Pages

Tuesday, 31 July 2012

మాయావిమాయావి


అందరూ అంటారు మనసు మల్లెలు పూయిస్తుందనీ, మనోహరంగా ఉంటుందనీ.. 
కానీ మనసు ఇలా కూడా ఉంటుంది   తెలుసా.. 

సజావుగా సాగుతున్న జీవితానికి లేని పోనీ సొగసులద్ది , 
సతమతం  చేసి  సంజాయిషీ అడుగుతుంది.

వెన్నెలలా, పట్టుదారంలా  మెరుస్తూ, మురిపిస్తూ,
చిక్కు వెంట్రుకలా  చికాకు పెడుతుంది.

మ్రోగుతున్న హృదయాన్ని  మూగదాన్ని చేసి,
దిక్కుతోచక దిగంబరమై  రోదిస్తుంది.

తనువు తగలబడి పోతున్నా  తాను  మాత్రం ,
రక్తం మరిగిన వ్యాఘ్రం లా  వేటాడుతుంది.

ముఖం మీది చిరవ్వులతో  నటిస్తూఉంటామా ,
చర్నాకోలుతో  కొట్టి చెవులుమూస్తుంది.

నిద్రను  చెడగొట్టి  కళ్ళకు  చీకటి  గంతలుకట్టి,
కలతలను   కానుకగా  ఇస్తుంది.

మరగున  పడిన  తలపులను  తలనుండి  తోడి,
తనువును  తడిపేస్తుంది.

చిక్కిశల్యమైన   శరీరానికి  శుష్కించిన  చిరునవ్వునద్ది,
చిత్రంగా  తిలకిస్తుంది.

గొంతునుండి  గుబులు   బైటకి  రానీక ,
మాటలకు  మమకారపు   రంగు  వేస్తుంది.

ఎదురుపడి   వేదనను  వెళ్లగక్కే  సమయానికి,
అభిమానపు  ఆభరణం  అరువుగా  ఇస్తుంది.

బంధనాలు  తెంచుకొనే   తెగింపు  వచ్చినప్పుడు,
బేలగా  మారి  గోలచేస్తుంది.

విచ్చుకొనే   వేకువకూ .  .అంతమయ్యే  సంద్యకూ,
సంకెళ్ళు  వేసి  మరణశాసనం  రాస్తుంది.

గుండెను  మెలిపెట్టి, నరాలను నుజ్జుచేసి, ఆశ్రువులను  ఆరనివ్వక,
అయినవారికి దూరమైనప్పుడు ముక్కలవుతుందీ   మహమ్మారి  మనస్సు.

చింతతో చితగ్గొట్టి, వేదనతోవిరగొట్టి,  బాధతో బంధించి,
మాయలతో  మాలిమి చేస్తుందీ    మాయావి మనస్సు.  


Sunday, 29 July 2012

అనుబంధాలు


తెల్లవారుజాము నాలుగు గంటలైనట్లుంది ఇంటిముందు ఆటో ఆగిన చప్పుడుతో పాటు అల్లుడూ, అల్లుడూ... అంటూ ఓ పోలి కేక, అమ్మాయ్, అమ్మాయ్ అంటూ ఓ ఆడ కేక వినిపించి ఫ్యాక్టరీ సైరన్ లా అందరినీ లేపింది. నేను మా వారూ హడావిడిగా వీధి గుమ్మంలోకి వెళ్లి చూశాం. గుమ్మడి కాయ లాంటి ఓ ఆడ శాల్తీ, పక్కన పొట్ల కాయలా ఓ మగ శాల్తీ, దోస కాయల్లాంటి ఇద్దరు మగపిల్ల శాల్తీలు, ఓ ఆడ పిల్ల శాల్తీ అటో లోంచి దిగారు. ఎవరా వీళ్ళు అనుకుంటుండగా, పోట్లకాయలాంటి శాల్తీ " ఏమిటోయ్! నువ్వేనా మా కాముడి మొగుడివీ " అంటూ మా వారి భుజం పై ఓ చరుపు చరిచాడు. కాక చస్తానా అన్న ఫీలింగ్ కనిపించింది మా వారి మొఖం పై. అప్పుడా గుమ్మడి కాయ లాంటి ఆడ శాల్తి " నేనే నే అమ్మా, మీ సూరమ్మ పిన్నిగారికి వరసకి అక్కని, అన్నట్టు మీ పెళ్ళికి మేం రాలేదు కదా, ఓ సారి చూసిపోదాం అంటూ వచ్చామే అమ్మా" అంటూ ఇరవై ఏళ్ల క్రితం జరిగిన మా పెళ్ళి గుర్తు చేసి పరిచయాలు మొదలు పెట్టింది. వీళ్ళు అరుణ పిల్లలే, అదే నిన్ను అక్కా అక్కా అంటూ నీ వెంట వెంట తిరిగేది దాని పిల్లలు, వీడు పెద్దోడు "బంటి" వీడు చిన్నోడు "చంటి" ఇదేమో "చిట్టి" చంటిది. అప్పుడర్థమయ్యింది వీళ్లు నాకు దూరపు బందువు బాబాయి పిన్ని వరుస అవుతారని.

ఓ హో హో, మీరా పిన్ని గారూ, రండి రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానించాను. ఆటోకి ఆనుకుని సెల్లు లో మాట్లాడుకుంటున్న డ్రైవర్ తో "ఒరే అబ్బీ అలా కొల్లుదున్నలా నిల్చున్నావేమిటీ? ఆ సామాను ఇంట్లో పెట్టు" అంటూ నెత్తి మీద ఒక్క మొటిక్కాయి ఇచ్చి లోపలికి వచ్చారు పిన్ని గారు. "ఇదెక్కడి పరేషాన్ రా  బాబూ " అని గొణుక్కుంటూ సామను లోపల పడేశాడు అ డ్రైవరు.

ఇంతలో బాబాయిగారు ఓయ్ అల్లుడూ.. అల్లుడూ.., ఈ అటో వెధవ చూడు, మీటరు అంటూ గోలెడుతున్నాడు, ఆ మీటరు ఏంటో వీడి మొహాన తగలెయ్యి నాయనా అంటూ లోపలికొచ్చి, ఉస్సో అంటూ ముడేసిన తాడు పడేసినట్లుగా సోఫాలో చతికిలబడ్డాడు. అల్లుడు గారు.. అదే మా వారు ఏమిటీ అపశ్రుతి అన్నట్టు నావంక కోర కోర చూస్తుంటే నేను కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా ఏమీ ఎరగనట్టు ఉండిపోయాను.

