Pages

Wednesday, 27 June 2012

సలీం కీ షాదీ


సలీం కీ షాదీ

సలీం భాయి పెళ్ళి. అదో ప్రహసనం. అందరి పెళ్లిలా జరగలేదు. ఆయన బారాత్ కు ఓ విశేషం ఉంది.

రాత్రి 9 గంటల "నిఖా" ( పెళ్లి) కి మధ్యాహ్నం ఒంటిగంట నుండే హడావిడి మొదలైంది. తొమ్మిది గంటలకల్లా బారాతు "షాది ఖానా" (function hall) చేరాలి. పిల్లా మేకా అందరూ సాయంత్రానికల్లా తయారై బారాతు గుర్రం కోసం ఎదురు చూస్తున్నారు.
అందంగా అలంకరించిన గుర్రం రానే వచ్చింది. ముఖం మీది "సేహేరా" (ముఖం పై వేలాడే పూల సరాలు) లోనించి సలీమూ, కళ్ళకున్న గంతల్లోంచి గుర్రమూ ఒకర్నొకరు పరిచయం చేసుకున్నారు. చెప్పోద్దూ, సలీంకి గుర్రాన్ని చూసి పిసరంత కంగారు వేసింది. పిప్పళ్ళ బస్తాలా ఉన్న సలీం ని చూసి బక్క చిక్కిన గుర్రానికీ కాస్త భయం వేసినట్టుంది. ఇక సలీం దోస్తులంతా కలసి సలీం ముఖానికి "సేహెరా" కట్టి, ముస్తాబు పూర్తి చేసి గుర్రంపైకి కుదేశారు. గల్లీ అంతా అత్తరు ఘుమ ఘుమలతో నిండిపోయింది. పెళ్ళి పెద్దలంతా షేర్వానీలు ధరించి గుర్రం వెనక, కుర్రకారంతా గుర్రం ముందు నిలబడి అసహనంగా "తాషా మార్ఫా" (డప్పు వాయిద్యాలు) ల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు మొదలైంది అసలుకథ. ఒక్కసారిగా దడ దడ మంటూ "తాషా మార్ఫా" శబ్ధాలు వినిపించాయి. అంతే ...... అసలే మొదటి సారిగా బారాతుకు తెచ్చిన గుర్రం, ముందు కాళ్ల మీద లేవడం, వెనక్కి పడిపోతున్న సలీం ని వెనక కాళ్ళతో తన్నడం రెప్ప పాటులో జరిగిపోయింది. "దుల్హన్" ను ఉహించుకుంటున్న సలీంకు కళ్ళ ముందు పట్టపగలే నక్షత్ర్రాలు మెరిశాయి. షెర్వానీలన్నీ పరేషానయ్యి, సలీం ని లేపి, మట్టి దులిపి, ధైర్యం చెప్పి, చేతికి నిమ్మకాయ గుచ్చిన కత్తి ఇచ్చి తిరిగి గుర్రం మీదికి నెట్టి చేతులకంటిన మట్టి దులుపుకున్నాయి.

బారాతు కదిలింది. గుర్రం ముందు పిల్లా పెద్దా అంతా డాన్సులేస్తున్నారు. ముఖానికి "సేహరా" అడ్డం ఉండటం వల్ల బారాతు ఎటు పోతుందో తెలియటం లేదు. ఎవర్ని అడిగినా వినిపించుకోవటం లేదు. చుట్టుపక్కల జరిగే శబ్దాల వల్ల ఏ ప్రాంతంలో వెళ్తున్నారో అంచనా వేసుకుంటున్నాడు సలీం. ఒక్కసారిగా గుర్రం ఆగిపోయింది. జనాల డాన్సులూ ఆగిపోయాయి. ఎదురుగా పెద్ద గుంపు పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా బస్సులు తగలబెడుతున్నారు. కేకలూ అరుపులూ, పోలీసు ఫైరింగూ. ఈ హడావిడిలో గుర్రం పక్క గల్లీలోకి పరుగుతీసింది. ఏమీ కనిపించని సలీం అందరూ తన వెనకే వస్తున్నారనుకుంటున్నాడు.

సలీమ్ కి ఏమీ అర్థం కావటం లేదు. ఎటు వెళ్ళినా ట్రాఫిక్ పోలీసులు VVIP program అంటూ ఇంకోవైపుకు తరుముతున్నారు. మెహిదీపట్నం నుండి ఆసిఫ్ నగర్ వెళ్ళాల్సిన తను "లకడికా పుల్" ఎలా చేరాడో అర్థమై చావట్లేదు. ఇంతలో "రవీంద్ర భారతి" ఎదురుగా ఓ పేద్ద గుంపు కనిపించింది. రెండు రాజకీయ పార్టీల వాళ్లు ఒకరి పై ఒకరు రాళ్ళు రువ్వుకుంటున్నారు. ఫలితంగా కర్ఫ్యూ. ఓ పోలీసు లాఠీతో గుర్రం నడ్డి మీద ఒక్కటిచ్చుకున్నాడు. అంతే.... గుర్రంగారు "Deccan Derby Cup" లెవెల్లో గాలితో పోటీ పడి సికిందరాబాదు వైపుగా పరుగు లంకించుకున్నారు.

