Pages

Wednesday 29 January 2014

ఆశల భవిత.

    


    ఆశల  భవిత. 

     ఆమె గుండె మండుతుంది,గొంతు తడి ఆరుతుంది,
     బుగ్గలపై జారుతున్న కన్నీళ్లు ఎండిపోతున్నాయి. 

     గట్టిగా అరవాలనుంది, వీధిలోకి పరుగెట్టాలనుంది,
     నిద్రిస్తున్న నాగరీకులనందరినీ  నిలదీయాలనుంది. 

     చదువులమ్మ బడిలో అన్నీనీతిసూత్రాలే, సుమతివాక్కులె,
     సాయంత్రమైతే   కన్నతండ్రి  నోటినుండి అన్నీ బూతులే,

     చదువుల తల్లి  చేతిలో శభాష్ అనిపించుకున్న మార్కులచిట్టీ,
     తూలుతూ  వచ్చిన తండ్రి   చేతి వేలుముద్రకై పట్టిన కుస్తీ,

     చిరాకుపడ్డ  సగటు మనిషి  చిట్టీని   చింపి పారేశాడు,
     అడ్డమొచ్చిన  ఆలిని గొడ్డుని బాదినట్లు బాదేశాడు. 

     ఎగిరేపిట్టకి  ఉండేలు దెబ్బ తగిలినట్లూ...  ,
     వేల కీటకాలు  శరీరాన్ని  తొలుస్తున్నట్లూ..,

     నేలరాలిన ప్రతి కాగితపు ముక్కా వెక్కిరిస్తున్నట్లూ.... ,
     దిక్కులన్నీ ఏకమై  తనని  బురదలో ముంచేస్తున్నట్లూ..,  

     తన్నులు  తిన్న తల్లి  కన్నీటితో కలిసిన, 
     మెతుకులు తినిపిస్తుంటే,కుక్కి మంచంలో కునుకు తీసింది. 

     అవును  ఆమె చదువుల తల్లి, 
     రేపటి ఆడపిల్లలకి కల్పవల్లి, ఆశల దీపావళి.. 

     (మరో కొత్త ఉదయం ఆమెను నిద్ర లేపుతుంది,
     ఆశా భవిత  బడివైపు  అడుగులేయిస్తుంది )




  

Monday 27 January 2014

రేపటి పౌరులు






    రేపటి  పౌరులు



గణతంత్ర దినాన్ని పునస్కరించుకొని మా పిల్లల కోరిక మేర నగరం లో జండా వందన అనంతరం ఓ పార్క కి విద్యార్ధులను తీసుకొని వెళ్ళాము.

పిల్లలు పార్కంతా కలయ దిరిగారు, ప్రతి పువ్వునూ పలకరించారు,తెల్లని యూనిఫాంలో పావురాళ్ళలా ఉన్నారు మేము టీచర్స్ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా పిల్లలని ఓ కంట కనిపెట్టే ఉన్నాము .
ఆడుతున్న్నమా పిల్లలు ఉన్నట్లుండి ఓ చోట గుమిగూడారు, ఏమయి ఉంటుందో అని మేము పరుగున వెళ్ళాము
వారి మద్య ఓ ఆరేళ్ళ పిల్ల చింపిరి జుట్టూ,చిరిగిన బట్టల్లో భుజానికి ఓ గుడ్డ సంచీ,చేతికి వెదురుబుట్ట తగిలించుకొని వేపిన పల్లీలు(వేరుశనగ పప్పులు)అమ్ముతుంది.చిన్ని చిన్ని పేపరు ముక్కల్లో వాటిని అందంగా పేర్చి పొట్లం కట్టి ఇస్తుంది.మేము ఆ దృశ్యం చూస్తూనే పిల్లల్ని గట్టిగా కేకలేశాము, ఇదేనా మీకు స్కూల్లో నేర్పింది ఇలా బైటి చిరుతిండ్లు తినకూడదని చెప్పలేదా అని కేకలేశాం. పిల్లలు వెంటనే ఆ పొట్లాలు ఆ పిల్ల బుట్టలో పడేసి మా వెనక్కి వచ్చి నిల్చున్నారు, ఆ పాప వాళ్ళకు పైసలు తిరిగి ఇస్తూ.. అవి శుబ్రంగానే ఉన్నాయండీ అన్నది భయంగా, మా పావురాళ్ళు మాతో కదిలాయి, ఆ పాప కొంచం సేపు అక్కడే తచ్చాడి ఇక లాబం లేదని ఎటో వెళ్ళింది.

మద్యాహ్నానికి పిల్లలు ఆడి ,ఆడి అలసిపోయి మేము అరేంజ్ చేసిన ఫుడ్ తిని, ఓ చోట గుండంగా కూర్చుని ఇండోర్ గేమ్‌ ఆడుకుంటున్నారు.

