Pages

Saturday 25 January 2014

నిరుక్త

    




   నిరుక్త

    కలలకి ఆకారమయిన చిరు మొలకవి.

    కష్టాలకొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి.


    నిరుపేద ముంగిట వెలసిన చలువ పందిరివి.


    కలల పంటవైన నిను మోసిన అమ్మ,


    కరవు కాటకాలతో వడలిపోయిన కొమ్మ.


    అణువణువూ ఆరిపోతున్నట్లూ, ఆఖరి శ్వాస ఆగిపోతున్నట్లూ..


    నిప్పుల కొలిమి తానై నొప్పులు పడింది,


    కంటి దీపమైన నీవు ఇంట వేలిగే వరకూ 

    పంటి బిగువున బాధనాపుకోగలిగింది.

    తొమ్మిది నెల్లల్లో నీ బతుకు పుస్తకం అచ్చువేసింది.


    తొలి పలుకుల్లో నీ ఆకారానికి ఆకృతిని ఇచ్చింది.


    ఆఖరి పేజీలో తన ఆయువునే అంకితమిచ్చింది.


    తన గర్భం నుండి దించి నిను ధరణి వితర్ది పై నిలబెట్టింది


    "కంగారు తల్లి "లా నిను తోలుసంచిలో మోయలేక పోయింది..


    జోల పాటలతో నిన్ను నిదురపుచ్చలేదు.


    కర్మ సిద్ధాంతాన్ని నీ కాళ్ళకు చుట్టింది.


    ఆకలి గ్రంథాన్ని నీ అరచేతిలో పెట్టింది.నీకు అందనంత దూరం వెళ్ళింది


    చిరుచేపవైన నీవు వెతల వైతరణిని ఎలా ఈదగలవో..


    చిన్న కురంగివి నీవు వేటసివంగులను ఎలా ఎదుర్కొగలవో..


    కాలదోషం పట్టని ఈ బీదతనాన్ని ఎలా పారద్రోలగలవో...


                                          ***

    చిన్ని వామనా భారతమ్మనడుగు అడుగు ఎక్కడ పెట్టాలి అని.

    చిట్టి కుచేలా అన్నపూర్ణమ్మని అడుగు నా అన్నం ఏది అని.


    ధర్మభూమినడుగు ఈ దారిద్యపు ఖర్మ ఏమిటి అని..


    కాళరాత్రి నడుగు కాంతి పుంజం ఎపుడొస్తుందీ అని.


    నీ ప్రతి పనినీ పదును చేసుకో ..నీ బ్రతుకు బాటను చదును చేసుకో.



10 comments:

  1. అందరూ ఉన్న బిడ్డలే పెరగడం గగనమైపోతుంటే,
    పాపం ఒంటరి పనిని పదును చేసుకుని......
    బతుకు బాటను చదును చేసుకోగలదా మీరజ్ ?
    కానీ తప్పదు ఆ పరిస్థితిని బట్టి అంటారా...
    కవిత హృద్యంగా సాగింది .

    ReplyDelete
    Replies
    1. నిజమే అన్నీ ఉంటేనే బ్రతకటం కష్టం ,కానీ బ్రతకాలి కదా తప్పదు.

      Delete
  2. సమస్యను విభిన్న కోణం లో ఆవిష్కరించారు. మంచి కవిత

    ReplyDelete
    Replies
    1. సర్, నా బ్లాగ్ కి పున:స్వాగతం.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  3. నీ కన్నతల్లి కలల ఆకారం చిరు మొలకవి, కష్టాలకొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి, నిరుపేద ముంగిటి చలువ పందిరివి .... నీవు నీ అమ్మ కలల పంటవి. నిప్పుల కొలిమి తానై నొప్పులు పడి తన కంటి దీపమై నీవు ఇంట వెలగాలని పంట బిగువున బాధనాపుకుని కన్నది.
    కాలదోషం పట్టని బీదతనంతో పాటునమ్మకం ఆత్మవిశ్వాసాన్ని నా చనుపాలలో రంగరించి ఇచ్చింది .... నీ ప్రతి పనినీ పదును చేసుకోవాలని .... నీ బ్రతుకు బాటను చదును చేసుకొమ్మని .... నీవు నడిచే దారి నలుగురికీ మార్గమయ్యేలా ఉండమని ....
    మెరాజ్ ఫాతిమా గారు మీ ప్రతి కవిత లోనూ ఒక మంచి సందేశానికి అవకాశం ఉండి ఏదో అవ్యక్త ఆవేదన కనిపిస్తూ .... ఆ పదాల వెనుక దాగిన ఘూడార్ధం నాకు ఎంతగానో నచ్చుతుంది.
    శుభోదయం కవయిత్రి గారు!!

    ReplyDelete
    Replies
    1. సర్, నా కవితల్లో మంచి సందేశాలను ఇవ్వగలగటానికి స్పూర్తి మీ వంటి కవి మిత్రులే.
      మీ స్పందన నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుంది.

      Delete
  4. ఫాతిమా జీ..అద్భుతం. మరో మాట నాకు తట్ట లేదు.

    ReplyDelete
    Replies
    1. సర్, ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఇంకేమి కావాలి.
      రెండేళ్ళగా అడుగడుగునా నా అక్షరాలను (కవితలను ) సరిచేసిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  5. ఎంతటి ఆవేధన !
    మీరు మలిచిన మీ " నిరుక్త " లో.
    మీ ఆవేదన లోని ప్రతీ భావము సమాజంలో కొంత మార్పునైనా తేగలిగితే - కవితనందించిన మీతో పాటు , మేమూ ధన్యులమే అని తోస్తుంది నాకు.
    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నా అక్షరాలపై మీకున్న్న నమ్మకానికి నా వందనాలు శ్రీపాద గారూ.

      Delete