పరిగెత్తి పరిగెత్తి గుర్రం చివరికి అర్ధ రాత్రి సమయంలో "రైలు నిలయం" వెనక ఆగింది. సలీం గుర్రంతో పాటు అర్ధరాత్రి చలిలో అక్కడే పడి నిద్రపోయాడు. తలమీద ఎవరో ప్రేమగా నిమురుతున్న ఫీలింగ్, ముఖానికి చల్లగాలి తగిలింది. ఏదో స్పర్శ. మెల్లగా కళ్ళు తెరిచాడు. ఇంకేముంది, ఆకలికి ముఖం మీది పూలు, మెడలో పూల హారం తింటూ గుర్రం కనిపించింది. సలీం కి పిచ్చి కోపం వచ్చింది. కానీ ఏం చేయగలడు.రెండు సార్లు కింద పడడంతో వాచీ రెండు ముక్కలు సెల్లు రెండు చెక్కలయ్యింది. టైం ఎంతయ్యిందో తెలియట్లేదు. మెల్లగా గుర్రమెక్కి బయల్దేరాడు.. మసక వెలుతురులో దూరంగా ఇంకో గుర్రం కనిపించింది. ఏమిటీ వింత, పెట్రోలు ధరలు పెరగటంవల్ల అందరూ గుర్రాలే వాడుతున్నారా? అనుకున్నాడు. మెల్లగా ఆ గుర్రం దగ్గరయ్యింది. దానిమీద చిరిగిన షేర్వానీతో, నలిగి వాడిపోయిన పూలహారంతో ఓ ఆకారం. అర్థమయ్యింది, ఆ ఆకారం కూడా తనలాగే ఓ పెళ్లి కొడుకే. సలీం తానె పలకరించాడు. "భాయ్ సాబ్, కల్ సే పరేషాన్ హూ. ఆసిఫ్ నగర్ కా రాస్తా బతాయియే మేరీ నిఖా హై. ఆయ్ రే. మియాన్, ఖాలి ఎక్ దిన్ కూ ఇత్నా పరేషాన్ హోరై. మై తో చార్ దిన్ సే భటక్ రహా హూ. బారాత్ భీ గయీ, దుల్హన్ భీ గయీ.


"ఏ హైదరాబాద్ కీ ట్రాఫిక్ హై భాయి, జరా సంభల్కే చలో"

June 2012 "ఆశ" మాస పత్రికలో ప్రచురితం.. 

Sunday, 24 June 2012

అతుకు అక్షరంఅతుకు  అక్షరం

చిన్నప్పుడు  కాన్వెంటులో  చేరినప్పుడు  ఎంత ఆనందమో .

అక్క ఆకుచేప్పులతో    ప్రభుత్వబడికి   పోతుంటే, నేను కొత్తబూట్లు  టక టక  లాడించే వాడిని.

అక్క  కాలినడకన  వెళ్తుంటే, స్కూలుబస్సేక్కి  స్టైలుగా   టాటా  చెప్పేవాడిని.

నన్ను  కాన్వెంటుకి   పంపటానికి  మా జోడెద్దులు  అమ్ముడుపోయాయి.

నన్ను కే. జీ లు  దాటించడానికి  అమ్మ కమ్మలు కుదవపోయాయి .

హస్తరేఖలు   డాక్టరు  అవుతాయని  చెప్పాయని  అక్క నమ్మకం,

నన్ను స్కూలు ఫైనలు దాటించటానికి  అక్క రోజుకూలీ   అయింది.

గొప్ప మార్కులతో  పాసైనా  నాకోసం  ఏ  కళాశాల   గేటూ  తెరుచుకోలేదు.

అక్కడితో  మలుపు తిరిగింది  నా  జీవన దారి,  ఆశయాల  సౌధాల నుండి ఆశల సాకారంలోకి.

బ్రతుకు బడిలో భర్తీ  అయ్యాను, ఆయువును  రుసుముగా కట్టేస్తూ, జీవిత పాఠాలు చదివేస్తూ,
కాలమనే  కాగితంపై   కాయమనే కలాన్ని కదిలిస్తూ,  బాధల  గేయాలు రాస్తున్నా.


ఏమి చేయను  ఆనందంగా ఉన్నానని అబద్ధం రాద్దామంటే, అక్షరాలన్నీ ధిక్కరించి నిజాన్నే నింపుతున్నాయి.

మీకు  తెలుసా ఈ వేదనలూ,   వెతలూ  ఎంత  చెరిపినా ఎగిరివచ్చి  ముఖచిత్రం గా ముచ్చటిస్తున్నాయి .

బతుకు పుస్తకానికి అతుకు పడుతుంది, అతికేకొద్దీ  కష్టాల చెదలు చుట్టుకుంటున్నాయి. 