ఇంతలో ఓ కుర్రాడు కొన్ని బెలూన్లు తీసుకొని అక్కడికి వచ్చాడు, వాడు ఎండలో తిరిగి చెమటలు కక్కుతున్నాడు, మేము మా పిల్లలకు అవి కొనొద్దని కళ్ళతోనే వారించాము.అశుబ్రమైన వారి దగ్గరికి వెళ్ళరాదని మేము చెప్పిన పాఠం వారు మరచిపోలేదు.

మరి కాసేపటికి ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడు, ఓ చిన్ని ప్లాస్టిక్ సీసాలో సబ్బు నీళ్ళు నింపుకొని, చిన్ని స్ట్రా తో ఆ నీరు నోటిలోకి తీసుకొని బుడగల్లా ఊదుతున్నాడు . అది చూసి మా పిల్లలు సంబరపడ్డారు, వెంటనే ఓ టీచర్ ఆ నీళ్ళు నోటిలోకి వెల్తే  ప్రమాదమని హెచ్చరించింది. వాడిని అక్కడినుండి వెళ్ళమని అదిలించింది.ఇంతలో ఓ మూడేళ్ళ చిన్ని కుర్రాడు రంగురంగుల కాగితపు పూలు కొనమని ఇంచుమించు కాళ్ళు పట్టుకున్నట్లు అడిగాడు, ఆ పూలకి వేసే రంగులు ప్రమాదకరమని మా డ్రాయింగ్ టీచర్ వద్దన్నారు. మొత్తం మీద ఆ పిల్లల్ని అక్కడి నుండి తరిమేసి, మా పావురాళ్ళని  రక్షించుకున్నాం.
                                                                    ***


సాయంత్రమైంది ఇంటికి బయలుదేరాము  పిల్లల్ని బస్ లో ఎక్కించి మేము గేట్ వరకూ మెల్లగా నడుస్తున్నాం, ఇందాకటి ఆ పిల్లలు పార్కులో ఓ మూల చేరి ,మా విద్యార్ధులు తిని పారేసిన ఎంగిలి ప్లేట్స్ లో మిగిలిన పదార్దాలు తింటూ కనిపించారు.

అంతలోనే  ఓ ఆడ మనిషి, చేతిలో ఓ బెత్తం (మా బాషలో)తో వారిని  కొట్టేందుకు  ఎగబడింది.
"దొంగ నా.. ఇక్కడ మెక్కుతున్నారా? ఒసే .. పల్లీలు అమ్మకుంటా ఎంగిలి నాకుతున్నావా కుక్కా.." అంటూ ఆ పిల్లని  జుట్టు పట్టుకుంది.

నేను అడ్డుకోబోయాను మా టీచర్స్ వద్దన్నారు, (నిజమే మా లాంటి నాగరికులు కలగజేసుకోకూడదు కదా..)
"అయ్యో వాళ్ళు వద్దన్నారక్కా.. అవి తినకూడదట", ఆ పిల్ల వణుకుతూ చెప్పింది,

"నీకేమైందిరా బద్మాష్.." సబ్బునీళ్ళ బుడ్డోడిని జుట్టు పట్టుకుందావిడ.

"ఆ నీళ్ళు నోట్లోకి పోగూడదంట." మొండిగా అన్నడు వాడు.

"నువ్వురా చెత్త నా.. "కాగితపు పూల బుడ్డోడిని నేల మీదేసి ఈడ్చింది.

ఆ ఇస్కూల్ పిల్లల్ని మాటల్లో పెట్టి కొనిపించలేకపొయ్యారు, మీకు కడుపు మాడిస్తే తిక్క కుదురుతుంది కేకలేస్తుందామె.

వాళ్ళు ఎదో మాట్లాడతున్నారక్కా. మాకు అర్దం కాలా ... చదూకున్నోళ్ళు కదా మా దగ్గరగా రాకూడదని దూరంగా వెళ్ళారు. ఏడుస్తూ ఏక కంఠం తో చెప్తున్నారు ఆ పిల్లలు , ఇక చూడలేక నేను బస్స్సెక్కాను ,



గేటు దాటుతున్న మా బస్సుకు టాటా, చెప్తూ  ఊపుతున్న ఆ పసి చేయి  నా నీళ్ళు నిండిన కళ్ళకు మసగ్గా  కనిపించింది.  బాల్యం కూడా ఎన్ని రంగుల్లో ఉందో... (నేనింకా మూడురంగుల్లోనే వెతుకుతున్నాను.)





















Saturday 25 January 2014

నిరుక్త

    




   నిరుక్త

    కలలకి ఆకారమయిన చిరు మొలకవి.

    కష్టాలకొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి.


    నిరుపేద ముంగిట వెలసిన చలువ పందిరివి.


    కలల పంటవైన నిను మోసిన అమ్మ,


    కరవు కాటకాలతో వడలిపోయిన కొమ్మ.


    అణువణువూ ఆరిపోతున్నట్లూ, ఆఖరి శ్వాస ఆగిపోతున్నట్లూ..


    నిప్పుల కొలిమి తానై నొప్పులు పడింది,


    కంటి దీపమైన నీవు ఇంట వేలిగే వరకూ 

    పంటి బిగువున బాధనాపుకోగలిగింది.

