Pages

Tuesday 26 March 2013

   






     సాక్షి 
   
   అమ్మ అన్నపూర్ణ  సాక్షిగా ,
   పల్లెటూరు ఒకటుండేది.

   అన్న  రైతన్న సాక్షిగా ,
   అక్కడ అన్నం దొరికేది.

   కరువు కాటకాల  సాక్షిగా,
   ఇప్పుడక్కడ ఆకలి తాండవిస్తుంది.
   ఎండిన  పొలాల  కళేబరాల సాక్షిగా,
   సొక్కి  సోలిన  వరి పంటే ఉంది.

   రాబందుల  వికృత రెక్కల  సాక్షిగా,
   మా పాడి గేదె కాయం ఉంది.

   తెచ్చుకున్న అప్పుల సాక్షిగా,
   మా రైతన్న  ఊగిన ఉరికొయ్య ఉంది.

   పట్టనీకరణపు  తళుకుల సాక్షిగా 
   పల్లె మరోమారు  వల్లకాడైంది.

   ఇప్పుడు మన నాగరికత సాక్షిగా 
   పల్లెని సినిమాల్లో చూడొచ్చు .

   పట్నం నుండి తెచ్చిన ప్లాస్టిక్ చెట్ల సాక్షిగా,
   పల్లె  కళకళ లాడుతుండటం  చూడొచ్చు.

   కండలు తిరిగిన  సీమ హీరో  సాక్షిగా,
   మన బక్క రైతన్నని  మరచిపోవచ్చు.

Sunday 24 March 2013




    

     
   నీకోసం 


   వాస్తవ లోకాన 
   ఊహా సౌదంలో ..
   ప్రేమని వెతుకుతూ ..

   వేకువనే,
   మదిలో వేదనతో  
   గుండె నిండా రోదనతో 
 
   ఎండిన పెదవులకు,
   పలుకుల తొలకరి,
   తళుకుల సింగారింపులు 

   చలం మైదానాన్ని,
   గిజిగాని వసంతాన్ని,
   సృజించి తరింపు.

   అంతరాంతరాలలో,
   నీ ప్రేమకై అన్వేషిస్తూ,
   నిరసన రుచిచూస్తూ,

   కలకూ, మెలుకువకూ 
   భాషకూ,భావానికీ,
   అంతుపట్టని  నీ ఆత్మ సౌందర్యం 

   అందుకోలేని  అభాగినినై,
   ఆశల ,ఊసుల మద్య,
   నిరాశా,నిట్టూర్పుల నా అంతరంగం 

Saturday 23 March 2013












ఆడపిల్ల 

విరిసీ విరియని కలువని 
కొత్త కొలనులో పాతి  పెడితే,
తట్టుకొని నిలిచి తలఎత్తుకుంది. 

గుండెల్లో  ఎగిసిపడే  దిగులుని,
స్పర్శించి పరామర్సించితే, 
కంటనీరుదాచేస్తూ   కళ్ళు వాల్చింది. 

బరువు అనుకొని బలురక్కసి  పొదలమద్య,
అదృశ్య లోకాలలో  విసిరేస్తే,
విషాదగీతికై  విలపించింది. 

అనాగరిక ఆటవికుల మద్య,
జీవించమని ఆదేశిస్తే,
తలవంచుకొని  ఆచరించింది. 

దేవుడు ఎదురై  ఎమికావాలీ అంటే,
పెదవి విప్పి ఒకటే వేడుకుంది,
ఆడజన్మ  తప్ప, ఏదైనా ఇమ్మంది  

Friday 22 March 2013

నీ తలపుల్లో

   






    నీ తలపుల్లో 

   వెన్నెల వెల వెల  పోతుంది 
   తిమిరాన్ని తరమలేనంటుంది.

   నిశి  నిండిన నా మది విలపిస్తుంది.
   నీ ప్రేమకు మూగ సాక్షిగా.

