Pages

Saturday, 29 September 2012

తోలు బొమ్మలు





తోలు బొమ్మలు 

నిదుర లేచిన నీ ఎదుట  నీ సేవకై  హాజరైన
సుప్రభాత గీతాలు వీళ్ళు.

నీ ఇంటి గచ్చునేలను  నిత్యం  మెరిపించే
చిరుగుపాతలు వీళ్ళు.

ధన పునాదియైన  నీ ఎత్తైన  సౌధానికి
కాపలా కాసే  శునకాలు వీళ్ళు.

నీకోసం  పెరటి పరిమళ  మల్లియ పూయించిన
చెమట  చలమలు  వీళ్ళు.

నీవు  విదిల్చిన ఎంగిలి మెతుకులు కతికే
క్షామ పీడితులు వీళ్ళు

నువ్వు విసిరేసే  నాలుగు రూకలకోసం నీ చుట్టూ
భ్రమించే  ఆకలి సూరీళ్ళు  వీళ్ళు.

పల్లకినెక్కిన  నిన్ను శ్రమనెరుగక  మోస్తున్న
కదిలే శవాలు వీళ్ళు.

నీవు వెతకనక్కరలేని  నీ కాళ్ళు చుట్టుకొనే
వెతల తీగలు వీళ్ళు.

గుప్పెడు మెతుకుల కోసం  బండెడు  చాకిరీ చేసే 
దారిద్ర  దౌర్భాగ్యులు  వీళ్ళు.

శ్రమలో  కాయాన్ని కొవ్వొత్తిలా  కరిగించి
మట్టిలో కలుస్తున్న మూగ జీవులు వీళ్ళు.

నిరంతరం నీ చేతి  వేళ్ళ  మద్య  ఆడే
తాళ్ళు లేని తోలు బొమ్మలు వీళ్ళు.

              ***
 వీరిని చైతన్య రహిత ,యాంత్రిక జీవులను చేసి నీ కనుసన్నలలో ఉంచుకున్న కాలాంతకుడివి  నీవు.

తలే కాని  తలపులు లేని  వీరిని  నీ పనుల కోసం  నియమించుకున్న నియంతవు నీవు.

నిర్మించుకో  వీరి బానిసత్వం  పై  నీ భవిత భవనాన్ని. దానికి రంగుగా అద్దుకో  వీరి రుధిరాన్ని

ఏదో ఒకరోజు పోటెత్తిన ఈ జనమే  నీ  భవనాన్ని పునాదులతో సహా  పీకి పారేయగలరు.

అంతవరకూ  సాగనీ  చాప కింద  నీరులా  ఉన్న  నీ  దౌర్జన్యాన్ని,












34 comments:

  1. మొత్తానికి ధనత్వం నకు వ్యతిరేకంగా మీరు కురిపించిన నిప్పుల కవిత్వం సుపర్బ్.ఫాతిమా గారు

    ReplyDelete
    Replies
    1. surya savarnikaగారూ, నాబ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.

      Delete
  2. చాలా బాగుంది ఈ కవిత.
    శ్రామికుల కష్టం పెట్టుబడి దారులు దోచుకోవడం
    ఒకప్పుడు కవితా వస్తువుగా చెలరేగింది.
    ఇప్పటి ఈ దోపిడీ బడా పారిశ్రామిక వేత్తలే కాదు,
    మామూలు మధ్యతరగతి మానవుడు కూడా యథాశక్తి చేస్తున్నాడు.
    మీ దౄష్టి కోణం కొంచెం కొత్త పుంతలు
    తొక్కుతున్నట్లుంది.
    పరిణామం పరిణితికి గుర్తు.
    శుభాభినందనలు!

    ReplyDelete
    Replies
    1. సర్, ఈ దోపిడీ ఎప్పుడూ ఉండేదే భూస్వామ్య ,పెత్తందారి, రాచరిక వ్యవస్తలు మారినా దోపిడీ పోలేదు.
      మీరు చెపినట్లు మధ్యతరగతి కూడా తమవంతు చేస్తుంది తెలిసో తెలియకో.
      ఇకపోతే మీరన్నట్లు నా ద్రుష్టి కోణం కొత్తపుంతలు తొక్కుతుంది అన్నారు.సమాజాన్ని గమనించటమే నేను చేస్తున్న అద్యయనం.
      కవిత చదివిన మీకు నా కృతజ్ఞతలు.