    తొమ్మిది నెల్లల్లో నీ బతుకు పుస్తకం అచ్చువేసింది.


    తొలి పలుకుల్లో నీ ఆకారానికి ఆకృతిని ఇచ్చింది.


    ఆఖరి పేజీలో తన ఆయువునే అంకితమిచ్చింది.


    తన గర్భం నుండి దించి నిను ధరణి వితర్ది పై నిలబెట్టింది


    "కంగారు తల్లి "లా నిను తోలుసంచిలో మోయలేక పోయింది..


    జోల పాటలతో నిన్ను నిదురపుచ్చలేదు.


    కర్మ సిద్ధాంతాన్ని నీ కాళ్ళకు చుట్టింది.


    ఆకలి గ్రంథాన్ని నీ అరచేతిలో పెట్టింది.నీకు అందనంత దూరం వెళ్ళింది


    చిరుచేపవైన నీవు వెతల వైతరణిని ఎలా ఈదగలవో..


    చిన్న కురంగివి నీవు వేటసివంగులను ఎలా ఎదుర్కొగలవో..


    కాలదోషం పట్టని ఈ బీదతనాన్ని ఎలా పారద్రోలగలవో...


                                          ***

    చిన్ని వామనా భారతమ్మనడుగు అడుగు ఎక్కడ పెట్టాలి అని.

    చిట్టి కుచేలా అన్నపూర్ణమ్మని అడుగు నా అన్నం ఏది అని.


    ధర్మభూమినడుగు ఈ దారిద్యపు ఖర్మ ఏమిటి అని..


    కాళరాత్రి నడుగు కాంతి పుంజం ఎపుడొస్తుందీ అని.


    నీ ప్రతి పనినీ పదును చేసుకో ..నీ బ్రతుకు బాటను చదును చేసుకో.



Thursday 23 January 2014

అతివ అంతరంగం

అతివ అంతరంగం

నీ  రాకకై  ఎదురు  చూసిన  "ఊర్మిళను"
నీ  తలపుతో  తపించిన  " శకుంతలను"
నీ  ఆనతో  కానలకేగిన  "అయోనిజను" 
నీ  పాద  స్పర్శతో  నాతియైన  "అహల్యను"
నీ  ప్రేమ  నాకే  చెందాలని  సాధించిన  "సత్యను"
నిను  తులసి దళంతో తూకం వేసిన "రుక్మిణిని"
నీ  పదాలనే  పలవరించిన  "మీరాని"
నీ  సత్యపథంలో  నడిచిన  "చంద్రమతిని"
నీకు  పరస్త్రీ  వ్యామోహం  వలదని  పలికిన  "మండోదరిని"
మూర్చిల్లిన  నిను  ముప్పునుండి  తప్పించిన  "నరకాసుర మర్దినిని"
నీ  ప్రేమకై  రేపల్లెను  పొదరిల్లు  చేసిన  "రాధని"
నీవాడిన  జూదంలో  పావునైన  "పాంచాలిని"
యుగాలు  మారినా  నీ "యువతినే", తరాలు మారినా నీ "తలోదరినే"
కలియుగంలోనూ నీ "కలికినే".
ఈ యుగం లో నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలను".
రాక్షసంగా  నీవు మారి నన్ను విగతను చేస్తున్నావు.

Wednesday 22 January 2014

కాలుతున్న పూలతీగలు

   









    కాలుతున్న పూలతీగలు. 

     పూలతోటలో పరిమళించాల్సిన  కుసుమాలు ,
     దున్నపోతుల  గిట్టలకింద నలుగుతున్నాయి. 

     వెలుగు కిరణాలతో  విరియాల్సిన  గులాబీలు,
     నిశి  రాతిరిలో నుసి రేఖలై  రాలుతున్నాయి. 

     అక్షరాల  ఆలయాలలో కూడా రాక్షస పాదాలు. 
     సంచరిస్తూ  సరదా  తీర్చుకున్తున్నాయి. 

     ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఊరిబైట చేరి ఊరిస్తున్నాయి,
     మిడతల దండును తరిమేందుకు  మిరియపు పొడినిస్తున్నాయి. 

     గడప దాటిన తనయ  ఘడియైనా  కాకముందే,
     వార్తల్లో నాని  నాన్నకి  శవమై  అగుపిస్తుంది. 

     ఎన్ని డేగల ముక్కులు పొడిచాయో..,ఎన్ని కుక్కలు ఎంగిలి చేశాయో 
     ఎన్ని ఎలుగులు దాడిచేశాయో,క్షణ,క్షణమూ  వీక్షణం. 

     కన్నవాళ్ళ,తోడబుట్టిన వాళ్ళను  కెలికి,కెలికి,
     నిజాలు తెలుసు కొంటున్న  వైనాలు. 

     దాడిచేసిన  అడవి దున్నలు,జనారణ్యం లో 
     రోమ్మువిరుచుకు  తిరుగుతున్నాయి.

     ఏలికలు  బృహన్నలై  "అభయ" ముద్రలు చూపుతున్నారు,
     న్యాయ స్థానాలు  "నిర్భయ" వాగ్దానాలు చేస్తున్నాయి.  

