నిను మోసిన అమ్మ,

కరవు కాటకాలతో వడలిపోయిన కొమ్మ.

అణువణువూ ఆరిపోతున్నట్లూ, ఆఖరి శ్వాస ఆగిపోతున్నట్లూ..

నిప్పుల కొలిమి తానై నొప్పులు పడింది,

కంటి దీపమైన నీవు ఇంట వేలిగే వరకూ పంటి బిగువున బాధ నాపుకోగలిగింది.

తొమ్మిది నెల్లల్లో నీ బతుకు పుస్తకం అచ్చువేసింది.

తొలి పలుకుల్లో నీ ఆకారానికి ఆకృతిని ఇచ్చింది.

ఆఖరి పేజీలో తన ఆయువునే అంకితమిచ్చింది.

తన గర్భం నుండి దించి నిను ధరణి వితర్ది పై నిలబెట్టింది

"కంగారు తల్లి "లా నిను తోలుసంచిలో మోయలేక పోయింది..

జోల పాటలతో నిన్ను నిదురపుచ్చలేదు.

కర్మ సిద్ధాంతాన్ని నీ కాళ్ళకు చుట్టింది.

ఆకలి గ్రంథాన్ని నీ అరచేతిలో పెట్టింది.నీకు అందనంత దూరం వెళ్ళింది

చిరుచేపవైన నీవు వెతల వైతరణిని ఎలా ఈదగలవో..

చిన్న కురంగివి నీవు వేటసివంగులను ఎలా ఎదుర్కొగలవో..

కాలదోషం పట్టని ఈ బీదతనాన్ని ఎలా పారద్రోలగలవో...

***

చిన్ని వామనా భారతమ్మనడుగు అడుగు ఎక్కడ పెట్టాలి అని.

చిట్టి కుచేలా అన్నపూర్ణమ్మని అడుగు నా అన్నం ఏది అని.

ధర్మభూమినడుగు ఈ దారిద్యపు ఖర్మ ఏమిటి అని..

కాళరాత్రి నడుగు కాంతి పుంజం ఎపుడొస్తుందీ అని.

నీ ప్రతి పనినీ పదును చేసుకో ..నీ బ్రతుకు బాటను చదును చేసుకో.

Wednesday 19 September 2012

మాలెక్కల కష్టాలు





మాలెక్కల  కష్టాలు 


ఈ మద్య మహిళలు చాలా అలర్ట్ గా ఉంటున్నారు అనటానికి నాకు జరిగిన సన్మానం (నిజం అనుకున్నారు కదా., కాసేపు అలానే అనుకోండి ) మీకు చెప్పుకుంటాను, నా గోడు మీరు తప్ప ఎవరు వింటారు చెప్పండీ..


పట్ట పగలే దొంగతనాలూ, దోపిడీలూ, జరుగుతున్నాయనీ ఒంటరి మహిళలే టార్గెట్ అవుతున్నారనీ ,, చానెళ్ళు, పత్రికలూ రకరకాలుగా.. ఎక్కడెక్కడ ఎవరు బలియిపోయారో రోజంతా ఊదరగొడుతుంటే, మరీ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని నిద్రపోతే కలలో కూడా దొంగలు కనిపించటం లేదని పోలీసులు కూడా తమవంతుగా కాలనీల మీద పడి బూరలో(లౌడ్ స్పీకర్ ) అరుస్తూ తిరిగి మహిళలను అప్రమత్తంగా ఉండమని చెప్పేసి తమ ఖాకీకి న్యాయం చేస్తున్నారు.

ఏలికలకు అర్జెంటుగా ఓట్లు అవసరమోచ్చేసికాబోలు ప్రజానీకం గుర్తొచ్చి పనిలేని పంతుళ్ళమైన మమ్ము తోలేశారు ఊరిమీద. ఓ మిట్టమద్యాహ్నం నేను నా సహోద్యోగులు భాస్కర్, శేఖర్, ఉషా ,గార్లతో కలసి ఆరుగురం జనాబా లెక్కలకి బయలుదేరాను. జాతీయ రహదారికి దూరంగా ఉన్న ఓ చిన్ని కాలనీకి వెళ్లాం, ఎండ మండుతూంది, నెత్తిమీద టోపీలు, కళ్ళకు నల్ల కళ్ళజోళ్ళూ , మూతులకు రుమాళ్ళూ, భుజాలకు వేలాడే సంచులూ, చంకన రికార్డ్ బుక్కులూ, విచిత్ర వేషధారణలో మొదటిబహుమతి విజేతల్లా ఉన్న మేము ఇద్దరిద్దరం గా విడిపోయి కాలనీ వీధులు పంచుకున్నాము (మేమంతే లెండి )


నేను ఉషా ఓ ఇంటి తలుపు తట్టాము తెరుచుకోలేదు.. కొంచెం గట్ట్టిగా టక్..టక్.. అంటే తలుపు తెరుచుకొంది, ఆడ ఘటోద్గజుడిలా ఓ ఆవిడ మమ్మలి కొరకొరా చూస్తూ, అబ్బా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా, ఆ దిక్కుమాలిన సబ్బులూ, పాచిపోయిన బిస్కట్లూ మాకొద్దు వెళ్ళండి అంటూ మొఖం మీద తలుపు భళ్లుమని వేసింది.