      Delete
  3. మొత్తానికి ధనత్వం నకు వ్యతిరేకంగా మీరు కురిపించిన నిప్పుల కవిత్వం సుపర్బ్.ఫాతిమా గారు

    ReplyDelete
  4. నువ్వు విసిరేసే నాలుగు రూకలకోసం నీ చుట్టూ
    భ్రమించే ఆకలి సూరీళ్ళు వీళ్ళు.

    ఈ వాక్యాలు హత్తుకున్నాయి. కానీ శవాలుగా చూపడం నచ్చలేదు. కానీ అక్కడితో ఆగక చివరికి చలిచీమలదే గెలుపని ముగించినందుకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వర్మగారూ, నా భావావేశం నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  5. చాలా బాగా రాసారండి ఆ పని పసివాళ్ళని చూస్తుంటే ఎంత ఆవేదనగా ఉంటుందో

    ReplyDelete
    Replies
    1. రమేష్ గారూ కవిత నచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  6. మెరాజ్ గారూ,
    పేదరికంతోటీ, ఆకలితోటీ ఆడుకునే ధనిక సమాజం ఇ(మన)ది. ధనమున్నవాడే ధనికుడనుకున్న భ్రమ వీడాలంటే మీరన్నట్టు పునాదులతో సహా పెకళించక తప్పదు...
    తలే కాని తలపులు లేని వీరిని...చాలా దయనీయంగా అనిపినింది ఈ మాట...
    మీ కవిత ఈ సమాజానికి నిలువుటద్దం...

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ, నా ఆవేదన అర్ధం చేసుకున్న మీ సహృదయతకు ధన్యవాదాలు.
      మీ వ్యాఖ్య నాకు స్పూర్తిదాయకం.

      Delete
  7. నిత్యం మన సమాజంలో కనిపించే దృశ్యమే అయినా...మీరు పెట్టిన ఫొటో కాసేపు కళ్ళనే కాదు, గుండెనీ ప్రశ్నించింది?

    ReplyDelete
    Replies

    1. Nijame ilaanti drusyaalu enno nitya jeevithamlo

      Delete
  8. మంచి కవితావేశాన్ని ప్రతిఫలిస్తున్నాయి మీ కవితలు.చెమట చలమలు.. వెతల తీగలు ..బాగున్నాయి మీ ప్రయోగాలు.కాని తొందరలో వ్రాసి ప్రచురిస్తున్నట్లనిపిస్తోంది.ఒకటికి రెండుసార్లు చదివి చూసుకుని సంతృప్తి చెందాకనే ప్రచురించండి.ఉదయ సుప్రభాతాలు ఏమిటి ? సాయం సుప్రభాతాలు ఉండవు కదా? చెమట చలువలు మల్లియలను పూయించడానికి దోహద పడ్డాయి కాని మల్లియలు చెమట చలువలను పూయించ లేదుకాదా?మల్లియలను అని ఉండాలి.లేకపోతే వ్యతిరేకార్థం వస్తుంది.పరిమళ మల్లియ అన్న ప్రయోగమే బాగు లేదు.క్షమించాలి.మీ కవితలింకా పరిమళించాలన్నదే నా ఉద్దేశం. లేకపోతే ఇక్కడ ఇది వ్రాయవలసిన అవసరం నాకు లేదు.ప్రచురించక పోయినా గమనిస్తే చాలును.

    ReplyDelete
    Replies
    1. సర్, నేను మీ ప్రతి సూచనా పాటిస్తాను, నా కవితలల్లో తిరిగి అలాంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నాను.
      ఇది రాయవలసిన పని లేదు, ప్రచురించకున్నా పర్వాలేదు అన్నారు. నిజానికి నేను పెద్ద కవయత్రిని కాను.
      నా భావాలను మీ వంటి పెద్దల ఆశీర్వాదంతో నలుగురితో పంచుకొనేందుకు సాహసిస్తున్నాను.నా రాతలను సరిదిద్దుతున్న మీకు కృతజ్ఞతలు.

      Delete
  9. శ్రమజీవుల కష్టాన్ని వారిని దోపిడీ చేసే విధానాన్ని గొప్పగా పలికించారు.

