Pages

Sunday, 24 June 2012

అతుకు అక్షరంఅతుకు  అక్షరం

చిన్నప్పుడు  కాన్వెంటులో  చేరినప్పుడు  ఎంత ఆనందమో .

అక్క ఆకుచేప్పులతో    ప్రభుత్వబడికి   పోతుంటే, నేను కొత్తబూట్లు  టక టక  లాడించే వాడిని.

అక్క  కాలినడకన  వెళ్తుంటే, స్కూలుబస్సేక్కి  స్టైలుగా   టాటా  చెప్పేవాడిని.

నన్ను  కాన్వెంటుకి   పంపటానికి  మా జోడెద్దులు  అమ్ముడుపోయాయి.

నన్ను కే. జీ లు  దాటించడానికి  అమ్మ కమ్మలు కుదవపోయాయి .

హస్తరేఖలు   డాక్టరు  అవుతాయని  చెప్పాయని  అక్క నమ్మకం,

నన్ను స్కూలు ఫైనలు దాటించటానికి  అక్క రోజుకూలీ   అయింది.

గొప్ప మార్కులతో  పాసైనా  నాకోసం  ఏ  కళాశాల   గేటూ  తెరుచుకోలేదు.

అక్కడితో  మలుపు తిరిగింది  నా  జీవన దారి,  ఆశయాల  సౌధాల నుండి ఆశల సాకారంలోకి.

బ్రతుకు బడిలో భర్తీ  అయ్యాను, ఆయువును  రుసుముగా కట్టేస్తూ, జీవిత పాఠాలు చదివేస్తూ,
కాలమనే  కాగితంపై   కాయమనే కలాన్ని కదిలిస్తూ,  బాధల  గేయాలు రాస్తున్నా.


ఏమి చేయను  ఆనందంగా ఉన్నానని అబద్ధం రాద్దామంటే, అక్షరాలన్నీ ధిక్కరించి నిజాన్నే నింపుతున్నాయి.

మీకు  తెలుసా ఈ వేదనలూ,   వెతలూ  ఎంత  చెరిపినా ఎగిరివచ్చి  ముఖచిత్రం గా ముచ్చటిస్తున్నాయి .

బతుకు పుస్తకానికి అతుకు పడుతుంది, అతికేకొద్దీ  కష్టాల చెదలు చుట్టుకుంటున్నాయి. 

(ఈ బతుకు బడిలో  పెరిగి పెద్దవారై   అయ్యవారులైన.. ఎందరో  బుడి బుడి  అడుగులలోనే బలురక్కసి  పొదల బాటన నడిచిన వారే   అందరి వేదనా ఆవేదనా ఇది.  అతి కొద్ది మంది మాత్రమె  చదువులమ్మ వడిలో అక్షరాలు దిద్దుతున్నారు,)40 comments:

 1. ఫాతిమా గారు ,
  చాలా చక్కగా ఆవిష్కరించారు....చాలా బాగుందండీ..!!


  ఏమి చేయను ఆనందంగా ఉన్నానని అబద్ధం రాద్దామంటే, అక్షరాలన్నీ ధిక్కరించి నిజాన్నే నింపుతున్నాయి.

  ఇంకా బాగుందిది...!! :) :)

  (జీవిత పాఠాలు ఏమో ఒక్కసారి ఎమీ అనుకోకుండా చూసుకొరూ.....!!)

  ReplyDelete
  Replies
  1. సీతగారూ, కవిత నచ్చినందుకు, ధన్యవాదాలు. మీరన్నట్లుగానీ అచ్చుతప్పును సవరించాను. మరోమారు థాంక్స్.

   Delete
 2. చదువు వ్యాపారమయిపోయి సామాన్యుని బతుకు ఛిద్రమయిపోయింది. చాలా బాగా అవిష్కరించారు.

  ReplyDelete
  Replies
  1. సర్, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లే చదువు వ్యాపారమైనది.

   Delete
 3. Replies
  1. naa kavitha nachhina meeku , naaa blog darshinchina meeku dhanyavaadaalu

   Delete
 4. అక్షరం విలువ దానికోసం పోరాడిన వాడికిమాత్రమే తెలిసిన రహస్యము.ఆర్ధిక సంకెళ్ళ వలయములో ఎందరో చిక్కుకొని విలవిలాడుతున్నారు అది విద్య బోధనకు దగ్గరగా వున్న మీలాంటి వారికి ఎక్కువ అవకాశము.
  అన్ని వృత్తి ల కన్నా ఉపాధ్యవృత్తి చాల ఉన్నతమయినదని నా అభిప్రాయము కారణము మిగతావన్ని వస్తువులను,వృత్తులులను తయారు చేస్తే ఉపాధ్యలు మాత్రము వాటికి అవసరమయిన జ్ఞానం అందించే బాద్యత చేస్తారు.ఒక సాధారణమయిన పిల్లవాడిని మహోన్నతంయిన పౌరుడు గా తీర్చి దిద్దుతాడు.ఇది 40 years ఉపాధ్య వృత్తిలో మానాన్నగారు ఆచరణ లో చేసినది తద్వారా మాకో ముద్ద,ఇంత అక్షరం నేర్పినది.ఉపాధ్య వృత్తిలో వున్న మీకు నా నమస్కారములు.