అమ్మో ..చచ్చాను బాబోయ్... మాఉష కేకతో నేను షాక్ నుండి తేరుకున్నాను. పాపం మా ఉషకొంచం అడ్వాన్ అయిపోయి ముఖం లోపల పెట్టినట్లుంది, ముక్కు కాస్తా పచ్చడి అయ్యినంత పనయ్యింది.


ఈసారి తలుపు గట్టిగా కొట్టాను. ఇందాకటి ఇల్లాలే తలుపు తీసి "ఏంటి ఇంకావెళ్ళలేదా మీరు?" హూంకరించింది. లేదండీ, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం " అంటూ కొంచం చనువుగా దూరబోయాను, ఊహు.. ఆమె ఇంచి కూడా కదలకుండా అడ్డుగా నుల్చుంది, ఇక చేసేదేమీ లేక గడప బైటే ఓ కాలు మడతపెట్టి నుల్చుని రికార్డు తీసి వివరాలు రాసుకోనేందుకు సిద్దమై తలెత్తాను. ఆమె తన ఏడేళ్ళ కొడుకు చెవిలో ఏమో చెప్పటం చూసి అబ్బే ఇప్పుడు కూల్ డ్రింకులు లాంటివి ఏమి వద్దండీ... మొఖమాటంగా నవ్వుతూ... మీరు కాసేపు మాతో సహకరించండి చాలు అన్నాను, తలవాకిలి వైపు చూస్తున్న ఆమెను చూసి.

అలాగే కానీ మా ఇంట్లో కొత్తగా ఎవరూ పుట్ట్టలేదు, ఉన్నవారు పోరు కూడానూ అన్నది పక్క గదివైపు చూస్తూ .., అక్కడినుండి సన్నగా దగ్గు వినిపిస్తూనే ఉంది నేను వచ్చినప్పటి నుండి.(ఈమె గారి ఆదరణ వెనుక ఆ గది వేదన నేను అంచనా వేయగలను). నేను వివరాలు రాసుకొవటం పూర్తి కాగానే ఉష కోసం చూసాను, తను లేదు బహుశా ముక్కుపట్టుకొని ఏ చెట్టుకిందో కూర్చుని ఉంటుంది అనుకున్నా, విపరీతంగా దాహం వేస్తుంది. "ఏమండీకాస్త నీళ్ళు ఇస్తారా" అని చనువుగా లోపలికి ఓ అడుగేసాను ఆమె లోపలికెల్లటం చూసి. ఆమె ఎదురొచ్చి"ఆహా.. ఎందుకివ్వనూ! నేను నీళ్ళ కోసం వెళ్తాను ఇదిగో నువ్విలా నా వెనుకే వచ్చి ఏ మందో మాకో చల్లుతావు నాకు తెలీదా "అంటూ తన పిడికిటదాచుకున్న కారాన్ని శపిస్తున్న ఋషిలా నా ముఖాన కొట్టింది.

"అయ్యో బాబో.. చచ్చాన్రో ఏమిటీ అన్యాయం అంటూ మండుతున్న కళ్ళు తెరవటానికి ప్రత్నిస్తూ, ఉషా ఉషా, అంటూ  కేకలు వేస్తున్న నన్ను ఒక్క గుంజు గుంజి బట్టల మూటలా గదిలో ఓ మూలకి విసిరేసి ఓ చిన్ని చున్నీ నా నోట్లో కుక్కింది. అరిచావో చంపుతాను పోలీసులోచ్చే వచ్చేవరకూ లోపల నోరు మూసుక్కూచోని తగలడు అంటూ జాంబవంతిలా బయటికి జంపు చేసిందా ఇల్లాలు. నా చేతిలోని రిజిస్టర్లు, సెల్లు ఫోను అక్కడే పడిపోయాయి.