(ఈ బతుకు బడిలో  పెరిగి పెద్దవారై   అయ్యవారులైన.. ఎందరో  బుడి బుడి  అడుగులలోనే బలురక్కసి  పొదల బాటన నడిచిన వారే   అందరి వేదనా ఆవేదనా ఇది.  అతి కొద్ది మంది మాత్రమె  చదువులమ్మ వడిలో అక్షరాలు దిద్దుతున్నారు,)Wednesday, 20 June 2012

స్వప్న కెరటం
స్వప్న కెరటం

పాతజ్ఞాపకాలు  నను  తట్టి  లేపుతున్నాయి. మసకబారిన  మస్తిష్కంలో  నీ రూపురేఖలు  వత్తిగిల్లుతున్నాయి. 

కలల   దస్తావేజులు తిరగేస్తే  ఇంకో స్వప్నం  బాకీ ఉంది.

ఎప్పుడో  నిద్రలో ఉలిక్కి పడితే, నిస్థబ్దత  నుండి ఓ నిట్టుర్పుబైటకొస్తే, నా  నిదురరాని  కళ్ళకు  ఎదురుగా  ఓ  ఆకారం.

మెదడునరాలను  చిట్లగోడుతూ, గుండెగోడలను  కూల్చేస్తూ.., అదే  ఆకారం ... అదే అస్పష్టత. 

జ్ఞాపకం  విషాదంగా పరచుకుంటుంది, వలపు స్మృతి  పలవరింతల్లో  దాక్కుంటుంది.

నీ  తలపు   అపశ్రుతా? లేక  జాగ్రుతా? తెలియటం లేదే? వాడిపోదూ, వీడిపోదూ, ఉండిపోదు. 

ఉండి, ఉండీ  ఉరుములా  ఉలిక్కిపడే  మెరుపులా  నను కదిలిస్తూ  ఉంటుంది. 

ఒక్కోసారి  లోకమంతా  అబద్దమనీ, నా నీవే  నిజమనీ  మురుస్తాను. 

మరోసారి  నీవసలే  లేవనీ  ... నీ తలపే  అప్రమేయమనీ   వెరుస్తాను.

నాగుండె  కవాటాలు  తెరుచుకుని  రుధిరం  ప్రేమని  నింపుకుని  గమ్యం తెలీక శరీరమంతా  ఉప్పెనలా  ఉరుకుతుంటే,

నీ స్మృతులు  దాన్ని  అడ్డగించి,  మత్తెక్కించి, ముఖం  మీదికి  సిగ్గుసింగారంలా  అతికిస్తాయి.

ఆర్ద్రతతో  నేను  దరికిచేరబోతే  అందకుండా  దూరంగా, బింకంగా  ఉండిపోతావ్.

ప్రియా,   అపురూపమైన  నిన్నెలా  అందుకోనూ ... కానరాని  నిన్నెలా   చేరుకోనూ. 

ఏ లతాంగిలాలనలో ఉన్నావనుకోనా ఏ  సమాజపాలనలో  ఉన్నావనుకోనా. 

మెల్లగా  ఏదో  స్వప్నకెరటం  నను తాకుతుంది. నిను  జ్ఞాపకంగానే  నా దరి  చేరుస్తుంది.  అందుకే  ఈ వ్యదలేవీ  నీకు  అంటకుండా  నా ఎదలోపలే  దాచుకుంటా.

ఎన్నిజన్మలైనా  నిన్నే  తలచుకుంటూ  ఉంటా,  నీకై  వేచిఉంటా  ప్రారబ్ధపు  పందిరి కింద  ఆశలతీగనై  నిను అల్లుకుంటా. 


Wednesday, 13 June 2012

ఆ రాత్రి


ఆ రాత్రి 


అర్దరాత్రి  అయినట్లుంది,  "ఆమె ఎవరు" సినిమాలో లాగా దగ్గరగా ఊరకుక్కల అరుపులు, దూరంగా నక్కలు ఊళలు వినిపిస్తున్నాయి.  తమ  కడుపులు కాల్చిన  ఈ కాలనీవాసులు ఎలా   నిద్రపోతారో చూద్దాం  అనుకున్నాయి  కాబోలు.

చీకటి  చాలా భయంకరంగా ఉంది. చెట్లన్నీ   మత్తుగా  ఊగే  ఆడ  దయ్యాల్లా కనిపిస్తున్నాయి.  అభిలాష్  "శ్యాంగోపాల్  శర్మ"   భూతాల  సినిమా సెకండ్  షో చూసి  కాలనీలోకి  అడ్డదారిలో శ్మశానం మీదుగా వస్తున్నాడు.  ఉన్నట్లుండి  ఎదురుగా ఓ ఆకారం  కదిలినట్లూ,  తనను  దాటుకుంటూ  వెళ్ళి నట్లూ  అనిపించి, ఒక్కసారిగా  ఒళ్ళు  జల్లుమన్నది.  భయంపోగోట్టుకోనేందుకు  లేటెస్ట్  పాట ఒకటి  "కొలవరి, కొలవరి ..డీ ..,"   అందుకున్నాడు, అంతే ముందు వెళ్తున్న ఆకారం  ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి  చూసింది. 


