Pages

Saturday 29 March 2014

ఎలా చెప్పను?

   



   ఎలా చెప్పను?

    అందమైన  భావాలన్నీ మదిని, 
    ఆలింగనం చేసుకున్నాయనీ, 
    ఎంత  దాచినా వదనంపై  విరులలా, 
    విచ్చుకుంటున్నాయనీ....ఎలా చెప్పను?

    చిరు కదలికకే   కాలి అందియ  
    నా ఉనికి  తెలియచేస్తుందనీ, 
    వెనుక ఉన్న వాలుజడ,  
    వీపుపై  దరువు వేస్తుందనీ....ఎలా చెప్పను?


    పొగ మంచులో ఎగసిపడే వలపు వేడిమి 
    ఎద లోపల ఘనీభవిస్తుందని 
    మధుర స్వప్నాల మూట విప్పితే 
    నిదుర చెడకొట్టి  ఎగిరిపోతున్నాయని...ఎలా చెప్పను?  


    వెన్నెల వెండి పాత్రలో నీ చెలిమి, 
    వెన్నముద్దలా మురిపిస్తుందనీ.., 
    పూల రెక్కల స్పర్సలా తేనేచుక్కల రుచిలా, 
    నీ ప్రేమ పులకింతలు పెడుతుందనీ .... ఎలా చెప్పను? 


    లోతుకు పాతుకుపోయే నీ చూపులకు, 
    హృదయ ఫలకంపై  నీచిత్రమే  ఉందనీ,
    నిన్ను కలిసే ఈ క్షణం కోసం, 
    మనసు మయూరమై నర్తిస్తుందనీ.... ఎలా చెప్పను? 


    గాలివాటుని... తేనే  ఊటనీ,  
    ఆస్వాదించే మిళిందానికి,  
    స్నేహ బాటని...వలపు తోటని చేరమని.... ఎలా పిలువను? 

    మదికీ... మస్తిష్కానికీ సామ్యం కుదరక,
    వేదనకు... రోదనకు పొంతన లేదని.... నిన్నెలా మరువను?
     
    

Friday 28 March 2014

మరీచిక



    మరీచిక

    ఎక్కడో చూసిన జ్ఞాపకం
    ఎప్పుడో కలసిన వైనం

    తలపుల  తలుపు తెరిస్తే  నీవే ప్రత్యక్షం 
    గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం

    గుండె లోతుల్లో నీ తలపు మధురిమ 
    హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ                                                                                    

    నా ఊహల్లో విహరిస్తున్తావు
    నా ఊపిరిలో సంచరిస్తుంటావు 

    తలపుల తలుపు తడతావు
    గుండె గుడిగంటలు కోడతావు

    చెలికాడనే అంటావు చెంత చేరవు
    జతకాడనే అంటావు జాడ చూపవు

    మరిచిపోఇనవే  గుర్తు చేస్తావు
    మరుగున పడినవి చర్చిస్తావు

    విలుకానిలా వేటాడతావు    
    చెలికానిలా మాటాడతావు

    ఎదలోనే ఉన్నాను వెతుకు అన్నావు 
    మదిలోనే ఉన్నాను బ్రతుకు అన్నావు

    పగలంతా నా అడుగులకు తడబాటువై
    రేయంతా నా పలవరింతల అలవాటువై

    దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
    వాకిట్లో నీడలా పారిపోతావు

    కోకిలా అన్నావా   అనే ఉంటావు
    కోవెలలో వున్నావా వుండే ఉంటావు 

    వీడని నా పెదవినీ ముడివడిన నా భ్రుకుటినీ 
    కరువడిన నా భాషనీ మరుగడిన నా ధ్యాసనీ పరిహసిస్తావు 

    జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నై   
    కొన్ని కలలా కొన్ని కన్నీళ్ళలా 

    ఎద సోదలలో సన్నని మెలిక
    మది కథలలో చీకటి కదలిక

             తెలిసింది.  
             నీవు గత జన్మస్మృతివి
             మరోజన్మకు శ్రుతివి 
             ఈ జన్మకు మదినిండిన "మరీచికవి".
         

