Pages

Wednesday, 30 May 2012

నీ ..నా


నీ ..నా

నువ్వూ  నేనూ  నడిచే   బాటలో   ఎవరు ముందు వెళ్ళాలి అనే  వాదనెందుకు?

నీకూ నాకూ తెలిసిన  గతంలో ఎవరిదిఎంత  తప్పో అనే   ప్రస్తావనెందుకు?

నీలో నాలో కలిగిన అసహనాల సెగలో  ఎవరు కాలిపొతారో  అనే  కలత ఎందుకు?

నీకై  నాకై  నిర్మించుకున్న  కుటీరంలో   ఎవరి వాటా ఎంత అనే  వాదనెందుకు?

నీది, నాది  అనుకున్న ఈ జీవనంలో  ఎవరి  స్థానం  ఎంతో   అనే  సందేహం ఎందుకు?

నువ్వూ నేనూ విడిపొవాలి  అనుకున్నప్పుడు  ఎవరి సలహాలూ  వినపడవెందుకు?

నీ, నా  అనుకున్న ఓ  ప్రాణి  మనకున్నప్పుడు  ఎవరికి చెందుతుందో  అనే  అనుమానమెందుకు?

నీవీ, నావీ నుదుటి  రాతలు  సరిగా లేనప్పుడు  ఎవరినో  నిందించే  ప్రయత్నమెందుకు?

నీవీ, నావీ  నడకలు  సరిగా ఉన్నప్పుడు  ఎవరి అడుగుల ఆసరానో  మనకెందుకు?

నీ, నా  సొంతమైన  ఓ  బుల్లి  దీపం  మన ఇంట  ఉండగా  ఎవరి కంటి  వెలుగో  మనకెందుకు?  

నీలో, నాలో  సంస్కారం  మెండుగా  ఉన్నప్పుడు  ఒకరినొకరు మన్నించుకొనేందుకు ఆలస్యమెందుకు?  
Sunday, 27 May 2012

అందని ప్రేమ


అందని  ప్రేమ

కళ్ళు  తెరిచే  కలలు   కన్నావు , వాస్తవమై  కాటేశాడు.

నెచ్చెలివై  చెంత  చేరావు , నొప్పి తెలీని  కత్తితో   కుత్తుక  కోశాడు 
కాలనాగు  చుట్టుకున్నా  మల్లితీగ  అని  మురిసి పోయావు.

నమ్మకం  అనుకుంటూ  వమ్ముకు  కొమ్ము కాశావు.

గుండెలమీద  నడచి వెళ్తున్నా  నోచ్చుకుంటాడని   ఓర్చుకున్నావు. 

ఒక్కసారి  నా గూర్చి  యోచన     చేయమని దీనంగా   యాచించావు. 

కన్నీటితో   కట్టి పడేయలేక    కాళ్ళు  పట్టుకుని  వేడుకున్నావు. 
మరుగున  పడుతున్న  ఊసులన్నీ   మళ్ళి  మళ్ళీ   గుర్తుచేసావు. 

ఏమిస్తే  మచ్చికవుతాడో, ఏం  చేస్తే మనువాడుతాడో  అడిగి చూసావు. 

కొత్తపిట్టతో  కువ కువలాడితే  దైన్యంగా  విలపించావు.

అంధకారంలో  ఆశల  దివిటీతో  నీ చండురున్ని  వెతికావు.

తలపులలో  తలారికి  చోటిచ్చావు,   ఉరికొయ్యకు   చిక్కుకున్నావు . 
గుండె రాయి చేసుకున్నావు, కసాయికి  పట్టం  కట్టావు.

నీ ఆశల  కొమ్మ   ఎండిపోతుంటే  అశ్రువుల  ఎరువు  వేసావు. 

కాలుతున్న   గుండెకు  కాటి  కాపరినే  కాపలా  ఉంచావు.

కరకు పాళీని  తెచ్చి ,  వలపు సిరాలో  ముంచి  కొత్త   కావ్యం  రాసాడు.
నిను  విడిచి  పోతున్న  నీ  కలల  రేడు , కల్లల   కాటిన్యుడు.   

వలపు వాకిలి  మూత   పడినదనా ..  వల్ల  కాటికి  పయనమయ్యావు?  

నీ వెనుక  నడిచే  చెల్లెళ్ళకు  ఏమి చెప్పి   వెళ్లావు? 
నీ  నిష్క్రమణ  వెనుక  ఓ  సత్యాన్ని  ఆవిష్కరించావనా? 

          పేద  గుండె  ప్రేమకు  పనికి రాదనా ?  ఇదేనా  నువ్వు  చెప్పింది ? 

