Pages

Monday, 27 January 2014

రేపటి పౌరులు


    రేపటి  పౌరులుగణతంత్ర దినాన్ని పునస్కరించుకొని మా పిల్లల కోరిక మేర నగరం లో జండా వందన అనంతరం ఓ పార్క కి విద్యార్ధులను తీసుకొని వెళ్ళాము.

పిల్లలు పార్కంతా కలయ దిరిగారు, ప్రతి పువ్వునూ పలకరించారు,తెల్లని యూనిఫాంలో పావురాళ్ళలా ఉన్నారు మేము టీచర్స్ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా పిల్లలని ఓ కంట కనిపెట్టే ఉన్నాము .
ఆడుతున్న్నమా పిల్లలు ఉన్నట్లుండి ఓ చోట గుమిగూడారు, ఏమయి ఉంటుందో అని మేము పరుగున వెళ్ళాము
వారి మద్య ఓ ఆరేళ్ళ పిల్ల చింపిరి జుట్టూ,చిరిగిన బట్టల్లో భుజానికి ఓ గుడ్డ సంచీ,చేతికి వెదురుబుట్ట తగిలించుకొని వేపిన పల్లీలు(వేరుశనగ పప్పులు)అమ్ముతుంది.చిన్ని చిన్ని పేపరు ముక్కల్లో వాటిని అందంగా పేర్చి పొట్లం కట్టి ఇస్తుంది.మేము ఆ దృశ్యం చూస్తూనే పిల్లల్ని గట్టిగా కేకలేశాము, ఇదేనా మీకు స్కూల్లో నేర్పింది ఇలా బైటి చిరుతిండ్లు తినకూడదని చెప్పలేదా అని కేకలేశాం. పిల్లలు వెంటనే ఆ పొట్లాలు ఆ పిల్ల బుట్టలో పడేసి మా వెనక్కి వచ్చి నిల్చున్నారు, ఆ పాప వాళ్ళకు పైసలు తిరిగి ఇస్తూ.. అవి శుబ్రంగానే ఉన్నాయండీ అన్నది భయంగా, మా పావురాళ్ళు మాతో కదిలాయి, ఆ పాప కొంచం సేపు అక్కడే తచ్చాడి ఇక లాబం లేదని ఎటో వెళ్ళింది.

మద్యాహ్నానికి పిల్లలు ఆడి ,ఆడి అలసిపోయి మేము అరేంజ్ చేసిన ఫుడ్ తిని, ఓ చోట గుండంగా కూర్చుని ఇండోర్ గేమ్‌ ఆడుకుంటున్నారు.

ఇంతలో ఓ కుర్రాడు కొన్ని బెలూన్లు తీసుకొని అక్కడికి వచ్చాడు, వాడు ఎండలో తిరిగి చెమటలు కక్కుతున్నాడు, మేము మా పిల్లలకు అవి కొనొద్దని కళ్ళతోనే వారించాము.అశుబ్రమైన వారి దగ్గరికి వెళ్ళరాదని మేము చెప్పిన పాఠం వారు మరచిపోలేదు.

మరి కాసేపటికి ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడు, ఓ చిన్ని ప్లాస్టిక్ సీసాలో సబ్బు నీళ్ళు నింపుకొని, చిన్ని స్ట్రా తో ఆ నీరు నోటిలోకి తీసుకొని బుడగల్లా ఊదుతున్నాడు . అది చూసి మా పిల్లలు సంబరపడ్డారు, వెంటనే ఓ టీచర్ ఆ నీళ్ళు నోటిలోకి వెల్తే  ప్రమాదమని హెచ్చరించింది. వాడిని అక్కడినుండి వెళ్ళమని అదిలించింది.ఇంతలో ఓ మూడేళ్ళ చిన్ని కుర్రాడు రంగురంగుల కాగితపు పూలు కొనమని ఇంచుమించు కాళ్ళు పట్టుకున్నట్లు అడిగాడు, ఆ పూలకి వేసే రంగులు ప్రమాదకరమని మా డ్రాయింగ్ టీచర్ వద్దన్నారు. మొత్తం మీద ఆ పిల్లల్ని అక్కడి నుండి తరిమేసి, మా పావురాళ్ళని  రక్షించుకున్నాం.
                                                                    ***


సాయంత్రమైంది ఇంటికి బయలుదేరాము  పిల్లల్ని బస్ లో ఎక్కించి మేము గేట్ వరకూ మెల్లగా నడుస్తున్నాం, ఇందాకటి ఆ పిల్లలు పార్కులో ఓ మూల చేరి ,మా విద్యార్ధులు తిని పారేసిన ఎంగిలి ప్లేట్స్ లో మిగిలిన పదార్దాలు తింటూ కనిపించారు.

అంతలోనే  ఓ ఆడ మనిషి, చేతిలో ఓ బెత్తం (మా బాషలో)తో వారిని  కొట్టేందుకు  ఎగబడింది.
"దొంగ నా.. ఇక్కడ మెక్కుతున్నారా? ఒసే .. పల్లీలు అమ్మకుంటా ఎంగిలి నాకుతున్నావా కుక్కా.." అంటూ ఆ పిల్లని  జుట్టు పట్టుకుంది.