Thursday 27 March 2014

కొత్త మలుపుకై

     


    కొత్త మలుపుకై...,

     అంతరాన  ఆలోచనా  అలలు  పోటెత్తితే,
     నేలమీద  నడిచే సముద్రం ఎలా కాగలను,

     సూర్యుడే  పగటిని  మింగే  పన్నాగమెత్తితే,
     ఇక రాత్రి తిమిరాన్ని ఎలా తరమగలను.

     యుద్దాలే  నిషిద్దమనుకొని  వెనక్కి తగ్గితే,
     పద్మవ్యూహాలను  ఎలా చేదించ గలను.

     అంతటా నెత్తురు   రుచిమరిగిన  మృగాలైతే ,
     అత్తరు కమండలాలతో ఎలా అదిలించగలను. 

     రక్త  సంబంధాలన్నీ ముంగాళ్ళ  బంధాలైతే,
     కరకు చెరలను చేదించే కరవాలమెలా కాగలను.

     ఆకలి పేగుల అడుగులతో బడికి చేరిన పిల్లలతో,
     బ్రతుకుపాఠం తప్ప ఇంకేమి వినిపించగలను.  

     అందుకే .... ,

     జిత్తులమారి ఎత్తుగడలేసే  దేశములో,
     ఎవరి ఆయుధాలు వారు ఎక్కుపట్టక తప్పదు. 

     జనం గుండెల్లో జెండా కావాలంటే ,
     ఆర్దిక చైతన్యాన్ని మేల్కొలిపే  దండోరా వేయాలి.  





 







Monday 24 March 2014

ఆమె

    


   ఆమె 

    ఆమె చిన్ని పెదవుల నుండి,
    రాలిపడే  పిలుపుకై  చెవులొగ్గుతున్నా,

    చీకటిని  చీల్చిన ఆ కలం  నుండి,
    జారిపడే వెలుగు  వాఖ్యాలకై  దోసిలొడ్డుతున్నా, 

    సుడిగాలికి  రెప,రెప లాడే ఆ చిరుదీపం నుండి,
    నులివెచ్చని  కిరణాలలో చలికాసుకుంటున్నా,

    ఎప్పటి గాయాలో రేగి ఆమె చూపులనుండి,
    రక్తమోడటం  నేను గమనిస్తూనే ఉన్నా,

    అనుక్షణం అన్వేషించేే ఆమె అక్షరం  నుండి,
    ఓ అమ్మతనపు  కమ్మదనాన్ని చూస్తున్నా,

    ప్రతి సంబంధం వెనుకా, 
    నీడలా కనిపించే  ఓ  అదృశ్య  సంఘటన,

    మానసిక శ్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
    పుట్టిన మూగ వేదననై  బైటికి రావాలని చూస్తున్నా,

    కంటి తుడుపు సానుభూతి నచ్చని తననుండి,
    ఏదైనా సందేశము  ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నా, 
    
    దో వేదన ఒళ్లంతా పాకుతుంటే, 
    తప్పటడుగునై  తడబడుతున్నా..... 



Friday 21 March 2014

వీడ్కోలుకు ముందు....,




   వీడ్కోలుకు ముందు....,

    ఒంటరితనం  వేటాడినంత  వేగంగా,
    వ్యాఘ్రం కూడా  వేటాడలేదు.

    ప్రాణం పట్టుతప్పుతున్న సమయాన,
    అయిన వారి చేయి అసలే అందదు.

    ఒకప్పటి విశాల హృదయాలూ,విస్తార స్నేహాలూ,
    నేడు  నిస్సారమై దూరమవుతాయి.

    తొలితరం రూపాలన్నీ ఆరిన దీపాలైతే,
    మలితరం దీపాలన్నీ తప్పించుకు తిరిగే కిరణాలే.

    వారసత్వాలకు  అలివిగాని  వసంతాలిచ్చినా,
    శిశిరాన్ని తలపించే  చిటపటలే. 