    ReplyDelete
    Replies
    1. శంకర్ గారూ, ధన్యవాదాలు నా కవిత అర్ధం చేసుకున్న మీకు.

      Delete
  10. శ్రమజీవుల గురించి హృదయం కదిలించేలా వ్రాసారు. అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies

    1. నాగేంద్ర గారూ, నిత్యం మనం చూస్తున్న దృశ్యాలే ఇవి
      కాని తరచి చూస్తే వాటి వెనుక ఎంత వేదన ఉందొ మనదరికీ విదితమే.
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  11. నిరంతరం నీ చేతి వేళ్ళ మద్య ఆడే
    తాళ్ళు లేని తోలు బొమ్మలు వీళ్ళు.
    ...
    అవును మెరాజ్ గారూ!
    చాలా బాగా చెప్పారు వారి బానిస బ్రతుకుల గురించి...
    @శ్రీ

    ReplyDelete
  12. శ్రీగారు, కవిత నచ్చినందుకు చాలా సంతోషం. మెచ్చిన మీకు థాంక్స్.

    ReplyDelete
  13. ' ఉదయ సుప్రభాతాలు ' అన్న ప్రయోగం సరికాదని విమర్శించారు.
    మరి ' ఉదయాన్నే సుప్రభాతం విన్నాను ' అనే వాక్యానికి ఎటువంటి అభ్యంతరం ఉండనప్పుడు
    కవితలో ఉదయ సుప్రభాతాలు ఎలా తప్పు పట్టగలం?
    అలాగే పరిమళ మల్లియ కు కూడా విమర్శ ఎదురైంది.
    బహుశా వ్యాకరణం కోసం మల్లియ పక్కన ' ను ' చేరిస్తే
    ఆ విమర్శ కూడా సమాధానపడవచ్చు.
    నేను వ్యాకరణం కంటే భావానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని
    సమర్థిస్తాను.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ సమయాన్ని వెచ్చించి నా రాతలకు స్పూర్తినిస్తున్నందుకు సదా రుణపడి ఉంటాను.

      Delete
  14. నేను ఏదో విమర్శించడం కోసం చేసినది కాదిది.ఉదయాన్నే సుప్రభాతం విన్నాను అంటే ఉదయాన్నే (శ్రీ వేంకటేశ్వరువి మేలుకొలుపుతూ పాడే)సుప్రభాత గీతాన్ని విన్నాను అనే అర్థం వస్తుంది.సుప్రభాతమంటేనే ఉదయమైనప్పుడు,ఉదయ సుప్రభాతమనడం సరికాదనే నాభావన.ఉదయం మనం వినే సుప్రభాత గీతాలతో సరిపోల్చదలచుకుంటే సుప్రభాత గీతాలు వీళ్లు అంటేనే సరిపోతుంది.కవిహృదయం స్పష్టంగా ఆవిష్కృతమౌతుంది కూడా.మీరైనా ఎవరైనా ఉదయాన్నే సుప్రభాతం విన్నాననే అంటారు గాని ఉదయ సుప్రభాతాన్ని విన్నానని అనరు కదా?కవిత్వంలో వ్యాకరణం అక్కరలేదనుకున్నా స్పష్టత ( Clarity) ఉండాలి కదా?వ్యాకరణం కోసం కాక పోయినా మల్లియలను అని లేక పోతే వ్యతిరేకార్థం వస్తుంది కదా? దాన్ని పరిహరించాలి కదా?భావమే ప్రధానమని తలచినప్పుడు కూడా దానిని స్పష్టంగా ఆవిష్కరించే ప్రయత్నం కూడా కవి చేయాలి.ఫాతిమా గారి కవితలు బాగున్నందునే వాటికి మెరుగులు దిద్దే ప్రయత్నమే ఇది.