బయట మావారు గట్టిగా అరుస్తున్నారు. ఏంటయ్యా మీటర్ వెయ్యలేదు ఐదు వందలు అడుగుతున్నావు అంటూ. నేనూ బయటికెళ్ళాను , ఏం జరుగుతోంది అనుకుంటూ. అటో వాడూ అరుస్తున్నాడు." అరె ఏమిడ్ది సార్ సెకండ్ షో సూసి ఇంటికేల్తుంటే తగిలిందీ గిరాకి. లొల్లి లొల్లి చేసిన్రు, ఏడేడనో తిప్పిండ్రు. పోరోల్లిద్దరు నా భుజాల మీందికెక్కి దమ్ము దమ్ము చేస్తుంటే, పోరేమో నా ఒళ్లో కూసుని హండిల్ తిప్పుతూ పరేషాన్ చెయ్యబట్టే. ఆ పెద్దయనైతే మా అల్లుడు పోలీసాయన నిన్ను మస్తు గొట్టిపిస్తా అంటూ ఆగం ఆగం చేస్తుంటే, ఆయమ్మేమో గిట్ల పోనీ, గట్ల పోనీ అంటూ ఎన్క కెళ్ళి డొక్కలో ఒకటే పోడువుడు. ఇంకొకళ్ళ కైతే హజార్ రుపై అడుగుతుంటి, ఇగ నువ్వేమో పోలీసాయన వైతివి" అంటూ గోలె డుతుంటే మా వారు వాడికి నాలుగు వందలు ఇచ్చి నా వైపు గుర్రుగా చూస్తూ లోపలికొచ్చారు.

"అవునే అమ్మాయ్, నీకో తమ్ముడు ఉండాలి కదా, ఎప్పుడో ఓ సారి అనంతపురం ఆస్పత్రిలో మీ అమ్మతో పాటు చూసాను. కుర్ర సన్నాసి ఏదో చూసి దయ్యమని దడుచుకున్నాడట , ఇప్పుడెక్కడున్నాడు?"

"బావున్నాడండీ, విదేశాల్లో చదువుకుంటున్నాడు".

"అవునా! జాగ్రత్తమ్మా ఏ తెల్ల దొరసానులో నల్లదోరసానులో ఎగరేసుకు పోతారు".

" లేదులెండి రెక్కలు మా దగ్గరే ఉంచుకుని వాడినోక్కన్నే పంపించాం" అన్నాన్నేను.

                                                                           * * *
ఇక నేను వాళ్లకు కాఫీ టిఫిన్ల ఏర్పాట్ల కోసం వంటింట్లోకొచ్చాను. కుంకలు ముగ్గురూ తోకల్లేని కోతుల్లా సోఫాల మీద దూకుతూ హడావిడి చేస్తున్నారు. ఇంతలో గట్టిగా అటో హారన్ వినిపించింది. గుండె ఝల్లు మంది నాకు, మళ్ళీ ఎవరోచ్చార్రా బాబూ అనుకుంటూ వంటింటి లోంచి వచ్చి చూద్దునుకదా ఒక కుంక అటో హారన్ నోట్లో పెట్టుకుని ఊదుతున్నాడు. అర్థమయ్యింది నాకు, కుంకలు అటో హారనుపై హస్త లాఘవం ప్రదర్శించారని. ఆ శబ్దానికి మా యువరాణి చిరాగ్గా లేచి ఆ పిల్లల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. పిన్ని గారు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఒళ్లో కూచోబెట్టుకుని బుగ్గలు నిముర్తుంటే మా యువ రాణి గారు మళ్ళీ చిరాకు పడింది, నేనేమైనా చిన్న పిల్లనా మమ్మీ అంటూ.
ఇక మావారు తయారై ఆఫీసుకు బయల్దేరుతూ, ఏమోయ్ నా కళ్ళజోడు కనపడ్డం లేదు చూడు అంటూ హడావిడి చేస్తున్నారు. చూద్డును కదా బాబాయి గారు ఆయన కళ్ళజోడు పెట్టుకుని స్టయిలుగా పేపరు చదువుతున్నారు.

నేను విననట్లే ఉండిపోయాను. వారు కాసేపు చూసారు బాబాయి గారు కళ్ళ జోడు ఇస్తారేమోనని, ఇచ్చే సూచనలేమీ కనిపించకపోయే సరికి, ఈరోజు పనెలా ఏడవాలో కళ్ళ జోడు లేకుండా.. సణుక్కుంటూ వెళ్ళిపోయారు. పిన్నిగారేమో వంటిల్లు ఎకచత్రాదిపత్యంతో ఏలేస్తున్నారు.

                                                                             ***
సాయంకాలం నాలుగు గంటలైంది. పిల్ల రాక్షసులు ఆరు బైట ఆడుకుంటున్నారులాఉంది. పిన్నిగారు ఓ గుండు చెంబుడు కాఫీ పెట్టుకుని తాగుతూ దాని రుచిని ఆస్వాదిస్తున్నారు. బాబాయిగారేమో ఈవినింగువాక్ వెళ్లినట్లున్నారు. ఇంతలో మా అమ్మాయి పోలి కేక, కాలేజి నుండి వస్తూనే ఏమయింది దీనికి అనుకుంటూ బైటికొచ్చి చూద్దును కదా, బంటి గాడు మా పాప "లాప్ టాప్" కు తాడు కట్టి దాని చివర నడుముకు కట్టుకుని "పీప్.. పీప్.. అంటూ పరిగెడుతూ ఆడుతున్నాడు. మా పాప వాడి దగ్గర్నుంచి లాప్ టాప్ లాక్కుని ఒక్కటి అంటించింది. అంతే, వాడు ఇల్లెగిరిపోయేలా ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. బామ్మ గారు "ఏమిటే అమ్మా! ఆ ముదనష్టపు డబ్బా కోసం పిల్లాడిని ఏడిపించావు అంటూ వాడికి ఆ పక్కనే ఉన్న "డిజిటల్ ఫోటో ఫ్రేం" ఇచ్చి వెళ్లి ఆడుకో నాయనా అంది. వాడు అది తీసుకుని దానికి తాడు కట్టి బస్సు ఆట నిర్విఘ్నంగా ఆడుతున్నాడు. మా యువ రాణేమో మామయ్యా గిఫ్ట్ ఇచ్చిన "డిజిటల్ ఫోటో ఫ్రేం" సర్వ నాశనం చేస్తున్నాడు వెధవ, I will neck out this fellow అంటున్న దాన్ని సముదాయించే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది.

ఇక రాత్రయితే చంటి గాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మా వారి బ్రీఫ్ కేసు లోంచి ఎప్పుడు తస్కరించాడో ఆయన రివాల్వర్, అది తీసుకుని మహేష్ బాబు లెవెల్లో తిప్పుతూ, జారి పోతున్న చెడ్డీ కూడా పట్టించుకోకుండా, డాం.. డాం. అంటూ అటూ ఇటూ పరిగెడుతూ మామ్మ దగ్గర ఆగి, మామ్మ! నాకు పోలీసు డ్రెస్సు కొని పెడతావా లేదా? లేకుంటే కాల్చేస్తా అంటూ పిన్ని గారివైపు గురిపెట్టాడు. పిన్ని గారు గజ గజ వణుకుతూ పోలీసు బాబాయికి చెప్పి కొని పెడతా లేరా నాన్నా.. ముందా ముదనష్టపు పిస్తోలు అక్కడ పడెయ్యి అంటూ బతిమలాడ సాగింది. వాడు వింటేనా, అ ..అ .. నా డ్రెస్సు... అంటూ కోతిలా గంతులేస్తున్నాడు. ఇంతలో మా వారు బయట్నుంచొచ్చి వాడి చేతిలోనించి రివాల్వర్ లాగేసుకున్నారు. హమ్మయ్య... అంటూ అందరం ఊపిరి పీల్చుకున్నాం.