    అందలమెక్కివ్వలేదనే   నిందలతో,
    అసహనపు మాటల శూలపు పోట్లే, 

    ముసిరిన రోగాలతో,మూలుగులతో ఉనికిని తెలిపినా,
    ఆత్మీయ స్పర్శ  ఎడారిలో ఎండమావే.

    అణువణువూ దహిస్తున్నా, ఆత్మాభిమానంతో సహిస్తూ,
    అయినవాళ్ళే హత్యచేస్తున్న  చిత్రమైన భావన.

    ఆకరి ప్రయాణానికి ఆయత్తమవుతూ,
    మసకబారిన చూపులతో ...,ఇసుక తత్వాలను చూస్తూ..,






Tuesday 18 March 2014

మూలాల లోతుల్లోకి ...,

    


   మూలాల  లోతుల్లోకి ...,

    అన్యాయాన్ని పోషించే వ్యవస్థకు,
    అన్నం  పెట్టటం ఎలాతెలుస్తుంది?

    అవినీతి మురికి మడుగులో,
    పడ్డ పందుల మురికి 
    కడిగే చేయి ఎక్కడుంది? 

    గల్లీ నుండి డిల్లీ వరకు,
    చెత్త చెదారమూ  నిండితే,
    ఊడిచే చీపురు ఎక్కడుందీ?

    పార్ట్ టైమో,ప్రైవేటిజమో,
    రెండూ, రెండు చక్రాలై,
    సైకిల్లా సర్రున దూసుకోస్తుంటే..,

    కళ్ళలో కారం కొట్టి,
    కడుపులో చిచ్చుపెట్టి,
    కాళ్ళకు మాత్రం చెప్పులు తొడుగుతుంటే..,

    మాటల మాయగాళ్లనో,
    ఎంగిలి ఫలాలను మింగే కేటుగాళ్ళనో,
    నమ్మి మోసపోయే సమయాన,

    మేధావి వర్గాలు, 
    ఎవరి స్వార్ధపు ముసుగుల్లో వారు దూరి,
    మాటల తూటాలు పేలుస్తూ,
    రోగిష్టి బిడ్డని లాలించే అమ్మలా ఫోజులిస్తుంటారు. 





Sunday 16 March 2014

అన్నా... అన్నం పెట్టు

   





    అన్నా... అన్నం  పెట్టు 

    ఎక్కడున్నావ్,
    మెడసారించి  మేఘాలను 
    బ్రతిమిలాడుకుంటున్నావా...?

    గ్రాసం లేక,
    డొక్కలెండిన,
    బసవన్నలను ఓదారుస్తున్నావా...?

    ఆకలి తీర్చే,
    పథకాలన్నీ, 
    అటకలెక్కాయని వగస్తున్నావా..?

    అంబలి పోయలేక,
    ఆలు బిడ్డలకు,
    ముఖం చాటేస్తున్నావా...?

    అధికారులకు,
    దుర్బిక్షాలను,
    వివరించలేకపోయావా....?

    నేలతల్లిపై,
    వ్యాపారంచేసే  నీచులకు,
    అన్నం పెట్టిన చేత్తో  దణ్ణం పెడుతున్నావా..?

    వలసపోయిన,
    పల్లెవాసుల,
    పాదముద్రల్లో వెతలను వెతుకుతున్నావా..?

    అధైర్య పడకు,
    భూమాతను నమ్ముకున్నావ్,
    బువ్వ పెట్టకపోదు,
    ఎన్నికలోస్తాయి,ఎల్లలు మారుతాయి,
    కానీ.... ఆకలి మారదు,
    అందరూ తినేది అన్నమే సున్నం కాదు. 