    ReplyDelete
  15. శ్రీనివాస్,గోపాలకృష్ణ గార్లకు నమస్కారాలతో.
    సర్, నేను మొదటే చెప్పినట్లుగా పెద్ద కవయత్రిని కాను, ఇకపోతే మీరు ఇద్దరు నా దృష్టిలో గొప్పవారే.
    నా రాతలను సరిదిద్దగల విచక్షనత గలవారే. నిజమే "సుప్రభాతము" అంటే ఉదయగీతమే. అయితే శ్రీనివాస్ గారు అన్నది ఏమిటంటే వ్యాఖరణం కంటే భావం ముఖ్యం కదా అని. సర్, ఏదైనా నేను విమర్శగా తీసుకోవటం లేదు. నన్ను రాయమని ప్రోత్సహించిన శ్రీనివాస్ గారూ , రాస్తున్న వాటిని మెరుగులు దిద్దుతున్న గోపాలకృష్ణ గారూ, ఇక ముందు కూడా నా రచనలని పరిశీలించి ముందుకు నడిపించగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  16. ఉపాథ్యాయ వృత్తిలోని వారికి సామాజిక దృక్కోణం మెండు . మీదు మిక్కిలి బలహీనుల పక్షాన నిలిచి పోరాడు తారు . వారి రచనలకు సార్థకత సిధ్ధిస్తుంది .మెరాజ్ గారి రచనలు అందుకే మనస్సుకు హత్తు కుంటాయి . దుర్మార్గాన్ని ఎదిరించే దిశగా జనాన్ని చైతన్య పరచే ఇలాంటి రచనల ప్రయోజనం అనంతం . బ్రమలలో పరిభ్రమిస్తూ రాసే కవితలు వాస్తవ దూరాలై ప్రయోజన సూన్యాలై రాసే వాళ్ళకూ,చదివే వాళ్ళకూ కాల హరణం .

    ReplyDelete
  17. రాజారావ్ గారికి నమస్తే ,
    మీరన్నది అక్షరాలా నిజం, ఇతర వృత్తుల వారికి సామాజిక స్పృహ ఉండదని కాదు , కానీ ఉపాద్యాయులు బిడ్డల భవితకు పునాదులు.
    సర్, నా రచనలలో కొన్ని అక్షర దోషాలు దొర్లుతున్నాయి కాదనను కానీ అర్దాలే తప్పు అనుకుంటే నేను రాయలేనేమో అనే సందేహంలో పడిపోయాను.
    నేనికా రాయగలగాలి అంటే మీ వంటి వారి ప్రోత్సాహం నాకు కావాలి. ధన్యవాదాలు నాకు స్పూర్తినిచ్చిన మీ సహృదయతకు.

    ReplyDelete
  18. చాలా బాగా వ్రాసారు.
    ఇంతకంటే చెప్పలేను.

    ReplyDelete
  19. చాలా చాలా ధన్యవాదాలు,
    ఇంతకంటే ఏమనగలను

    ReplyDelete
  20. నీకోసం పెరటి పరిమళ మల్లియ పూయించిన ... చెమట చలమలు వీళ్ళు.
    గుప్పెడు మెతుకుల కోసం బండెడు చాకిరీ చేసే ... దారిద్ర దౌర్భాగ్యులు వీళ్ళు.
    నిరంతరం నీ చేతి వేళ్ళ మద్య ఆడే ... తాళ్ళు లేని తోలు బొమ్మలు వీళ్ళు.
    తలే కాని తలపులు లేని వీరిని నీ పనుల కోసం నియమించుకున్న నియంతవు నీవు.
    ఆ రోజొస్తుంది ... పోటెత్తిన ఈ జనమే నీ నిజ రూపాన్ని చూసే రోజు,
    నీ భవనాన్ని, చాప కింద నీరులా సాగుతున్న నీ దౌర్జన్యాన్ని, పునాదులతో సహా పెకిలించేసే రోజు.
    అంటూ నీ కవిత్వం ప్రశ్నించడంతో పాటు చైతన్య రధం మీద అరుణరాగాన్ని ఆలాపిస్తున్నట్లుంది.
    మీ కవిత సావధానుల్ని కమ్మని ... దోపిడి వర్గాన్ని హెచ్చరిస్తున్నట్లుంది.
    అభినందనలు గొప్ప కవితానుభూతిని కలిగించిన మీరజ్ ఫాతిమా కు!

    ReplyDelete
  21. మీరిచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు నడిపిస్తుంది.
    నిత్యం నేను పడే భావ సంగర్షణ సరైనదే అనే తృప్తి ని కలిగిస్తుంది.
    ప్రతిచోటా దోపిడీ ... ఈ బడుగుజీవులను ఎవరు ఆదుకుంటారో....మరోమారు ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  22. This comment has been removed by the author.

    ReplyDelete