************
ఇంతలో అలికిడయ్యింది.. కళ్ళు తుడుచుకుని చూసాను, ఆమె కొడుకు హిడింబి లాంటి మరో ఇద్దరు ఆడవాళ్ళను వెంటపెట్టుకొని వచ్చాడు." చూశావా వదినా ఇది ఎంత నంగనాచిలా వచ్చింది అనుకున్నారూ .. జనాబా లెక్కలు దీని కాష్టంలో లెక్కలు అంటూ, నేను తెలివైనదాన్ని కాబట్టి సరిపోయిందిగానీ, లేకుంటే అమ్మో, అమ్మో".. చేతులు కళ్ళూ తిప్పుతూ చెప్తుంది నన్ను పట్టుకున్నావిడ. ఆ వచ్చిన వాళ్ళలో ఒకామె "అయ్యో నువ్వు మీ బాబుని పంపుతూనే వచ్చేవాళ్ళమే తల్లీ..అంటూ చెప్పుకుపోతూఉంది (వాడిని పంపింది కూల్ డ్రింకులకి అనుకున్న నాబుద్ధి  ఎంత గొప్పదో మీకీపాటికి అర్దమై ఉంటుంది ) ఏమైందో తెలుసా? మా గేటు దగ్గర ఓ ఆడమనిషి దీని వయస్సు (ఏంటో బొత్తిగా మర్యాద లేదు వీళ్ళకి, అయినా నేనిప్పుడు పంతులమ్మని కాదు కదా) ఉంటుంది మూతికి బట్ట కట్టుకొని ముఖం గుర్తు పట్టకుండా ఇంట్లో దూరటానికి తచ్చాడుతుంది, దాన్ని పట్టి రూంలో వేసి పోలిసులకి ఫోన్ చేస్తున్నాము మీ వాడు వచ్చాడు." వివరించింది. నా ప్రాణం యెగిరి పోయింది అంటే వాళ్ళు ఉషని కూడా పట్టి లోపలవేశారన్నమాట. కోపంతో నా పళ్ళు కొరికాను నోట్లో చున్నీ ఉంది కదా వారికి వినిపించలేదు. మాతో వచ్చిన ఈ మగ టీచర్లు ఏమయ్యారో? ఏముంది ఏ టీ కొట్టు దగ్గరో బైటాయించి సిగరెట్లు ఊదుతూ ఉంటారు.

ఈ వీర వనితలు నన్ను ఎలా పట్టుకున్నదీ, ఇంకా నాలాంటి దొంగలు (అయ్యో!) ఎక్కడెక్కడ తిరుగు తున్నదీ.. టి.వి.లో ఏచానల్లో ఎప్పుడెప్పుడు చూసారో మాట్లాడుకుంటూ, నేనున్న గది తలుపు బయటినుండి గడియ పెడుతుండగా నా సెల్ మోగింది. నాకు ప్రాణం లేచి వచ్చింది మా స్టాఫ్ చేసి ఉంటారు అనుకోని. తలుపు గడియపెడుతున్నావిడ గభాలున గెంతి నా ఫోను లిఫ్ట్ చేసి రౌద్రరూపంతో. " ఎరా దొంగ రాస్కెల్ ఏ ఇంట్లో ఉన్నావ్ పని అయిపోయిందా అని అడుగుతున్నావా? ఉండు నిన్ను కూడా పట్టుకొని.." ఊగిపోతుందా లావుపాటి శాల్తీ. ఆయాసంతో మాటలు రావట్లేదావిడకి.


ఆముగ్గురిలో ఇంకో ఆవిడ పెద్ద గొంతుతో "అయ్యో, అయ్యో.. అంటే వీళ్ళు పెద్ద గ్యాంగే వచ్చారన్న మాట, చుప్పనాతిది ఎలా చూస్తుందో చూడు దొంగమొఖం వేసుకుని. " అంటూ నా తల గోడకేసి కొట్టింది. ఏంటో మా వారేమో బంగారం నువ్వు బాగుంటావురా బొమ్మలా అంటారు. మా కోలీగ్సేమో ఇంత అమాయయకంగా ఉంటె ఎలా  మేడం అంటారు. మరి వీళ్ళకి దొంగ మొఖం ఎలా అనిపించిందో... అంతా నా రాత లెండి. బిక్కు బిక్కుమంటూ నిల్చున్నాను ఇంకా నా మీద ఏమి ప్రయోగాలు చేస్తారో ఏమో అనుకుంటూ.