(అన్నం పెట్టు  ఎవడికీ  దణ్ణం పెట్టకు,నీకు అండగా మా పెన్ను ఉంటుంది)  



      















Wednesday 12 March 2014

జీవిత నా(తో)వ

    





   జీవిత నా(తో)వ 

    జీవన పయోనిదిలో సాగిపోయే,
    నా జీవిత నౌక,

    ఆశల అలలనంటిన,
    కలల విహారమై,

    ఆటుపోట్లకు తట్టుకొని,
    దిక్కుతోచని  వియోగంలో,

    కదిలే కాలపు అంచుపట్టుకొని,
    నీ పిలుపు పులకింతకై,

    సుడిగుండాల తోవలో,
    ఉద్వేగపు ఉప్పెనలో,

    కన్నీరింకిన  ఎదపొంత లో,
    వేడిగా రగిలే దిగులుతో,

    చేజార్చుకున్న స్మృతుల్లో,
    ఏ  ఒక్క క్షణం చిట్లినా...,
    వేయి శిశిరాల  వేదన నాది. 

    కలం సాగదూ,అక్షరం విశ్రమించదూ,
    కలల కడలిలో,నీ తలపులతడిలో,

    నా  జీవితనౌక ,
    మరణానికి కొంచం దూరం లో,
    లంగరేసుకొని  నిరీక్షిస్తుంది.  







Tuesday 11 March 2014

గమ్యం వైపు...,






   గమ్యం వైపు...,

   ఊరూ,వాడా  అంతటా  నిశ్శబ్దం,
   ప్రజల మద్యనే పాలన నలుగుతుంది,
   మండుతున్న ఆకలికి  ఆర్దికస్థితి సాక్ష్యమైంది.

   బడి నుండి తిరిగొచ్చిన చిట్టి  తల్లి,
   బువ్వ దొరకలేదన్న బుంగమూతితో,
   పేరుపెట్టి  పంపమని ఆర్దికస్థితి ని బలపరచింది.

   రేషన్‌ బియ్యానికి  తెల్లకార్డ్  తెచ్చుకోకుంటే,
   మసి పాతకంటే  హీనంగా తీసిపారేసే,
   డీలర్  ముందు  దిక్కులేక ఆర్దికస్థితి విలపించింది.

   సిరులు విరుల్లా రాలిన నట్టింటనే,
   అధిక దరలు  అటకనెక్కి కూర్చుంటే,
   అన్నం పెట్టలేని  ఆర్ధికస్థితి  వెర్రిదైంది.

   ఆలొచించి  అడుగేస్తే...,

   శ్రమను చరిత్ర చిహ్నంగా  ఎగరేసే,
   మానవీయ మహానదిలో,
   ఆకలి పేగులను తడిపే అమ్మ కావాలి  మన స్థితి.

   వర్గ,వర్ణ,వైషమ్యాల విషక్రీడలను,
   కుల చీడను   చేదించే కరవాలమై,
   దీనులకు పిడికెడు మెతుకులు పెట్టే  
   అక్షయ పాత్ర  కావాలి మన స్థితి.

   ఇరుకు గూటికి కొత్త ప్రాణి రాక ముందే,
   విశాలమైన  ఇంటికి మారే జీవనానికి,
   నాంది పలకాలి మన ఆర్దికస్థితి.మన  ఆశయసిద్ది.




Friday 7 March 2014

రక్తాక్షరాలతో...,





   రక్తాక్షరాలతో...,

    కళ్ళు మూసుకున్నా..,కనిపిస్తూ ,
    కళ్ళు తెరిస్తే ...వికటిస్తూ ,
    ఎన్నో చేదు భయాలు ఎదురవుతూ, 

    దారి పొడవునా...ఇకిలిస్తూ,
    ఒళ్ళంతా చూపులతో... తడిమేస్తూ,
    ఎన్నో లైంగిక వేదింపులు వెన్నాడుతూ,

    మొగ్గలనైనా....  చిదిమేస్తూ,
    తోడేళ్ళై... వెంటాడుతూ,
    ఎన్నో మలపుల్లో...  కాటేస్తూ,

    గుండెపగిలినా...,కడుపు మండినా ,
    నిప్పుతాళ్ళకు  బందీలై.... మాడిపోతూ,
    గాయపడిన.... గేయాలవుతూ,