   నిద్దుర ఎరుగని కనులు ,
   నిశ్సబ్దంగా నీకై రోదిస్తున్నాయి.

   స్తంబించిన  కాలం నిలదీస్తుంది,
   యెంత సేపు ఈ నిరీక్షణా అని.

   ఉక్రోషం ,ఉద్వేగంగా ఉంది,
   గట్టిగా నిన్ను పిలవాలని ఉంది.

   గుండెపగిలేలా  అరవాలనీ,
   ఈ వేదనను చేదించాలని 

   కలవరంతో కనులురాల్చిన అశృవులను,
   కాలి బొటనవేలు  నేల రాస్తుంది విరహగీతికగా.

   పచ్చటి మోము రుదిరవర్ణం  దాలుస్తుంది,
   మెలిపెట్టిన పైటకొంగు పళ్ళ మద్య  గింజుకొంటుంది .

  నిరీక్షణే   నీరసించేలా,అలిగిన అభిసారికలా 
  నిర్జన  ప్రదేశాన నిద్ర ఎరుగని నిశాచరిలా.

  కాలమనే ఇనుపగోళాన్ని కాలికి కట్టుకొని,
  నడుస్తూ,నిరంతరం నీ తలపుల్లో తడుస్తున్నా.


Thursday 21 March 2013



   చూడు 

   మానవ మృగాలు 
   పాలుగారే బుగ్గలను కూడా,
   తడిమి తపన తీర్చుకున్తున్నాయి.

   కొత్త పుంతలు తొక్కే,
   నాగరికతలన్నీ  నగ్నంగా,
   నాట్యం చేస్తున్నాయి.

   తేనే పూసిన మాటలతో,
   కపటమద్దిన   చేతలతో,
   మాలిమి చేస్తున్నాయి.

   ఆరేళ్ళ  ఆడపిల్లల్ని,
   రాక్షస క్రీడకు   బలిచేసి,
   నూరేళ్ళు నిండేలా చేస్తున్నాయి,

   సైకోల ఉన్మాద చర్యలు 
   స్వై ర్య  విహారం చేస్తూ,
   కసిగాయలపై  కసిగా,
   "కఫన్" కప్పుతున్నాయి.

   (కఫన్ ..చనిపోయినప్పుడు కప్పే తెల్లని వస్త్రం )
 

Thursday 14 March 2013

 







నీ నుదుటి పున్నమినౌతా 


నన్ను చూసి తలుపు చాటు నక్క్కుతావు.
నా ప్రతి అడుగూ  లెక్కెడతావు.

నా పలుకులతో అలకలు పోతావు,
ఓర కంట నన్ను కవ్విస్తావు 

నా పిలుపుతో పులకరిస్తావు,
కానీ  విననట్లు నటిస్తావు.

ఎప్పుడూ యోగినిలా ద్యానంలో  ఉంటావు,
నన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడతావు.

నా స్పర్స తగిలితే  కంపిస్తావు,
కానీ నెపం చల్లగాలిపై తోస్తావు 

నా పిలుపుతో పులకరిస్తావు,
కానీ  విననట్లు నటిస్తావు.

ఎప్పుడూ యోగినిలా ద్యానంలో  ఉంటావు,
నన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడతావు.

నా స్పర్స తగిలితే  కంపిస్తావు,
కానీ నెపం చల్లగాలిపై తోస్తావు 

నిశాచరునిలా, నేను సంచరిస్తుంటే,
చుక్కల వత్తులేసి  జాబిలి  దీపం పెడతావు.

ముద్దుమోమును  దోసిట తీసుకుంటే,
కలువ కనులను మూసుకుంటావు.

నిరాశ  చెంది  నేను  వెనుతిరిగితె,
కలవరంతో కదలిపోతావు.