******
నా బ్యాగులోని పత్రాలు లాక్కుని చూశారా ఇవి నకిలీవి అంటూ ధ్రువీకరించారు ఆ అతితెలివి మహిళలు. ఈ టి.వి.చానళ్ళు క్రైం గూర్చి ఊదరగొట్టి , అరిచి గీపెట్టి, ఈ మహిళారత్నాలకి సొంత ఆలోచన లేకుండా చేశారు దేవుడా ఇప్పుడేది దారి...నాలో నేను గొణుక్కుంటూ ఉన్నాను. ఇంతలో నా గది (నా గదేంటి నా బొందా ) తెరుచుకుంది . హి..హి ..అంటూ ఇంటి ఇల్లాలు వచ్చింది. కళ్ళు మండుతున్నా ఎలాగో చూసాను ఆమె వెనక మా హెడ్ మాస్టర్ గారు, మాతో వచ్చిన టీచర్లు,ఉష, పోలీసు ఇనస్పెక్టర్ కారం పడ్డ నా కళ్ళకి మసగ్గా కనిపించారు , ప్రాణం లేచి వచ్చింది. మా వాళ్ళను చూస్తూనే.

"మేడం ఆర్ యు ఓకే, " అన్నారు పోలీసు ఇనస్పెక్టర్ . నాట్ ఓకే.... అని అరవాలనిపించి, సభ్యత కాదని ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నా. ఇంటావిడ వారితో పాటు నాకు కాఫీ ఇస్తూ నా చేతులు (మనసులో కాళ్లు అనుకుందో ఏమో) పట్టుకొని " ఏంటో అందరూ భయపెడుతుంటే అలా చేసాను కానీ ఈ మేడం ముఖం అలా (ఎలా?) అనిపిచలేదు ..హి ..హి ... " అమ్మయ్య నా ఒరిజినల్ కామెంట్ నాకు దొరికిందోచ్ ..

"సారీ మేడం మా కాలనీ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టినట్లున్నారు.. హి హీ . . మీరు కొంచం అలర్ట్ గా ఉండాల్సింది " అన్నారు ఇనస్పెక్టర్.

ఉష గొంతు చించుకున్నట్లు అరిచింది మేము అలర్ట్ గా ఉండటం కాదు మీరు వీళ్ళని మరీ అంత అలర్ట్ గా చేసి నట్లున్నారు అందుకే మీ డ్యూటి కూడా వీళ్ళే చేస్తున్నారు . "

శేఖర్ సార్ ఏరి అడిగాను మిగతా వారిని " వెనక వీదిలో ఓ ఇంటి ఇల్లాలు అతన్నిదొంగా కాదా పరీక్షించేదుకు కుక్కని వదిలిందట. అది అతని పిక్క పీకి హాస్పిటల్ పాలు చేసింది . తనదైన శైలిలో నింపాదిగా చెప్పారు మా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు.
*****
మొత్తం మీద మేమంతా ఇంటిదారి పట్టాం, జనాబాలో మేము తగ్గనందుకు సంతోషిస్తూ..ఇలాంటి పనులకు ఉపాధ్యాయులనే ఎందుకు నియమిస్తారా అనుకొనేదాన్ని ఇప్పుడు అర్దమైంది. మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కదా జీవిత పాఠాలు ఇలాగే ఉంటాయి మరి.




































Sunday 16 September 2012

అంతర్వేదన









అంతర్వేదన 

నిరీక్షణా  సాంధ్య  నిశీధిలో ..నీకోసం  నిత్యం  వెతికే  నిస్సహాయినై  ...


చిద్రమైన  స్వప్నసౌధాన   పునాదితో  సహా  కూలిపోయిన  కుడ్యమునై ..


ఏకాంత  వనాంతర  విహార  వీక్షణలో ఎగిరే  అలుపెరుగని  విహంగమునై ..


గుండె అమ్ముకున్న నిను  దయకోసం  కోసం  దేవురిస్తూ  దేహీ అనే   బిక్షువునై...


ఏ నగిషీ  ఎరుగని నవ్వును  ఎండిన  పెదవులపై  తేవాలనుకొనే  వృదాప్రయాసినై...



కఠినశిలను  కన్నీటితో కరిగించి  ఇష్టరీతిలో మలచుకోవాలనుకొనే  ఆశల వులినై...

ఎద చీకటి గదులలో  జ్ఞాపిక దివ్వెతో తలపులను  తడమాలనుకొనే  అత్యాశి నై...


గాయమైన గేయం నుండి  రక్తమోడుతున్న రాగాన్ని  పలికించే  వీణియనై....


ద్రవించే  భావానికి  స్రవించే  అక్షరమోసగి  నిగూడ  అర్దాన్నిచ్చిన  నిఘంటువునై..


ముక్కలైన  గుండె  శకలాలను  శోక సంద్రాన  గాలిస్తూ మునకలు వేస్తున్న నిరాదరినై ...


పెదవి  దాటని మాటలు గొంతులో  విచ్చుకత్తులై   గుచ్చుతుంటే  మూగభావపు   మౌనినై...