తన   పాట  అంతగా నచ్చేసిందా, అనుకుని   హి, హి, అని నవ్వుకుంటూ  కొంచం దగ్గరికి  వెళ్ళాడు  మన  అభిలాష్ .  చెంద్రుడి  గుడ్డి వెన్నెల్లో కనిపించిన  ఆ  ఆకారం వో  అమ్మాయిది అని పోల్చుకోగలిగాడు. తెల్లటి బట్టల్లో  సన్నగా పొడుగ్గా  ఉంది. "హలో"   అన్నాడు  ఏదో పలకరించాలి  కనుక.  ఆమె గిరుక్కున   ముఖం  తిప్పుకుని  వడివడిగా  వెళ్ళసాగింది.  ఇంతకీ  ఈమె  ఎవరై  ఉంటుందీ? సినిమా చూసి  వెళ్తుందా?  అదీ  ఒక్కర్తి, వయసులో  ఉన్న అమ్మాయి. బహుశా గాంధీ  గారి  కలలు  నిజమయ్యాయా?  అస్సలు  మన కాలనీలో ఇలాంటి అమ్మాయిలే  లేరు, ఇలాంటి ఏంటి!  అస్సలు  అమ్మాయిలే  లేరు,  రోజూ సాయంకాలం  అలా షికారు  వెళ్తానా,  ప్రతిగుమ్మం  ముందూ ముగ్గుబుట్టలాంటి తలతో  ఓ ముసలమ్మ  ప్రత్యక్షం. తనని  చూస్తూనే  అబ్బీ  ... బైటకి  వెళ్తున్నావా?  తలనొప్పి  మాత్ర  తెచ్చిపెట్టు బాబూ,  మోకాళ్ళ నొప్పిమందు  తెచ్చిపెట్టు  నాయనా, ఇలా   లిస్టు  ఇస్తూ చిరాకు పెడతారు.

*   *   *
అరెరే...   ఆలోచనల్లో  ఆ అమ్మాయి   ఎటువెళ్లిందో  చూడలేదే,  కొంపదీసిగానీ తియ్యకుండాగానీ  ఆత్మహత్య  చేసుకునే  బాపతు  కాదుకదా? ఆ  ఆలోచన రావడం ఆలస్యం, ఒక్కసారిగా   పక్కనున్న పిల్ల కాలువవైపు పరుగెత్తాడు అభిలాష్. సందేహం లేదు ఆమె  అటుగానే  వెళ్ళింది.   అదిగో  ఆ కనిపించే వంతెనమీదికి  వెళ్తూ ఉంది  అనుకుంటూ  "హలో ..  మేడం" అంటూ అరిచాడు  అభిలాష్ .  "హాలో  మిమ్మల్నే"   ఈసారి  రెట్టించాడు. జవాబు ఇవ్వలేదు  ఆమె.  సరికదా  గబగబా  సగం కూలిపోయిన  వంతెన ఎక్కింది.  అభిలాష్ పరుగులాంటి నడకతో ఆమెను సమీపించాడు. ఆమె కాలువలో  దూకబోయింది  వెంటనే చేయి  పట్టుకుని ఆపబోయాడు.  ఆమె దూకటానికి ముందుకు వంగింది, తను  వెనక్కి లాగటానికి  ప్రయత్నిస్తున్నాడు,  ఆమె చాలా బలంగా   ఉంది,  అభిలాష్ తన శక్తినంతా  ఉపయోగించి  లాగుతున్నాడు.  ఈసారి రెండు   చేతులతో  లాగాడు,  ఆ ఫోర్సుకి   ఇద్దరూ  వెనక్కి పడిపోయారు.  కొంపదీసి వంతెన  కూడా కూలిందా అనుకున్నాడు అభిలాష్.

అయ్యో  ఆమె నా మీద పడింది  కదా... లేపుదామంటే  ఇంత బరువుగా ఉందేమిటి చెప్మా? .. పైగా  నా పేరే  పిలుస్తుంది  ఎలా తెలుసూ   అనుకున్నాడు అభిలాష్.  కానీ అంత చనువుగా  "ఒరే  అప్పిగా" అని పిలుస్తుంది అచ్చు  బామ్మ పిలిచినట్టుగా,  అయ్యో,  పిలిచినట్టుగా  ఏమిటి  బామ్మే.   అయితే  నా మీద ఉలవల బస్తాలా పడింది   బామ్మా??  ఆయితే   నేను లాగేసింది బామ్మ   పడుకున్న  మంచంకోడునా?.. ఇలా అనుకోగానే చచ్చే  సిగ్గేసింది అభిలాష్ కి.  ఇదంతా కలా ??   మొదలే  సిగ్గుతో చితికి  పోతుంటే  ఇక బామ్మగారి దండకం వినండి.  "ఆ  దిక్కుమాలిన దయ్యం  సినిమాలు   చూదోడ్డురా  అబ్బీ అంటే వింటావా, పగలంతా ఆ కుర్రకుంక  ఫోటాను తో కలిసి ఈతలపోటీలు, గేదె రేసింగులూ, రాత్రుళ్ళు పక్క తడపడాలూ"  నా నడుం విరిగి పొయిందిరో ..  దేవుడో, వెధవా వదులు  మంచం కోడు అంటూ తిట్లు లంకించుకుంది బామ్మ.