                                                                           * * *
మరుసటి రోజు ఆదివారం. కాపీలు, టిపినీలు లాగించి మగపిల్లపిడుగులిద్దరూ టీవీ దగ్గర కుస్తీలు పడుతుంటే ఆడ పిల్ల పిడుగు చిట్టి మాత్రం మా యువరాణి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూచుని క్రీములన్నీ మొహానికి పులుముకుని, జగన్మోహిని సినిమాలో జయమాలినిలా దర్శనమిచ్చింది. గుండెలవిసిపొయ్యాయి దాన్ని చూసి. వీళ్ళు వెళ్ళేంత వరకు పిల్లల్ని ఏమీ అనకూడదన్న వార్నింగుతో మా యువ రాణి సైలెంట్ గా చూస్తూ ఉంది, కానీ అసహనం దాచుకో లేక పోతుంది. ఇంతలో పదకొండున్నరకు "సత్యమేవజయతే" ప్రోగ్రాం చూద్దామని టీవీ దగ్గరికేల్తే, అక్కడ కుంకలిద్దరూ వాలి సుగ్రీవులను, సుందోపసుందులను మరిపిస్తూ వీర వీరగా యుద్ధం చేస్తున్నారు. పిన్నిగారు గత ఆరు ఏళ్లగా కొనసాగుతున్న ఏదో అరవ డబ్బింగు సీరియల్ చూస్తున్నారు. ఒక మొగుడి కోసం ఇద్దరు ఆడవాళ్ళు విలన్లుగా మారి భారీ డైలాగులతో పోట్లాడుకొంటున్నారు. బాబాయిగారేమో పిల్లల చేతిలోంచి రిమోట్ లాక్కుని ఫ్యాషన్ టి.వి పెట్టి ఏమిటర్రా ఇది పిల్లల ప్రోగ్రామేమో కదా అంటూ గుడ్లు మిటకరించి చూస్తున్నారు.

"ఆ.. అఘోరించారు.. వేదవ తెలివి తేటలు మీరూ, ఆ తైతక్క బొమ్మలని చూడటానికి మాత్రం అద్దాలు అక్కరలేదు." ముందు ఆ సీరియల్ పెట్టండి, అంటూ నెత్తిమీద ఒక్కటిచ్చుకున్నారు. ముందుకు తూలిన ఆయనగారి చేతిలోనించి జారిన రిమోట్ బంటి అందుకున్నాడు. వాడి చేతిలో నుండి చంటి లాక్కున్నాడు. ఇద్దరి మధ్యా హోరాహోరీ యుద్ధం కొనసాగింది.. పలితంగా టి.వి. రెండు ముక్కలు నాలుగు చెక్కలైంది. నేను నా పరివారం శ్రోతలయ్యాము. అయ్యో కొట్టుకోకండిరా నాయనా .. తాతయ్య మిమ్మల్ని పార్కుకి తీసుకెళ్తారట అని ఉరుకోబెట్టటానికి ప్రయత్నించారు పిన్నిగారు. అయ్యా బాబో ఇక పార్కులో కిష్కింధ కాండే, ఎన్ని ఫిర్యాదులోస్తాయో అనుకుంటూ వంటింట్లో కెళ్ళాను.

                                                                           ***
పిల్లలు రోజూ ఏదో అల్లరి చేస్తూనే ఉన్నా కాస్త మచ్చికయారు మాకు. మా అమ్మాయి కూడా వాళ్ళతో ఆడుతోంది. ఇక వారం తర్వాత వాళ్లు వెళ్ళడానికి తయారయ్యారు. రైలు ప్రయాణం అనో లేక ఇక్కడి కట్టడికి విసుగిచ్చిందో ఏమో పిల్లలకు మహా సరదాగా ఉంది వెళ్ళడానికి. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బట్టలు, చిన్న చిన్న ఆటబొమ్మలు అవీ ఉత్సాహంగా సర్దుకుంటున్నారు. వాళ్ళు వెళ్తుంటే ఏదో వెలితిగా అనిపించింది. మా అమ్మాయి ఇచ్చిన ఏవో గిఫ్ట్స్ పిల్లలు సంతోషంగా తీసుకున్నారు. ఇక పిన్ని బాబాయి కళ్ళల్లో నీళ్ళు చూసి నాకూ మనసు వికలమై కళ్లల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. వాళ్లను చూస్తుంటే స్వర్గస్తులైన మా అమ్మా నాన్నా గుర్తొచ్చారు. పిన్ని గారు నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఎప్పుడూ మెటీరియల్ గా ఉండే మా అమ్మాయి కుడా ఏడ్చేసింది.

వెళ్ళిపోయారు వాళ్ళు. ఇల్లు ప్రశాంతంగా ఉంది, కానీ ఏదో వెలితిగా కుడా ఉంది. నిజమే! ఓ రకమైన యాంత్రిక జీవితానికి అలవాటు పడి, పిల్లల్ని కూడా క్రమ శిక్షణ పేరుతో కట్టడి చేస్తున్నామేమో అనిపించింది. వాళ్ళ పసితనాన్ని లాక్కుంటున్నట్లు అనిపించింది. ఆ రోజు సాయంత్రం ఏంతో ఆశ్చర్యం వేసింది నాకు, మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చి, ఆ పిల్లలు ఎక్కణ్ణుంచో తెచ్చి ఆడుకుని పడేసి వెళ్ళిన సైకిల్ చక్రం తీసుకుని దాన్ని కర్రతో తిప్పుతూ ఇంటి ప్రాంగణం లో ఆడుతూ ఉంది. దాని మొఖంలో ఎంతో సంతోషం. పాత సైకిల్ చక్రంతో రోడ్డు మీద, వర్షం నీళ్ళలో కాగితపు పడవలతో, ముంగిట్లో తోక్క్డుడు బిళ్ల ఆడుతున్న ఆ పిల్లల ఆటలు చూస్తుంటే మా అమ్మాయి పసితనంలో ఎం పోగొట్టుకుందో దాని పసితనాన్ని ఎంతగా లాగేసుకున్నామోఅనిపిస్తోంది.

ఓ వారం రోజుల పాటు పిన్ని బాబాయి గారు బాగా గుర్తొచ్చారు. వాళ్ళు ఉన్నన్నినాళ్ళు ఏంతో "సెక్యూర్" గా అనిపించేది.ఇంట్లో పెద్ద వాళ్లు లేని కొరత ఇప్పుడు బాగా బాధ పెడుతుంది. అనుబంధాలు మర్చి పోయి మెటీరియల్ గా జీవిస్తున్న మాకు పిన్ని, బాబాయిగారు, పిల్లలు ఆ అనుబంధాలను రుచి చూపించారు.
Thursday, 26 July 2012

ఆరోజు వస్తుంది

ఆరోజు వస్తుంది

గుడిసె  కూలిపోయింది చట్టాల పరిదిలో,
బ్రతుకు  కొట్టుకు పోతుంది కష్టాల  వరదలో,

కాపురం తరువు కిందికి మారింది,
కాచుకున్న గంజి కుక్కల పాలైంది.