పారిపోతున్న  నీడవెంట  నడుస్తూ  నీ సహచరిని   అనుకొనే   తెరువరినై ...


జీవన  పయోనిధిలో  అంతరంగ తరంగ ఆటుపోట్లను  ఎదుర్కొనే  ఓటు  పడవనై ...


నిరంతర  నీ  ద్యాసలో  అలమటిస్తూ  ఆఖరి శ్వాసవరకూ  నీకై  నిరీక్షించే  అభిసారికనై...



సమస్యలూ .సందిగ్దాలూ ,అనుమానాలూ,అలసటలూ ,బాధలూ, బాధ్యతలూ,కష్టాలూ ,కలతలూ వెతలూ,వేదనలూ,

ఏవి లేవనుకొనే  భవితకాంక్షనై....బ్రతికేయాలనుకొనే..భావుకురాలినై.. దోసిట  అక్షరాలతో  మోకరిల్లుతున్నా....



Thursday 13 September 2012

గృహ హింస





ఉదయం ఐదు  గంటల సమయం   నిద్రలో  ఉన్నా..   "డబ్ " మన్న చప్పుడుతో  ఉలిక్కిపడి లేచాను. వెంటనే "వామ్మో చచ్చాను" అనే కేక విని  హడావిడిగా  ముందుగదిలోకి  వెళ్లి చూసాను.. మా శ్రీమతి మాధవి  బోర్లాపడి  వుంది.  "అయ్యో ఏమయ్యిందే "  కంగారుగా అడిగాను. 

టి.వి లో "మీ వొళ్ళు - మా ఆసనాలు"   కార్యక్రమం చూసి శీర్షాసనం  వేద్దమనుకున్నానండీ, ఇదిగో  ఇలాపడి  పోయాను, లేపండీ  అలా తమాషా  చూస్తారే.. చేయి  అందించింది మాధవి. అప్పుడు టి.వి.వంక  చూసాను..  ఆసనాలు  వేసే   గురువుగారికి    తిండి అనే పదం తెలుసో లేదో,  అస్తిపంజరానికి   కుర్తా పైజమా   వేసినట్లున్నాడు.  "గురువుగారు  సులభంగానే  వేసారండీ, నేనూ  అలాగే వేద్దామనీ"..నసిగింది  మాధవి.
"ఆ ఆసనం  అతనే వేశాడా?" అది శవాసనమా? మళ్ళీ అనుమానంగా అడిగాను. 

"అదిగో అందుకే మిమ్మల్ని రోజూ  కొంచం  సేపైనా  గురువుగారి  ఆసనాలు చూడండీ  అని మొత్తుకోనేది". కనీస ప్రాధమిక జ్ఞానం  కూడాలేదు  అన్నట్లు నా ముఖాన  ఓ  సీరియస్  లుక్  పడేసి లోపలికి వెళ్ళింది  విసవిసా. (మరిప్పుడు  నడుం నొప్పి ఎమైనట్లో?) 

పోనిద్దూ  ఏమన్నా  అన్నానా నాకు కాఫీ  ఉండదు, లోపలికి  వెళ్లిందంటే  కాఫీ తెస్తుంది, అలా  ఆరుబైట  కూర్చుని  చల్లగాలిని ఆస్వాదిస్తూ  తాగొచ్చు ముఖ్యంగా  ఈ దిక్కుమాలిన  టి.వి. కట్టేయవచ్చు అనుకున్నాను.  లోపలిగదిలో నుండి వచ్చిన  మాధవి చేతిలో కాఫీ కప్పుకు బదులు   ఓ చిన్న చెడ్డీ  ఉంది. అది నా చేతిలో పెట్టి "మనూ.. ఇది వేసుకొని  మీరూ ప్రాక్టీస్  చేయొచ్చు..ఉండండి చానల్  మారుస్తాను" అంటూ చానల్ మార్చింది.  ఓ  ముప్పై  ఏళ్ళ యువతి  పొట్టిగా   లావుగా ఉంది  ఒన్..టూ  అంటూ గెంతుతుంది. అమ్మో మా శ్రీమతి ఎంత హుషారూ.. నన్ను  ఎలాగైనా  ఈ  టి.వి ప్రోగ్రామ్స్  కి కట్టేయాలని ఇలా  ఆడ అస్త్రాలను కూడా ప్రయోగించి చూస్తుంది.

"అమ్మా బంగారు తల్లీ  నన్నిలా బ్రతకనీ, ఆ విచిత్ర వేషధారణ నేను వెయలే నుగానీ  నా ముఖాన  ఇంత కాఫీ పడెయ్యి" అనేసి అక్కడే కూలబడ్డాను.(నేను అక్కడే టి.వి.లో కళ్లేసాను ).