ఏమండీ  స్నేహితులూ...  మీరు  ఈ విషయం  ఎక్కడా  చెప్పకండీ  పాపం అబిలాష్, పెళ్లి కావాల్సిన  కుర్రాడు కదా  బాగుండదు.  ప్లీజ్ .., ప్లీజ్.
Sunday, 10 June 2012

అనుకోని అతిధి


వేకువనే  వలపు  తలుపు  తెరిస్తే  వెచ్చటి  కిరణంలా  అరుదెంచావు.

అతిధివి   అనుకుంటే  ఆత్మీయుడివి   అయిపొయ్యావు.

రేతిరి  చుక్కలపక్క  వేస్తే  చందమామలా   చేరువయ్యావు.

వేకువనే   వెళ్తావనుకుంటే   వెన్నంటే    ఉండి పొయ్యవు.

సాయం  సంధ్యలొ  చల్లగాలికి   కూర్చుంటే,  పిల్ల తెమ్మెరవై   ప్రవేశించావు.

అంధకారానికి   అద్రుశ్యమౌతావనుకుంటే   అల్లరిగా   అల్లుకుపోయావు.

పగటివెలుగులో  పాడియార్ది నై   ఉంటే    మిత్రునిలా  పక్కనచేరావు.

సాయంకాలం సాగనంపుదామంటే సందు చూసుకుని   సహచరుడివైపోయావు.

జామురాతిరి  జ్ఞాపకాలపుటలు    తిరగేస్తుంటే   కళ్ళుమూసి  కలలోకోచ్చావు.

వెలుగు   వస్తూనే  వెళ్ళిపోతావు  అనుకుంటే   వెక్కిరించి   నావెనుక  నక్కావు.

ఒంటరితనం   వెన్నంటేఉంటే    పొన్నచెట్టు   నీడలో   సేదతీరుతుంటే, 

కనులుమూసి  అధరాలపై   ముద్ర వేసావు.   
ఉలిక్కిపడిన   నాతో కలతపడకు    కలకాలం     తోడుంటాను    అన్నావు.

నిన్నేమని    అనుకోను   మరుభూమిలో   మల్లితీగవు   అనుకోనా?

ఎడారిలో   నీటి తేటవి    అనుకోనా,   అంతరాన  ఉన్న  అతిదివి  అనుకోనా?


Friday, 8 June 2012

మె(మి)సేజ్
లంచ్  అవర్లో  నేను  సిగరెట్  కాలుస్తూ  కారిడార్లో  పచార్లు  చేస్తున్నా, మా సెక్షన్  నుండి చిన్నగా పాట వినిపిస్తుంది. "దేహమును ప్రేమించుమన్నా.. లంచ్ అన్నది లాగించుమన్నా" మా డిస్పాచ్ క్లర్కు గురుమూర్తి  గొంతులో సొంత బాణీ లో రూపుదిద్దు  కున్న  పాట అది.

మా సెక్షన్ లో పెళ్లి  కానిది గురుమూర్తి ఒక్కనికే, దేహాన్ని ఇష్టంగా పెంచుకుంటూ, ఆకలి లేకున్నా తింటూ, అమిరికా  ప్రసిడెంటు  బుష్  లాంటి వారి కళ్ళలో  పడి దేశానికీ  చెడ్డపేరు తేవటం  ఇష్టం లేక  ఒక్కడే  రూమ్  లో కూర్చుని  లాగించేస్తూ ఉంటాడు.


అసలు చీకూ చింతా  ఈ గురుడికి ఉండవా అనుకుంటారు  అందరూ.  కానీ  ఇతన్ని కూడా ఓ చింత  చింపి వేస్తూ ఉందట ఈ మద్య, అదేమిటంటే పెళ్లి చేసుకుందామంటే  పిల్ల దొరక్క  పోవటం. పెళ్లి చూపుల్లో ఇతగాడు  లాగించే  పలహారాల    ఖర్చు   పెళ్లి     ఖర్చుని    మించి    పోతుందని    ఆడపిల్లల  తండ్రుల  గుండెలు  లబ్బో  డబ్బో   అంటున్నాయట.   ఇతను   తింటున్న  పలహారాల   పళ్ళెం   లాగేసుకుని  ఇతన్ని   ఇంటిబైటకి   తోసేస్తున్నారట అదీ  ఇతన్ని చింపేసే  సమస్య.

*   *   *

ఈ మద్య మా గురుమూర్తి  ముసి ముసిగా నవ్వుకుంటూ  మరుగుదొడ్ల  పక్కనా, డస్ట్ బిన్నుల  వెనుకా  నక్కి  సెల్లు లోకి చూసుకుంటూ  దర్శనం  ఇస్తున్నాడు.  ఇంతకీ కథ  ఏమిటని  నిలదీస్తే  మెలికలు  తిరిగాడు . 