Thursday, 24 May 2012

దీన దీపికలు
దీన  దీపికలు

ఎవరివా నయనాలు? ..... దీన దీపికలై నను వెంటాడుతున్నాయి.

ఎవరిదా చిరుకదలిక? ..... మంద గమనమై నను చేరాలని చూస్తుంది.

ఎక్కడిదా పిలుపు? ..... అంత దీనంగా ఉండి నను నిలిపివేస్తుంది .

ఎందుకా చిట్టి కెరటం అంత వడిగా నను తడపాలని చూస్తుంది?

ఎక్కడిదా చిన్ని రూపం? ..... అంత ఆశగా నను హత్తుకోవాలని చూస్తుంది.

ఎలా పడ్డాయి ఈ వెన్నెల మరకలు నా హృదయాంబరం పై?

ఎందుకు ఈ చుక్కలు దిక్కులేనివై చెల్లాచెదురయ్యాయి?

ఏ దోషానికి ఈ ముత్యపు చిప్పలు ఇలా ఉప్పెనలో మునుగుతున్నాయి?

ఏ శాపానికి ఈ మేఘమాలికలు గగన గర్భం నుండి నేల రాలాయి?

పుట్టిన గడ్దనీ, కట్టిన బట్టనీ ఎరుగని ఈ బాల గంధర్వులను, ఏ అక్షయ పాత్రతో ఆదుకోగలను.

ఆ పాల బుగ్గల పై జారే పసిడి ధారలను ఏ ఆపన్నవస్త్రం తో తుడవ గలను.

ఆ చిన్ని బోజ్జలను నింపటానికి ఏ అక్షయ పాత్రను ఆశ్రయించ గలను.

ఈ వెన్నెల కూనలను, ఈ కాళ రాత్రి కరకు సాక్ష్యాలను ఎలా న్యాయ దేవత కు నివేదించ గలను

Saturday, 12 May 2012

HAPPY MOTHERS DAY

HAPPY MOTHERS DAY TO ALL BLOGGER FRIENDS

మేరాజ్  ఫాతిమా 


Wednesday, 9 May 2012

అరణ్య రోదనఅరణ్య  రోదన


విత్తు ఏదైనా గానీ చెత్త కుప్పలో చిరుమొలక అయ్యింది.
ఆకలి మేక తరుముతుంటె ఆర్తనాదం చేసింది.

రవి కిరణాలతొ, ధూళి కణాలతొ పెరిగింది.
ఎంగిలి ఆకుల మధ్యనే ఏపుగా పెరిగింది.

గాలినీ,  ధూళినీ తప్పుకుంటూ దారి పక్కనే నక్కింది.
ఉమ్మునూ, దుమ్మునూ తుడిచేసుకుంటూ ఎదిగింది.

పచ్చదనపు పలవరింతలు, వెచ్చదనపు కలవరింతలు,
మొగ్గతొడిగిన సిగ్గు దొంతర్లు, మోముపై  సింగారించుకుంది.

మొహపు మొగ్గ నుండి మేలిమి కుసుమం అయ్యింది,
మౌనపు  ముగ్ధ నుండి ముత్యపు మాట అయ్యింది.    

కొత్త కొమ్మల పట్టుపావడాతొ మత్తు మత్తుగా ఊగింది.

పగలు కాగితం పువ్వు, రాత్రి కలువ పువ్వు అయ్యింది.

కంచె లెని తననుతాను రక్షించుకొలేకపొయ్యింది.
కామ మృగాల వంచనకు భక్షణగా మారింది. 

అంతవరకు దాచుకున్నది దొచుకోబడింది.
అనాధ మొలకైన తాను అందరికీ చులకనైంది.

నిశి రాత్రి నిశ్శబ్దంగా రొదించింది,
రేఖలు కొల్పోయిన పూబాల శొక దేవత అయ్యింది. 

తలదాచుకునేందుకు తల్లి వేరూ లేదుకదా,
తలచుకునేందుకు వలపు కాదుకదా.

చరిత్ర పునరావృతం  అయ్యింది.  మరో చిరుమొలక చెత్త కుప్పలొ మొలిచింది.
Monday, 7 May 2012

మార్పు


మార్పు


మార్పు

ఆకృతి  కొల్పొయిన నా మనస్సును కుదించి కుట్టేసుకున్నా... ఎంత COMFORT  గా ఉందో.

అస్తిత్వం కొల్పొయిన నా తలపులను వేటాడి బంధించాను... ఎంత CORRECT  గా ఉందో.