  ReplyDelete
  Replies
  1. రమేష్ గారూ, పండిత పుత్రులైన మీరు అదృష్టవంతులు. ఇకపోతే నా ఆవేదన అక్షర రూపమే కాదు ఆచరణ రూపం కూడా, తెలివి ఉండి చదువుకోలేని పిల్లలను, డబ్బు ఉండి చదువు మీద ఆశక్తి లేని పిల్లలను పోల్చి చూసి ఆవేదన చెందుతాను. ఏమో చేయాలని తపన, నా శేక్తికి మించిపోయినపుడు భరించలేని వేదన ఇలా కవితగా వెలువడుతుంది. నా బ్లగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.

   Delete
 5. సర్వ శిక్షా అబియాన్ పేరుతొ
  కోట్ల రూపాయలు స్వాహా అవుతున్నాయి తప్ప
  అందరికీ విద్య అనే నినాదం నెమ్మదిగా నిశ్శబ్దంలో కలిసిపోతోంది...
  చదువుకొనే స్థితిలో పుట్టిన మనం నేడు చదువు"కొనే" స్థితిని చూస్తున్నాము..
  ఏమంటారు ఫాతిమా గారూ!
  ఒక ఉపాధ్యాయినిగా మీ ఆవేదనకి
  అద్దం పడుతోంది మీ కలం నుంచి
  జాలువారిన మరో చక్కని కవిత....
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. నమస్కారం శ్రీ గారు,
   వాస్తవాన్ని చక్కగా చెప్పారు

   Delete
  2. శ్రీ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. అర్ధవంతమైన మీ వ్యాఖ్య ఎంతో ఆలోచింప చేస్తుంది. నా ప్రతి కవితను చదివి ప్రోత్సహించే మీకు కృతజ్ఞతలు.

   Delete
 6. ఎంత బాగా రాశారంటే
  కొడుకును MBA చేయించడానికి అప్పుచేసి ఆ అప్పుతీర్చలేక ఆ కొడుకుతో పాటు కుటుంబం(అనారోగ్యం లో తండ్రి,కూలి చేసే తల్లి చెల్లి) మొత్తం ఆత్మహత్య చేసుకుందామనే పరిస్తితిలో వున్న ఓ కుటుంబం తో కలిశాను ఓ సారి.
  ఆ బాధ ఈరోజు ఈ కవిత్వం లో కనిపించింది.........

  ReplyDelete
  Replies
  1. అఫ్రోజ్ గారూ,బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు. మీకు జరిగిన అనుభవం పంచుకునందుకు మరో మారు ధన్యవాదాలు.

   Delete
 7. మీ ఆవేదన అర్థం చేసుకున్నాము.బాగా వ్రాసారు.

  ReplyDelete
  Replies
  1. శంకర్ గారూ, , కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 8. చాలా బాగా రాసారండీ!

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 9. అక్షరం అక్షరం ఆవేదనగా.
  చాలా బాగా ఆవిష్కరించారు.
  ఇలాటి పరిస్థితుల పట్ల..:( :(

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, నా ప్రతి కవితకు మీ ప్రోత్సాహం ఉంది, కృతజ్ఞతలు.

   Delete
 10. సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు
  చేతి నిండ రియలెస్టేటు వల్ల
  పర్యవేక్షకులకు పట్టదు పనితీరు
  విద్యానిధులు బొక్కు విధుల వల్ల
  పాఠశాలల బాగు పట్టదు నేతకు
  కార్పొరేటు బడుల కలిమి వల్ల
  బిడ్డల చదువులు పెద్దవారెరుగరు
  జీవన పోరాట స్థితుల వల్ల

  వెరసి - గ్రామీణ బడులలో వెలయు చదువు
  చిత్తశుధ్ధికి దూరమై చిత్రమైన
  తీరు తెన్నుల భాసించు తీరు చూడ
  చదువు మృగ్యము సర్కారు ‘సాగు’ బడుల .

  కొడుకు జదివించు కొనుటకు కూలి చేయు
  తల్లికి తనయ చేదోడు తప్పదయ్యె
  చదువు సర్కారు బడులలో చక్కనైన
  కార్పొ’ రేటు ’ బడుల కేగు కర్మ తొలగు .
  ----- సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. మాస్టారూ ,అక్షరాల బడినే కాక అనుభవాల బడిని చూసిన అయ్యవారు తమరు, నేను పడే ఆవేదనను అర్ధం చేసుకోగలరని మీరు రాసిన వ్యాఖ్య చెప్తుంది. ధన్యమైనది నా కవిత.

   Delete
 11. school ki vellagane chaduvvu kavithalu vachesayandi, bhagundi.