చక్కగా సాగదీసి  నిగ్గదీసి అడిగితే  "మిస్సేజి "  అన్నాడు సిగ్గుపడిపోతూ.  అదీ ఓ అమ్మాయి  నుండి వచ్చిందట. ఇంకేముందీ  గురుడు ఇక్కడ నిల్లు  సెల్లులో  ఫిల్లు. గురుమూర్తి  అన్ని పనులూ మానేశాడు .ఎప్పుడు చూసినా  సెల్లు లోకి   సొల్లు కారుస్తూ  ఏ  మూలనో  నక్కి ఉంటున్నాడు.
                             
*   *    *

ఓ  రోజు  మా ఆఫీసు  క్యాంటీన్లో  కాఫీ  తాగుదామని  వెళ్లి కూర్చున్నాను.  కాసేపటికి  కొందరు ఆడవాళ్ళు హోం గార్డ్స్    అనుకుంటా బిల బిల  మంటూ వచ్చి నావెనుక  కుర్చీలలో  కూర్చున్నారు. వీరంతానాతో ఏదో సందర్భంలో ఎప్పుడో ఓ సారి  మాట్లాడిన వారే. వారిలో  సన్నగా ఉన్నావిడ గట్టిగా  నవ్వుతూ  "ఓయ్  గజనీ ఇక ఆపవే  తల్లీ   ఆ సెల్లు గోల  ముందు కాఫీ తాగు  అన్నది.  సెల్లు పట్టుకున్న  గజినీ   టేబుల్ మీద గట్టిగా బాదుతూ గలగలా  నవ్వింది. నవ్వులా..అవి కావు ..ఇనుపగోళాలు  అన్నట్లుగా  ఇనుపగోళాలను  తలపై దొర్లించినట్లుగా  ఉంది ఆ నవ్వు.   సభ్యత  కాకున్నా వెనక్కి తిరిగి చూసాను,  ఖాకీ పాంటు, ఖాకిషర్టు  టక్చేసుకుని నడుముకి  ఓ చున్ని  కట్టుకుని,  చేతికి సిల్వర్ కడియం, టోపికింద  చిన్న ముడి, ఏ  యాంగిల్లో  చూసినా  ఆడలక్షణాలే  కనిపించటం లేదు.

మళ్ళి  సేల్లులోకి  చూసి  గట్టిగా  నవ్వుతూ.. " ఏయ్  గోమతీ  నీ వెయిట్  ఎంతని అడిగాడే మెసేజిలో" అన్నది.  " ఊ .. ఓ నలబై  అని ఇచ్చెయ్యి  అని సలహా  ఇచ్చింది  గోమతి" మరీ  సగానికంటే   తక్కువ  చెప్తే బాగుండదేమో    సందేహం వెలిబుచ్చింది గజనీ. " పోనిద్దూ  తనివ్వలేదా  సిక్సుపాక్  గాడిననీ ".. చురక  అంటించింది  గోమతి.

మళ్ళీ  అందరూ  గొల్లున  నవ్వారు. సిక్సు  ప్యాక్  అట   ఈ మద్య   ప్రతిఒక్కడికీ  అలా చెప్పుకోవటం  ప్యాషను  అయిపొయింది.  ప్యామిలీ ప్యాక్ లా  ఉంటాడు. అన్నది గోమతి  మళ్ళి  అందరూ  గొల్లున  నవ్వారు.

"ఏయ్   మీకు తెలుసా  ఇది  దీని పేరు గజనీ అని చెప్పకుండా  ఘజల్  అని చెప్పింది,  ఇక గురుడు  గురుమూర్తి అని చెప్పకుండా  గౌరవ్  అని చెప్పాడట" వారిలో ఒకావిడ  నవ్వుతూ  చెప్పింది. వింటున్న  నాకు ఒక్కసారిగా  షాక్  తగిలినట్లు   అనిపించింది. అయితే  వీళ్ళు  ఇప్పటివరకూ  మాట్లాడుకున్నది  మా గురుమూర్తి  గురించా, పాపం  ఎంత మురిసి  పోతున్నాడో  ఆ మెసేజీలు  చూసుకుని.

"పోనీ  నిజం   చెప్పేద్దామా".. జాలిగా  అన్నది గోమతి.  నాకూ  అదే  మంచిది అనిపించింది.  " నోర్ముయ్యి  వంద  మేస్సేజిలు   అబద్దమైనవైనా  సృష్టించి  ఓ  జంటను  కలపాలి"  గద్దించింది  మరో ఆవిడ.  "ఏయ్  ఎలాగో మమ్మలని  కలపండే  మా పెళ్ళిలో  మీ అందరికీ  సెల్లు ఫోనులు  కానుకగా ఇస్తాము." ప్రాదేయపడింది   ఘజల్. "లేకుంటే  జీవితాంతం  ఇలా  మేస్సేజులు  ఇచ్చుకుంటూ  పోతే   జీవితాన్నేమిస్సయి  పోతానే తల్లీ "మళ్ళీప్రాదేయ పడింది   ఘజల్, గురుమూర్తి  ఊహించే ఘజల్ కి    ఈ    గజానికీ  పోలికే  లేదు.  ఇకపోతే  వాడూ  కొంత అబద్దం చెప్పాడు  కనుక  దేవుడు  వీళ్ళ ఇద్దరినీ  మన్నించి  వీడి మేస్సేజులు  మిస్ యూజు   కాకుండా, ఈ మిస్ గారు మిస్  కాకుండా  శుభమే  జరగాలని  ఆశిద్దాం.