     ఆడబిడ్డలని  వివస్త్రలను  చేసిన  ఉన్మాదులకు,
     ఇలాంటివి "అనూహ్య " సంఘటనలవుతున్నాయి. 

     ఒక్కసారి,

     మదాన్ధులను  వధించి చూడు, 
     ఉన్మాదులను ఉరేసి చూడు,
     చట్టం దాని పని అది చేసుకొనేలా చూడు,
     తక్కెట్లో  న్యాయాన్ని సరిచేసి చూడు.   




Monday 20 January 2014

కంటివెలుగువై... మింటిదీపమై






    కంటివెలుగువై... మింటిదీపమై... 


     తొలి కిరణమై,వెలుగు దారమై... 
     నులివచ్చని  స్పర్శవై..,

     ఆత్మీయ బంధానివై, సుమ గంధానివై... 
     కలల కౌముదివై...,

     అనురాగ అతిథివై,రంగుల ఆమనివై..,
     ఎడారిలో నీటి చలమవై..,

     ఒంటరి జీవితానికి  కొండంత ఓదార్పువై..,
     మదుర జ్ఞాపకానివై..,

     ఎద మీటిన  భవిత వీణియవై.., 
     నుదుట రాసిన  వెన్నెల  సంతకమై..,

     అవును 

     చూపులేని  ఆ  కనుపాపలకు,
     వెలుగునిచ్చే మింటిదీపానివై..,

     దృశ్య ప్రవాహమై... తనతో ..,
     ఏడడుగులు  నడిచిన  నీవు 

     మరో మహానీయుడివే....మానవత్వానికి మరో మాటవే.     




Friday 17 January 2014

మూగబోయిన పల్లె

   






    మూగబోయిన  పల్లె

     నిద్రబోయిన   నా పల్లె
     నిశ్సబ్దంగా ఉంది,

     పక్షులన్నీ  గింజలు లేక,

     చెట్టు కొమ్మకే అంటుకు పొయాయి.

     డొక్కలెండిన కుక్కలు

     మురికి నీళ్ళతో  కడుపు నింపుకున్నాయి.

     దారంతా గోతులు,

     మట్టి ఎగుమతి  అవుతున్న ఆనవాళ్ళూ,

     నరికిన చెట్లూ,

     పూలమ్మిన చోటే కట్టెలమ్మిన దౌర్భాగ్యాలూ,

     బోసిపోయిన వాకిళ్ళూ ,

     గుమ్మం లో ముసలీ,ముతకా కాపలాలూ,

     నులకతాళ్ళు  తింటున్న తువ్వాయిలూ,

     కళ్ళలో ప్రాణాలెట్టుకున్న బసవయ్యలూ, 

     బిలంలోకి   జారిపోయిన పల్లె తాళాలూ,

     వెతికి పట్టుకున్న నగరవాసులు , 

     పల్లెతల్లిని నిద్దురలేపి,
     పాతకబుర్లన్నీ  పలికించుకొనీ,
     అమ్మ కమ్మదనమంతా ఒలికించుకొనీ... ఆడీ,పాడీ,

     హటాత్తుగా అమ్మనలా వదిలేసి ,
     పట్టుకొమ్మని  దిగి,బతుకు బాటన పడతారు,
     మళ్ళా మకర సంక్రాంతికి  పలకరిస్తారు.

     {పల్లెలు దేశానికి  పట్టుకొమ్మలు అన్నారు బాపూజీ... 
     అవినేడు  ఎండుకొమ్మలవుతున్నాయి.
     ఆ కొమ్మలను చిగురించేలా.. రైతుకు  చేయూతనిద్దాం }  





Wednesday 15 January 2014

ఆశ

     





    ఆశ 

     ఆకలితో జీవశ్చవాల  
     అడుగులు తడబడుతున్నప్పుడు.

     ఎక్కడినుండో  కొన్ని నవ్వులు ఎగిరొచ్చి 
     వారిని పలకరిస్తున్నాయి. 

     రోడ్డుపై   విసిరేసిన   పేదరికాన్ని,
     ఓపిగ్గా చేతిలోకి తీసుకున్నాయి.

     ఆకలి ఆక్రందల్నీ,బాధల భావోద్వేగాలనీ,
     జీవన పట్టాలనీ,తప్పుల చిట్టాలనీ,  
     సరిచేస్తున్నాయి,

     కొండల్ని మింగే  గండు చీమలనీ,
     ఇసుకమేటల ఎత్తుపల్లాలనీ,
     ఊడ్చి శుభ్రం చేస్తున్నాయి.

     మానవ సరోవరం లో కూడా,
     మొలకెత్తే మంచితనాలు 
     కనిపిస్తున్నాయి.

     అంతరంగం లో అలజడి మొదలై,
     బాహ్య  ప్రపంచానికి  తమ వంతుగా,
     బాటనేస్తున్నాయి.

     ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న చిరుమొలకలై,
     తడికోసం  తపిస్తున్న బీజాలై,
     జనకోటికి  జీవన  ఏరులై పారుతున్నాయి.