  ReplyDelete
  Replies
  1. sir nijame meeru annadi kaani entha happy gaa unna o prakka ee vadana untundi, manalannti kavulaku.

   Delete
 12. ఫాతిమా గారూ!
  ఒక ఉపాధ్యాయినిగా మీ ఆవేదన చాల బాగా రాసారు.

  ReplyDelete
  Replies
  1. ఫల్గుణి గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 13. చదువుకునే స్టేజికి నుంచి చదువు'కొనే' స్టేజికి వచ్చాము... మా అన్న కొడుకుని స్కూల్ లో జాయిన్ చేశారు వాడికి స్కూల్ అలవాటు కావలి జాయిన్ చేస్తే... వాడికి 10k పీజ్... దారుణం అయిపొయింది... ఎక్కడ చూసినా దోసుకోనేవాడే...

  ReplyDelete
  Replies
  1. ప్రిన్స్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, చదువు కొనగలిగే వారికే అర్హత ఉంది కళాశాలలో అడుగు పెట్టటం ఇది మనదౌర్భాగ్యం. మీకు మరో మారు థాంక్స్.

   Delete
 14. బ్రతుకు బడిలో భర్తీ అయ్యాను, ఆయువును రుసుముగా కట్టేస్తూ, జీవిత పాఠాలు చదివేస్తూ,
  కాలమనే కాగితంపై కాయమనే కలాన్ని కదిలిస్తూ,బాధల గేయాలు రాస్తున్నా.
  ఏమి చేయను ఆనందంగా ఉన్నానని అబద్ధం రాద్దామంటే, అక్షరాలన్నీ ధిక్కరించి నిజాన్నే నింపుతున్నాయి.
  మీకు తెలుసా ఈ వేదనలూ, వెతలూ ఎంత చెరిపినా ఎగిరివచ్చి ముఖచిత్రం గా ముచ్చటిస్తున్నాయి.
  touching lines madam...claps!

  ReplyDelete
  Replies
  1. పద్మగారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, హ్రిదయానికి హత్తుకునేలా రాయటం మీ తర్వాతనే కదా ఎవరైనా. మీ ఆత్మీయ ఆగమనానికి థాంక్స్.

   Delete
 15. చాలా బాగుంది ఫాతిమా గారు.

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 16. ఈ అక్షరాల అతుకులకు తడినద్ది హృద్యంగామలచిన మీకు అభినందనలు ఫాతిమాజీ...

  ReplyDelete
 17. వర్మాజీ , ధన్యవాదాలు కవిత నచ్చినందుకు.

  ReplyDelete
 18. ఫాతిమ గారూ,
  "బ్రతుకు బడిలో భర్తీ అయ్యాను, ఆయువును రుసుముగా కట్టేస్తూ, జీవిత పాఠాలు చదివేస్తూ, కాలమనే కాగితంపై కాయమనే కలాన్ని కదిలిస్తూ...", కదిలించేశారు ఎన్నో ఆశలతో ఉన్నవన్నీ అమ్మి చదివుకునీ పై చదువులకి వెళ్ళలేక ఇలా ఆక్రోశించే హృదయాల దయనీయత అంతా "బతుకు పుస్తకానికి అతుకు పడుతుంది, అతికేకొద్దీ కష్టాల చెదలు చుట్టుకుంటున్నాయి..." ఈ ఒక్కవాక్యంలో చాలా గొప్పగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. సర్, ధన్యవాదాలు కవిత నచ్చినందుకు. అన్నానికీ అక్షరానికీ నోచుకోని బ్రతుకులు ఎన్నో, అవకాశం తెలివి తేటలకు కాక నోట్ల కట్టలకు దొరకటం దౌర్భాగ్యం.

   Delete
 19. చదివించడంలో ఆడపిల్లలను వెనక్కి నెట్టి మగ పిల్లలని బాగా చదివించాలి
  అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. వారిలో ఆ భావం పోనంతవరకు
  మనల్ని మనం అక్షరాస్యులుగా భావించలేము.
  చక్కటి కవిత! సున్నితంగా చెప్పారు! బాగుంది!

  ReplyDelete
  Replies
  1. శ్రీ సర్, మీరన్నది అక్షరాలా నిజం. ఆడపిల్లలను వెనక్కి నెట్టటమే కాదు, మగపిల్లల చదువుకు ఆడపిల్లలు కూలి చేస్తున్నారు, ఇదే కారణం నేను ఆడపిల్లలకు ఫ్రీఎడుకేషన్ నా స్కూల్లో ఇవ్వడానికి కారణం. మీరన్నట్లు మనమింకా మనల్ని మనం అక్షరాస్యులుగా భావించరాదు. కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
  2. సర్, ఆంధ్రభూమి జన్మదిన సంచికలో మీ అభిప్రాయం శీర్షిక చూసాను, కంగ్రాట్స్.నవ్య"మెయిన్..టీన్ " యువతకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మంచి విషయాలు ప్రస్తావించారు.

   Delete