నేను అడ్డుకోబోయాను మా టీచర్స్ వద్దన్నారు, (నిజమే మా లాంటి నాగరికులు కలగజేసుకోకూడదు కదా..)
"అయ్యో వాళ్ళు వద్దన్నారక్కా.. అవి తినకూడదట", ఆ పిల్ల వణుకుతూ చెప్పింది,

"నీకేమైందిరా బద్మాష్.." సబ్బునీళ్ళ బుడ్డోడిని జుట్టు పట్టుకుందావిడ.

"ఆ నీళ్ళు నోట్లోకి పోగూడదంట." మొండిగా అన్నడు వాడు.

"నువ్వురా చెత్త నా.. "కాగితపు పూల బుడ్డోడిని నేల మీదేసి ఈడ్చింది.

ఆ ఇస్కూల్ పిల్లల్ని మాటల్లో పెట్టి కొనిపించలేకపొయ్యారు, మీకు కడుపు మాడిస్తే తిక్క కుదురుతుంది కేకలేస్తుందామె.

వాళ్ళు ఎదో మాట్లాడతున్నారక్కా. మాకు అర్దం కాలా ... చదూకున్నోళ్ళు కదా మా దగ్గరగా రాకూడదని దూరంగా వెళ్ళారు. ఏడుస్తూ ఏక కంఠం తో చెప్తున్నారు ఆ పిల్లలు , ఇక చూడలేక నేను బస్స్సెక్కాను ,గేటు దాటుతున్న మా బస్సుకు టాటా, చెప్తూ  ఊపుతున్న ఆ పసి చేయి  నా నీళ్ళు నిండిన కళ్ళకు మసగ్గా  కనిపించింది.  బాల్యం కూడా ఎన్ని రంగుల్లో ఉందో... (నేనింకా మూడురంగుల్లోనే వెతుకుతున్నాను.)

24 comments:

 1. Heart touching! Jeevitam lo ennenni rangulo!

  ReplyDelete
 2. హ్మ్...నిజమే ఎన్ని రంగులో కదా...సమాధానం లేని ప్రశ్నలు...:(

  ReplyDelete
  Replies
  1. బాల్యం బరువౌతుంది. జీవితం చేదుగా మారుతుంది. బాలలకు.

   Delete
 3. నేటి పిల్లలే రేపటి పౌరులు
  కొందరు .... ఉపాద్యాయుల సంరక్షణలో పుస్తకాలు పాటాలు చదువుకుని నియమబద్దంగా ....
  కొందరు, మనుగడ కోసం పోరాడుతూ జీవితం బడిలో స్వయం శిక్షణలో ....
  ఆరోగ్యమూ ప్రధూషణము లాంటి ఎన్నో ప్రశ్నల్ని మదిలో పొడిచి ఆలోచింపచేస్తున్న పోస్టింగ్
  బాగుంది మెరాజ్ గారు! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సర్, మీ విష్లేషణకు

   Delete
 4. ఎప్పుడైనా ఏ విషయాన్నైనా తరచి చూస్తేనే మనలోని అజ్ఞానం తొలుగుతుంది,
  వద్దు....అన్న తర్వాత ఆ పిల్లల్ని గమనించనట్లయితే.....?
  మీరజ్ చాలా బాగా చెప్పారు.....రేపటి పౌరుల నేటి దుస్థితి గూర్చి .

  ReplyDelete
  Replies
  1. నేటి బాలలే కానీ బాల్యమే బాగ లేదు వారికి.
   దేవీ ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 5. నిర్బంద విద్య మన హక్కు. ప్రభుత్వం ఆ దిశగా కచ్చితమైన స్టెప్స్ తీసుకోకపోతే... ఈ సన్నివేశంలో ఎటువంటి మార్పుని
  ఆశించలేం. రెండు... ఉపాధి. సంపాదనంతా కొద్ది మంది చేతుల్లో పోగుపడితే.. దారిద్ర్యం ఎక్కువమందికి పలకరిస్తుంది.ఇదేలా
  మారాలి. ఎప్పుడు మారాలి... మీరు చూసిన ఇలాంటి రేపటి పౌరులు దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది ఉన్నారని
  ఎప్పటిదో అంచనా. ఇప్పుడింకా పెరిగే ఉంటుంది. మన వ్యవస్థ శిధిలమైపోయింది మెరాజ్ గారు. ఒక్క విషయం మెరాజ్ గారు.
  చింతపండు, గుండు పిన్ను అమ్ముకోడానికి ఆరడుగుల జాగా కోసం వచ్చాడు బ్రిటీషోడు. దేశం మొత్తాన్ని 200 ఏళ్లు అప్రతిహతంగా పాలించగలిగాడు. మనకు గణతంత్రం వచ్చి.. 65 ఏళ్లు మాత్రమే అయింది. దేశాన్ని ఏక తాటి మీద నడిపించే రాజ్యాంగ వ్యవస్థ ఎక్కడుంది చెప్పండి. స్వతంత్రం వచ్చాకే భారతదేశాన్ని ఎక్కువ నాశనం చేశారు. ఫలితంగానే మనం ఇలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తోంది.