శ్రీమతి  కాఫీ తేవటానికి వెళ్లిందో లేదో, టక్కున రిమోట్ (కొరివి )  తీసుకొని  చానల్ మార్చాను.(పొయ్యి మీది నుండి  పెనం మీద పడ్డానన్న  మాట) 
హాయ్. . నవ్వుకావాలా? లవ్వు కావాలా?   ప్రోగ్రాంకి  "ష్వాగతం"   "షుశ్వ్వాగతం". ముందుగా ఎవరి  కాలో(ఎవరు జారారో?) చూద్దామా?  అంటూ ఓ అమ్మాయి  పళ్లన్నీ  బైటపెట్టి   మనం  బాగా  పరిచయం  ఉన్నట్లు. మాట్లాడుతుంది. ఇంతలో  ఏపనీ పాటా లేని  తల్లెవరో  ఫోను  చేసినట్లుంది. "హాయ్  ఆన్షీ... క్యా బాత్ హై, అంకుల్  లేరా? " (యాంకర్ ప్రశ్నల వర్షం). ఆమె ఏదో చెప్పబోయేలోగా  "హాయ్  "ఆన్షీ"  మీకు బోయ్  ఫ్రెండు ఉన్నారా?  మీరు ఎలాంటిపాట   ఆయనకీ  పంపుతారూ" అంటూ వచ్చీ రాణి (ఛి,ఛీ నేను తెలుగు మరచిపోతున్నా) తెలుగులో  ఆమె కొంపకి  నిప్పు పెట్టె సమయానికి మా శ్రీమతి కాఫి  తెచ్చింది. మా శ్రీమతి వస్తూనే  సంబరంగా  యాంకర్ని  చూస్తూ ఇదిగో ఈ చీరే   నేను  చెప్పింది  మిమ్మల్ని కొనమని.. అంటూ ఉండగా,  ముంచుకొచ్చే  ప్రమాదాన్ని  గ్రహించి  నేను  వేడి వేడి కాఫీ  గొంతు కాలుతున్నా  ఎలాగో  మింగేసి.  స్లిప్పర్స్  వేసుకొని   వాకింగ్ బయలుదేరాను.

*********

సాయంకాలం  ఆఫీసునుండి  వస్తూ  కూరగాయలు  కొంటుంటే  మా  సెక్షన్లో  పని  చేసే మా కొలీగ్  రాణి గారు కలిసారు. ఇద్దరం ఉన్నది ఒకే కాలనీ  అయినా ఎప్పుడూ ఇలా  తటస్థ పడలేదు, ఇద్దరం  ఏవో  మాట్లాడుకుంటూ  నడుస్తుండగానే మా ఇల్లోచ్చేసింది. బాగుండదుకదా అని ఆమెను ఇంట్లోకి  ఆహ్వానించాను (ఇబ్బందిగానే). ఆమె కూడా మొహమాటపడుతూనే  వచ్చారు.

పరిచయాలయ్యాక మాధవి  టీ  పెట్టేందుకు లోపలికెళ్ళింది. టి.వి. లో "బతుకు రిక్షా బండి" ప్రోగ్రాం వస్తూ ఉంది. ఓ నడివయసు మహిళ  చేతులు లేని జాకేట్టుతో, మెడలో పెద్ద పూసలమాలతో (లేగదూడల  మేడలో వేసే లాంటిది) జుట్టు ముఖాన్ని  సగం కప్పేస్తుంటే  వెనక్కి తోసుకుంటూ ప్రోగ్రాము anchoring చేస్తూ ఉంది. ఎదురుగా ఓ పల్లెటూరి యువతి  నేతచీరలో ముద్దబంతిలా ముద్దుగా ఉంది. ఆమె ఎదురుగా  ఓ  యువకుడు   మాసిన బట్టల్లో దిగులుగా ముఖం  వేలాడేసుకుని  ఉన్నాడు.

జబ్బల్లేని జాకెట్టు (JLJ) ముందుగా  నైతిక విలువల గూర్చి,  మధ్య మధ్యలో  పూసలు సవరించుకుంటూ మగవారి దురహకారం (?) గూర్చి లెక్చర్   దంచి ఆ తర్వాత ఇంటర్వూ  మొదలు పెట్టింది.

ఏమయ్యా "నువ్వు నీ భార్య పర్మిషన్ లేకుండా  పరాయి ఆడదాన్ని ఇంటికేందుకు పిలిచావ్?" అంటూ ఆ యువకుణ్ణి దబాయించింది JLJ.