సగం చీర చంటిదానికి  ఉయ్యాలైంది,
చిరుగుల  సగం సిగ్గును  దాచలేకుంది,

తిన్న ఒక్కముద్డా  ఆకలిని ఆర్పనన్నది,
ఉన్న  ఒక్క దుప్పటీ చలిని  ఆపలేనన్నది, 

అంటుకునే  రోగాలకు అంతమే లేకుంది,
అందనంత ఎత్తులో  ఆరోగ్యం శ్రీ  కారం చుట్టింది, 

గుడ్డిదీపం చమురులేక  కొండెక్కింది,
దుడ్డు బియ్యానికి  కార్డ్  కరువయ్యింది,

చంటోడికి  చదువంటే బయంగానే ఉంది,
అయినా వెళ్తాడు, మద్యాన్న బువ్వ ఇంకా ఉంది.

కాలం మార్పును తెస్తుంది
జనజీవనం  మార్పు కోరుకుంటుంది,
యువత  తమ దారి మార్చుకుంటుంది.

కాయం కత్తుల కంబళి  కప్పుకుంటుంది,
కాలం నిప్పుల కుంపటి  నెత్తికెత్తు కుంటుంది,

కలాన్నీ, మడాన్నీ, వెనక్కి తిప్పవద్దన్నది,
కులాన్నీ, మతాన్నీ ఎంచి  చూపొద్దన్నది .

వేయి గొడ్లు మింగిన రాబందును  వేటాడి  బంధిస్తుంది,
పట్టుకొని  పొట్ట కోసి  నీళ్ళు రాని  పంపుకింద  కడుక్కొమంటుంది.

పొట్ట నింపుకోవడాని పనికొచ్చే పట్టా వస్తుంది,

చట్ట సభలలో బూతుబోమ్మలకు బట్టలేసే రోజు వస్తుంది.

అంగళ్ళలో రత్నాలు అమ్మేరోజు రాకున్నా..,

అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తుంది.


                                                                తప్పకుండా వస్తుంది.
Sunday, 22 July 2012

మదిచింతన
                                 
మదిచింతన                           

                          ఏవో  తలపులు తల నిండా, 
                          ఏవో  జ్ఞాపకాలు హ్రుదినిండా,

ఏటిఒడ్డున    ఇసుక  మేటపై  ఎవరి పేరో రాస్తూ.., 
గరిక  చివర  మంచుబిందువులను  చిదిమేస్తూ..,

                         రాలుపూలను రెల్లుగడ్డితో   కుట్టు కుంటూ.., 
                         రావి ఆకుల గలగలలను  వింటూ.., 

మనసారా  నవ్వుకుంటూ.., తనివితీరా  ఏడ్చుకుంటూ..,
కుందేళ్ళతో  పందెం వేసుకుంటూ.., లేగదూడలతో పరిగెడుతూ..,

                         
నీటికోలనులో  ఎవరిదా రూపం? లేఎండలో ఎవరితో సన్నిహితం?

పరుగిడి, ఎగబడి, తెగబడి, విరగబడి, అలసిపోయి  చతికిల బడితే...ఎవరిదా చిరునవ్వు?
వినిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది, వినిపిస్తూనే ఉంది.

                        
ఆకలి లేదు, భయంలేదు, రాత్రో, పగలో, అర్ధం కావటం లేదు. మదిలో అలజడి జ్ఞాపకాల ఒరవడి.

కొన్ని కంఠాలు  అరుస్తూ, కొన్ని కర్రలు ఎగస్తూ..
                      
ఎర్రటి రక్తం ఉప్పగా నాలుకను తడుపుతూ..,
                      వెచ్చటి  ఊపిరి మెల్లగా..ఊగుతూ.., 
                      
మూతలు పడుతున్నకళ్ళముందు  ఓ రూపం కదలుతుంటే..,
                      

ఒరిగిపోతూ, ఓడిపోతూ. కులాన్నీ, ధనాన్నీ, దౌర్జన్యా న్నీ గెలిపిస్తూ. 
                      
నేనన్న  ఒకే  పలుకు       సఖీ.....  "సె - లవ్".
                                                                                                       

ఇప్పుడు  నాదో  లోకం, భయంలేదు, బాధా లేదు, బాధ్యత లేదు, భావంలేదు, చీకూలేదు, చింతాలేదు, జ్ఞాపకంలేదు, జ్ఞానంలేదు, ఆధారంలేదు, ఆర్జనాలేదు, ఆశాలేదు,ఆవేశంలేదు, ఆకలీలేదు, తలపూలేదు, వలపూలేదు, అసలు నీవే లేవు.
                      

మదికీ,మస్తిష్కానికి  పొంతనలేదు, అసలు నిను పొందలేదే       

అనే  చింతనే లేదు.                       ధన్యుణ్ణి అయ్యాను .....నీ ప్రేమను పొంది.
                        విముక్తుణ్ణి  అయ్యాను ..... ఈ బంధాల నుండి.


Saturday, 21 July 2012

నైతిక విలువలు

ఈ మధ్య జులై తొమ్మిదిన గౌహతిలో ఒక విద్యార్థిని పట్ల జరిగిన సంఘటనపై అంతర్జాతీయంగా పెద్ద దుమారమే లేచింది. గౌరవ్ జ్యోతి నియోగ్ అనే ఆ జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. "Teem Annaa" కమిటీ మెంబర్ "అఖిల్ గోగోయ్" అతన్ని ఆ సంఘటనలో జనాన్ని ఆ అమ్మాయి పై ఉసిగొల్పినందుకు దోషిగా నిర్దారించడం వల్ల ఆ జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసారు.

మేధావులు, జర్నలిస్టులు "అఖిల్ గోగోయ్" బాధ్యతపై వారి వారి అభిప్రాయాలను వ్యక్తీకరించారు. కొంతమంది ఆ ఫోటో జర్నలిస్టుని సమర్థించారు, మరికొంతమంది విమర్శించారు.

అసోం ముఖ్య మంత్రితో సహా ఏంతో మంది ఆ గౌహతి జర్నలిస్టు యొక్క నీతి బాధ్యతపై విమర్శలు సందిస్తుండగా, మన దేశ ప్రముఖ ఫోటో జర్నలిస్టు అయిన రఘు రాయ్ లాంటి కొంత మంది గౌహతి జర్నలిస్టును సమర్థించారు. ఆయన అభిప్రాయం ఏమిటంటే, సంఘటన ఎంతటి దుర్భాగ్యకరమైనదైనా జర్నలిస్టు బాధ్యత కేవలం దాన్ని రిపోర్ట్ చేయడమే.

చర్చ ఏమిటంటే, జర్నలిస్టులు అందరిలాగా ethical standards పాటించాలా అవసరం లేదా అన్నది.


ఇక్కడ ఒక సంఘటన ఉదహరించాలి. 1994 లో Kevin Carter అనే ప్రపంచ ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు సూడాన్ లో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉన్న కరువు ప్రాంతం లో ఓ ఫోటో తీశాడు.