                                         * * *
        

Tuesday, 5 June 2012

నాణేనికి ఆవలి జీవితంనాణేనికి ఆవలి జీవితం

బ్రతుకు చట్రంలో ఇరుక్కున్న జీవితం.

రంగుటద్దాలలో  అందంగా అగుపించే జీవితం. 

గుండెసెగలకే  మండిపోతున్న జీవితం.

కంటిపాపపై  నెత్తురు గడ్డలా  ఉన్న జీవితం.

మృత్యుఘోషలో  రహస్య రోదన లాంటి జీవితం. 

అమాయకత్వాన్ని అణగదొక్కే  జీవితం.

ఆత్మగౌరవాన్ని  అమ్మకానికి పెట్టిన  జీవితం.

వ్యామోహాన్ని వ్యాపారంగా చేస్తున్న  జీవితం.

అన్వేషణలలో   అంతమవుతున్న  జీవితం. 

అసహనాలతో  విసుగెత్తుతున్న  జీవితం.

అపనమ్మకాలతో  అలకపాన్పునెక్కిన జీవితం.

ఆయువులో సగం అమ్ముకున్న  జీవితం.

ఆదర్శాలకోసం  సగం అర్పించుకున్న జీవితం.

ఎంగిలి కూటికోసం  అంగలార్చే  జీవితం.

అభద్రతా భావనతో  అలసిపోయిన జీవితం.

నూరేళ్ళు  నిండక ముందే  ముగుస్తున్న జీవితం 

వెలుగు నీడల హెచ్చు ,తగ్గుల  గానుగెద్దు  జీవితం.

అక్కరకురాని వెక్కిరించే దిక్కుమాలిన జీవితం.Sunday, 3 June 2012

గ్రీన్ సిగ్నల్అమ్మమ్మగారి ఊరు వెళ్ళాలంటే మా పిల్లలకి చాలా సరదా, ముఖ్యంగా మా ఆవిడకి మరీ ఇష్టం. నాకెమో మహా చిరాకు. కానీ తప్పదుకదా. నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు మా అత్తగారిది. మేమెక్కిన బస్సు మిట్టమధ్యాన్నం మండుటెండలో ఓ అడవిలాంటి ప్రదెశంలొ మమ్మల్ని దింపి, మీ చావు మీరు చావండి అన్నట్లు వెళ్ళింది. ఓ నలభై యాభై లగేజీ బ్యాగుల్తొ రోడ్డు పక్కనే కూర్చున్నాం. ఎర్రటెండలో ఎర్ర చీమల్లా మాడిపొతున్నరు పిల్లలిద్దరూ. ఇక్కడికి ఓ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మేం వెళ్ళాల్సిన ఊరు. అక్కడికి బస్వెళ్ళదు. ఈ మధ్య కొత్తగా ఓ జట్కా బండి ఉందని తెలిసి దానికొసం ఎదురు చూస్తున్నాం. ఇంతలొ మా చిన్నాడు దాహం వేస్తుందని నానా గొల చేస్తూ సామాన్ల మధ్య కుప్పిగంతులు వేస్తున్నాడు.