Sunday 12 January 2014

కాకినైనా... కాకపొతిని.

   





    కాకినైనా... కాకపొతిని. 

     గుడిసె ముందు  గువ్వలా..,
     కరువునెలపై రాలిన  ఎండుటాకులా ...,

     గుమ్మానికి  కట్టిన  నాటి  తోరణం లా..,
     పసుపు లేక వెలవెల బోయిన గడపలా..,

     అప్పటి  తప్పతడుగుల గురుతులింకా  
     గుమ్మం లో ఆరబొసుకుంటూ..,

     పసుపు కుంకుమల  నుదుటి నింకా,
     తడిమిచూసుకుంటూ..,

     రెక్కలొచ్చి ఎగిరెళ్ళిన   పిల్లలకై  ఎదురుచూస్తూ,
     జీవిత బాగస్వామి జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ..,

     ప్రతి పండక్కీ  తనకు తానె  అతిధిననుకుంటూ,
     ఎన్నాళ్ళ నుండో,చావును ఓడించాలనుకుంటూ..,

     కానీ,

     గమ్యం తెలీని ఈ జీవన ప్రయాణం లో ,
     కలసి కన్నీటిని  పంచుకొనేదెవ్వరో.. ?

     ఒకవేళ   తన  మరణమే అనివార్యమైతే,
     తనని మట్టి గర్బంలో  జారవిడిచేదెవ్వరో.. ? 

     (మనం కాకులమైనా బాగుండేది కదా ... 
     చెలిమి  నేర్పి చెంత  చెర్చుకొనేవీ) 

     (పండగ  పూట  ఒంటరిగా ఉన్న ఆత్మీయులను  గుర్తించి పలకరించండి  
     వారి దీవెనతో మీ పండుగ  ఆనందంగా సాగుతుంది) 







Saturday 11 January 2014

ఆడాళ్ళూ....మీకు జోహార్లూ....



         ఆడాళ్ళూ....మీకు   జోహార్లూ....


       గతంలో  తానుపడ్డ  వెతల్ని,

       తిప్పి,తిప్పి చెప్పి తిప్పలు పెడుతుందో  "తలోదరి."

       అయినవాళ్ళ ముందు  అలుసయ్యానని,

       అలుకలు  పోతుందో   "ఇల్లాలు".

       అత్తింటివాళ్ళు ఎంత  అనాగరికులో చెప్పి ,

       అల్లరి  పెడుతుందో "లలన".

       తనను  పుట్టింటికి  పంపలేదని,

       పెచీ  పెడుతుందో  "పడతి".

       కారూ,నగలూ తనకు  తేలేదని,

       కయ్యానికి దిగుతుందో  "కలికి".

       ఆలస్యంగా  ఇల్లు చేరిన భర్తని,

       ఆరడిపెడుతుందో  "ఇంతి".

        ఆఫీసు  స్టెనో తో  మాట్లాడాడని,

        కట్టడి చేస్తుందో "సుదతి".


అమ్మలూ ,తల్లులూ, మీరు చేయాల్సిన  పనులు చాలా ఉన్నాయి ,

భర్తకు చేదోడు వాదోడుగా ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని  కాపాడుకోండి. 
అత్తా,మామలను ఆదరించండి,కొడుకులను ఉత్తములుగా తీర్చిదిద్ద్దండి ,
కుమార్తెను ఆదర్శ నారిగా తయారుచేయండి. 
అమ్మగా, ఆలిగా, కోడలిగా,కూతురుగా మీ పాత్ర  చాలా గొప్పది
ఒక  బిడ్డకు జన్మనివ్వటంలో  తన ప్రాణాన్నే పణంగా పెట్టే  స్త్రీ మూర్తికి 
ఈ  అసూయా, ద్వేషాలనువిడనాడటం ,పెద్ద కష్టమేమీ కాదు 
స్త్రీ ఎప్పటికీ పురుషునికి సమానం కాదు...కాదు కానే కాదు.. ఎక్కువే             
చాలా ఎక్కువే.


            (సంక్రాంతి  పర్వదిన సందర్బంగా  బ్లాగ్ మిత్రులందరికీ  నా శుభాకాంక్షలు) 
     
నా సోదరీమణులు  అన్యదా భావించరనే  ఆశతో... మేరాజ్



Friday 10 January 2014

చిరుగుతున్న విస్తర్లు



     చిరుగుతున్న విస్తర్లు  

     పెద్దోళ్ళ (పెద్దింటోళ్ళ) పెళ్లి  హడావిడి,
     ట్రాపిక్   మళ్ళింపుల  గారడీ..,

     ఆరు రోజుల నుండీ హాలు  అలంకరణా..,

     అక్కడే కాచుకున్న అనాథల ఆకటి నిరీక్షణా. 