అలమటించే నా మదిని వేదననుండి వేరుచేశాను... ఎంత  HAPPY  గా  ఉందో .


అగోచరమైన  అభిమానాలను వెతకటం మానేశాను ... ఎంత DILUTE  గా  ఉందో .


నన్ను నేను  POSTMORTEM చేసుకుని, కొన్ని కొత్త కణాలను చేర్చుకుని, 

నేనున్న ఊహల సౌధాన్ని పునాదులతో సహా పీకి పారేశాను...  

అచ్చోట  కొత్త సమాధి కట్టుకుని దానిపై  రారాణిలా కూర్చుని, 

కొత్త తలపులతో ద్రోహపు తిమిరాన్ని చీల్చి,

స్నేహపు సమరాన్ని సాగిస్తున్నా ...ఎంత  DYNAMIC  గా ఉందో.                         

Sunday, 6 May 2012

ఏం చేద్ద్దాంపంపు నీళ్ళ  కొచ్చిన  యశోద  చీర  చిరుగుల్లోని వంపులు చూసే కసాయి బసవాన్ని....
అరటి మొక్కలా ఎదుగుతున్న మతిలేని చిట్టి తల్లి కస్తూరి ఎత్తులను చూసే రిక్షా చంద్రాన్ని ....
చదువులేని వాళ్ళని సరిపెట్టుకుందామా.

వేకువనే టూష న్ కి వెళ్తూ గుండెలకు పుస్తకాలూ అడ్డు పెట్టుకుని పరుగులు పెట్టే శ్రీవల్లిని సందు మలుపులో దారి కాసి సైకిల్  అడ్డుపెట్టి ముద్దులడిగే  సూరిగాడిని ....
టీనేజ్   అని  తీసి  పారేద్దామా.

కాగి పోతున్న  కూతురు ఒళ్ళు  కళ్ళ  ముందు మెదులుతూ  ఉంటె ....
పర్మిషన్  అడిగిన  వనజను పెన్ను కింద  పడేసి తీసి ఇవ్వమని జారిన  కొంగు చూసి చొంగ  కార్చే బాసు గాడ్ని ....
సభ్యత  లేదని సర్దుకు పోదామా.

రేషన్  బియ్యం కోసం క్యూలో నించున్న  కమల  చిరుగుల  లంగా సిగ్గు దాచ  లేకుంటే, చెమటతో తడిచిన  రవిక  పిగిలిపోతుంటే, దీక్షగా చూస్తున్న  డీలర్ గాడిని ....
అవివేకి అని వదిలేద్దామా.

రోజు కూలీ రంగమ్మ,  పాపకు పాలిస్తుంటే సిమెంటు బస్తాపై  బైటాయించి సొల్లు కార్చే మేస్త్రీ గాడ్ని .... 
దయదలచి దాటవేద్దామా.ఇక  నా చేత  కాదు, చూడలేను నా అక్క  చెళ్ళెళ్ళ  అర్ధ  నగ్న  నిర్భాగ్యాన్ని,  వావి వరసలు, నైతిక  విలువలు తెలియని జనాలకు చెప్పటం నా చేత  కాదు.

కూడు ఇస్తాం, గూడు ఇస్తాం అనే నేతలు, చదువు ఇస్తాం, కొలువు ఇస్తాం అనే సంస్థలు ఉన్నాయి. 

సంస్కారం ఇస్తాం, సంస్కృతిని రక్షిస్తాం, ఆడ  కూతుర్లను గౌరవిస్తాం అనే నీతి కుటీరాలు, విలువల  విద్యాలయాలు రావాలి. 

ఆడ పడుచులను ఆదుకోవాలి  అన్న  ఆలోచన  కావాలి. 
అప్పటి వరకూ నేనిలానే ఘోషిస్తూనే ఉంటా.
                                                         