అది కాదమ్మా..ఆయమ్మ  నేను పని చేసేకాడనే చేస్తా... అతని మాట పూర్తి కాకుండానే JLJ అడ్డుకుని  "నోర్ముయ్  నిన్ను496, 498A సెక్షన్ల కింద  అరెస్టు చేయిస్తాను  తెలుసా.. హుంకరించింది. 

"అయ్యో, ఆడి  తప్పేమీ లేదమ్మా, ఆడు పిలవంగానే  ఎగేసుకొని వచ్చిందే దాన్ని అనుకోవాలి" ఆ ముద్ద బంతి  మొగుణ్ణి  వెనకేసుకొచ్చింది. నువ్వు నోర్ముయ్ మేము  చూస్తాం కదా (మీరు ఎలా కాపురం చేస్తారో), కోపంగా అరిచింది JLJ

నేను ఇబ్బందిగా చూసాను  మాకొలీగ్  వంక, ఇంచుమించు  ఆమె పరిస్థితి  కూడా  అలాగే   ఉంది. మా శ్రీమతి  మమ్మల్ని కొరకొరా  చూస్తుంది. ఇంకోమారు  టి.వి. మా ఇంట  నిప్పు పెట్టింది  అనుకున్నాను  నేను, ఎలాగో ఆమెను  సాగనంపాను.

ఈ  దిక్కుమాలిన  టి.వి   నుండి  బైట పడటానికి రిమోట్  మా పుత్ర రత్నానికి  ఇచ్చాను. వాడేదో  కార్టూన్ పెట్టాడు. ఆబోమ్మలకి అనుగుణంగా  విచిత్రమైన భాష (తెలుగే).

"హె..హే.. నువ్వు ఎక్కడికీ పోలేవు జేన్, నువ్వు నా దోస్తీని  అంగీకరించాల్సిందే"
"లేదు  జేన్ నీది స్వార్ధపరమైన  ఆలోచన "హో కమాన్ '" ...

ట్రూ   ట్రాన్సిలేషన్ ... ఇంచి, తుంచి, దంచి, చీల్చి కుట్టిన అతుకుల  బొంతలా ఉందా భాష... బాబో నా మెదడు నరాలు  చిట్లినట్లు,  వంద సూదులు  ఒకేసారి  కళ్ళలో గుచ్చినట్లూ  ఉంది. 

(ఈ హింస ఇప్పటికి ఆపేస్తాను,  మా ఇంట్లో ఈ టి.వి. అనే  రాక్షసి పెట్టె హింస  మళ్ళీ చెప్తాను). 








Sunday 9 September 2012

కనపడుటలేదు


కనపడుటలేదు 

పట్నం వెళ్ళిన పండుగాడు పదిరోజులైనా పతాలేడు.

బయపడ్డ బంగారు బస్తీ బయలుదేరింది.
చిలిపి సెంటర్లూ, తులిపి హోటళ్ళూ వెతికింది.
కంగారుపడ్డ బంగారు ఏమంటుందో విందామా..

మాటలొద్దు మనువాడరా మామా అంటే, 
నచ్చినోడినే కదా నమ్మకంలేదా అన్నాడు.

నోసటన బొట్టెట్టి, కాలివేళ్ళకి మెట్టిలెట్టి,
నువ్వు భార్యవే కదా బంగారుకొండా అన్నాడు.

అదిగో నాకప్పుడే అనుమానమొచ్చింది నేనసలే గడుసుదాన్ని.

ఏటిగట్టున ఎవరితో ఆ పరాచికాలూ అంటే,
నీటిలోని చేపలతోనే నాచిలకా అన్నాడు.

మంచె మీద ఎవరితో ఆ మంతనాలూ అంటే..,
మల్లెతీగతోనే మరదలపిల్లా అన్నాడు.

సంతలో ఎవరితో ఆ సరసాలూ అంటే..
చంకనున్న మేకపిల్లతోనే నా సంపంగీ అన్నాడు.

వేగుచుక్కతోనే లెగిసిపోతావ్ ఎందుకు మామా అంటే..,
ఏరువాక ఎనకబడిపోతే ఎంత అగమానమే నా ఎంకీ అన్నాడు.

నిద్దట్లో ఎవరితో ఆ కలవరింతలూ అంటే..,
నా కలలన్నీ నీ చుట్టూరే కదరా కన్నా అన్నాడు.

బంతి పూలతోటలో ఎవరితో ఆ బాసలూ అంటే..,
అవి బంతిపూలా నీ బుగ్గలనుకున్నానే భామా అన్నాడు.

చెరకు తోటలో ఎవరితో ఆ చతుర్లూ అంటే..,
చిలకలన్నీ పలుకుతున్నాయే చిత్రాంగి అన్నాడు.