Kevin Carter


దుర్భర ఆకలితో దాహంతో ఉన్న ఓ బాలిక ఓ కిలో మీటర్ దూరంలో ఉన్న UN food camp వైపు పాకుతూ వెళ్తుంటుంది. ఓ రాబందు ఆ బాలిక చనిపోయాక పీక్కు తినడానికి దగ్గరలో వేచి చూస్తూ ఉంది. Kevin Carter ఆ చిత్రాన్ని కెమెరా లో బంధించాడు. తర్వాత ఆ ఫోటోకు అమెరికాలో పాత్రికేయులకు కొలంబియా విశ్వ విద్యాలయం వారు ఇచ్చే అత్యుత్తమ "Pulitzer prize" దొరికింది.
ఆ తర్వాత ఒక కాన్ఫరెన్సు లో, ఫోటోలో ఉన్న ఆ బాలికకు ఏం జరిగింది, మీరు ఆ బాలిక కోసం ఏమైనా సహాయం చేశారా అని అడిగారు. ఫోటో తీసిన తర్వాత ఆ బాలికకు ఏమీ సహాయం చేయనందుకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శకు, నిరసనకు గురి అయ్యారు. ఆ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆయన రెండేళ్ళ తర్వాత ఆత్మ హత్య చేసుకున్నారు.

ప్రెస్సు వాళ్లయినా, విలేఖరులయినా, ఫోటో జర్నలిస్టులయినా, సామాన్యులు అయినా ethical standards ఉండాలా అవసరం లేదా అన్నది ఎంతవరకు చర్హనీయాంశం. అది వారి వారి విజ్ఞతకు వదిలేయాలి.

Tuesday, 17 July 2012

లాంగ్ ఫేసు


లాంగ్ ఫేసు

ఈమధ్య నా మీద ఓ గురుతర భాద్యత వచ్చిపడింది, అదేమిటంటే నేను టీచర్ ని కనుక మా కాలనీ ప్రసిడెంటు గారైన అరుంధతమ్మకు ఇంగ్లిష్ నేర్పాలి,, తప్పదు. అదీ ఎలాగంటే ఆమె అనర్గళంగా మాట్లాడగలిగేలా, అస్సలు ఆమెకి ఆమె పుట్టి ఇన్నాళ్ళ తర్వాత ఈ బుద్ది ఎందుకు పుట్టిందా అని ఆరా తీయగా నిన్న పక్కింటి వారిని న్యూస్ పేపర్ అడిగితే మా పేపర్ మీరు చదివేది కాదులే ఇంగ్లిష్ పేపర్ అన్నారట, అంతే అరుంధతమ్మకు అరికాలి మంట నెత్తికెక్కింది, ఏది ఏమైనా నా నెత్తికి చుట్టుకుంది.నేను వెళ్లేసరికి అసహనంగా అటూ,,ఇటూ తిరుగుతూ నన్ను చూసి ఆదరంగా ఆహ్వానించింది. పనివాళ్ళు అందరూ అమ్మగారి కొత్త అభ్యాసాన్ని ఆసక్తిగా తిలకించటానికి రడీగా ఉన్నారు. "ఇదిగో ఎలా నేర్పుతావో నాకు తెలీదు ఓ వారం లోగా నేను ఇంగ్లిష్ మాట్లాడాల, ముఖ్యంగా మా పక్కింటి ఎభ్రాసి దాన్ని ఇంగిలీషులో దులిపెయ్యాల" ఖంగుమన్నది అరుంధతమ్మగొంతు. మీకు త్వరగా నేర్పిస్తానండీ (నేర్పక చస్తానా!!) అన్నాను, ఏమో ఏమి చేస్తావో ఏమిటో ఇప్పటికే ఆలస్యం అయింది ప్రతి  వెదవ నాతో ఇంగ్లిష్ మాట్లాడుతున్నాడు అందరికీ బుద్ది చెప్పాలి ". అంటూ పనిమనిషి తెచ్చిన వేడి పాలు తీసుకోమన్నది "అబ్బే వద్దండీ " నేను నంగినంగిగా అన్నాను " పర్వాలేదు తాగు,, అవి మా గేదేపాలు, మీరు తాగే నీళ్ళ పాలు కావు, కోపమూ,, అసహనమూ, వెటకారమూ కలిపి గర్జించింది. మొదలుపెడదామా అన్నది, వచ్చిన పని మరచిపోయి పాలు తాగుతున్న నాతో, మేము మొదలుపెట్టే సమయానికి ఆమె పెనిమిటి అనుకుంటా, పొట్టిగా పొట్టతో ఉన్నాడు తాయిలం దొంగిలించిన కుర్రాడు అమ్మ చూడకుండా జారుకుంటున్నట్లు గోడవారగా నక్కుతూ,, నక్కుతూ,, వెళ్తున్నాడు. "ఏమిటా పాకుడు , ఎక్కడికి ఊరేగుతున్నారు?" గద్దించింది అరుంధతమ్మ. " ఆం.. ఏమీ లేదు.. అమ్మవారూ ..నసిగారాయన. "ఏమిటి అమ్మగారా మీ అమ్మగాని వస్తుందా, మొన్ననేగా వెళ్ళింది? "విసుగ్గా ఉందామె స్వరం. "అయ్యో లేదు ఆరూ అమ్మవారి దగ్గరికి ఈరోజు ఏదో ప్రోగ్రాము ఉందంటేనూ.. మళ్ళీ నసుగుడు, "ఏం వళ్ళు తిమ్మిరిగా ఉందా అక్కడకి వెళ్ళేప్పుడు నేను తీసుకెళ్తాను గానీ కాసేపు ఇంట్లో యాడవండి" ఒక్కసారి ఉరిమి చూసేసరికి ఆయనగారు ఇంట్లోకి వెళ్లారు బహుశా ఏడవటానికేమో.                                                                 * * *

నువ్వేంటి పాలు తాగిన పిల్లిలా కూర్చున్నావు అన్నట్లున్న ఆమె చూపుకి భయం వేసి "నేను A.B.C.D రాసిస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి" అన్నాను. "అక్కర్లేదు అవన్నీ న్యూసు పేపర్లో ఉంటాయి, ముందు చదవటం నేర్పించు చాలు" కోపంగా అన్నది అరుంధతమ్మ . దిమ్మతిరిగిమైండు బ్లాక్ అయింది పండుగాడు కొట్టినట్లుగా నాకు. "అమ్మా! ఓ పని చేద్దాం ముందు మీరు మాట్లాడటం నేర్చుకోండి తర్వాత ఇంగ్లిష్ చదవటం వస్తుంది " అన్నాను ఎలాగో ఈ ప్రమాదం నుండి బైట పడాలి కదా అనుకుని. " అవును ఇదే బాగుంటుంది, వాళ్ళను ఇంగ్లీష్లో చడా , మడా దులిపేయవచ్చు అప్పటికి కానీ నా మనస్సు కుడట పడదు, ఆయాసపడుతూ నిప్పుల కుంపటి నెత్తికిఎత్తుకున్నట్లు తాండవం మొదలెట్టింది.