  ReplyDelete
  Replies
  1. నిర్బంద విద్య ఎవరికీ అమ్మా నాన్నా ఉన్న పిల్లలకి, (వారిని బడికి పంపమని తల్లిదండ్రులను వత్తిడి చేయాలి)
   కానీ వీరంతా అనాథలు ఎవరి కట్టడిలోకో వెళ్ళిన వాళ్ళు, వారినడ్డుపెట్టుకొని జీవనం సాగించే ఎన్నో ముఠాలను , వార్తల్ల్లో మనం చూశాము.
   మార్పు వస్తుందనే ఆశ లేదు, ఆ బిడ్డలను చూస్తే బాద..:-(

   Delete
 6. మార్చడానికి మంత్రదండం కావాలి.

  ReplyDelete
  Replies
  1. అంతేనంటారా...?

   Delete
  2. మీరు చెప్పిన సందర్భంలో స్కూలుపిల్లలు వాళ్ళదగ్గర కొనుక్కోవాలి, లేదా అమ్మేవాళ్ళు పరిశుబ్రంగా తయారయి అమ్ముతూ, కొనేవాళ్ళకి నమ్మకం కలిగించాలి. చిన్నపిల్లలచేత పనిచేయించకుండా తల్లితండ్రులు వాళ్ళను బడికి పంపించాలి... కానీ ప్రతీవాళ్ళకీ అలా చెయ్యకుండా ఉండడానికి వాళ్ళ, వాళ్ళ కారణాలు ఉంటాయి. అందుకే అన్నింటినీ మార్చడానికి మంత్రదండం ఉండాలని చెప్పింది. ప్రతీసమస్యకీ తక్షణ పరిష్కారం ఉండకపోవచ్చు. కానీ, మీరు రాసిన విధానం ఆలోచనల్ని మొలకెత్తిస్తుంది.

   Delete
  3. ఆ మంత్రదండమే... సరైన సమాజిక పాలన, ఆరోగ్యకరమైన వ్యవస్థ. అది మనందరి చేతుల్లోకి తీసుకొవాలి, దానికి ప్ర భుత్వ పదకాలు అమలు కావాలి. నైతిక విలువలు పెరగాలి.
   వర్మాజీ, నా పొస్ట్ గూర్చి పదే,పదే ఆలోచించటమే మీలో ఉన్న సామాజిక స్పృహను తెలియజేస్తుంది.

   Delete
 7. భావి భారత భాగ్య విధాతల భవిష్య జీవితానికి భరోసా ఎప్పుడు లభిస్తుందో????
  హృద్యంగా రాశారు.

  ReplyDelete
  Replies
  1. వస్తుందనే ఆశతో...మనవంతుగా కొంత చేయూతతో నడిచేద్దాం.

   Delete
 8. "బాల్యం కూడా ఎన్ని రంగుల్లో ఉందో.."
  అవును మీతో పాటు కళ్ళు చెమ్మగిల్లాయి నాకూను .
  వాస్తవాలని ఓ అద్దం పట్టినట్లు బాగా చూపించే ఏదో అతీత మైన 'శక్తి" మీలో ఉంది .
  'హాట్స్ ఆఫ్ టు యు' ఫాతిమా జి - శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, మీ ప్రశంసకు హృదయపూర్వక ధన్యవాదాలు.
   వాస్తావాలను గ్రహించే మీరు అంతే హుందాగా స్పందించటం సంతోషం.

   Delete
 9. Replies
  1. నారాయణ మూర్తి గారూ, మంచి ప్రశ్న వేశారు, నేను రాసే రాతలను కొంత చేతల్లో చూపించాలని చూస్తాను,
   నా వంతుగా (నా శక్తి మేరకు ) అలాంటి కొందరి బిడ్డలకు ఉచిత విద్య ఇస్తున్నాను.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
  2. అభినందనలు మెరాజ్‌గారు.

   Delete
  3. ధన్యవాదాలు వర్మగారు.

   Delete
 10. గణ తంత్ర దినోత్సవం నాడు రెప రెప లాడే పతాకం త్రివర్ణమే !
  పేద బాల బాలికల సప్త వర్ణాల భవిత, తిమిర వర్ణమే !
  బాధ్యత మరిచి తల్లి దండ్రులు కన్నా ,
  కసురుకున్నా , 'కాటేసినా' ,
  సమాజం మీదకు ' మందలు ' గా తోలుతున్నా,
  'నలిగే పోయే' నవ కుసుమాలు, ఆ బాల బాలికలే !

  కారుణ్యం గా చెప్పారు, యదార్ధ సంఘటనను ! అభినందనలు !

  ReplyDelete
  Replies
  1. సర్, మీ అభిప్రాయం సరియైనదే్,
   నిజమే బాలబాలికలకే కష్టాలు

   Delete