ఆరుబైట ఎవరితో ఆ హాస్యాలూ అంటే..,
ఆకాశవాణి వింటున్నానే అల్లరిపిల్లా అన్నాడు,

ఈ మహా నగరంలో వాడిని ఎలా వెతకను నేనసలే అనుమానపుదాన్ని.

ఏ లతాంగిని లాలిస్తున్నాడో.
ఏ కలికిని కవ్విస్తున్నాడో.
ఏ ముదితతో ముచ్చట్లాడుతున్నాడో.
ఏ కొమ్మతో కులుకుతున్నాడో.
ఏ లలనను లాలిస్తున్నాడో.
ఏ మగువను మురిపిస్తున్నాడో.
ఏ తలోదరిని తలచుకుంటూ ఉన్నాడో.

వాడు దొరికాడో..అయ్యతో చెప్పి బడితపూజ చేయిస్తాను.
గుంజీలు తీయించి, గుంజకు కట్టేస్తాను.

వాడి చేతికి తాళిబోట్టిచ్చి, మీ చేతిలో అక్షింతలు పెడతాను. ఆ... నేనసలే గడుసుదాన్ని.




Wednesday 5 September 2012

బహుమతి









బహుమతి

అంతరాన ఉన్న  ఒక్కో తలపూ.. అంతమవుతుంటే ,

కట్టుకున్న కలల  సౌధం  కళ్ళముందే  కూలిపోతుంటే..,

శ్వాసను ఆపివేసేందుకు ఒక్కో అణువూ  పోరాడుతుంటే,

మాటలన్నీ మౌనం దాల్చి మూగతనం  అంటగడుతుంటే,

గుండెకు  తోడున్న  అనుబంధం విచ్చన్నమవుతుంటే, 

తీగ  తెగిన  హృదయవీణ   మ్రోగలేనని    మూగబోతుంటే.

విచ్చుకున్న  ప్రేమ  కుసుమం  రేకులు   రాలిపోతుంటే.
                                 




కమ్ముకున్న పొగమంచులో,కదిలిపోయే మేఘంలా .., 

సాగిపోయే  సమీరంలా   వెళ్తున్న నీవు వెనక్కి రావటం..,

ఎగిసిపడే  కెరటంలా ఒక్క  ఉదుటున  నీఎదుట నిలిచిన 

నా  చేతిలో  నీవు  పెట్టిన  నీలిరంగు  " చిన్ని చీటీ "

నీరు నిండిన నా కళ్ళకు "దస్త్రం లో చుట్టినదస్తావేజులా...

నేను విప్పి చూడలేదు   ఆ అవసరమే రాదు,

నాకు తెలుసు  అందులో  ఏముందో, 

"అక్షరాల ఆత్మవంచన," " స్వచ్ఛతలేని ప్రాయశ్చిత్తం" 

"నిగూడ పద ప్రయోగం" మరచిపోయిన "స్మృతి చిహ్నం". 

అనంత క్రూర నిరీక్షణకై నీవు కట్టిన కలలసమాది.
అనంత తీవ్ర ఆవేదనకై నీవు వేసిన అక్షర శిక్ష. 

Tuesday 4 September 2012

అక్షరాంజలి









శిల వంటి మమ్ము శిష్యులు  చేసుకొని  మాకో రూపమిచ్చిన "అక్షర శిల్పివి"

బలపం  పట్టలేని  మాచిట్టి వేళ్ళకు  అక్షరాలు దిద్దటం  నేర్పిన  "అయ్యవారివి"

బడికి   వచ్చిన   మాకు   భవిత   బంగరు   భాటవేసిన   "బోధకుడివి".

చదువునీ, సంస్కారాన్నీ   ఒకేసారి నేర్పగల  "సవ్యసాచివి".


తప్పుచేసిన  మమ్ము సరైనదారిలో  పెట్టే  "దయామయుడివి"


విద్యతో  పాటు వివేకాన్ని ప్రసాదించిన  "విజ్ఞాతుడివి" 


దైవం కన్నా ముందు  శ్రేణిలో ఉన్న   "గురుదైవానివి"


ఎల్లలు ఎంచక మమ్ము  ఒక్క తాటిపై  నడిపే "సూత్రదారివి"


అక్షరాలూ దిద్దే వేళ  ఒడిని చేర్చుకొనే  "అమ్మ పాత్రదారివి".


గుప్పెడు అక్షరాలను మా దోసిట  పోసిన  "అక్షర దాతవి" 


స్వార్ధం లేని సంస్కారివి, మా రాతలను  నిత్యం సరిచేసే అభినవ బ్రహ్మా.... 


మీకు  అక్షరాలతో  అంజలి ఘటిస్తున్నా.