ఇక మా చదువుసాగింది ఎలా అనుకున్నరూ ఇదిగో ఇలా ..."మీరు ఎలా ఉన్నారూ  అని ఆడగాలి  అనుకోండీ .."(నేను పూర్తి  చెయ్యనే లేదు.)
"నీవు నన్ను అడిగేది నాకెందుకు  నేను ఏమి చెప్పాలో  అది నేర్పు .(విసుగ్గ్గా అన్నారు)
"ఐయాం  ఫైన్ థాంక్యు , అంటే నేను బాగున్నాను అని అర్ధం " (చెప్పాను  నేను.)
"నువ్వు బాగుంటే నాకు ఏమి చేసేది ఉంది నేను ఏమి చెప్పాలో  అది నేర్పు" ( ఈసారి కోపం తారాస్తాయి లో ఉంది)
నాకెందుకో  కళ్ళ  ముందు  నక్షత్రాలు తిరుగుతున్నట్లు, చెవుల్లో ఏవో శాభ్దాలు వినిపిస్తున్నాయి  బహుసా  పిచ్చి పట్టేముందు  ఇలాగే ఉంటుంది అనుకుంటా.
"ఏమి పంతులమ్మా నోట మాట లేదు ఏమి  నేరిపిస్తావూ  అన్నారామె, లేని ఓపిక తెచ్చుకొని  మొదలెట్టాను.
"యువర్  శారీ  వెరీ  నైస్  మేడం ,  మీ చీర బాగుంది " అన్నాను ఏమి నేర్పాలో తెలీక.
"అది నువ్వు చెప్పేది ఏముంది  అందరికీ  ఎరుక  నేను ఖరీదైన చీరలే కడతానని." ( చిరాకుగా అన్నారామె)
"ఇదిగో  పంతులమ్మ నీకు  రావటం లేదుగానీ, నేను దర్జాగా ఉపన్యాసం  దంచటం  నేర్పు  ఇంగ్లీషులో, సాయంకాలం  మన కాలనీ  మీటింగ్లో  మాట్లాడుతాను, అన్నారు.
కానీ నేను చెప్పింది ఆమెకు నచ్చక  ఇదిగో ఇలా మాట్లాడారు.
"హల్లో  ఆలు  గుడ్డీవినింగూ  ఆలు కమింగు ఇయరూ .. మై యాపీ, మై వాటు స్పీకు ఆలు టేల్లు  యస్సు యస్సూ, యు టేకు కాపీ , బిస్కుటూ . ఐ యాపీసూ " ఆడంగులంతా  చప్పట్లు కొట్టారు.
నిలువు గుడ్లతో, నోరు ఎల్లబెట్టి  చూస్తున్న నాతో  ఎలాఉంది  నా  లాంగుఫేసు.అన్నారామె.  ఒక్కసారిగా  ఈలోకంలోకి  వచ్చిన నాకు మరో పజిల్  లాంగుఫేసు  అంటే ఏమిటి?
" మీకేమండీ  చక్కగా ఉంటారు అన్నాను నంగి నంగిగా (సిగ్గు పడుతూ  ముద్దు ముద్దుగా  పలకటం)
"నేను బాగానే ఉంటాలే అదిగాదు  నేను అడిగింది నా లాంగుఫేసు  ఎలా ఉందీ అని?"  అడిగారు మళ్ళీ
" మీ ముఖానికి  ముక్కెర అందాన్నిచ్చింది, అన్నాను  కొంచం దైర్యంగా,"
"ఏమిటో  మీకు కొంత  తింగరితనం  ఉన్నట్లుంది, నేను  నా ఇంగ్లిష్  లాంగుఫేసు  గురించి  అడుగుతుంటే   ఏమేమో చెప్తున్నావ్ "  జాలి పడుతూ నా వంక చూసారు.
ఒక్క సారిగా ఐసుదిమ్మ  నెత్తిమీద  పెట్టినట్లుగా  తల దిమ్మగా ఉంది నాకు.  బాప్ రే.. లాంగ్వేజ్ కి వచ్చిన తిప్పలా నేను  సైడు ఫేసు  అనుకున్నా.  " సరే  రోజూ  వచ్చేయండి  ఇద్దరం కలసి  పార్టీస్ (ప్రాక్టీస్) చేసుకుందాం. మీరు నాతో  కోపరైట్  ( కోపరేట్) చేయండి. జీతం ఇస్తాను  నా దగ్గరే  జాబ్  అనుకోండి  అని అభయం ఇచ్చిన అమ్మవారిలా ఫోజు పెట్టారు.


                                                            * * *


అదిగో  ఆరోజునుండీ  ఇలా ఫిక్స్ అయిపోయీ   ఉద్యోగం ఊడగొట్టుకుని ,ఫుల్ టైం  ఈ ఇంగ్లిష్ చానల్ ఈదుతున్నా .. నిఘంటువు  లో  కొత్త పదాలను  చేరుస్తూ  నా లాంగుఫేసు తో  మిమ్మల్ని  త్వరలో  కలుస్తాను.Saturday, 14 July 2012

చేజారిపోతున్న విలువలుసభ్య సమాజం తలదించుకునే మరో సంఘటన. గౌహతిలో జరిగిందీ  సంఘటన. నడిబజారులో రాష్ట్ర సచివాలయానికి కిలోమీటరు దూరంలో  పదిహేను, ఇరవై మంది గల ఓ అసాంఘిక  గుంపు ఒక  మైనర్ విద్యార్థినిని   వివస్త్రను చేసి హేయంగా, క్రూరంగా చితక బాదుతుంటే  దాన్ని ఓ సినిమాలా నిస్సహాయురాలైన ఆ బాలిక దురవస్థను  తిలకిస్తూ  ఆనందించింది  వందల సంఖ్యలో ఉన్న సభ్య సమాజం. కారణం ఏదైనా కావచ్చు, ఆ బాలిక తప్పేదైనా చేసుండొచ్చు.   


ఎంతో బాధ్యతాయుతమైన మీడియా కూడా ఆ బాలిక రక్షణకు ప్రయత్నించకుండా  ఈ సంఘటను ఓ డాక్యుమెంటరీలా తాపీగా చిత్రీకరించి ఇంటర్నెట్లోకి ఎక్కించింది.  భాద్యతాయుతమైన  అసొం రాష్ట్ర ఒక  ఉన్నతాధికారి గారు కూడా మీడియా సకాలంలో స్పందించి వీడియో కవరేజ్  చేసినందుకు కృతఙ్ఞతలు తెలియజేసారేగానీ, ఆ   కవరేజ్   ఇంటర్నెట్లోకి ఎక్కించినందుకు మీడియాను ఎంతమాత్రం తప్పు పట్టలేదు.  ఆ బాలిక మరియు ఆమె తల్లితండ్రులు ఎంత సాంఘిక అవమానానికి (social stigma) గురిఔతారొ  DGP దొరవారికి ఎంతమాత్రం పట్టలేదు. క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ప్రభుత్వానికీ, అధికారులకూ ఏ మాత్రం అవగాహన ఉందో మనకు అవగాహన అవుతోంది.  


జాతీయ నేర రికార్డుల సంస్థ  అంచనా ప్రకారం దేశంలో బాలికలు మరియు స్త్రీల పట్ల నేరాలు ఇతర నేరాలైన  హత్యలు మరియు దొంగతనాలకంటే ఎక్కువ శాతం నమోదుతున్నాయి. వీటిలో చాలా నేరాలకు స్త్రీలే బాధ్యులని చెప్పి మొఖం చాటేస్తూన్నాయి ప్రభుత్వాలూ, శాంతి భద్రతలు పరిరక్షించే సంస్థలు.  ఈమధ్య కాలంలో మన రాష్ట్రంలో జరిగిన  "ఆయేషా" హత్య సంఘటనలో ఎంత న్యాయం జరిగిందో అందరూ చూసారు.ప్రేమించిన నేరానికి "Honour Killing" అంటూ కన్న కూతుర్ని క్రూరంగా పాశవికంగా చంపేసే సంస్కృతి నాగరికులమని చెప్పుకునే ఉత్తర భారత దేశ సమాజంలో ప్రబలుతూ ఉంది. ఇది ఎంత అనాగరికం, అనాగరికమైన  ఆదిమమానవ స్థాయిలోనే ఉందా మన సమాజం.