     దారంతా  రంగు,రంగుల దీపాల  వెలుగులూ,

     చెవులు చిల్లులు పడేలా శబ్ద తరంగాలూ,

     పడవలాంటి కార్లూ, పలకరింపులూ ,

     కరచానాలూ,కౌగిలింతలూ,కవ్వింపులూ ,

     సినీతారల తళుక్కులూ ,మంత్రుల  ఉళక్కులూ,

     విందులూ,చిందులూ  ఎన్నో కనువిందులూ,

     పసందైన విందూ, ఖరీదైన మందూ,

     ఆకలిలేని ఆరగింపులూ, వ్యర్ధమైన  పదార్ధాలూ,

     అమ్మాయి ఆంపకాలూ అయిన వారి వేడ్కోళ్ళూ ,

     కదలిన వాహనాలూ,కలకలలూ, గలగలలూ,



                        
     అప్పటివరకూ  ఆగిన ఆకటి పేగులూ ..,
     ఒక్క సారిగా గేటు  తొసుకొన్న పరుగులూ,

     మూతబడ్డ  ఫంక్షన్ హాలు  గేటు తలుపులూ ,

     చెత్తలోకి విసరబడ్డ  ఆహారపదార్దాలూ..., 

     కలబడ్డ  మూగజీవాలూ ,భావి పౌరులూ ,

     ఏక వర్గ (ఆకటి)పోరాటాన  చిరిగిన  విస్తళ్ళూ... 
     నేలపాలైన  మెతుకులూ...  ఎప్పటికి  మారేనీ  బతుకులూ ..?





Wednesday 8 January 2014

రైతు బేజార్






రైతు బేజార్

మాదో చిన్న పల్లెటూరు, అందరమూ చిన్న కారు రైతులమే,వ్యవసాయం తప్ప మరేపనీ చేతకాదు.పిల్లగాళ్ళకి చదువుకోడానికి ఎలిమెంటరీ చదువుంది, ఆ పై పట్నం పంపలేక చదువులు ఆపించేసి మాతో పొలం పనులకు తీసుకె ళ్తాము.

మాఊర్లోఎప్పుడో ఓ జమిందారు ఉండే వాడంట, ఆయనెప్పుడో పట్నమ్లో సెటిల్ అయిపొయ్యాడు, ఆయన బిడ్డలు విదేశాల్లో ఉన్నారంట, గతేడాది ఆయన పోతూ మా ఊరిమీదున్న అభిమానంతో ఆయన బంగళాని మాఊరి మంచికొసం ఉపయోగించుకోమని, దానిమీద సర్వ హక్కులూ ఊరి పౌరులకు చెందుతాయనీ, ఏదైనా మంచి పని చేయాలంటే, అందరూ కలసి సంతకాలెట్టుకొని ఆ బంగళాని ఉపయోగించుకొవచ్చనీ, దీనివల్లా ఊరు ఎప్ప్పటికీ కలసి కట్టుగా ఉంటుందనీ, నమ్మి అలాంటి ఫిట్టింగ్ పెట్టాడు.

మా ఊరి సర్పంచ్ మమ్మల్ని ఊరిరచ్చరచ్చబండదగ్గరికిరమ్మని కబురెట్టాడు, అందరమూ వెళ్ళాము, మేం వెళ్ళేసరికి, సూటూ,బూటూ వేసుకున్న ఇద్దరు పెద్ద మనుషులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు,
మాకేమీ అర్దం కాలా, ఒకరిమొఖాలొకరం చూసుకుంటూ నిల్చున్నాం, మా సర్పంచ్ మా పక్కకి తిరిగి. అందరూ కూకోండి నిదానంగా ఆలోచించి నేను ఒక మంచి పని చేస్తుండా, మీరు కాదనరని ఇదిగో ఈ పెద్దమనుషులని తీసుకొచ్చినా,అన్నాడు


"మన బంగళా ఈళ్ళకి అప్పగిస్తే(?) రైతు బజార్ చేసి మనకు ఉపయోగపడేట్టు చేస్తారంట," మీ మేలు కొరే ఈపనికి ఒప్పించాను. మీరంతా ఈ కాగితాలమీద ఏలుముద్దర్లు ఏస్తే చాలు అన్నాడు,
ఊరి మంచికి ఉపయోగపడ్తే ఇంకేమి కావాల అనుకొని మూకుమ్మడిగా ఏలు ముద్దర్లు ఏసేశాం.

బూత్ బంగళా పెళ్ళికూతుర్లా, ముస్తాబయింది, మా ఊరి పిల్లగాళ్ళంతా అక్కడే పొద్దస్త మానమూ, అబ్బామనూర్లో రైతు బజారంట, మన పొలమ్లో పండినవన్నీ ఇక్కడే అమ్ముకోవచ్చంట, అందరమూ మురిసిపోయాం, ఆ మాటే మా పెద్ద పిల్లగాడు(మద్రాస్ లో చదువు కుంటున్నాడులే వాళ్ళ అమ్మమ్మ దగ్గర)తో అంటే అస్సలు రైతు బజారంటే ఏంటొతెలుసు కున్నారా? ఎందుకు సంతకాలు చేశారు ఊరు,ఊరూ... అని కేకలేశాడు, వాడంతే పట్నపు నీళ్ళు వంట బట్టి ఏదీ నమ్మడు.
                                             
