Pages

Friday, 28 March 2014

మరీచిక    మరీచిక

    ఎక్కడో చూసిన జ్ఞాపకం
    ఎప్పుడో కలసిన వైనం

    తలపుల  తలుపు తెరిస్తే  నీవే ప్రత్యక్షం 
    గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం

    గుండె లోతుల్లో నీ తలపు మధురిమ 
    హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ                                                                                    

    నా ఊహల్లో విహరిస్తున్తావు
    నా ఊపిరిలో సంచరిస్తుంటావు 

    తలపుల తలుపు తడతావు
    గుండె గుడిగంటలు కోడతావు

    చెలికాడనే అంటావు చెంత చేరవు
    జతకాడనే అంటావు జాడ చూపవు

    మరిచిపోఇనవే  గుర్తు చేస్తావు
    మరుగున పడినవి చర్చిస్తావు

    విలుకానిలా వేటాడతావు    
    చెలికానిలా మాటాడతావు

    ఎదలోనే ఉన్నాను వెతుకు అన్నావు 
    మదిలోనే ఉన్నాను బ్రతుకు అన్నావు

    పగలంతా నా అడుగులకు తడబాటువై
    రేయంతా నా పలవరింతల అలవాటువై

    దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
    వాకిట్లో నీడలా పారిపోతావు

    కోకిలా అన్నావా   అనే ఉంటావు
    కోవెలలో వున్నావా వుండే ఉంటావు 

    వీడని నా పెదవినీ ముడివడిన నా భ్రుకుటినీ 
    కరువడిన నా భాషనీ మరుగడిన నా ధ్యాసనీ పరిహసిస్తావు 

    జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నై   
    కొన్ని కలలా కొన్ని కన్నీళ్ళలా 

    ఎద సోదలలో సన్నని మెలిక
    మది కథలలో చీకటి కదలిక

             తెలిసింది.  
             నీవు గత జన్మస్మృతివి
             మరోజన్మకు శ్రుతివి 
             ఈ జన్మకు మదినిండిన "మరీచికవి".
         

16 comments:

 1. చాలా అందమైన స్మృతి
  దీదీ

  ReplyDelete
 2. మేడం గారూ...
  మీరు కూడా మా సెగ్మెంట్ లోకి వచ్చేస్తే
  ఇక మేం తట్టా బుట్టా సర్డుకోవాల్సిందే...

  ఇంత అద్భుతంగా ప్రేమ కవిత్వం కూడా
  మీరు రాయగలరని ఊహిస్తే ఒట్టు.

  నచ్చని లైన్లు ఒక్కటి కూడా లేకపోయినా...
  మరింత గా నచ్చిన...

  దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
  వాకిట్లో నీడలా పారిపోతావు...

  కోకిలా అన్నావా అనే ఉంటావు
  కోవెలలో వున్నావా వుండే ఉంటావు...

  మనఃపూర్వక అభినందనలతో...

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. సర్, మీకు నా కవిత నచ్చినందుకు చాలా సంతోషం,
   మీరు కూడా చాలా బాగా రాస్తారు.
   ఇది రెండేళ్ళక్రితం ఆంద్రభూమి వీక్లీ లో అచ్చయింది.
   మనస్పూర్తిగా ప్రశంసించిన మీకు నా క్రుతజ్ఞతలు.

   Delete

 3. భావ పరంపర,పద గుంఫన బాగున్నవి .అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. సర్, నమస్తే,మీ అభినందనలకు నా ధన్యవాదాలు.

   Delete
 4. can't hold enjoying the magical...

  ... కోకిలా అన్నావా అనే ఉంటావు...
  ... కోవెలలో వున్నావా వుండే ఉంటావు...

  just pure magic...
  kudos again ma'm...

  ReplyDelete
 5. అందమైన పదాలూ, అందమైన ఉపమానాలూ,
  కవిత చాలా బాగుంది మేడం.

  ReplyDelete
  Replies
  1. లక్ష్మీ, థాంక్స్.

   Delete
 6. శృతి లయలతో సొంపుగా ఉంది , మీ కవితా స్మృతి !
  శత హొయల తో అవుతూంది మీ కవిత , విస్తృతి !
  ఒత్తులు , దీర్ఘాల ను కూడా సరిచేస్తూ ,
  హత్తుకునే లా రాశారు , కవితా హృదయానికి !

  ReplyDelete
  Replies
  1. సుదాకర్ గారికి, నమస్తే,
   కవితా హృదయాన్ని హత్తుకున్న నా కవిత ధన్యమైంది.
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 7. ఎక్కడో ఎప్పుడో చూసినట్లుంది
  గుండె లోతుల్లో, హృదయ తంత్రుల్లో ....
  ఊహల్లో విహరిస్తూ ఊపిరిలో సంచరిస్తూ ....
  చెలికాడనే జతకాడనే అంటావు ....
  విలుకానిలా, చెలికానిలా ....
  పగలంతా అడుగుల తడబాటువై రేయంతా పలవరింతల అలవాటువై ....
  కదులుతున్న జ్ఞాపకాల దొంతరలు ....
  కొన్ని కలలా, కొన్ని కన్నీళ్ళలా ....
  ఎద సోదలలో మెలికలా మది కథలలో చీకటి కదలికలా ....
  ఈ జన్మకు మదినిండిన "మరీచికవి" .... మరీచిక లా
  ఎండమావుల్ని వేటాడుతున్నట్లుంది భావాల లోతుల్ని చూడాలనే
  సాహసం చెయ్యలేక .... అభినందనలు కవయిత్రి గారికి అని సరిపెట్టుకుంటున్నాను.
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

  ReplyDelete
 8. మాటలు రానంత బాగా రాశారు మీరజ్ ,భావుకత చాలా బాగుంది .

  ReplyDelete
 9. ఫాతీమా గారూ !
  నిజం చెప్పాలంటే ఈ పది రోజులు సాహిత్యానికి దూరమయి,
  చాలా 'మిస్' అయ్యాననిపిస్తుంది. అలా కళ్ళు మూసుకుని తెరిచేలోగా ......
  ఎన్ని కవితలు మీ కలం నుండి. ఏమిటీ అనూహ్యమైన కవితా ధార.

  "తలపుల తలుపు తెరిస్తే నీవే ప్రత్యక్షం
  గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం"

  మనసు ప్రశాంతంగా ఉంది మీ మాటలు చదివాక
  మీ భావనల పరంపరనే మీకు "అల్లా" ఇచ్చిన నిధి.

  "గుండె లోతుల్లో నీ తలపు మధురిమ
  హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ"

  వలపు సరిగమలను రాగ మాలికలుగా అల్లి ,
  అందాన్ని జత చేసారు రాసిన ప్రతి పంక్తికి.
  అందుకోండి నా అభినందనల చందనాలు.

  * శ్రీపాద

  ReplyDelete