ఎక్కడుంది స్త్రీలకూ రక్షణ? ఇంట్లో గృహ హింస, స్కూల్లో, హాస్టల్లో, పోలిస్ స్టేషన్లో చివరికి జనసమూహంలో కూడా రక్షణ లేకుండా పోతుంది. దీనికి బాధ్యత ఎవరు. సక్రమంగా పెంపకం చేయని తల్లితండ్రులడా, పబ్బులు, డిస్కోతేక్కుల కల్చరా, సమాజానిడా, ప్రభుత్వానిదా ?


ఈ సంఘటనను విచారిస్తున్న "National Commission of Women" నిందుతులను న్యాయ వ్యవస్థ ముందు నిలబెడుతుందా. చూడాలి.   


ఏది ఏమైనా మార్పు అనేది సమాజపరంగా రావాలి, దాని ప్రారంభం ఇంటినుండి మొదలవ్వాలి.
Sunday, 8 July 2012

శిశు గీత
శిశు గీత

ఏ అనుబంధం నన్ను  కడుపులో  పెంచిందో,
ఏ అసహనం  నన్ను అక్కరలేదు అనుకుందో,

ఏ సమస్య నన్ను వదిలించుకోమందో,
ఏ నిర్ణయం నన్ను బుట్ట దాఖలు  చేసిందో,

ఏ ఆలోచన నన్ను అంతం చేసిందో,
ఏ విషాదం నన్ను దూరం చేయమందో,

ఏ సందిగ్దం  నన్ను తప్పించుకోమందో,
ఏ సందర్భం  నన్ను సాగనంపిందో,

ఏ సలహా నన్ను చంపివేయమందో,
ఏ సమాజం నన్ను పంపివేయమందో,

అమ్మా నాన్నలకే  అక్కరలేని నేను, అన్యులైన  మిమ్ము అడుగుతున్నా.

ఎక్కడిదీ బిడ్డలను చంపుకునే అసాంఘిక ధర్మం?
ఎక్కడిదీ ఆడపిల్లలను కడతేర్చే ఆటవిక న్యాయం?

ఎక్కడిదీ మానవతను మంటగలిపే  బుద్దిమాంద్యం?
ఎక్కడిదీ అంతరాత్మను  చంపుకొనే అంధ  అజ్ఞానం?

ఎక్కడిదీ వారసత్వపు  శకలాలను  మూటగట్టే మూఢత్వం?
ఎక్కడిదీ మాతృత్వాన్ని మంటగలిపే గొడ్డుమోతుతనం?

ఎవరు తెచ్చారు  ఈ సంకరజాతి  సంస్కృతిని ?
ఎవరు నేర్పారు  ఈ వికృతనీతి  విష క్రీడని?

ఎవరు ఎదుర్కుంటారు ఈ  విపరీత పరిణామాన్ని?
ఎవరు వేటాడుతారు  ఈ  విషపు విహంగాన్ని?

నిష్టూరమన్న (అమంగళం) నన్ను, సృష్టి కి ప్రతి సృష్టిగా  గుర్తించే వరకూ నేనింక తిరిగి  రాను.


Friday, 6 July 2012

బిక్షపతి
బిక్షపతి

ఆటో డ్రైవరు బిక్షపతికి కొత్తగా పెళ్లి అయింది. పిల్ల కంట్లో నీళ్ళు రాకూడదూ,ఆటోరంగు మాయకూదడూ, అనే కండిషన్ మీద అత్తగారు ఆటోకోనిచ్చి పిల్లనిచ్చారు. ఆ రోజు బిక్షపతి కూరగాయల మార్కెట్ దగ్గర ఆటో పెట్టుకుని భార్యతో సెల్లులో సోల్లుతున్నాడు. సినిమాకు తీసుకెళ్తానన్నవాడివి ఎక్కడ చచ్చావు అంటూ క్లాసు పీకే ప్రాయోజిత కార్యక్రమం జరుగుతోంది ఫోనులో. త్వరగా ఇంటికెళ్ళడానికి ఇంటివైపు వెళ్ళే సవారీ దొరుకుతే బాగుంటుందని చూస్తున్నాడు బిక్షపతి. ఇంతలో భుజం మీద ఓ బలమైన చెయ్యి పడింది. "ఏయ్! గిది నీ అత్తగారిల్లా రా ఆటో గీడ పెట్టినవ్. తీ నీ యబ్బ బండి తీ " కరుకు ఖాకీ హూంకరించింది.


బిక్షపతి ఒక్క మాటకూడా మాట్లాడకుండా ఆటో స్టార్ట్ చేసి అటు, ఇటూ తిప్పి అక్కడే ఓ మూల నక్కిండు. అప్పుడే వచ్చింది, ఏమిటి "మూర్చ" అనుకుంటున్నారా? కాదు, ఆడ భీముడు లాంటి ఓ శాల్తి. ముగ్గరు పిల్లలూ, ఆరు లగేజీలతో, బిక్షపతి వంక కనీసం చూడకుండా సంచులనూ, పిల్లలనూ ఆటోలో వేసి తనూ ఎక్కి పోనీ అన్నది, ఆమెకు తెలుసు ఎక్కకుండా బైట నిల్చిని మర్యాదగా అడిగితే ఆటో వాళ్ళు ఎన్ని కండిషన్లు పెడతారో, "ఏడ బోవాలె" చిరాగ్గా అడిగాడు బిక్షపతి. 'కొంపల్లి" చెప్పింది ఆమె. అంతే ఆమె పక్కన కూర్చున్న 5 ఏళ్ళ కొడుకు ఒక్క సారిగా ముందుకు వంగి భిక్షపతి చొక్కా పట్టుకుని ఓ గుంజు గుంజి, ఆ .. ఆ .. నేను మా అమ్మమ్మ తానకే బోతా, అంటూ ఆరున్నొక్క రాగం శ్రుతి చేసాడు. భిక్షపతి వెనక్కి తిరిగి "ఏమి లొల్లి ఇదీ, ముందు డిసైడ్ జేసుకోవాలే ఏడికి బోవాల్నో" చిరాగ్గా అన్నాడు, "అరె నువ్వు బోనీ రాదన్నా పిల్లగాని ముచ్చటేందుకు నీకు. చూడ బోతే ఆడాళ్ళకు అత్తా మొగోళ్ళకు మామ లెక్కనున్నవు ". విసుక్కుంది ఆమె. గట్లనే, నాకేం చెసేడ్డుంది అంటూ ఆటో కదిలించాడు. "మీటరు మీన తీస్ రుపై ఐతది." అన్నాడు బిక్షపతి". అవ్ నువ్వు మోస్తున్నవ్లే లగీజీ మొత్తాన్ని నెత్తిమీద " వ్యంగంగా అన్నదామె.