                       ***


ప్రారంభోత్సవంరోజు మాపొలములో పండిన పిందా,పూతా దూసి బండ్లకెత్తుకొని, పిల్లగాళ్ళని తీసుకొని బంగళా దగ్గరికి బయలు దేరాం, మమ్మల్ని అల్లంత దూరానే ఆపేశారు,
మినిస్టర్ వచ్చాడంట, పోలీసు వచ్చారు, అప్పటికే రిబ్బను తెంపటం (కట్) జరిగిపోయింది, దూరంగా పెద్ద అరుగు దాని మీద మా సర్పంచ్ వెంకట్ రెడ్డీ మొన్నొచ్చిన పెద్ద మనుషులూ కనిపిస్తున్నారు,
మంత్రి హిందీలో ఎందో... చెప్తున్నాడు, మాకేమీ అర్దం కాలా.. మా ఊరి యువకులంతా కోపంతో మమ్మల్ని ఎందుకు రానీటం లేదని ముందుకు ఉరికినారు, అంతే....

పోలీసుల లాటీలు మా మీదకి లేశాయి, గొడ్లు బెదిరి పోయాయి,పిల్ల జెల్లా పరుగు లెట్టారు, అందరమూ పరుగెట్ట్టటం లో.. ఒకరి నొకరం తొక్కు కున్నాం ,తిట్టుకున్నాం.మాలో ఓ పెద్దాయన ఎనక్కి పదండి, అని మందలించి మమ్మల్ని బైలదేర దీశాడు,

మాకు ఇప్పుడు సర్పంచ్ మాటలు వినిపిస్తున్నాయి." మా ఊర్లో అందరమూ అన్నదమ్ముల్లా ఒక్క మాటమీదే ఉంటాము. మా ఊరి రైతులకు అవసరమైన పనిముట్లు, ఎరువులూ, వగైరా కావాలంటే ఎక్కడికో ఎళ్ళాలి, అందుకే వాళ్ళ కోరిక మీద ఇక్కడ ఈ బంగళాలో సరుకులు పెట్టి అమ్మటానికి  ఈ పెద్ద మనుషులు అంగీకరించారు, వీరి పుణ్యమా అని" ..... ... ఇంకేమీ వినిపించ లేదు మాకు.


అనాలోచితమూ, అవిద్యా,నమ్మకమూ, ఇవన్నీ కలిపి మమ్మల్ని కలసి కట్టుగా మోసపోయేలా చేశాయి.

ఈ పరిస్థితి నుండి బైట పడటానికి  ఏ విద్యావంతుణ్ణో ఆశ్రయించాలి.  ఆ విద్యే 
మా పిల్లలకీ మాకూ  ఉంటే ..... 







Monday 6 January 2014

తొలి పాఠం

       







    తొలి  పాఠం 

      ఇక్కడంతా అలజడి, 
      అలలలా  ఎగసిపడే  ఒరవడి. 

      ప్రేమలు  ఒలకబోసే  గారడి ,
      అనురాగాల  నటనా జడి. 

      కడుపునిండా అసూయను మెక్కీ ,
      తలల నిండా విషాన్ని కుక్కుకొనీ,
      నీ ముంగిట్లో  వేదాంతాన్ని కక్కుతారు. 

      మెత్తని  బురదపాములై,
      బొరియల్లోని కీటకాలై,
      తమ మజిలీలను మార్చేస్తుంటారు. 

      నిన్ను గాలిపటాన్ని చేసి ఎగరేసి,
      దారాన్ని తమవేలుకే ముడివేసుకొని,
      సరదాగా తల తుంచేస్తారు. 

      నీటిలో ముంచి  ఉడికించినట్లూ, 
      చీకటి బావిలోకి తోసినట్లూ,
      కబంద హస్తం నిన్ను  పిసికి పిండిచేసినట్లూ,

      నిరంతర బాధా,నిర్విరామ   క్షోభా,
      మనసంతా పొగ చూరినట్లూ,బతుకంతా నుసిరాలినట్లూ .... 
      వలయాలు, నల్లని వలయాలు  నిన్ను చుట్టుముట్టేస్తాయి, 

      ఒంటరిగా ఒదిగిపోతావ్, 
      నీ నీడకి నువ్వే బయపడతావ్. 
      చచ్చిపోవాలనిపిస్తుంది,  కానీ... కొంచం ఆగావనుకో,
      చావును వాయిదా వేశావనుకో... 

     అప్పుడు 

     నీ చుట్టూ ఉన్న పాత్రలూ, పాత్రదారులూ,
      కపట అభిమానాలూ,కలల్ల అనునయాలూ 
      వ్యర్దాన్నంతా  మూటగట్టుకొని   ఏకమై  కనిపిస్తాయి. 

      చచ్చి బతికిన నీవు,
      పిశాచ గణాలను  పసిగట్టె  నీవు,   
      మర్మమెరిగిన  మాయల పకీరువే.   