* * *
హమ్మయ్య, మమ్మల్ని రక్షించటానికా అన్నట్లు దూరంగా జట్కా బండి వస్తూ కనిపించింది. దగ్గరయ్యేకొద్దీ అది కదులుతున్న పూల రథంలా ఉంది.రంగు రంగు పూలతొ అలంకరించి దాని మీద రెండు పెట్రొమాక్సు లైట్లు పెట్టి ఉన్నాయి. గుర్రానికి ముఖమ్మీద ఓ కుచ్చు అందంగా వేలాడుతూ ఉంది. బండి లోపల మెత్తటి పరుపులూ వగైరా రాచమర్యాదలని తలపిస్తున్నాయి. మేము పిల్లలూ ఎక్కికూర్చున్నాము, బండి బయలు దేరింది. మా పిల్లలు అడిగే ప్రశ్నలకు బండి సాయిబు వచ్చీ రాని తెలుగులో సమాదానాలు ఇస్తున్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళామో లేదో బండి ఆగిపోయింది. గుర్రం ఓ అడుగు కూడా ముందుకు వెయ్యలేదు చల్,,చల్ అన్నాడు బండి సాయిబు, అస్సలు కదలనని మొండికేసింది గుర్రం. సాయిబు గారు గుర్రం ముందుకెళ్ళి చేతులూ, కాళ్ళూ కదిలిస్తూ hip hop, salsaa లాంటి డాన్సు ఫార్మ్స్ అన్నీ కలిపి డాన్స్ చేసాడు, అప్పుడు కదిలిందా అశ్వరాజం. చెప్పొద్దూ నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇక మా పిల్లలు సరే సరి,, ఒకటే కేరింతలూ, కుప్పిగంతులూ, కబుర్లూ. ఇలా ఓ ఫర్లాంగ్ వెళ్ళామో లేదో మళ్లీ మొండికేసింది గుర్రం ఈసారి సాయిబుగారు ఎన్ని కుప్పిగంతులేసినా చెల్లలేదు, ముసలి హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడనట్లుగా సాయిబు డాన్సు బోరు కొట్టిందేమో మరి, మూతి బిగించుకుని నా ముఖం నా యిష్టం అన్నట్లుగా పెట్టింది గుర్రం. సాయిబు గారికి ఐడియా బల్బు వెలిగినట్లుంది బుర్రలో అంతే .. రంగం లోకి కుర్ర హీరోలను దించాడు, ఇంకేవరనుకున్నారూ,, మా పుత్ర రత్నాలు. ఇక చూడండీ స్టెప్పులతో ఇరగదీసారు నాకు నవ్వు ఆగలేదు. వాళ్ళని చూస్తుంటే ఎండలో ఎగిరెగిరి పడే కప్పపిల్లల్లా ఉన్నారు నా కళ్ళకు. అప్పుడు గుర్రం కదిలింది "హమ్మయ్య" అనుకున్నాం. అలసిపోయిన పిల్లలు నిద్రకు ఒదిగారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..... సాయిబుది, గుర్రానిదీ హైదరాబాదు. ఆ గుర్రం పెళ్లి బారాతుల్లో (పెళ్లి ఊరేగింపు) పెళ్ళికొడుకును ఊరేగించేందుకు ఉపయోగించేది. అలా బాజా భజంత్రీలకీ స్టెప్పులకీ అలవాటు పడిందట.... అందుకే ..... అలా మధ్యలో ఆగిపోతుందట ఎలాంటి కార్యక్రమం లేనప్పుడు. ఇదంతా మా మరదలు చెప్పినప్పుడు కొంత సిగ్గనిపించింది. అయినా హాయిగా నవ్వేసుకున్నాం.


       

Friday, 1 June 2012

వీలునామావీలునామా

మూటలు మోసి  మూర  మల్లెలు  తెచ్చేవోడివి, ముద్దబంతిలా  ఉన్నావంటూ   ముద్దు చేసేవోడివి.

కట్టెలు కొట్టి, కడుపు కట్టుకొని కమ్మలు తెచ్చావు, కడుపుతో ఉన్న నను చూసి  మురిసిపోయావు. 

నీ కళ్ళు  నేనైతే  నా కలవి నువ్వూ, నీ ప్రాణం  నేనైతే  నా ప్రణయం నీవూ,

వెన్నెల కురుస్తున్న  మన జీవన బృందావనంలోకి   వేదన  వేటగాడిలా   వచ్చింది.
.
అమ్మనవుతున్న  నేను  ఆసుపత్రిని  ఆశ్రయించాను, అయ్యవవుతున్న నీవూ  ఆదుర్దా పడ్డావు.

నాకోసం నీవు   యంత్రంలా, క్షణ క్షణం  అనుక్షణం   పరుగులెత్తావు   పాటుపడినావు.                                  

పందికొక్కుల,  రాబందుల   సంతానమైన ఆసుపత్రి  బృందాల  చిల్లు  జేబు  నింపాలని  చూశావు                                 


వైద్య పరిశోధనలకోసం   ఈ  జలగలకి చిక్కావు, కాయాన్ని  వీరి  ధనాకలికి  దానం చేసావు.

బొంగరంలా .. నా  చుట్టూ  తిరిగే  నా  బంగారు  మావా ... నా కోసం  అనాద  శవం  అయ్యావా?

నా కోసం  ప్రాకులాడే  నిన్ను ముందుగా పంపేసారు ఈ దయ లేని  దూర్తులు.

మావా .. నా కళ్ళు  కలువ పూలు అనేవోడివి  కదా , వాటికి  విలువ  కడుతున్నారు.

ఈ మానవ  మాంసపు  కబేళాలో     వేలం   వెయ్యబడుతున్నాయి   నా   కళ్ళు.

ఈ కసాయి  వైద్యుల  కత్తులు   నా కుత్తుక  మీద  సవారీ చేస్తున్నాయి.

 రోగం (?)  ముదిరినాక  వచ్చామనీ  ఏది ఏమైనా  మేమే  భాద్యులమనీ  ఏలు ముద్రతో  వీలునామా  ఇచ్చామట.

అదే  ముద్దర   ఏస్తున్నారు  మన   ఆనాద  శవాలకు   మూకుమ్మడి  రాబందుల్లా,ఈ  ధన్వంతరి వారసులు .

ఆర్డరు  పాసయి పోయింది  ఆనాద అందురాలైన   నా సమక్షంలో, అక్షరాలా  లక్షల  సాక్షిగా. 

ఆసుపత్రులోద్దని   అరద్దామంటే..  అయిసులో  పెట్టి  చల్లగా  నా ముక్కుమూసారే  ఈ  కర్కోటకులూ ..