ఆమె పిల్లల్లో పెద్దవాడు బాబు, తర్వాతది పాప 3 ఏళ్ళు, మూడోది పాప చంటిది ఒల్లో ఉంది. పెద్ద పాప సంచీలో ఉన్న కొత్త పుస్తకాల్లోనుంచి ఒకటి తీసి చదవటానికి ప్రయత్నించింది, ఆటో స్పీడుకి గాలి తోడై బుక్కును ఎగరేసుకెల్లింది, అంతే పాప ఏడుపు లంకించుకుంది. "వామ్మో నా బుక్కు ఎగిరిపోయిందే" తల్లి ఆటో ఆపమని ఆర్డరు వేసింది. "ఏమైందీ దిగి పోతారా?" ఆశగా అడిగాడు భిక్షపతి. "దిగిపోవుడేమిటి ? పిల్ల బుక్కు ఎగిగి పోయింది, నువ్వూ నీ దిక్కుమాలిన ఆటో, ఉరుకు తీసుకురాపో" హడావిడి పెట్టిందామె. "మనం మస్తు దూరమచ్చినాం, అది ఇప్పటికే బండ్ల కింద బడి తుక్కులెక్క అయిపోయి ఉంటాది" నీరో చక్రవర్తి లా నింపాదిగా ఉన్నాడు భిక్షపతి. పిల్లాడు ఆటోలో నుండి ఒక్క గెంతుగెంతి , బాల హనుమాన్ లా వాయువేగంతో వెళ్ళాడు. * * *

ఇరవై నిమిషాలైంది పిల్లాడు రాలేదు, తల్లి కంగారు పడుతూ పెద్ద పిల్లని నాలుగు అంటించింది. ఆపిల్ల ఆరు రాగాలు, చిన్న పిల్ల అర రాగంతో కోరస్ అందుకోగా , ఇద్దర్నీ తీసుకుని పిల్లాడిని వెతికేందుకు ఆటో దిగి వెళ్ళింది. ఇంతలో రాంగు ప్లేసులో ఆటో ఆపినందుకు ట్రాపిక్ పోలీసు తెలుగులో ఉన్న బూతులన్నీ లంకించుకున్నాడు. భిక్షపతి అస్సలు తనకు పంచేంద్రియాలలో చెవులే లేనట్లు ఉండిపోయాడు. కాసేపటికి ఆమె పిల్లాడిని తన్నుకుంటూ వచ్చి ఆటో ఎక్కింది. ఇంతకీ కుర్రాడు ఏం చేసాడనుకున్నారు. బండిమీద పడి ఫ్రీగా అరటి పళ్ళు తింటున్న ట్రాఫిక్ పోలీసు విజిల్ కొట్టేయటంలో బిజీగా ఉన్నాడన్నమాట. ఆటో బయలు దేరింది కొంచం దూరం వెళ్ళగానే పీ..... మంటూ పోలీస్ విజిల్ వినిపించింది. ఆటో షడన్ గా ఆపాడు భిక్షపతి, పిల్లాడు చప్పట్లు కొడుతూ "అయ్ అంకులు మస్తు భయపడిండులే.. బలే బలే " పక, పకా నవ్వాడు." అరె! గిదేం పరేశానమ్మా, గీడికెళ్ళి తొవ్వ మంచిగ లేదు, మీరు దిగిపొండ్రి. " అంటూ వారిని దిగిపొమ్మని గోల చేసి దింపేసాడు. ఆ నిర్మానుష్య ప్రాంతంలో బిడ్డలతో దిక్కుతోచక నిల్చుంది పోయిందా ఇల్లాలు.

సవారీ కోసం చూడకుండా ఇంటి ముఖం పట్టాడు భిక్షపతి. వర్షం మొదలై పెద్దగా మారుతుంది, కరంటు పోయింది నగరమంతా చీకటి ఇద్దరు యువకులు ముఖానికి రుమాలు కట్టుకుని ఉన్నారు ఆటో ఆపారు. ఆటో ఆపిన భిక్షపతి" లేదన్నా పనిమీద పోతున్న రాను " అన్నాడు. "అవ్ బే మేముకుడా పనిమీదనే ఉన్నాం" అంటూ ఆటోలో జొరబడ్డారు. భిక్షపతి వాళ్ళను మిర్రర్లో చూసాడు హర్రర్ సినిమాలో భూతాల లెక్కన ఉన్నారు అనుకున్నాడు. కొంచం దూరం పోయిన తర్వాత " అరె ఇక్కడ ఆపు
అన్నారు ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది.

"ఏందన్న గీడ ఆపిండ్రు " అన్నాడు భిక్షపతి, పని ఉందిలే దిగు అంటూ కాలరు పట్ట్టుకుని దింపి, జేబులో డబ్బు లాక్కున్నారు, లబో దిబో మంటున్న భిక్షపతిని రోడ్డు మీద పడేసి ఆటోలో వెళ్తూ. " ఒరే భేవకూఫ్ ఆటో ఇదే రోడ్లో వదిలేస్తాం. రేపు తీసుకెళ్ళు లేకుంటే పోలీసు మామలు అది కూడా మిగల్చరు " అనేసి వెళ్ళిపోయారు. చీకట్లో నడుస్తున్న బిక్షపతి కి ఓ గంట క్రితం తను దింపేసిన మహిళ గుర్తొచ్చింది. నిస్సహాయత ఎంత దయనీయమో అర్ధమైంది.Sunday, 1 July 2012

ఏల ఈ భే(ఖే)దం

ఏల  ఈ  భే(ఖే)దం

తెలి  మబ్బునై  అంబరం  చేరిన నేను, కరి మబ్బునై  నేల  రాలాను,

తెల్లని మల్లియనై  వెన్నెలకు విరిసిన నేను, నల్లని కలువనై నిశిని  చేరాను,

వరదగోదారినై  ఉరకలెత్తిన నేను, నిండు చెరువునై   నిమ్మకుండి  పోయాను,

చందన శాఖ  కుందనపు  బొమ్మనైన  నేను, వొళ్ళంతా  గాయాలతో పిల్లనగ్రోవినైనాను.

కోటి కోరికల  ఉత్తేజ విహంగమైన  నేను, రెక్కలు తెగిన పక్షిలా నేలకోరిగాను,

ప్రణయ యాత్రలో  వలపు మజలీనైన నేను, విరహ వీధిలో  బాటసారినైనాను.

ఆరని తొలిసంతకపు  అమృత తడి నైన నేను, చెల్లని వీలునామానైనాను.

అందాల   ప్రఘాడిత పరిమళమైన నేను, అనాఘ్రాత పుష్పమైనాను.

సప్త పదుల సంఘటిత  భావమైన నేను, తడబడే అడుగునైనాను. 

దూరమయ్యే  దారిని  అంచనా వేస్తున్న నేను, నిశ్శబ్దనిరీక్షణి నైనాను.

ఆత్మీయ సరాగాల సాగరంలో మునిగిన నేను. అంతిమ యాత్రలో దింపుడుకల్లంలో  ఉన్నాను. 

నేనెప్పుడూ  నిరాదరినే, ఉషోదయపు తుషార బిందువులకై, దోసిలి పట్టిన దాహార్తిని నేను.

నేనెప్పుడూ  నిరాదరినే, నీ  కటాక్ష వీక్షణాలకై   వేయి కనులతో వేచిన భిక్షువును  నేను.