Saturday 4 January 2014

అని (కని) పిస్తుందిలా

      







       అని (కని) పిస్తుందిలా...  

       పలకా బలపాలు పట్టే   చిట్టి చేతులు,
       పట్టెడన్నానికై  చేతులు  చాపినప్పుడు. 

       చిట్టి,పొట్టి కథలు  వినే ఆ చెవులకు,
       పొట్టదోచే కట్టుకథలు  అర్ధం కానప్పుడూ,

       ఇంకొంచం  అన్నమడిగి  బొచ్చె చాపితే,
       ఛీ...అనే చీత్కారాలు  వింటున్నప్పుడూ.. 

       భూటకపు తనిఖీ  నిజమనుకొని  పిర్యాదు చేసి,
       వార్డన్  చేత చావు దెబ్బలు తిన్నప్పుడూ,

       ఒకే గదిలో గబ్బు గలీబులో  గుడ్డపీలికల్లా,
       కుక్కబడి,జబ్బుపడీ  కన్నులోట్టపోతున్నప్పుడూ,

       గెస్ట్ హవుసులో  రెస్ట్ తీసుకొనే  బడా బాబులకు,
       లేత దేహాలు సేవలు  చేయాల్సి వస్తుంటే...... 

       నాకనిపిస్తుందీ...... 

       చీకటి,ఆకటి బాకుల దాటికి  తట్టుకొనే  ఆ బిడ్డలు, 
       బతుకు బండ కింద అంకురించని బీజాలేమో... 

       భూగోళం అంచుల్లోనో,చీకటి సంచుల్లోనో....,
       ఊపిరాడని వెలుగు కిరణాలేమో... 

       తమ బాధని అక్షరీకరించలేని  నా అసమర్ధతకు,
       ప్రత్యక్ష  సాక్షాలేమో..... ఏమో.... ఏమో...  







Thursday 2 January 2014

వలస

    



    వలస

     గంపెడు చీకటి  నెత్తినెత్తుకొని ,
     నగరంవైపు అడుగులేస్తూ.

     కట్టడి  బతుకుల నుండి,
     వత్తిడి బతుకుల వైపుకు తిరిగి.

     డొక్కలెండగట్టుకొని  పరుగులెత్తుతూ ,
     కాకినోట్లో కప్పపిల్లలా విలవిల్లాడుతూ .

     అనాగరికుడివనే  అపకీర్తి నీ,
     అసమర్దుడివనే  భుజకీర్తినీ  మోస్తూ,

     మురికివాడల్లో మునిగితేలుతూ ,
     సవతి ప్రేమ చూపించే  పట్టణాలలో,

     వలస  ఉగ్గ్గుపాలు తాగే  అమాయకుడా...


     ఎక్కడ చూసినా వ్యసనాల  పలకరింపులూ ,
     ఎంగిలి  మెతుకుల   విదిలింపులూ ,

     నేడు శ్మశానాలు  సైతం మతాల జెండాలెత్తాయి
     శవాలు  సైతం రాజకీయ  కవాతులు చేస్తున్నాయి.

     సరిహద్దుల యుద్దాలలో  నలుగుతూ ,
     సమైఖ్యతా  రద్దులలో  నానుతూ,

     దేశపటం  చెదలు పట్టింది,రహదారులన్నీ నెర్రిలిచ్చాయి.
     అందుకే అడుగు కదపకు, 
     ఉన్నఊరునూ, కన్నాతల్లినీ వదిలెళ్ళకు.  











Wednesday 1 January 2014

అరుదెంచే కాలమా...

       
         అరుదెంచే కాలమా... 

            ప్రతిసారీ నిన్ను  నవ్వుతూ స్వాగతిస్తారు,
            అర్దరాత్రి వరకూ ఎదురుచూస్తారు, 
            అతిధి వై  వస్తావు. 

            నీ పాదాల కింద తమ అరచేతులుంచి,
            కందిపోకుండా నిన్ను నడిపిస్తారు,

            కలవారితో కలసి అడుగులేస్తావు ,
            ఆకలిగలవారిని  ఆమడ దూరం నెట్టేస్తావు.

            కామాంధులకు  కొమ్ముకాస్తావు,
            సైకోలకు  సహకరిస్తావు.

            మానవత్వపు మొక్కను వేళ్ళతో సహా  పీకి,
            రాక్షసత్వానికి  ఎరువు వేస్తావు.

            ఒకచోట నిప్పై,మరోచోట నీరై,
            ఇంకోచోట ప్రకంపమై ప్రకోపిస్తావు.
            
            
            నీ  నికృష్ట విన్యాసాలకు  అగ్గై భగ్గున  మండి,
            ఒళ్ళంతా కాలిన  నాకలం  నివురై పోతుంది.

            నా కలల  కలువలను కసిగా  తెంపి,
            నా స్వప్న సరోవరాన్ని రుధిరంతో నింపేస్తావు. 

            ఒక్కసారైనా... నా చెలిమి చేతికి  పచ్చబొట్టువై ,
            పదిలంగా ఉండిపోవా... కరుణించవా... ఓ కొత్త సంవత్సరమా....