సెలవు తీసుకొంటున్న నాకోసం,
నెలవు దాటి బైట పడతావు  

అమావాస్యలాంటి నీ జీవితాన పున్నమినౌతా,
వైధవ్యం  అంటిన నీ జీవితానికి   వరాన్నవ్ తా     





Friday 8 March 2013

నా...నీవు









నా.... . నీవు 

హేమంతంలో  పూచే  చేమంతిలా,
నీ హసితం  ఓ  సుభాషితం.

గ్రీష్మంలో  విరిసే మల్లియలా,
నీ  వదనం  ఓ   వరం.

మలయా  మారుతంలా
నీ   పలుకు  ఓ  పులకరింపు.

కరిమబ్బు  రాల్చే   చినుకులా
నీ పిలుపు   ఓ  చిరుజల్లు.

గలగలా  పారే  సెలయేరులా,
నీరాక   ఓ   ఏరువాక.

మలి  సంధ్యలో  శశి  పంపే  ఆహ్వానం లా,
నీ చూపు  వెన్నెల బాకు.

ఎడారిలో    దాహం తీర్చే  చలమలా,
నీ స్నేహం  ఓ  ఊరడింపు.




Monday 4 March 2013

దిక్కు (లేని)మాలిన సమాజం








దిక్కు (లేని)మాలిన సమాజం 


సమాజం ముసుగు తొలగించి  చూస్తె,
ముదిమి చెక్కిలికి  చెమ్కీ  రాసుకున్న 
వెలయాలిలా  కనిపిస్తుంది,

దాని చరిత్ర  పేజీలని  తిరగేస్తే
వదిలేసిన ప్రియురాలి,

గాలి కబుర్లులా అనిపిస్తున్నాయి. 

కరువును తరిమేసే  
పథకాలపై చెయ్యేస్తే, రేషన్ షాపులో 
బియ్యం మెక్కిన పందికొక్కుల్లా ఉన్నాయి. 

ఓటు  దొంగిలించిన   నేత దగ్గరికెళ్ళి 
కొలువుకోసం  కాళ్ళు పట్టుకొంటే,
అరగక పెరిగిన పొట్ట సొట్టలు పడేలా నవ్వాడు. 

లంచం తో పాటు  మంచం  మరిగిన
నీతిలేని చెత్త  వెదవల  చెలామణి,
దొంగ వెదవల దొరతనమూ..సాగుతుందిక్కడ. 

ఆలిని  అత్తారింటికి  తొలుదామంటే,
చేవలేని తనాన్ని  చూపులతో చెరిగేసిందీ,
మగతనాన్నే  తూలనాడింది

ఎంత  అలిగి  పడుకున్నా   
ఆకలికి  బయంలేకపోయింది 
అరుచుకుంటూ పక్కననొచ్చి చేరుతుంది. 

తీరిగ్గా తీర్ధయాత్రల్లొ  మునిగి తేలుతూ 
స్నానాదుల్లో సమాజాన్నీ కడిగి చూస్తే,
గంగానది గగ్గోలు  పెట్టింది. 

నేలమీద  కాయాన్ని పరుచుకున్నా,
తలదగ్గరో దీపమెట్టుకున్నా..,
కాళ్ళ దగ్గర గొయ్యి తవ్వుకున్నా,


కుళ్ళిన, రసికారే  కుష్టు రోగపు పుండు,
కళ్ళకు కాటరాక్ట్ , వచ్చి పొరలు కమ్మిన 
దిక్కుమాలిన, దౌర్భాగ్యపు ,ద్రోహపు సమాజాన్ని,
నాతొ పాటు  పాతిపెట్టండి, నేల  తల్లికి సమర్పించి 
అమర మొలకనై  తిరిగి అవతరిస్తా.....

( కొందరి మిత్రుల  సలహా మీద కవితని సవరించాను, ఎవరి మనొభావాలు దెబ్బతినటం నాకూ  నచ్చదు  అందుకే ఈ సవరణ)








'