 Wednesday, 2 May 2012

ఆజాదీ

తెల్ల వారితే స్వాతంత్ర దినోత్సవం. కానీ మా ఇంట్లో ఇంకా రాలేదు.  నేను రైల్వే అధికారిని, కానీ నా పిల్లల్ని నా రైల్వే స్కూల్ లో చదివించే స్వాతంత్ర్యం నాకు లేదు. నేను అంతో ఇంతో పేరున్న కవిని, స్వచ్చమైన తెలుగు మాట్లాడాలని ప్రయత్నిస్తాను, కానీ ఇంట్లో తెలుగు మాట్లాడితే పిల్లలకు ఇంగ్లీషు ప్రాక్టీస్ కాదని మా ఆవిడ మాట్లాడనివ్వదు. ఇక ఇంగ్లీషు తనతో మాట్లాడదామంటే ఏదో క్లాసు ఏడు సార్లు ఫెయిల్ అయ్యి ఇక చదవలేనని ఏడిస్తే ఏడేళ్ళ క్రితం నా ఎదాన పడేసాడు మా మామ గారు. 
పొద్దున్నే ఐదు గంటలకి కళ్ళు తెరిచినా నేను ముఖం దగ్గరగా తెల్లటి ఆకారం నా మొఖం లో మొఖం పెట్టి గట్టిగా అరవటం చూసి కెవ్వున కేకేసి మంచం మీద నుండి కింద పది నడ్డి విరిగినట్లయ్యి భయం తో ద. ద. దయ్యం అన్నాను. అబ్బా ఎప్పుడూ ఏదో పరధ్యాసేనండీ మీకు. నేనండీ.. లిల్లీని (తనను అల్లగే పిలవమంటుంది) నాకేమో అలా  పిలిస్తే  పిల్లి  అన్నట్టు ఉంటుంది.  అయినా వినదు.  ఇంతకీ నేను తన మేకప్ చూసి  భయపడ్డానన్నమాట. 

మర్చిపోయారా, మన బాబిగాడి స్కూల్లో  ఫంక్షన్ ఉంది.  మేడం గారు  రమ్మన్నారు,  లేచి తయారవ్వండి అంటూ పురమాయించింది. 

అది కాదే... మా రైల్వే వాళ్ళు నన్ను.... మాట పూర్తి కాలేదు, కాఫీ కప్పు టఫీమని నా నెత్తి మీద కొట్టింది. ఆ దెబ్బకి రెండు కనుగుడ్లూ ఓ జానెడు ముందుకొచ్చి మళ్ళా యదా స్థానానికి వచ్చాయి.  నెత్తిమీద జుట్టులేని కారణంగా కాఫీ త్వరగా నా నోట్లోకి జారింది, అదే తాగాను, ఎంచేస్తాను  మరి.
                                                             * * *
మేం వెళ్ళే సరికి జండా ఎగుర వేసేసారు. "కాంటా" మేడం (ప్రిన్సిపాల్ కాంతమ్మ) గారి ఉపన్యాసం సాగుతుండగా మేం మాకు కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నాం.  కాకి గూడు లాంటి కత్తిరించిన జుట్టు,  జబ్బల జాకెట్టు,ఎర్రటి మూతి (లిప్స్టిక్ తో) చేతులు  కళ్ళూ తిప్పుతూ  భయంకరమైన వ్యాకరణ  తప్పులతో  "అంగ్రేజీ"  లో ఉపన్యాసం దంచుతూ ఉంది.  నేను లేచి  నుంచున్నాను.  వెంటనే  మా  లిల్లీ  ఓ గుంజు గుంజి, నన్ను  కూచోబెట్టింది.  మీరు  కూచోండీ, ఆమెమీ  తప్పులు మాట్లాడ్డం లేదు, అది ఫారిన్ ఇంగ్లీషు అన్నది ఖచ్చితంగా అంతే అన్నట్టుగా. 

కాసేపటికి టీచర్లు స్వీట్లు పంచుతున్నారు. నేను మళ్ళీ లేచి నుంచున్నాను. ఈ సారి కండ ఊడివచ్చేలా నా తొడ మళ్ళీ గిల్లింది. ఛీ... ఛీ... అలా ఎగబడకండీ... మనింట్లో పక్కింటివాళ్ళిచ్చిన  స్వీటు అలాగే ఉంది. టామీని కూడా తిననీయకుండా మీకోసం ఉంచాను అంటూ నన్ను కుర్చీలో కూలేసింది. ఈ సారి, పిల్లలు నెహ్రూ, గాంధీజీ వేషాల్లో స్టేజి మీదకు వెళ్తున్నారు. నేను మళ్ళీ లేచి నుంచున్నాను. "అబ్బా వినరు కదా"... అంటూ నా పాంటు పట్టుకుని కిందికి లాగేసింది  మా ఆవిడ.  అయినా సరే నేను కూర్చోలేదు. ఈసారి నేను చెప్పదలచుకున్నది గట్టిగా అరిచి చెప్పాను.


"మేడం మీరు జాతీయ జెండా తిరగేసి కట్టి ఎగరేసారు". అంతే అందరూ అవాక్కయ్యారు, జెండా వంక చూసి కాదు, వలువలులేకున్నా, విలువలకోసం పోరాడుతున్న నన్ను చూసి. ఫరవాలేదు నేనూ స్వతంత్రుడినే.(ఆశ మాస పత్రిక May నెల సంచికలో ప్రచురితం)