    అత్యాచారాలకు,అవమానాలకు,
    అడుగడుగునా  ఆడతనం గాయపడితే,

    వికసించని మొగ్గలు సైతం,
    కసుక్కున కుత్తుకలు తెగి నేలరాలుతుంటే, 

    జీవించటానికి మాకు హక్కులేదా?
    అని ప్రశ్నించే  ఎందరో  వంచిత సోదరీమణుల చెక్కిళపై జారే,
    కన్నీటి బొట్టు   తుడవలేని  అసమర్దతతో..,
    సానుభూతి ప్రకటించి వారి ఆత్మ శాంతికై, 
    ఈ రక్తాక్షరాలతో  మోకరిల్లుతున్నాను.    
    (మూర్చరోగి మెడలోమాదిరిగా 
     ఈ "Happy woman's day" ఇనుప బిళ్ళ మా మెడలో వేయొద్దు) 





  

Wednesday 5 March 2014

ఇప్పుడు చేయాల్సిన పని.

    






   ఇప్పుడు  చేయాల్సిన  పని. 

    సంఘాన్ని  నిద్రలేపి,
    సమరశంఖాన్ని పూరించాలిప్పుడు. 

    అనైతిక  ముళ్ళకంచె నుండి,
    యువతను బైటికి  లాగాలిప్పుడు. 

    కుక్కలెక్కకుండా  గద్దెకు,
    కాపలా కాయాలిప్పుడు. 

    వాగ్దానాల  సుడిగుండంలో  చిక్కుకోకుండా,
    ఓటు సునామీతో పోటెత్తాలిప్పుడు. 

    పంటంతా తిన్న పందికోక్కులను,  
    కలుగులోకి తరమాలిప్పుడు. 

    ఊళ్లనూ,వాడలనూ, రక్తపింజర్లకు అప్పగించి,
    అహింసా వాదపు అత్తరు పూసుకుంటే.....,

    యుద్ధం చేయనని  నిద్రకుపక్రమిస్తే,
    అందుని  చేతికిచ్చిన  దీపమే భవిత ఎప్పుడూ...., 





Sunday 2 March 2014

నిదురపోని గాయం

    




   నిదురపోని  గాయం 

    చికిత్సకు  నోచుకోని  గాయం,
    శరీరాన్ని తొల్చుకుంటూ గుండెను తాకిన గేయం. 

    చిగురించాలని  ఏ మోడుకుండదూ..,

    వసంతాన్ని హత్తుకోవాలని  ఏ పువ్వుకుండదూ..,

    కరకు  చెరలను  చేదించే కరవాలమై,

    కన్నీటి  కడలిని  దాటిన  తీరమై,

    కంటి నుండి  దాటిపోయిన  సుదూర చిత్రమై,

    అపాయమనే  బరిణలో ఆరుద్ర పురుగై,

    కళ్ళుమూసుకొని  కలలు కలబోసుకుంటే,

    హృదయంలో  ఊడలై   పాతుకున్న జ్ఞాపకాలు. 

    ఉర్రూతలూపే   ఉదయ  కిరణాలూ,

    దు:ఖాన్ని  చుట్టుకుపోయే  సాయంసంద్యలూ,

    హృదయంలో అక్షర  గాయాన్ని రేపి,

    వెంటాడే  స్వప్నమై నిదురను ఖూనీ  చేస్తే..,

    పంజరం లో దేహాన్ని వదలి,

    మనస్సుకు రెక్కలు కట్టుకొని  విహరిస్తూ.... ,

    (ఎందుకో ఈ అనుబంధాలూ,ఎందుకో ఈ అభిమానాలూ... ,
    ఎక్కడ ఉన్నా... , ఏమైనా...సుఖమే కోరుకొనే దీవెనలూ....,
    మృత్యువులోకి జారిపోతూ ఒకరూ.... ,
    దు:ఖంలోమునిగిపోతూ మరొకరూ...,
    మానని గాయాలకు మమతల మందుకై  తపిస్తూ..., )